క్రైమ్/లీగల్

ప్రణయ్ హత్య కేసు 23కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 10: ప్రేమవివాహం నేపథ్యంలో హత్యకు గురైన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసును జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ స్పెషల్ కోర్టులో మంగళవారం విచారణకు రాగా, ఎనిమిది మంది నిందితులకు ఇద్దరు హాజరుకాలేకపోవడంతో ఈ కేసులో చార్జ్‌షీట్ దాఖలులో జాప్యం నెలకొనడంతో కేసును ఈనెల 23కు కోర్టు వాయిదా వేసింది. నిందితులంతా హాజరైన పక్షంలోనే చార్జ్‌షీట్ ఫ్రేమ్ చేయాల్సివుండగా, కేసులో ఏ-1నిందితుడిగా ఉన్న తిరునగరి మారుతీరావు గత శనివారం ఆత్మహత్య చేసుకోగా, మారుతీరావుకు అంత్యక్రియలు నిర్వహించిన అతని సోదరుడైన నిందితుడు ఏ-6శ్రవణ్ కోర్టుకు హాజరుకాలేదు. మిగిలిన ఆరుగురు నిందితులు ఏ-2 సుభాష్‌శర్మ, ఏ-3అబ్ధుల్ బారీ, ఏ-4 అస్గర్ అలీ, ఏ-5 అబ్దుల్ కరీం, ఏ-7 డ్రైవర్ శివ, ఏ-8 నిజాం కోర్టుకు హాజరయ్యారు. మొత్తం ఎనిమిది మంది నిందితులూ హాజరుకాకపోవడంతో చార్జ్‌షీట్ ఫ్రేమ్ ప్రక్రియ వీలుపడక కేసును వాయిదా వేశారు. తన కూతురు అమృత మిర్యాలగూడకే చెందిన ప్రణయ్ అనే వ్యక్తిని కులాంతర ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని తండ్రి తిరునగరి మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న కిరాయి హంతకులతో ప్రణయ్‌ను హత్య చేయించాడు. ఈ కేసులో 139/2018, 302, ఆర్/డబ్ల్యు 34, ఐపీసీ 120బీ, 109 సెక్షన్స్, 3(2), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌లను పోలీసులు నిందితులపై నమోదు చేసి 2019 జూన్ 12న చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 1600 పేజీల చార్జిషీట్ కాపీలను గత ఫిబ్రవరి 27న నిందితులకు అందించి చార్జ్‌షీట్ ఫ్రేమ్‌కు రెండు రోజుల గడువు ఇచ్చింది. అయితే చార్జ్జిషీట్ కాపీలను చదవడానికి నిందితుల తరఫున న్యాయవాది సమయం కోరగా అనుమతించిన కోర్టు ఈనెల 10న చార్జ్జిషీట్ ఫ్రేమ్ చేయాలంటూ సూచించింది. మారుతీరావు ఆత్మహత్య నేపథ్యంలో మంగళవారం నిందితులంతా హాజరుకాకపోవడంతో కేసును ఈనెల 23కు కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో పోలీసులు 102 మంది సాక్షులను విచారించి 10 నెలల పాటు దర్యాప్తు సాగించి చార్జ్‌షీట్ రూపొందించారు. ప్రణయ్ తండ్రి బాలస్వామితో పాటు ప్రణయ్ భార్య అమృత స్టేట్‌మెంట్‌ను కూడా పొందుపరిచారు. కేసు విచారణలో ఉండగానే ఇటీవల గత శనివారం రాత్రి హైద్రాబాద్ ఆర్యవైశ్య భవన్‌లో మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

*ప్రణయ్ హత్య కేసు నిందితులు (ఫైల్‌ఫొటో).