సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు..4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

3
రాత్రి పదకొండు గంటల సమయంలో హోటల్లో భోజనం ముగించి తన రూమ్ వైపు నడుస్తున్న రాజేష్ చప్పున ఆగిపోయేడు. అతన్ని దాటుకుని వెళ్లిన మ్యాక్సీ క్యాబ్ ఆగి అందులోంచి నలుగురు మనుషులు దిగి రాజేష్ వైపు రాసాగేరు. వాళ్లు రఫ్ కేరెక్టర్స్ మాదిరిగా కనిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు. వీధి నిర్మానుష్యంగా ఉంది.
నలుగురూ దగ్గరకు వచ్చాక ఒకతను అడిగాడు.
‘నీ పేరు?’
‘దేనికి?’ ఎదురు ప్రశ్నించేడు రాజేష్.
‘జవాబు చెప్పు...’ కరకుగా ఉందతని గొంతు.
‘నాతో పనేంటో చెబితే చెబుతాను’
హఠాత్తుగా ఒకతని చేతిలో లావుపాటి కర్ర ప్రత్యక్షమైంది. వెనకా ముందు చూడకుండా దాన్ని బలంగా ప్రయోగించాడతను. అది భుజానికి తగలగడంతో వెనక్కి తూలి కోపంగా అన్నాడు రాజేష్.
‘మీరెవరో నాకు తెలియదు. అనవసరంగా నా మీద దాడి చేస్తున్నారు. అది మంచిది కాదు’
‘నువ్వేంటిరా మాకు చెప్పేది..’ అంటూ ఓ అడుగు ముందుకేసి మరోసారి కర్రని ప్రయోగించాడు అంతకు ముందు కొట్టిన మనిషి.
గాలిలో దూసుకొచ్చిన కర్రని ఎడమచేత్తో ఆపి, కుడి అరచేత్తో అతని గుండెల మీద బలంగా చరిచేడు రాజేష్. కరెంట్ షాక్ తగిలినట్టు వెనక్కి విరుచుకు పడిపోతూ కర్ర వదిలేశాడతను. మిగతా ముగ్గురు రాజేష్ వంక ఆశ్చర్యంగా చూశారు, తమకి ఎదురు తిరిగినవాడు మొదటిసారి ఎదురైనట్టు.
‘మాతో విరోధం పెట్టుకుని ఈ సిటీలో బతకలేవు’ నాయకుడిలా కనిపిస్తున్న వ్యక్తి హెచ్చరికగా అన్నాడు.
‘విరోధానికి వచ్చింది మీరు, నేను కాదు’ సమాధానం ఇచ్చేడు రాజేష్.
ఆ యువకుడు అంత తేలిగ్గా లొంగే రకం కాదని అర్థమైంది అతనికి. ఇప్పుడు అతనితో పోట్లాటకు దిగితే జనాలు మేలుకుంటారు. ఎవరైనా కంట్రోలు రూమ్‌కి ఫోన్ చేస్తే లేనిపోని ఇబ్బంది.
‘మేం భూపతి మనుషులం...’ చెప్పాడతను.
‘అతనెవరు?’
‘అంత నిర్లక్ష్యం పనికిరాదు. నీ పేరు చెప్పు?’
‘చెప్పను’
‘అంతేనా?’
‘నీ దిక్కున్నచోట చెప్పుకో...’
ఇంతలో దగ్గరలోని ఓ బిల్డింగ్‌లో ఎవరో లేచినట్టు దీపం వెలిగింది. వెంటనే అంతా వెనక్కి తిరిగారు. వాళ్లు, క్యాబ్ ఎక్కిన మరుక్షణం అది ముందుకి దూసుకుపోయింది.
అప్పుడు కదిలేడు రాజేష్.
రూమ్ వైపు తాపీగా అడుగులు వేస్తున్నాడు కాని అతని బుర్ర తీవ్రంగా ఆలోచిస్తోంది. భూపతి పేరు మొదటిసారి రాసమణి ద్వారా తెలిసింది. ఇప్పుడతని మనుషులు తన కోసం వచ్చారు.
ఎందుకు?
తన గురించి తెలుసుకుని ఏం చేస్తారు? రాసమణితో మాట్లాడటం నేరమా? దీని అంతు తేల్చాలి. చివరగా నిర్ణయించుకున్నాడు రాజేష్.
* * *
‘శనివారం మధ్యాహ్నం ఎన్ని గంటలకు రాంప్రసాద్ ఇంటికొచ్చారు?’ ప్రశ్నించేడు యుగంధర్.
అది నగరంలోని చాలా ఖరీదైన గ్రూపు హౌసుల్లో ఒకటి. లోపల విలువైన ఫర్నిచర్, నేల మీద మందపాటి తివాచీ, ముట్టుకుంటే మాసిపోతుందేమో అనిపించే శుభ్రత, ఎక్కడ వస్తువు అక్కడ అమర్చి అద్భుతంగా ఉంది ఆ విజిటర్స్ రూమ్.
యుగంధర్‌కి ఎదురుగా రాంప్రసాద్ భార్య, అతని ఇద్దరు పిల్లలు కూర్చున్నారు. వాళ్లందరి ముఖాల్లో విషాదం తాండవిస్తున్నా, రాంప్రసాద్ కూతురు ముఖంలో కాస్త అధికంగా ఉంది.
‘ఎప్పటిలాగే రెండున్నరకి ఇంటికొచ్చి ముఖం కడుక్కుని టీ తాగి బయటకెళ్లారు. ఆదివారం మీరు చేసిన కాల్‌తో ఆయన గురించి తెలిసింది’ ఆమె కళ్లు తుడుచుకుంది.
ఆమె బాధ అర్థం చేసుకున్నట్టు రెండు నిమిషాలు వౌనంగా ఉండిపోయాడు యుగంధర్.
‘శనివారం రాత్రి ఆయన ఇంటికి రాకపోయేసరికి మీరు కంగారు పడలేదా?’ కొన్ని క్షణాల తర్వాత అడిగేడు.
‘అప్పుడప్పుడూ స్నేహితులతో గెస్ట్‌హౌస్‌లో ఉండిపోతారు’ చెప్పిందామె.
‘ఈ ఇల్లు మీ స్వంతమా?’
‘ఆర్నెల్ల క్రితం కొన్నారు’
‘మీ వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా?’
ఏం చెప్పాలో తోచనట్టు ఆమె ఆలోచనల్లో మునిగిపోయింది.
‘మీరిచ్చే సమాచారం హంతకుల్ని పట్టుకోవడానికి ఉపకరించవచ్చు...’
ఆమె నెమ్మదిగా గొంతు విప్పింది.
‘మూడేళ్ల క్రితం నెల్లూరు నుంచి ఇక్కడకొచ్చాం. అంతకు ముందే నెల్లూరు వాడైన రాజిరెడ్డి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఏదో పని మీద బ్యాంక్‌కి వచ్చి మావారిని పలకరించాడట. అప్పటి నుంచి అతనితో తిరుగుతున్నారు’
‘తన ప్రాణాలకి ప్రమాదం ఉందని రాంప్రసాద్ భావించేవారా?’
‘లేదు’
‘ఈ మధ్యకాలంలో ఎవరితోనైనా గొడవ పడ్డారా?’
‘లేదు.. అలాంటి వారు కాదాయన’
యుగంధర్ తలపంకించి మరో ప్రశ్న సంధించాడు.
‘రియల్ ఎస్టేట్ భాగస్వాముల్లో ఏవైనా సమస్యలు కలిగాయా?’
‘లేదు.. రియల్ ఎస్టేట్ బూమ్‌లో అంతా బాగా సంపాదించి ఇప్పుడు నిశ్చింతగా జీవిస్తున్నారు. రోజూ సాయంకాలం ఓ ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌లో కలుసుకుని పార్టీలు చేసుకుంటున్నారు. ఓ రోజు తాగి ఇంటికొచ్చిన ఆయన్ని, పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని హెచ్చరించాను. వారం తర్వాత ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించి కాగితాలు నా చేతిలో పెట్టారు. నా పేర, పిల్లల పేర బ్యాంక్ అకౌంట్లో కొన్ని లక్షలు డిపాజిట్ చేసి నా నోరు మూయించారు’ చెప్పిందామె.
‘రాజిరెడ్డితో మీకు పరిచయం ఉందా?’
‘గృహప్రవేశం రోజున మాత్రమే చూశాను’
‘మీ వారికి ముఖ్యమైన మిత్రులు కాని, శత్రువులు కాని ఉన్నారా?’
‘లేరు...’
‘అడ్డదారిలో మీ వారు సంపాదించలేదని నమ్ముతున్నారా?’
ఆమె చివ్వున చూసింది యుగంధర్ వైపు. ఆ తర్వాత తమాయించుకుని చెప్పింది.
‘నిప్పులాంటి మనిషి ఆయన. మీరు బ్యాంక్‌లో అడిగితే తెలుస్తుంది’
ఆమె నుండి సెలవు తీసుకుని బయటకు వచ్చాడు యుగంధర్.
* * *
‘ప్లీజ్ కూర్చోండి...’ చెప్పాడు రాజిరెడ్డి, తన ఆఫీస్ గదిలోకి వచ్చిన యుగంధర్‌తో.
‘ఏం తీసుకుంటారు?’ అడిగేడు, అతను కూర్చున్నాక.
‘నో ప్లీజ్.. రాంప్రసాద్ హత్య కేసులో కొంత సమాచారం కావాలి’
‘అడగండి..’ అని సిగరెట్ వెలిగించుకుని పాకెట్‌తోపాటు లైటర్ యుగంధర్ ముందుకు తోశాడు.
‘రాంప్రసాద్ మీకు ఎప్పటి నుంచి పరిచయం?’ అని మొదటి ప్రశ్న అడిగేడు యుగంధర్.
‘నెల్లూరులో ఉన్నప్పుడే తెలుసు నాకు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి వ్యాపారం మొదలెట్టాను. ఒకసారి బ్యాంక్‌కి వెళ్లినప్పుడు అక్కడ కలిశాడు’ చెప్పాడు రాజిరెడ్డి.
‘మీ వ్యాపారంలో అతను భాగస్వామా?’
రాజిరెడ్డి వెంటనే తల అడ్డంగా ఊపేడు.
‘కొణిజేటి సుందరం, నేను కలిసి వ్యాపారం చేస్తున్నాం. రాంప్రసాద్ మాకు ఫైనాన్షియల్ అడ్వయిజర్ మాత్రమే’
‘అంటే జీతం ఇచ్చేవారా అతనికి?’ విపరీతంగా తాగే అలవాటు వల్ల ఉబ్బిన అతని ముఖంలోకి చూస్తూ అడిగేడు యుగంధర్.
‘జీతం నామమాత్రం... కమీషన్ ద్వారా వచ్చేది ఎక్కువ’
‘పదో తేదీ శనివారం మీరెక్కడ ఉన్నారు?’
ఆ సంభాషణ యుగంధర్ జేబులోని సెల్‌లో నిశ్శబ్దంగా రికార్డవుతోంది.
ఓ క్షణం ఆలోచించి చెప్పాడు రాజిరెడ్డి.
‘ఆ రోజు ఉదయం తొమ్మిదింటికి ఇంటి నుంచి బయలుదేరి పరవాడ పదికి చేరాను. సర్వేయర్ వచ్చేసరికి పదకొండు దాటింది. ఓ సైట్ కొలతలు తీసుకుని రిజిస్ట్రేషన్‌కి కాగితాలు సిద్ధం చేసేసరికి రెండైంది. అచ్యుతాపురం వెళ్లే దారిలో ఒక మిత్రుని గెస్ట్‌హౌస్‌లో లంచ్ చేసి విశ్రాంతి తీసుకున్నాను. తిరిగి రాత్రి పదికి ఇంటికొచ్చాను’
‘రాంప్రసాద్ ఎలాంటివాడు?’
‘అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా తన పనేదో తాను చేసుకుపోయే మనిషి’
యుగంధర్ తలూపి అడిగేడు.
‘రాంప్రసాద్ బ్యాంక్ ఆఫీసర్. అందులోనూ అతను చూసేది లోన్ సెక్షన్. అలాంటప్పుడు అతను మీ పనులకు ఎలా అటెండ్ అయ్యేవాడు?’
‘రోజూ కూర్చుని చెయ్యాల్సిన పని మా దగ్గర ఉండదు. శని, ఆదివారాల్లో ఆఫీస్‌కి వస్తే చాలు. ఆషాడ, శూన్య మాసాల్లో రిజిస్ట్రేషన్స్ ఉండవు. అలాంటి రోజుల్లో మిగతా పనులు చూసుకుంటాం. మంచి రోజులు వచ్చేసరికి బల్క్‌గా రిజిస్ట్రేషన్‌కి ఏర్పాటు చేస్తాం. అవసరాన్నిబట్టి బ్యాంక్ నుంచి వచ్చాక ఒకటి రెండు గంటలు పని చేసేవాడు రాంప్రసాద్’
సిగరెట్ పీకని యాష్‌ట్రేలో కుక్కి మరో ఫ్రెష్ సిగరెట్ వెలిగించుకుని అప్పుడే గుర్తొచ్చినట్టు అడిగేడు రాజిరెడ్డి.
‘మీకభ్యంతరం లేదుగా?’
‘లేదు’ నవ్వేడు యుగంధర్. ఆ తర్వాత ప్రశ్నించేడు.
‘రాంప్రసాద్ నివసించే గ్రూప్ హౌస్ యాభై లక్షలు చేస్తుంది. ఆరు నెలల క్రితం కొన్నాడని తెలిసింది. అతనికి మీరేమయినా డబ్బు సాయం చేసారా?’
తల అడ్డంగా ఊపేడతను.
‘బ్యాంక్ ఆఫీసర్ కావడంతో వ్యాపారపరంగా మాకు బాగా ఉపయోగపడేవాడతను. నెలకి కనీసం అతని ద్వారా రెండు సైట్లు అమ్ముడయ్యేవి. వాటికి కమీషన్ చెల్లించేవాళ్లం’
‘ఒక సైట్ అమ్మితే కమీషన్ ఎంత ముడుతుంది?’
‘మా వ్యాపార రహస్యాలు అడుగుతున్నారు’ నవ్వేడు రాజిరెడ్డి.
యుగంధర్ కూడా నవ్వేసి అన్నాడు.
‘అంత ఖరీదైన ఇల్లు కొనేందుకు సోర్స్ తెలుసుకోవాలని అడిగాను’
‘రెండు వందల గజాల ఇంటిస్థలం పది లక్షలకు అమ్మితే సుమారు లక్ష రూపాయలు కమీషన్ ఇస్తాం’
అదే సమయంలో రాజిరెడ్డి పార్ట్‌నర్ కొణిజేటి సుందరం లోపలికి వచ్చాడు. యుగంధర్‌ని అతనికి పరిచయం చేశాడు రాజిరెడ్డి.
(మిగతా వచ్చే సంచికలో)

-మంజరి 9441571994