సెంటర్ స్పెషల్

మహావిజేత 11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రహాసుడు తదేకంగా అక్షయుని వైపు చూస్తూ ‘అడుగు కదిలిస్తేనే నడక’ అనేది నా సూత్రీకరణ! దీన్ని చాలాసార్లు అక్షయునితో ప్రస్తావిస్తూనే ఉన్నాను. అతను నా భావాల్ని పట్టుకుంటున్నాడు. ఇదంతా పురుషోత్తముల వారిచ్చిన జ్ఞాన ప్రసాదం’ అని చేతులెత్తి గురువందనం చేశాడు.
చంద్రహాసుడి చేష్టని చూసిన ముగ్గురూ ఆశ్చర్యపడి ఒకరి చూపుతో మరొకరు చూపు కలుపుకున్నారు.
‘అంతా చంద్రజ్ఞాన ప్రసాదం’ అన్నది పద్మిని. అంతా నవ్వుకున్నారు.
మరో లిప్తకాలం తర్వాత చంద్రహాసుడు ‘సరి మనం ఈ ప్రతిపాదనను మహామంత్రికీ వారి ద్వారా ప్రభువుకీ మనవి చేద్దాం.. ఏం అక్షయా?’ అన్నాడు. ‘అలాగే’ అంటూ సమాధానమిచ్చాడతడు.
వీరు లేచి కదలబోతుండగా ముఖమంటపం దగ్గర ఎదురయినాడు ముదువొల్ల, ప్రణామం చేశాడు. ‘బాగున్నావా. అమ్మమ్మ బాగుందా’ కుశల ప్రశ్నలు వేశారు అక్షయ చంద్రహాసులు.
బాగున్నామని చెప్తూ, ‘తమ దయ వల్ల నాకు ఎటువంటి లోటూ లేదు. సేవా బాధ్యతల్ని జాగ్రత్తగా నిర్వహిస్తున్నాన’ని తెలిపాడు ముదువొల్ల.
‘సంతోషం. కర్తవ్య నిర్వహణంలో పొందే ఆనందానికి ప్రత్యామ్నాయం లేదు’ అన్నాడు అక్షయుడు.
అందరూ బయటకి నడిచారు.
28
ఆ రోజు - ప్రాతః సమయం నుండీ కుళిందకుడూ, మేధావినీ దేవీ వాస్తు పూజా, హోమాలూ, అభిషేకాలూ, గ్రహశాంతీ, జపాలూ నిర్వహింపజేశారు.
మధ్యాహ్నం-
మహాన్న సంతర్పణ మొదలయింది.
నగర ప్రజలందరూ తరతమ భేదం లేకుండా విందుకు వచ్చారు. కనువిందుగా ఉంది ఆ సంతర్పణ. పంక్తి భోజనాలు ఎడతెరిపి లేకుండా సాగాయి.
ఆ మహోత్సవాన్ని చూస్తుంటే చంద్రహాసుడికి తన బాల్యమే కళ్ల ముందు కదలాడింది. ఎన్నిచోట్ల ఎనె్నన్ని అన్నదానాల్లో తాను పంక్తి భోజనం చేశాడు! చివరికి కుంతలపురిలో అన్నపూర్ణ ధర్మసత్రంలో జరిగిన అన్నదానంలోనే కదా - తాను కుంతల సామ్రాజ్య మహామంత్రి దృష్టిలో పడింది. అప్పటివరకూ పడిన ఇక్కట్లు వేరు. ఆ తర్వాతి దుర్ఘటన వేరు. చావుతప్పి బయటపడి, కుళిందకుల కంటపడ్డాడు. అదృష్టమంటే అదే!
చంద్రహాసుడి ఆలోచనల్ని చెదరచేస్తూ భోజన పంక్తుల్లో కలకలం చెలరేగింది. అక్కడ అప్పుడే వడ్డన జరుగుతోంది. భటులు ఎవరో ఒక వ్యక్తిని పంక్తిలో నుండీ బలవంతాన బయటకి లాగుతున్నారు.
చంద్రహాసుడు ఆ వైపు నడిచాడు. ‘విషయం ఏమిట’ని విచారించాడు. వారి నుండి పెనుగులాడుతున్న ఒక వ్యక్తి ఆగాడు.
‘ఇంత క్రితం వీడు ఇక్కడే భోజనం చేసి వెళ్లాడు ప్రభూ! ఇప్పుడు మళ్లా వచ్చి కూర్చున్నాడు’ అన్నదాన ఆధ్వర్యంలోని ఒక అధికారి అన్నాడు.
‘కాదు ప్రభూ. సగం భోజనంలో నా అవిటితనం వలన పాత్రలోని నీరంతా వొలికి తింటున్న విస్తరిని తడిపివేసింది. నేను పూర్తిగా భోజనం చేయలేదు ప్రభూ’ దీనంగా చూస్తూ కళ్లనీరు పెట్టుకున్నాడతను. చంద్రహాసుడు ఆ వ్యక్తిని పరిశీలనగా చూశాడు. కుడిచెయ్యి మణికట్టు వరకూ లేదు. ఎడమ పాదం లేదు. మనసంతా కలచినట్లయింది చంద్రహాసునికి.
‘తిననీయండి’ అని చకచకా అడుగులు వేస్తూ ఇవతలకు వచ్చాడు.
తలపుల సంద్రంలో ఈదుతున్న చంద్రహాసుని సమీపించి, ‘మన మిత్రులంతా నీ కోసం వేచి వున్నారు రా. అన్నా’ అంటూ అతన్ని తీసుకువెళ్లాడు అక్షయుడు. పోరన్న, హల్లప్ప వంటి మిత్ర బృందమంతా వున్నారక్కడ. పాత ముచ్చట్లలో మునిగారందరూ.
29
కాలరథ ప్రచారం సాగుతోంది.
కళింద్రకు ఉత్తరాన వున్న కౌండిన్యపురీ, తూర్పున వున్న అష్ట మండలాధిపతులు ఇరువురూ అసమర్థులు కావటం వలన, దుష్టబుద్ధిదే పైచేయిగా, ఆయన ఆజ్ఞలే పాలనగా చెల్లుబడి అవుతూ వచ్చాయి. మహారాజుకి తెలియకుండా చేసే ఆయన పరపీడన పరాయణత్వ శాసన విధానాలలో ఆ మండలాధిపతులూ ప్రజలను బాధించేవారు. తాము కోల్పోతున్నదేమిటో తమకు తెలియని స్థితిలోకి దిగజారారు వాళ్లు. ప్రజల నిరసనల్నీ, వ్యతిరేకతలనీ, అలజడుల్నీ ఎదుర్కోవలసి వచ్చింది.
ఆ అస్తవ్యస్థ పరిస్థితుల నుంచీ ప్రజల్ని సంరక్షించడానికి చంద్రహాసుడు ఆ మండలాలపై యుద్ధ ప్రకటన చేయించాడు.
ఒక్కొక్క మండలం నాలుగ రోజుల్లో కళింద్ర వశమైంది.
రెండు ప్రదేశాల్లోనూ ఆవేశంలో, ఉద్రేకంలో మండలాధిపతుల్ని ఆయా మండలాల ప్రజలే మట్టుబెట్టారు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లయింది.
కళింద్ర మహా మండలం మొత్తం కుంతల సామంత సంస్థానంగా నిలిచింది. ఇప్పుడు కుంతల పాలకులకు అనేక సమస్యల నుండి విముక్తి లభించినట్లయింది. వారంతా కుళిందకునీ, అక్షయ చంద్రహాసుల్నీ ఇతః పూర్వం కన్నా ఎక్కువ గౌరవంగా సంభావించసాగారు.
కౌండిన్యపుర మండలంలో కళింద్ర ప్రతినిధిగా అడివప్ప శిష్యుడు మల్లుని నియామకం విషయంలో చర్చ జరిగింది.
ఆ సందర్భంలో మల్లుని గురించి ప్రభువుకు చంద్రహాసుడు తన అభిప్రాయాన్నిలా వివరించాడు. ‘కౌండిన్యపుర మండల విజయంలో కోట ఆనుపానుల్ని మనకు అందజేసినవారు మల్లుని బంధువులు. వారి సహకారం మనకు శాంతిస్థాపనలోనూ ఆవశ్యకమే కదా ప్రభూ! దానికి యువకుడైన మల్లుని నియామకం ప్రోత్సాహకరంగా ఉంటుంది. మల్లుడు శక్తియుక్తుల్ని ప్రదర్శించాలంటే అందుకు తగిన అవకాశం కూడా ప్రభువులు కల్పించాలి. అనుభవరాహిత్యమో లేక మరో బలహీనతో హేతువుగా చూపి అతనికా అవకాశాన్ని కల్పించకపోతే, వ్యక్తి నిర్మాణంలో మనకు మనంగా అవరోధాల్ని సృష్టించినట్లే కదా! అతను ఇంక ఎన్నడూ పైకి రాలేడు కదా! ఆలోచించండి. అందుకని మల్లుని వంటి యువకునికి ఈ అవకాశాన్ని ఇచ్చి అతని ఎదుగుదలని ప్రోత్సహిస్తేనే మంచిదని నా ఉద్దేశం ప్రభూ!’
పురుషోత్తముల వారికి చంద్రహాసుని తర్కం సమంజసంగా తోచింది. ఆయన అన్నాడు. ‘చంద్రహాసుడు చాలా లోచూపుతో ఆలోచించే చెప్పినట్లు తోస్తోంది. భావితరాల్ని తీర్చిదిద్దడంలో మనం చొరవ తీసుకోక తప్పదు. ఆ ప్రోత్సాహం వారికి వెయ్యి ఏనుగుల బలాన్నిస్తుంది. మండలంలో శాంతిని నెలకొల్పటానికి ఈ విధానం ఒక సాధనమవుతుంది. వారి సామర్థ్యాన్ని సంఘ ప్రయోజనాలకు వినియోగించుకోకుంటే అభ్యుదయానికి అవకాశం ఉండదు’
ఆ వెంటనే చంద్రహాసుడు అన్నాడు, ‘సకాలంలో సరియైన నిర్ణయం తీసుకోవటం, తీసుకున్న నిర్ణయాన్ని సకాలంలో ఆచరణలో పెట్టడం కూడా ఒక బాధ్యత కదా ప్రభూ!’
అప్పుడు మాట కలిపాడు అడివప్ప, ‘ప్రభు భక్తికి విలువైన నిదర్శనం ప్రజల మేలు కోసం పాటుబడటమే. క్రమశిక్షణ కలవాడు ఇతర లోపాల్ని అధిగమించగలడు. అసమర్థత దోషం కావచ్చు. కానీ అవిధేయత నేరమవుతుంది - అంటాడు మన చంద్రహాసుడు. నిజానికి ఈ సూత్రాలు మల్లునికి మాత్రమే కాదు - యువకులందరికీ చేదివ్వెలే!’
అందరి కళ్లల్లోనూ మెరపు! అది చంద్రహాసుని పట్ల వారికిగల ఆరాధనాభావం!
* * *
ఈ ఏడాదిలో మల్లుడు కౌండిన్యపుర రాజ్య వ్యవహారాలను ఒక కొలిక్కి తెచ్చాడు. అతనికి సహకారిగా నియమింపబడిన ఉప సైన్యాధిపతి విష్ణుమిత్రుని దీక్షాదక్షతలు కూడా ఆశయ సాఫల్యానికి చోదకమైనై.
అష్ట మండలంలో ఉప సైన్యాధిపతి కుంజరుడు కళింద్ర ప్రతినిధి. అక్కడ రక్షణ, సైనిక, పరిపాలన వ్యవహారాలు మూడూ కుంజరుని పర్యవేక్షణలో సవ్యంగా సాగుతున్నై.
అటు కౌండిన్యపురం, ఇటు అష్ట - రెండు మండలాల్లోనూ మొత్తం పరిపాలనా రంగాలన్నింటిలో చంద్రహాసుని ముద్ర బలంగా ఉన్నది. దానిలో కీలకాంశం పరిపాలన వికేంద్రీకరణం. వివిధ రంగాల్లో పటిష్టమైన వ్యవస్థల్ని నెలకొల్పాడతడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అది అక్కడికక్కడే పరిష్కరింపబడే విధానాన్ని అమలులోకి తెచ్చాడు. దీనివలన అధికారులలో స్వావలంబన, సంతృప్తి నెలకొన్నాయి. వారంతా ఉత్సాహంగా తమ తమ విధుల్ని నిర్వహిస్తున్నారు. కేవలం ఉన్నత స్థాయి నిర్ణయాల కోసం క్లిష్టమైన సమస్యల పరిష్కారం, ఇతర అవసరాల కోసం మాత్రమే రాజధాని వారి జోక్యం అవసరమవుతోంది.

(మిగతా వచ్చే సంచికలో)

-విహారి 98480 25600