క్రైమ్/లీగల్

మ్యాట్రిమోని పేరుతో ఘరానా మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, మార్చి 11: పెళ్లి పేరుతో ఇద్దరు మహిళలను నైజీరియన్‌ల ముఠా మోసగించింది. బాధిత మహిళల నుంచి రూ.12.45 లక్షలు దోచుకున్నారు. డైవర్సీ మాట్రిమోనీలో విదేశీ డాక్టర్ పేరుతో బడా మోసానికి పాల్పడిన నలుగురు సైబర్ నేరగాళ్లను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మరో నైజీరియన్ పరారీలో ఉన్నాడు. సైబర్ నేరస్థుల గ్యాంగ్ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న రూ.3.05వేల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నిందితుల నుంచి 18 మొబైల్ ఫోన్‌లు, తొమ్మిది గుర్తింపు కార్డులు, పాస్‌పోర్టు, 25 సిమ్ కార్డులు, 67 చెక్‌బుక్‌లు, 15 డెబిట్ కార్డులు, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియా సమావేశంలో కేసుల వివరాలు వెల్లడించారు. ఢిల్లీలో నివసిస్తున్న నైజీరియా దేశంలోని లొగొస్‌కు చెందిన ఇసేలు ఉడో, గిడ్డీ ఇసాక్ ఒలు(36), నేపాల్ దేశంలోని నేపాల్‌గంజ్‌లోని కర్కాండో చౌక్‌కు చెందిన సాగర్ శర్మ(24), సుదీప్ గిరి అలియాస్ అనిల్ కుమార్ (26), బికస్ బల్మికి(25) ఓ ముఠాగా ఏర్పడ్డారు. నల్లగండ్లకు చెందిన ఓ వైద్యురాలు.. భారత్ మాట్రిమోనీకి చెందిన డైవర్సీ మాట్రిమోనీలో పెళ్లి కోసం తన పేరు నమోదు చేసుకుంది. ఇది గమనించిన సైబర్ నేరగాళ్ల ముఠా డాక్టర్ విపుల్ ప్రకాశ్ పేరుతో యూకేలో ఉంటున్నట్టుగా డైవర్సీ మాట్రిమోనీలో పోస్టు చేశారు. యూకే నుంచి అత్యంత ఖరీదైన బహుమతులు పంపించినట్టుగా సృష్టించి జీఎస్‌టీ చెల్లించడానికి బ్యాంక్ అకౌంట్ వివరాలు కావాలని చెప్పి బాధిత డాక్టర్ నుంచి రూ.7.45 లక్షలు కాజేశారు. మోసానికి గురైనట్టు గుర్తించిన సదరు వైద్యురాలు ఫిబ్రవరి 4న సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో ముఠా గుట్టు రట్టు చేశారు. మరో కేసులో ఓ మహిళకు విదేశీ కరెన్సీతో ఉన్న లాకర్‌ను పంపుతున్నానని, కస్టమ్స్ ఆఫీసర్‌కు డబ్బులు ఇవ్వాలని నమ్మించి రూ.5లక్షలు బ్యాంకు నుంచి కాజేశారు. ఈ రెండు కేసుల్లో నిందితులైన ఐదుగురు ముఠాలోని ఇసెలు ఉడో తప్పించుకోగా మిగతా నలుగురిని అరెస్టు చేసి బుధవారం రిమాండు చేశారు. సైబర్ క్రైమ్‌ను ఛేదించిన ఇన్‌స్పెక్టర్ చిర్ర రామయ్య, ఎస్‌ఐ కే.రాజేంద్ర, కానిస్టేబుళ్లు ఎన్.రాములు, ఎం.రవి, కృపాకర్ రెడ్డి, ఫయూమ్ మియా, ఎండీ అర్షద్ అలీ, డీ.శేఖర్, ఎం.సురేష్, జీ.శ్రీనివాస్‌ను కమిషనర్ సజ్జనార్ అభినందించారు.
మాట్రిమోనీ వెబ్‌సైట్‌లను గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తవహించాలని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. నిజమైన వ్యక్తులను గుర్తించడానికి వీడియో కాల్ లేదా ఇతర మార్గాల్లో ప్రయత్నం చేయాలని అన్నారు. కస్టమ్స్ అధికారులు గిఫ్టులను పంపించడానికి ఎవరూ ఫోన్ చేయరని, డబ్బులు అడగరని, అలాంటి మాటలకు మోసపోవద్దని చెప్పారు. ఎవరికీ బ్యాంక్ అకౌంట్ వివరాలు చెప్పవద్దని, బహుమతుల పేరుతో మోసాలకు గురికావద్దని కమిషనర్ సూచించారు.