సెంటర్ స్పెషల్

మహావిజేత 8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగన్న తను మంత్రితో అంటున్నట్టు, ‘కళింద్ర ప్రత్యేకతలు మహారాజుగారికి విదితమే కదా! వాటిని దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు జరుగుతాయని మా ఆశ’ అన్నాడు.
ఈ మాటల వెనుక గూఢార్థం అక్కడ వున్న అందరికీ తెలుసు. కళింద్ర ఆగ్నేయ సరిహద్దు అజేయమనే సంగతిని ప్రస్తావిస్తున్నాడు సింగన్న అనీ అర్థమయింది.
అయినా, తమ ఆధిపత్యాన్ని రెట్టించుకుంటూ అన్నాడు దుష్టబుద్ధి! ‘అవును. కుంతల శక్తియుక్తులూ, ఔదార్యమూ కూడా కళింద్రకు తెలుసు’ అని.
ఆ తర్వాత కొంతసేపు ఇతర విషయాల మీద వారి సంభాషణ సాగింది. చేతనుడు, సింగన్న సెలవు తీసుకుని బయటకి నడిచారు.
20
దుష్టబుద్ధి మందిరం నుంచీ సింగన్న, చేతన మంత్రి సరాసరి గాలవుల వారి దర్శనానికి వచ్చారు.
యోగ క్షేమాలను పరామర్శించారు గాలవులు. ఆ వెంటనే పురుషోత్తముల వారి క్షేమాన్నీ ప్రస్తావించారు. ఆయనకు ఆచార్యులవారంటే గౌరవ ప్రపత్తులు మెండు. వారికి కూడా గాలవుల వారంటే అంతటి అభిమానమే ఉంది. అందువల్లనే కుంతలలో గాలవుల వారు కళింద్రకు ఒక పెద్ద అండ. మహారాజు అగ్నివర్మకు గాలవులవారి సూచనలు శిరోధార్యం. ఆ విధంగా అగ్నివర్మకు కూడా కళింద్ర పట్ల ప్రత్యేకాభిమానం ఉంది. దీనిని ప్రోది చేయటానికి గాలవుల మాట సాయమే కారణం. ఈ వాస్తవం తెలిసి మసలటంలో కుళిందకుడూ ఆయన మంత్రీ, సేనానీ కూడా నైపుణ్యం కలవారు.
కరద మండలంలో జరిగిన సంఘటనలూ, సంభవాలూ సమస్తమూ గాలవులకు విన్నవించాడు చేతనమంత్రి. కుంతలపురిలో జరిగిన సమావేశాల వివరాలూ పూసగుచ్చినట్లు తెలిపాడు. అగ్నివర్మతో తాము నెఱపిన ప్రత్యేక సమావేశం గురించీ మనవి చేశాడు. చంద్రహాసుని ప్రసక్తీ తెచ్చాడు. అతని శక్తియుక్తుల్ని వర్ణించాడు. అతని గురించి దుష్టబుద్ధి యోచనలెలా ఉండవచ్చో అనే తమ భయాన్నీ వినయంగా, చాకచక్యంగా గాలవుల వారి ముందు పెట్టాడు. అవసరాన్నిబట్టి తానూ మాట కలుపుతూ వచ్చాడు సేనాని సింగన్న.
అంతా విని గాలవులు చిరునవ్వు నవ్వేరు. చాలా సంతోషంగా ఉంది. ‘మానవుడే మహనీయుడు’ అన్న కవి వాక్కు సత్యమైనదీ, స్థిరమైనదీ. ‘లోకే సర్వముపద్రవేణ సహితం నిర్దోషమేకం యశః’ అన్నది ఆర్యోక్తి. మణిని మట్టిలో పారవేసినా ప్రకాశించకుండా ఉండదు’ అన్నారు.
ఆ తర్వాత దుష్టబుద్ధి ఆర్థికాంశాల ప్రతిపాదననీ ఆయనకు తెలియజేశారు.
‘ఆ ఒప్పంద పత్రాలు రెండు రోజుల్లో సిద్ధమయ్యే అవకాశమే లేదు. ఆయన ఆజ్ఞాపించాడు కనుక, మీరీ రెండు రోజులూ కుంతలపురిలోనే ఉండి ఇతర విశేషాలను చూడండి’ అని ‘మీరు తెలిపిన ఇతర సమస్యల గురించి తగిన చర్యలు జరిగేటట్లు నేను చూస్తాను. భయపడకండి. ఆ యువకుని ప్రజ్ఞాపాటవాలు కళింద్ర అదృష్టం. అతని సాహసాలు కళింద్రకు రక్ష. ఆపైన కుంతలకూ అండ అవుతాయి. అతడు తన గుణ విశేషాల్ని ఇతోధికంగా ఉన్నతీకరించుకోవడానికి మీరూ, పురుషోత్తములూ సహకరించండి. జయోస్తు’ అన్నారు.
చేతనుడూ, సింగన్న ఆయన మాటలకి సంతోషించారు. సెలవు తీసుకుని అక్కడ నుండి తిరిగి తను కళింద్ర భవనానికి చేరుకున్నారు.
మర్నాడు-
తెలతెలవారుతుండగనే - కుంతల పురిలో అప్పటివరకూ తాము
నిర్వహించిన కార్యక్రమాలన్నింటినీ వివరిస్తూ, కుళిందకుడికి వర్తమానాన్ని పంపించాడు చేతనుడు.
ఆ తర్వాత, కుంతలపురికి దగ్గరలో వున్న పరశురామ తీర్థానికి వెళ్లారు.
స్నానఘట్టంలో నిలబడ్డాడు చేతనుడు. వాతావరణమూ, పరిసరాలూ కడు రమణీయంగా ఉన్నాయి. మందమారుతం దేహానికి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. స్నానాలు పూర్తి చేసుకున్నారు.
నది నుండీ బయటకి వచ్చి శ్రీరామేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. స్వామికి పూజాదికాలు నిర్వహించారు.
భోజనం, విశ్రాంతి - ఆ తర్వాత,
సమీపంలోని సిద్దేశ్వరగుట్టనీ చూశారు. ఇటు తుంగవాహిని, అటు పశ్చిమ కనుమలలో అత్యంత ఉన్నతమైన గిరి శిఖరాలు - ఆ ప్రాంతాన్ని సుందరంగా కనువిందు చేస్తున్నాయి. మానసికంగా మనిషిని సత్యశివ సుందర భావనలతో తన్మయతలో ముంచివేసే ప్రదేశాలను చూసి పులకించిపోయారు.
కళింద్ర భవన పర్యాటకాధికారి వీరికి స్థల పురాణాలూ ఇతర విశేషాలూ వివరంగా వర్ణనాత్మకంగా విశదీకరించి ఆనందపరచాడు.
ఆ రాత్రి - తిరిగి పరశురామ తీర్థం వచ్చి అక్కడే బస చేశారు. మరుసటిరోజు ఉదయానే్న కుంతలపురికి తిరుగు ప్రయాణమైనారు.
21
సాయంకాలమయింది.
ఉరుకులు పరుగుల మీద ఉత్సాహంగా దుష్టబుద్ధి సముఖానికి వచ్చాడు ప్రసేనుడు. ఆయన ముఖం కళకళలాడుతోంది.
‘అసలు రహస్యం సేకరించాను స్వామీ’ అన్నాడు.
‘శుభం. చెప్పండి’ అని పీఠం మీద ముందుకు వంగాడు దుష్టబుద్ధి.
‘కరద మండల విజయాన్ని సాధించిన సాహస యువకుని పేరు చంద్రహాసుడు. కుళిందకుని దత్తపుత్రుడట’
‘దత్తపుత్రుడు. చంద్రహాసుడు’ అని వినగానే ఉలిక్కిపడ్డాడు దుష్టబుద్ధి. కుళిందుడికొక దత్తపుత్రుడు ఉన్నట్టే తెలియదే? ఈ పరిణామం ఏమిటి? అవును. ఈ పేరు ఎన్నడో విన్నట్లుగా వున్నది. అతని మేధ ఆలోచనలోకి దిగింది. ఇదేమీ పట్టించుకోకుండా ప్రసేనుడు తన సంభాషణని కొనసాగించాడు.
‘అతడే తన మల్లయుద్ధ గురువు అడివప్పతోనూ, ఉపసేనాని దక్షణ్ణతోనూ కలిసి పరిమిత సైన్యంతో హఠాత్తుగా రాత్రి వేళ దాడి చేసి వీరశివుని అతని శయన మందిరంలో నిద్రిస్తుండగా బంధించాడట. తెల్లవారేసరికి కోటని వశపరచుకున్నారు - కళింద్ర సైనికులు. అంతటి వ్యూహ నైపుణ్యం అసాధారణమనీ, అప్రతిహతమనీ చెప్పాడు’ అని ఆగి, ‘చెప్పింది వీరశివుడే’ అన్నాడు మాటలను అక్కడ ఆపి, దుష్టబుద్ధి వైపు చూశాడు - ప్రసేనుడు.
మహామంత్రి దీర్ఘాలోచనలో ఉన్నాడు.
తాను చెప్పిన విషయాన్ని ఆయన పూర్తిగా విన్నాడా? లేదా? అనే సందేహం కలిగింది ప్రసేనుడికి. ‘ఏమి ఆలోచన ప్రభూ?’ అని ఆయన దృష్టిని మరల్చే ప్రయత్నం చేశాడు.
దుష్టబుద్ధి మనస్సంతా కల్లోలంగా ఉంది. మాట్లాడలేకపోయాడు. ఏనాటి సంగతులో ఆయన మదిని కలచి సుడిరేపుతున్నాయి. ఏమి మాట్లాడాలని అనిపించలేదు. మిన్నకున్నాడు.
ప్రసేనుడికి నిరుత్సాహం కలిగింది. తాను ఎంతో గొప్ప రహస్యాన్ని కనుగొని వచ్చాననుకున్నాడు. మహామంత్రి సంతోషిస్తాడనుకున్నాడు. కానీ, ఆయన పూర్తిగా ఉదాసీనంగా, అన్యమనస్కంగా ఉన్నాడేమా - అని నొచ్చుకున్నాడు.
ఇంతలో - దుష్టబుద్ధి తల విదిలించి, ప్రసేనుని చూస్తూ, ‘సరి.. బాగుంది. నీవొక ముఖ్యమైన సంగతిని గోప్యంగా విచారింపజెయ్యి. ఈ దత్తపుత్రుడెక్కడి వాడు? అతని పుట్టుపూర్వోత్తరాలేమిటి? కుళిందకునికి ఎప్పుడు లభించాడు? అనే అంశాలను ఆరా తీయండి. కళింద్ర రాజధానిలో మన ఆంతరంగికులకు ఈ బాధ్యతని అప్పగించండి. అవసరంగా వేగుల్ని పంపండి’ అన్నాడు.
‘చిత్తం’ అన్నాడు ప్రసేనుడు. ఆ వెంటనే ‘తమ ఆంతర్యంలో ఏమో విశేషం ఉంది’ అన్నాడు.. ‘అదేమిటో’ అనే అర్థాన్ని వెలిబుచ్చుతూ.
‘అన్నీ తెలుస్తాయి. ముందు ఆ వివరాలు సేకరించండి. అవి మనకు చాలా ముఖ్యం’ అని లేచాడు.
ఆ రాత్రంతా - దుష్టబుద్ధికి నిద్ర లేదు.
ఇక్కడ కళింద్ర భవనంలో చేతన మంత్రికీ నిద్రపట్టలేదు.
తాముగా అగ్నివర్మకు చెప్పిన వాస్తవాన్ని తెలుసుకోకుండా వూరకే ఉంటాడా దుష్టబుద్ధి - అనే ఆందోళన ఆయన మనసును నిలువనీయలేదు.
మరో రెండు రోజులు చేతనుడూ, సింగన్నా కుంతలపురంలోనే ఉన్నారు. కానీ - అందువలసిన పత్రాలు వారికి అందలేదు.
ఒప్పంద పత్రాలను తానే స్వయంగా పూర్తి చేయించి, ప్రత్యేక దూత ద్వారా కళింద్రకు పంపే ఏర్పాటు చేస్తానని చెప్పారు గాలవులవారు. ఆ కారణం వలన చేతనుడు, సింగన్న కుంతలలో మరికొంత సమయం వేచి చూడవలసిన అవసరం లేకపోయింది. ఆ రోజే వారు తమ రాజధాని చందనావతికి తిరుగు ప్రయాణమైనారు.
22
రోజులు గడుస్తున్నాయి.
ఆవేళ - సాయంకాలం...
అంతఃపుర ఉద్యానవనం. ఉద్యానవనంలోని మంటపంలో రాజకుమారి - చంపకమాలినీ బృందం. బృందంలో దుష్టబుద్ధి కుమార్తె - విషయ, ప్రసేనుని కుమార్తె - విరజ ప్రముఖులు. చంపకమాలిని - పరిచారికలు కాంచన, చంద్రిక - సరేసరి. ఆమెకు దేహత్రాణాల్లాంటివారు. విషయ చెలికత్తెలు శోభన, కళావతి కూడా చేరారు. విరజకు ఒక్కర్తే స్నేహితురాలు - కామాక్షి. ఆమె కూడా వచ్చి వీరితో కలిసింది.
అందరూ కూర్చుని కొంత సమయం పూబంతితో చెండ్లాట ఆడారు. ఎన్నిమార్లు ప్రయత్నించినా బంతి చేజారుతూనే ఉంది.. విరజకు. విసుగ్గా ‘నేను ఆడను’ అంది. చంపకమాలిని గోముగా సముదాయించింది.
ఒకటి రెండు ఆవర్తాలు కావటం, నవ్వుకోవటం. చంపకమాలిని పక్కన కూర్చుంది విషయ. కాంచన మాత్రం తనలో తాను పాడుకుంటూ తన చుట్టూ తాను తిరుగుతోంది.
‘ఒప్పులకుప్ప’ పాటతో శోభన చంద్రిక రెట్టించుకుంటున్నారు.
చివరి పాదాన్ని మార్చి మార్చి -‘ఏడే వాడు - వాడే మొగుడు, సంగడి కాడు - సత్తువ లేదు..’ పాడుకుంటూ తిరిగి తిరిగి బాగా అలసిపోయి వచ్చి చంపకమాలిని, విషయ కూర్చున్న చోట క్రింది మెట్టు మీద చతికిలపడ్డారు.
కొద్దిసేపటికి అందరికీ అలుపు తగ్గింది. నీళ్లు త్రాగి మాటలు కలిపారు. కబుర్లలో సమయం గడుస్తున్నది.
‘విన్నారా ఈ వార్త. కళింద్ర మహామండలంలో ఒక వయసుకాడు అతి సాహసంతో కరద మండలం మీద దాడి చేసి - అక్కడి మండలాధిపతి వీరశివుని బంధించి తెచ్చి మన రాజుగారికి అప్పగించాడుట. నగరంలో చాలామంది ఈ వింతనే చెప్పుకుంటున్నారు’ మాటల మధ్యలో విరజ అన్నది.
విషయ ముందుకు వంగి విరజకు దగ్గరై, ‘నిజంగానటే! అంతటి గండరగండడా ఆ వీరుడు?’ అన్నది.
‘అవునా?’ కళ్లు చక్రాల్లా చేసి విరజని చూస్తూ అన్నది చంపకమాలిని. అందరూ ఆసక్తిగా విరజనే చూస్తున్నారు. విరజ ఆశ్చర్యంగా అందరినీ గమనించింది. చెప్పింది. విని, వినబోయే దాని పట్ల ఉత్సుకతతో అందరూ వౌనం పాటించారు. కొంటెగా గొల్లున నవ్వుతూ, ‘ఏమిటమ్మలారా! కొమ్మలారా! మీ ఇద్దరికీ కావాలా?’ నర్మగర్భంగా అన్నది విరజ! చంపకమాలినీ, విషయా - ఇరువురూ ముఖాలు ముడుచుకున్నారు. నవ్వుకున్నారందరూ.
‘అదేలెండి... ఆ వీరుని సాహసం గురించి!’ అని రెట్టించి, ‘ఎక్కువ వివరాలు నాకూ తెలియవు. అది కూడా మా అమ్మా నాన్నగారూ మాట్లాడుకుంటూ వుంటే విన్నాను. ఏమైనా పాతికలోపున పరిమిత సైన్యంతో - వ్యూహాత్మకంగా విజయం సాధించుకొచ్చాడట. అదీ విశేషం’ విడమరచింది.
‘శక్తీ యుక్తీ ఉంటే ఏదైనా సాధ్యమే. మనకు గాలవుల వారు చెప్పారు కదా! ఆ చంద్రహాసునిలో ఈ లక్షణమున్నట్లనిపిస్తోంది’ విషయ మాటలకు ‘అవునవును’ అన్నారు ఇతరులు.
చంపకమాలిని పెదవులు చంద్రహాసుని పేరుని ఉచ్చరించుకున్నాయి.
‘ఏమో! అతను భవిద్రక్షకుడేమో!’ తనకు తాను చెప్పుకుంటున్నట్లుగా అన్నది విషయ.
‘ఎవరి భవిష్యత్తుకు విషయగారూ’ మళ్లీ పరిహారం చేసింది విరజ.
నవ్వుల రత్నరాశుల్ని క్రుమ్మరిస్తూ నవ్వేరందరూ.
విషయ సిగ్గుతో ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. తలవంచి మెడలోని హారాన్ని చేతివేళ్లతో ఆడుకోసాగింది. అది ముత్యాలపేరు. తండ్రి మాటలు గుర్తుకొచ్చినై. ‘ముత్తెములు, ఆణిముత్తెములు, ముక్తారాజములు అని ముత్యాలు మూడు రకాలు. ఈ హారంలో వున్నవన్నీ ముక్తారాజ జాతికి చెందినవి. అవి అష్టైశ్వర్యాలనూ ఇనుమడింప జేస్తాయి. ఇది నీకు ప్రత్యేక కానుక’ అని ఎన్నడో బహూకరించాడాయన. ఆనాడు అష్టమండలం నుండీ తిరిగి వచ్చాడు. చాలా ధన కనక వస్తు వాహనాదులను పట్టుకొచ్చాడు. ఆ సంపదలోనిదే ఇది. మరి, ఏ విధమైన ఐశ్వర్యం సిద్ధించబోతున్నదో తనకు! వీరుని రూపంలో కూడా రావచ్చేమో!’
చంపకమాలిని కూడా అంతర్ముఖీనంగా కూర్చుని ఉంది. అన్యమనస్కంగా మెడలోని మహేంద్ర నీలహారంతో ఆడుకుంటోంది. ఆమె చిన్నతనంలో పుట్టినరోజు నాడు తండ్రి అగ్నివర్మ బహూకరించాడు. నీలాలు, ఇంద్రనీలాల, హారాలెన్నో ఉన్నా ఈ హారం అంటే ప్రత్యేకమైన మక్కువ ఆమెకు.
చంపకమాలిని అరవిరిసిన పూవులా భాసిస్తున్నది. ఏదో అహేతుకానురాగం మనసును ముప్పిరిగొన్నది. అది వీరత్వారాధనో, వీరారాధనో అర్థంకాని వ్యక్తావ్యక్త భావనలు! అంతఃకరణ వృత్తిగా, ఏవో, ఎవరివో, దేనికో ఆహ్వాన పత్రికలు అందుతున్నాయి.
ఇంతలో - రాకుమార్తె దాది వసుంధర అక్కడికి వచ్చింది.
వసుంధర చంపకమాలినికి మాతృసమానురాలు. అగ్నివర్మ భార్య సుశీల - కుమార్తె ముద్దుముచ్చట్లు చూసుకునే అదృష్టానికి నోచుకోలేదు. ఆమెకు గర్భకోశంలో ఏర్పడిన కణితి వలనా, ఇతర ఆరోగ్య సమస్యలూ తలెత్తి సుమారు సంవత్సరంపాటు చాలా బాధపడి, చంపకమాలిని మూడవ ఏట కన్నుమూసింది. తన బంధుజనంలో ఏ తోడూ నీడా లేని వసుంధర అప్పటికే మహారాణి ప్రాపున బ్రతుకుతోంది. తన కడసారి కోరికగా చంపకమాలిని సంరక్షణ బాధ్యతని ఆమెకు అప్పగించి చనిపోయింది మహారాణి. అప్పటి నుండి రాకుమార్తెకు ఆమే సంరక్షకురాలు.
వసుంధర రాకతో అందరూ తమతమ ఆలోచనల నుంచీ బయటకు వచ్చారు.
చంపకమాలిని చూసిందామెను. వసుంధర ముఖం విషణ్ణంగా ఉంది. ఆమె చేతిలో ఔషధ పాత్ర ఉంది. ‘నాన్నగారికి ఔషధం ఇవ్వాలని బయలుదేరుతుంటే, వారే నీ కోసం కబురు చేశారు. కలిసి వెళ్లవచ్చని ఇటుకేసి వచ్చాను’ అన్నది.
యువరాణి కళవళ పడుతూనే లేచింది. ముఖంలో ఆందోళన ప్రస్ఫుటమయింది. స్నేహితురాండ్ర వైపు చూస్తూ ‘సరే, రేపు కలుసుకుందాం. మరి నే వస్తా’ అని, వసుంధరతో ‘పద’ అంటూ ముందుకు కదిలింది.
వయస్యలూ వెళ్లిపోయారు. కాంచన మాత్రం వారిరువురినీ అనుసరించింది.
వీరు మహారాజు మందిరానికి వచ్చేసరికి ఆయన తన పర్యంకం మీద కొద్దిగా ముందుకు వంగి, ఒడిలో ఒక ఉపధానాన్ని పెట్టుకుని, ఛాతీని పట్టుకుని ‘ఖళ్ళుఖళ్ళు’మని దగ్గుతున్నాడు.
రాజవైద్యుడు పక్కన నిలబడి మహారాజు వ్యాధి తీవ్రతని ఉపశమింప జేయడానికి నోటికి ఔషధ గుళికని అందించాడు.
అగ్నివర్మ తలెత్తి పక్కన నిలిచిన కూతురి వైపూ, దాది వైపూ చూశాడు. కుమార్తెను తన దగ్గరకు రమ్మని కనుసైగ చేశాడు. ఆమె ఒక అడుగు ముందుకు వేసి నిలిచింది. గుళికని మింగి నీరు త్రాగాడు.
వసుంధర తాను తెచ్చిన ఔషధ పాత్రను రాజవైద్యునికి అందించింది.
‘ఇది అంతఃపురంలోని వృద్ధ పరిచారిక రక్షిత తయారుచేసింది. పాకశాలలోని పదార్థాలు - శొంఠి, అల్లం, వాము, తేనె వంటి వాటితో చేసినట్లు చెప్పమన్నది. ప్రభువుల వారికి ఆయాసం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు దీనిని సేవిస్తే వెంటనే కొంత ఉపశమనం కలుగుతుందిట. మీకు తెలియనిదేముంది గానీ, మా ఆందోళన కొద్దీ...’
‘ఔనౌను’ అంటూ పాత్ర మూతను తీసి చూసి, తన శిష్యుని పిలిచి, ఔషధాన్ని పరీక్ష చేసి తీసుకురమ్మని పంపాడు. కొద్దిసేపు అయ్యాక అగ్నివర్మ - వైద్యునీ ఇక సెలవు తీసుకోమన్నారు. ఆయన వెళ్లిపోయారు. ఔషధాన్ని సేవించవచ్చని ఇచ్చి వెళ్లాడు శిష్యుడు.
వసుంధర, చంపకమాలినీ మాత్రమే మందిరంలో వున్నారు. ద్వారం బయట నిలిచి ఉంది కాంచన.
‘తల్లీ - చంపకం. నా ఆరోగ్య పరిస్థితి చూస్తున్నావు కదా! ఈ సమస్య వలన రాచకార్యాల్లో ఎక్కువ నిమగ్నం కాలేక పోతున్నాను. గాలవుల వారు ఒక సూచన చేశారు. అధికారికమైన ముఖ్యాంశాల్లో నీవు కొంత చొరవ తీసుకోవటం అవసరం రేపటి నుండీ వారికడ వలసిన బాగోగుల్ని నేర్వాలి నీవు. మహామంత్రుల వారికీ సైన్యాధ్యక్షులకూ ఈసరికే మా ఆదేశాలు చేరినాయి. ఏమంటావ్?’ లోగొంతుకతో అన్నాడు అగ్నివర్మ.

మిగతా వచ్చేవారం

-విహారి 98480 25600