సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు..16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతని చేతులు యంత్రంలా పని చేసుకుపోతున్నాయి. ఒక్కొక్క పార్టు వివేక్ మృత శరీరం మీద పడుతోంది. ట్యాంకులోని పెట్రోలు గోతిలో పోసి ఖాళీ ట్యాంకుని అందులో పడేశాడు. మరికొన్ని కట్టెలు తెచ్చి గోతిలో పేర్చాడు. చేతులకి అంటిన మట్టి దులుపుకుని వాటర్ బాటిల్ అందుకుని నీళ్లల్లో కలిపిన ఓడ్కా కొంత తాగేడు. సిగరెట్ ముట్టించి రెండు దమ్ములు లాగి ఆకాశంలోకి చూశాడు. చీకటి పడటానికి ఇంకా సమయం ఉన్నట్టు గుర్తించాడు.
ఓ రాయి మీద కూర్చుని ఒక్కొక్క గుక్క మందు తాగసాగేడు.
చీకటి పడ్డాక ఆ ప్రాంతానికి వచ్చే సాహసం ఎవరూ చెయ్యరు. ఆ గోతిలో అగ్గిపుల్ల పడేస్తే గంటలో కాలిపోతుంది శవం. దానితో పాటు బైక్ నామరూపాలు లేకుండా పోతుంది. జీడిమామిడి చెట్లు దట్టంగా ఉన్నాయి కాబట్టి వెలుగు బయటకి కనిపించదు. శవం కాలిన వాసన గుర్తించడానికి చుట్టుపక్కల మనుషులు ఉండరు. కాలడం పూర్తయ్యాక గోతిని మట్టితో కప్పేస్తే అంతే సంగతులు.
హత్య చేయడం ఎంత తేలికో శవాన్ని మాయం చెయ్యడం అంత కష్టం. శవం లేకపోతే ఏ పోలీస్ ఆఫీసర్ ఏమీ చెయ్యలేడు. చిన్నగా నవ్వుకున్నాడు ఆ వ్యక్తి.
చీకటి నల్లత్రాచులా ప్రకృతిని చుట్టుముడుతోంది.
* * *
ఉదయం తొమ్మిదిన్నరకి సమతా ఎక్స్‌ప్రెస్ రాయగడలో ఆగింది. రిజర్వేషన్ కంపార్ట్‌మెంట్ నుంచి చిన్న ఎయిర్ బ్యాగ్‌తో దిగేడు యుగంధర్. స్టేషన్ బయట ప్రయాణీకులతో హడావిడిగా ఉంది. ఓ ఆటోని పిలిచి బారిజోలా వెళ్లాలని చెప్పాడు యుగంధర్. తల అడ్డంగా ఊపి ఆ దారిలో వెళ్లే ఆటోని చూపించాడతను. ఆ షేర్ ఆటో నిండాక మరో ఇద్దర్ని తన సీటుకి అటు ఇటు కూర్చోబెట్టుకుని బండి స్టార్ట్ చేశాడు డ్రైవర్.
స్టేషన్ నుంచి బయటకొచ్చి ఎడమవైపు రోడ్డులో తిరిగింది ఆటో. పది నిమిషాల్లో టౌన్ లిమిట్స్ దాటి సన్నటి తారు రోడుడ మీద వెళ్లసాగింది. చుట్టూ ఎతె్తైన కొండలు, రోడ్డుకి ఇరువైపులా పచ్చటి పొలాలు. ప్రయాణీకులు కోరిన చోట ఆటో ఆపుతున్నాడు డ్రైవర్. మరో పావుగంట ప్రయాణం సాగేక ఒక చోట ఆపి, ‘బారిజోలా’ అరిచాడు.
యుగంధర్ ఆటో దిగి డ్రైవర్‌కి రెండు పది నోట్లు అందించాడు. అతను అయిదు రూపాయల నాణెం తిరిగిచ్చి వెళ్లిపోయాడు. యుగంధర్ చుట్టూ చూశాడు. రోడ్డుని ఆనుకుని ఉంది చిన్న ఊరు. వందలోపే ఉంటాయి ఇళ్లు. రోడ్డు పక్కనే ఉన్న బడ్డీకొట్టు సమీపించి అడిగేడు.
‘అనాధ శరణాలయం ఎక్కడ?’
అతను నోటితో చెప్పకుండా చూపుడు వేలితో చూపించాడు.
గమ్మత్తుగా కనిపిస్తున్న చిన్నచిన్న ఇళ్లని చూస్తూ అతను చూపించిన వైపు అడుగులు వేశాడు. ఊరు దాటేక చుట్టూ కంచె వేసిన ఓ స్థలం, అనాథ శరణాలయం అనే బోర్డుతో కనిపించింది. లోపల చెట్ల క్రింద రెండు పాకలున్నాయి. అందులో ఒకటి పెద్దది, మరోటి చిన్నది. చెప్పుకోవడానికి అవి పాకలే కాని చాలా శుభ్రంగా ఉన్నాయి. ఒకతను చిన్న పాక నుంచి బయటకొచ్చి ప్రశ్నార్థకంగా చూశాడు.
‘సెక్రటరీగారు కావాలి...’ చెప్పాడు యుగంధర్.
‘నేనే.. రండి’ అని, ఓ గదిలోకి దారితీసాడతను. ఆ వ్యక్తికి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు యుగంధర్.
‘నా పేరు యుగంధర్. విశాఖపట్నం నుంచి వచ్చాను. మీ నుంచి కొంత సమాచారం కావాలి’
‘అడగండి’ అన్నాడతను చిరునవ్వుతో. ఆ వ్యక్తికి నలభై వరకూ ఉంటుంది వయసు. అనాధ శరణాలయం సెక్రటరీ కావటంవల్ల కాబోలు ముఖంలో ప్రశాంతత, పెదాల మీద నిర్మలమైన చిరునవ్వు.
‘ప్రతి సంవత్సరం విశాఖపట్నం నుంచి మీకు పది వేల రూపాయలు విరాళం అందుతోంది’
అతను తలూపి చెప్పాడు.
‘అవును.. రాజరాజేశ్వరి అనే ఆవిడ పంపుతారు’
‘ఆమెకి ఈ అనాథ శరణాలయంతో సంబంధం ఏమిటి?’
‘తెలియదు’
‘తెలియకుండా విరాళం ఎలా స్వీకరిస్తారు?’
అతను చిన్నగా నవ్వేడు.
‘డొనేషన్ ఇచ్చే వారి పేరు తెలుస్తుంది. ఏ కారణంతో ఇస్తున్నదీ వాళ్లు చెబితే తప్ప మాకు తెలియదు. నేను ఇక్కడ సెక్రటరీగా తొమ్మిదేళ్ల నుంచి పని చేస్తున్నాను. అంతకంటే ముందు నుంచి మాకు రాజరాజేశ్వరి గారు డొనేషన్ పంపుతున్నారు’ చెప్పాడు.
‘మీకంటే ముందు ఇక్కడ సెక్రటరీ ఎవరు?’
‘మా నాన్నగారు’
‘ఆయనకి తెలియొచ్చు..’
‘నిజమే.. కాని ఆయన కాలం చేసారు’
‘సారీ!’
‘ఇట్సాల్ రైట్...’ అతని పెదాల మీద అదే చిరునవ్వు.
ఎటువంటి సంబంధం లేకుండా మరో రాష్ట్రంలోని అనాథ శరణాలయానికి రాజరాజేశ్వరి డబ్బు ఎందుకు పంపుతుంది? అదీ ప్రతి సంవత్సరం నిర్ణీత సమయంలో పంపడానికి ఏదో కారణం ఉండాలి.
‘మీకు అందుతున్న విరాళాలకి రికార్డు ఉంటుందా?’
అతను మాట్లాడకుండా లేచి ఓ బీరువా సమీపించి లావుపాటి రిజిస్టర్ ఒకటి తీశాడు. సంవత్సరాల వారీగా వెనక్కి చూసుకుంటూ పేజీలు తిప్పసాగేడు. ఓ పేజీ దగ్గర ఆగాడు.
‘పందొమ్మిది వందల తొంభై ఆరులో మొదటి విరాళం రాజరాజేశ్వరి గారి నుంచి ఈ సంస్థకి అందింది. నాన్నగారు స్వయంగా రాశారు’ చెప్పాడు.
ఆ వివరాలు నోట్‌బుక్‌లో రాసుకున్నాడు యుగంధర్.
‘ఈ సమాచారం ఎందుకు మీకు?’ అడిగేడు సెక్రటరీ.
‘రాజరాజేశ్వరి ఈ మధ్యనే చనిపోయింది. ఆమెకు సంబంధించిన వివరాలు ఏవీ దొరకలేదు. ఈ అనాథ శరణాలయంతో ఎలాంటి సంబంధం లేకుండా డబ్బు పంపదు. అది తెలుసుకోవాలని వచ్చాను. మీ అనాథ శరణాలయం ఎప్పుడు ప్రారంభమైంది? ఎంతమంది పిల్లలున్నారు?’ ప్రశ్నించేడు యుగంధర్.
‘నలభై ఏళ్ల క్రితం మా నాన్నగారికి పాతికేళ్ల వయసులో వచ్చిన ఆలోచన ఇది. ఈ అనాథ శరణాలయం నిర్మించి తీర్చిదిద్దడంలో చాలా కష్టపడ్డారు. మంచితనం, మానవత్వం పెట్టుబడిగా సమాజానికి ఏదో చెయ్యాలనే తపనతో ఇది నిర్మితమైంది. మొదట్లో ఇద్దరు పిల్లలతో మొదలై నేటికి ఏభై నలుగురితో నడుస్తోంది. అందులో ముప్పై ముగ్గురు ఆడపిల్లలైతే మిగతా వారు మగపిల్లలు’
‘ఎవరూ కనిపించడం లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది’
‘ఉదయం తెల్లవారుజామున అయిదుకి పిల్లల దినచర్య మొదలవుతుంది. ఎనిమిదిన్నరకి అల్పాహారం తీసుకుని లంచ్ బాక్స్‌తో సిద్ధంగా ఉంటారు. తొమ్మిదికి రాయగడ నుంచి వచ్చే బస్సులో స్కూళ్లకి వెళతారు. తిరిగి సాయంకాలం వస్తారు. పిల్లల్ని డిగ్రీ వరకూ చదివిస్తాం. ఆ తర్వాత ఉపాథి చూపించే ప్రయత్నం చేస్తాం’
‘ఎవరైనా పిల్లని కాని పిల్లాడ్ని కాని పెంచుకోవాలంటే ఇస్తారా?’
నవ్వుతూ చూశాడతను.
‘సంతోషంగా ఇస్తాం... ఇక్కడున్న వారికి బాగా జీవించే అవకాశం వస్తే వదిలిపెట్టం’
‘తొంభై ఆరు ఆగస్టు నుంచి అనాథ శరణాలయం ప్రారంభమైన నాటి వరకూ ఇక్కడున్న పిల్లల వివరాలు ఇవ్వగలరా?’
‘ఎందుకు?’ అడిగాడతను ఆశ్చర్యంగా.
‘వారిలో రాజరాజేశ్వరి ఉంటుందని నా అంచనా’
అతను తలూపి లేచి బీరువా దగ్గరికి వెళ్లాడు. పాత రిజిస్టర్లు కొన్ని తీసి టేబుల్ మీద ఉంచాడు. యుగంధర్ ఒక్కొక్క రిజిస్టర్ అందుకుని పిల్లల పేర్లు చూడసాగేడు. మొత్తం రిజిస్టర్లు పరిశీలించడానికి గంటపైనే పట్టింది. వాటిలో రాజరాజేశ్వరి పేరు లేదు. బుర్ర వేడెక్కడంతో వెనక్కి వాలేడు యుగంధర్.
‘రిజిస్టర్లు లోపల పెట్టేయనా?’ అడిగేడు సెక్రటరీ.
‘ఒక్క క్షణం’ చెప్పి, రిజిస్టర్లు మళ్లీ చూడసాగేడు యుగంధర్. పందొమ్మిది వందల ఎనభై నాలుగు లిస్టులో ఓ పేరు దగ్గర ఆగి చిన్నగా నవ్వి చెప్పాడు,
‘రాజరాజేశ్వరి భర్త బలరామ్ సాహు ఈ అనాథ శరణాలయంలో రెండేళ్లు ఉన్నాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో అతన్ని ఇక్కడ చేర్చారు. ఎనభై ఆరు తర్వాత రిజిస్టర్‌లో అతని పేరు లేదు’
‘ఆ తర్వాత అతని పేరు లేదంటే ఎవరైనా పెంపకానికి తీసుకుని ఉండాలి. లేదా ఎవరికీ చెప్పకుండా అనాథ శరణాలయం నుంచి వెళ్లిపోయి ఉండాలి’ అని, బీరువా నుండి మరో రిజిస్టర్ దానితోపాటు ఓ పేపర్ల కట్ట తెచ్చాడు. రిజిస్టర్‌లో పేజీలు తిరగేసి, పేపర్ల కట్ట నుంచి పిన్ చేసిన రెండు పేపర్లు తీశాడు. అవి చదివి చెప్పాడు.
‘మక్కువ గ్రామానికి చెందిన రంగరాజు రామచంద్రరాజు అనే ఆయన బలరామ్ సాహుని పెంపకానికి తీసుకున్నాడు. అప్పట్లో అనాథ శరణాలయానికి పాతిక వేలు డొనేట్ చేశాడాయన. ఇందులో వివరాలు ఉన్నాయి చూడండి’
అవి తీసుకుని పరిశీలించాడు యుగంధర్. భర్త అనాథ శరణాలయంలో పెరిగాడు కాబట్టి ప్రతి ఏడూ పదివేలు పంపుతోంది రాజరాజేశ్వరి. మక్కువ గ్రామానికి పెంపకానికి వెళ్లిన మనిషి విశాఖపట్నం ఎందుకొచ్చాడు? రాజరాజేశ్వరిని ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు? ఇవన్నీ తెలుసుకుంటే తప్ప వారసులు ఎవరో కనుక్కోవడం కష్టం.
అసలు బలరామ్ సాహు ఏమయ్యాడు? రాజరాజేశ్వరి ఇంట్లోంచి బయటకు రాకుండా జీవించడానికి కారణం ఏమిటి? కొత్త ప్రశ్నలు యుగంధర్ బుర్రలో ఊపిరి పోసుకున్నాయి.
* * *
ముందు వెళుతున్న స్కూటర్ మీద నుంచి దృష్టి మరల్చకుండా బైక్ పోనిస్తున్నాడు రాజేష్. పాత పోస్ట్ఫాస్ దాటి కొంత దూరం వెళ్లాక ఓ టీ షాపు దగ్గర స్కూటర్ ఆపి దిగాడతను. సిగరెట్ వెలిగించుకుని షాపతను గ్లాసుతో ఇచ్చిన టీ అందుకుని బల్లమీద కూర్చున్నాడు. టీ తాగుతూ తనకి ఎలాంటి అర్జంటు పని లేనట్టు మధ్యలో సిగరెట్ దమ్ము పీలుస్తున్నాడు.
వంద గజాల దూరంలో ఆగి సెల్ చెవి దగ్గర పెట్టుకుని ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఆ వ్యక్తినే గమనిస్తున్నాడు రాజేష్. ఓ పావుగంట గడిచాక టీకి డబ్బులిచ్చి స్కూటర్ స్టార్ట్ చేశాడు ఆ వ్యక్తి. ఆ బండి చేస్తున్న చప్పుడు, సైలెన్సర్ నుంచి వస్తున్న పొగ అది ఎంత పాతదో చెప్పకనే చెబుతున్నాయి. ఓ అపార్ట్‌మెంట్ యజమాని తన స్కూటర్‌కి ఇనుప గొలుసు చుట్టి తాళం వేశాడట. రెండో రోజు చూసేసరికి స్కూటర్ అలాగే ఉందట. దానికి కట్టిన ఇనుప గొలుసు దొంగ ఎత్తుకుపోయాడట. ఎక్కడో చదివిన ఆ జోక్ గుర్తొచ్చి నవ్వుకున్నాడు రాజేష్.
డాబా గార్డెన్స్ ప్రాంతంలోని కార్ షెడ్ బయట స్కూటర్ ఆపి లోపలికి వెళ్లాడతను. స్కూటర్‌కి తాళం వెయ్యకపోవటంతో వెంటనే తిరిగొస్తాడని ఊహించి షెడ్ సమీపానికి వెళ్లలేదు రాజేష్.
ఆ వ్యక్తి షెడ్ లోపలికి నడిచాడు. ఓ మెకానిక్‌ని విష్ చేసి లోపల చివరగా పార్క్ చేసిన బ్లూ కలర్ శాంత్రోని సమీపించాడు. జేబులోంచి కీ తీసి వెనుక డోర్ తెరిచాడు. ఎరుపురంగు వ్యానిటీ బ్యాగ్ సీటులో ఉంది. దాన్ని తీసుకుని తిరిగి డోర్ లాక్ చేసి బయటకొచ్చాడు. స్కూటర్ డిక్కీలో బ్యాగ్ ఉంచి బయలుదేరాడు.
దూరం నుంచి చూస్తున్న రాజేష్‌కి అతను డిక్కీలో ఏం పెట్టాడో కనిపించలేదు. ఎట్టి పరిస్థితిలోనూ అతన్ని వదిలే ఉద్దేశం లేకపోవడంతో తన బైక్ స్కూటర్ వెనుక పోనిచ్చాడు. టి.బి. హాస్పిటల్ సమీపించాక రోడ్డు పక్క స్కూటర్ ఆపి నిలబడ్డాడు ఆ వ్యక్తి. ఓ కారు అతని దగ్గర స్లో కావడం, డిక్కీ నుంచి తీసిన వస్తువు కారులోకి అందించడం, రెప్పపాటు వ్యవధిలో కారు కదిలి వెళ్లిపోవడం జరిగిపోయింది. ఆ కారు నెంబర్ గుర్తు పెట్టుకున్నాడు రాజేష్.
స్కూటర్ వెనక్కి తిరిగి తాపీగా వెళ్లసాగింది. ట్రాఫిక్ అధికంగా ఉన్నా స్కూటర్ తన దృష్టి పథం నుండి దాటిపోకుండా వెళుతున్నాడు రాజేష్. సిరిపురం మీదుగా యూనివర్సిటీ దాటి చినవాల్తేర్ చేరింది స్కూటర్. స్లమ్ ఏరియాలోని ఓ ఇంటి బయట స్కూటర్‌కి తాళం వేసి లోపలికి వెళ్లాడు ఆ వ్యక్తి.
పావుగంట తర్వాత బయటకొచ్చి నడవసాగేడు. ఒక బడ్డీకొట్టు దగ్గర ఆగి క్వార్టర్ బాటిల్ మందు, డిస్పోజల్ గ్లాసు, రెండు వాటర్ పేకెట్లు తీసుకుని బడ్డీ వెనక్కి నడిచాడు. అక్కడ బల్లల మీద కొంతమంది కూర్చుని తాగుతున్నారు. ఆ వ్యక్తి కూడా కూర్చుని బాటిల్ తెరిచి గ్లాసులో మందు పోసుకుని నీళ్లు కలుపుకున్నాడు. గ్లాసెత్తి మొత్తం గటగటా తాగేసి మూతి చేత్తో తుడుచుకుని సిగరెట్ వెలిగించాడు.
పది నిమిషాలు గడిచాక మిగతా మందు గ్లాసులో పోసుకుని సీసా దులిపి పక్కకి విసిరేశాడు. అక్కడ పని ముగించుకుని ఆ వ్యక్తి బయలుదేరాడు. ఇప్పుడతని అడుగులు తడబడుతున్నాయి. అంతకుముందు స్కూటర్ ఆపిన ఇంట్లోకి వెళ్లిపోయాడు.
ఓ అరగంట ఎదురుచూసి అతను తిరిగి బయటకు రాడని నిశ్చయించుకుని మొదట్లో ఆపిన తన బైక్ వైపు అడుగులు వేశాడు రాజేష్.
భూపతి మనుషులమని చెప్పి తనని బెదిరించడానికి ప్రయత్నించిన వ్యక్తి. భూపతి పేరు మీదున్న చెక్కు మార్చడానికి బ్యాంక్‌కి వచ్చిన వ్యక్తి ఒక్కరే. అంతేకాదు, గుడిలో రాసమణి భయపడింది కూడా అతనికే. ఇప్పుడు రాజేష్ అనుసరించింది ఆ వ్యక్తినే!

(మిగతా వచ్చే వారం)

-మంజరి 9441571994