విలన్‌గానూ నటిస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గుండెల్లోగోదారి’, ‘వైశాలి’, ‘ఒక విచిత్రమ్’, ‘మృగం’ చిత్రాలతో నటుడిగా పరిచయమున్న ఆది పినిశెట్టి తాజాగా నటించిన చిత్రం ‘మలుపు’. ఈ చిత్రం తమిళంలో రూపొందించి, తెలుగులో కూడా అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను ఆయన వివరించారు.
సినిమా ఎలా వుంటుంది?
నలుగురు స్నేహితులు కథనంతో సాగే ఈ చిత్రం వారు చదువు పూర్తిచేసుకున్న రోజునుండి ప్రారంభవౌతుంది. డిసెంబర్ 31 నాడు జరిగిన ఓ సంఘటన వారి జీవితాలను ఏ విధంగా మార్చింది అనే కథతో ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగుతుంది. నేను గతంలో నటించిన చిత్రాలకు పూర్తి వైవిధ్యంగా ఉంటుంది.
సినిమా చాలా ఆలస్యమైంది ఎందుకు?
ఈ చిత్రాన్ని చెన్నై, పాండిచ్చేరి, వైజాగ్, బొంబాయి, గోవా లాంటి అనేక ప్రాంతాలలో చిత్రీకరించాం. దాదాపు 240 లొకేషన్లలో షూట్‌చేశాం. మా సొంత నిర్మాణ సంస్థనుండి వస్తున్న తొలి చిత్రం కనుక కొన్ని అనివార్య కారణాలవల్ల ఆలస్యమైన మాట నిజం.
తెలుగులో ఎలా ఉంటుంది?
తమిళంలో రెండున్నర గంటలపాటు సాగే ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పు, చేర్పులు చేశాం. సినిమా చాలా వేగంగా సాగే స్క్రీన్‌ప్లేతో రెండు గంటలపాటు మాత్రమే వుంటుంది.
మీ అన్నయ్య దర్శకుడిగా ఎలా?
అన్నయ్యకు ‘మలుపు’ తొలి చిత్రమే అయినా పూర్తి బాధ్యతగా చేశారు. నాన్న ఈ కథ విని బావుందని చెప్పినా, దర్శకత్వ శాఖలో ఎక్కడా ఆయన కల్పించుకోలేదు. అన్నయ్య నాన్నకన్నా మొండివాడు కనుక తనకు నచ్చిన విధంగా చేశాడు. ఈ సినిమాను దాదాపు 200 రోజులపాటు చిత్రీకరించాం.
మీ పాత్ర ఎలా వుంటుంది?
కాలేజీ కుర్రాణ్ణి కనుక స్టయిలిష్‌గా కనిపిస్తాను. ఇందుకోసం బరువుకూడా తగ్గాను. మేకప్, బాడీలాంగ్వేజ్, కాస్ట్యూమ్స్ తదితర విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాం. ఏదైనా సరే కొత్తగా కనిపించాలని అనుకున్నాను ఈ చిత్రంలో. సినిమా కూడా అలాగే వుంటుంది.
అంటే కాలేజీ కుర్రాడి పాత్రలే చేస్తారా?
అలాగని ఏం లేదు. ‘మలుపు’ సినిమాలో పూర్తి కమర్షియల్ హీరోగా కనిపించే నేను సరైన నటనకు ప్రాధాన్యం వున్న చిత్రాలు వస్తే తప్పకుండా నటిస్తాను.
విలన్‌గా చేస్తున్నారు కదా?
బోయపాటి దర్శకత్వంలో విలన్ పాత్ర ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. అందుకే ఆయన చిత్రాన్ని ఒప్పుకున్నాను. రెగ్యులర్ విలన్‌లా కాకుండా ఓ సరికొత్త నటనను ఆవిష్కరించే విధంగా ఆ పాత్రలు ఉంటాయి. ‘సరైనోడు’ చిత్రంలో కూడా నా పాత్ర వెరైటీగానే ఉంటుంది.
ఈ పుట్టినరోజుకి ఏమైనా నిర్ణయాలు
తీసుకున్నారా?
అలాంటిదేం లేదు. మనకు ఎలాంటి పాత్రలు వస్తే అలాంటిది నటుడిగా నిరూపించుకునేలా ప్రయత్నిస్తాను. ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి స్నేహితులతో పార్టీ చేస్తాను. కానీ ఈసారి చెన్నై వరద బాధితులకోసం ఆ నగదు అంతా పంపిస్తున్నాను. నా స్నేహ బృందం కూడా అక్కడే వుండి సహాయం అందిస్తున్నారు.
తర్వాతి చిత్రాలు?
ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నాను. తెలుగులో కూడా కొన్ని చిత్రాలకు కాల్షీట్లు ఇవ్వాల్సి వుంది.

- యు