సెంటర్ స్పెషల్

మహా విజేత 7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రహాసుడు తన నడుముకు వున్న మోకుని లాగాడు. దాని ఒక కొసను వలయాకారంలో తిప్పి మోకుకు ముడిపెట్టేశాడు. ఉరితాడులా తయారయిందది. కోటగోడకు ఒకటి రెండు అడుగులు ఇవతలకు వచ్చి, గురిచూసి ఆ మోకును బురుజు పైకి విసిరాడు. అతని ప్రయత్నం ఫలించలేదు. మోకుకు పట్టు చిక్కలేదు. నిరాశపడక ఈసారి మరింత వేగంగా, మరింత శక్తితో విసిరాడు. ఇప్పుడు దానికి పట్టు చిక్కింది. లాగిలాగి చూశాడు. ముడి బిగిసింది.
అడివప్పను చూశాడు. అతడు కోటగోడను ఎక్కేస్తున్నాడు.
సంతృప్తిగా ఊపిరిపీల్చి, దక్షణ్ణకు సైగచేసి త్వరత్వరగా బురుజు పైకి చేరిపోయాడు. రక్షణ నిమిత్తం దక్షణ్ణ అక్కడే ఉండిపోయాడు.
బురుజుపైన ఎవ్వరూ లేరు. ఆశ్చర్యపోయాడు. వెంటనే స్ఫురించింది. తాను చేరుకున్నది మూడు అంతస్థులలో మధ్య అంతస్థుకని! పైదానిలో కానీ లేదా కింద అంతస్థులో కానీ రక్షక భటులు ఉండి ఉండవచ్చని జాగరూకతతో కిందికి దిగాడు. మొదటి లోవరిలోనూ ఎవ్వరూ లేరు. చకచకగా కిందికి దిగాడు.
ఎదురుగా చూశాడు.
ద్వారానికి అటుపక్క తనకు సమాంతరంగా అడివప్ప. పిడికిలి బిగించి బొటనవ్రేలుని ఎత్తి చూపుతూ నవ్వాడు!
ముందుకు చూస్తే పది విల్లుల ముంగిలి. దానిని ఆనుకుని రాజమందిరం. ప్రధాన ద్వారం తూర్పు వైపున వున్నది. తాము వచ్చింది దక్షిణ పార్శ్వం నుంచీ. ఆవైపు ద్వారం కనిపిస్తోంది. ఇద్దరు భటులు కాపలా కాస్తున్నారు.
వారికంట పడకుండా ద్వారాన్ని చేరాలంటే గోడవారగా ఎడమకు నడిచి కుడివైపునకు నడుస్తూ మందిరం గోడ దగ్గరికి చేరాలి.
అడివప్పకు ఆ ద్వారానికి చేరాలనే తన పథకాన్ని సైగ చేశాడు. అతడు అర్థం చేసుకున్నాడు. నక్కినక్కి అడుగులు వేస్తూ ఇద్దరూ ఒకరి వెనగ్గా ఒకరు నడిచారు.
మందిర ద్వారం దగ్గర భటులు పులిపంజాల్లాంటి వీరి ఘాతాలతో మరుక్షణంలో అసహాయులైనారు.
అడివప్ప చంద్రహాసులు వీరశివుని భోగమందిరం ప్రవేశించారు.
తూర్పు, పశ్చిమ ద్వారాలకు లోపలివైపు గడిమానులు, చిలుకులు తగిలించి ఉన్నాయి.
ఒకపక్కగా నిలిచి ఊపిరిని గట్టిగా తీసుకున్నారు.
రాజమందిరం లోపలి భాగం సర్వాలంకార శోభితంగా ఉంది. కుడ్యచిత్రాలు, రమణీయమైన పీఠికలు, మణిమయ తోరణాలతో సోరణగండ్లు; పీఠికలకు ఎదురుగా చిన్నచిన్న జగిలెలు, వాటి మీద వివిధాలంకారాలతో, వివిధాకృతులతో పానపాత్రలు, ఫలభరిత పళ్లెరాలు ఉన్నాయి. గోడలలోని దీగూడులలో అమర్చిన దీపికలు!
ఎదురుగా ప్రత్యేకాలంకృతమైన మేలుకట్టు కింద పర్యంకం. ఆ పానుపు పైన గాఢనిద్రలో వీరశివుడు!
ఏ లేడి పిల్లనో మింగి సేదదీరుతున్న కొండచిలువలా పడుకుని ఉన్నాడు.
నల్లగా నిగనిగలాడుతున్న దేహచ్ఛాయ, పైపంచె చెదరి ఉంది. నడుముకు జుట్టిన ధట్టీ వొరుసుకుంటోంది. ఉపధానం మీద ఎడమచేయి. దాని మీద తల!
పర్యంకానికి ఒక పక్కగా చంద్రహాసుడూ, వేరొక పక్కగా అడివప్ప వీరశివుని సమీపించి, కత్తులతో సంసిద్ధులై అతనిని తట్టి లేపారు.
కళ్లు తెరిచి చూసి దిగ్భ్రమ చెందాడు మండలాధిపతి! నిశే్చష్టుడైనాడు.
పర్యంకానికి ఇరువైపులా చేతుల్లో కత్తులు పట్టుకుని మీదకు వంగి ఉన్నారు ఇరువురు యోధులు. ప్రతిఘటించడానికి వీలులేని పరిస్థితి.
వీరశివుడు బందీయైనాడు!
బయట - దక్షణ్ణా, మిగిలిన వీరులూ కరద సైనికులను లొంగదీసుకుని కోట ద్వారం దగ్గరకు చేరారు. దొడ్డణ్ణ, హాలప్పల సహాయంతో ద్వారాన్ని తెరిపించి లోపలకు ప్రవేశించారు.
వీరశివుడు బందీయైన వార్త క్షణంలో కరద మండలమంతా వ్యాపించింది.
కరద మండలం కళింద్ర వశమయింది!
తర్వాతి వివరాలన్నీ జనశ్రుతిలో కతలైనవి.
17
చందనావతి నగరమంతా విజయోత్సవాలలో మునిగింది.
కొందరు ఢీలకీ మోతల్ని అనుసరిస్తూ లవణీ నాట్యం చేశారు. ‘డొల్లుకునిత’ని ప్రదర్శించారు. వారు పాడిన పాటలలో ఎక్కువ భాగం ఉత్తేజపూరితమైన యుద్ధ ప్రక్రియ గురించీ, విజయ సాధన గురించీ వున్నై. కొందరు బయలాటల్నీ ప్రదర్శించారు. సామాజికులకు ఆనందం కలిగేటట్లుగా రామాయణంలోని వివిధ ఘట్టాలనూ రసవంతంగా ఆడారు.
విజయోత్సవ సంబరాల ముగింపు సభలో తన ప్రసంగంలో ఈ విజయానికి కారకులైన వారందరినీ ప్రశంసలతో ముంచెత్తాడు ప్రభువు. తన ప్రతిస్పందనలో అడివప్ప ఒక్కటే మాటగా చెప్పాడు. ‘వ్యూహం, ప్రణాళికా - ఆచరణా - సర్వమూ చంద్రహాసునివే. ఈ వయస్సులో అంతటి శౌర్య సాహసాలూ, ఆ విధమైన మనః ప్రవృత్తీ ఉండటం చాలా అరుదైన విషయమే. రక్తపాత రహితంగా విజయాన్ని సాధించిన ఘనత చంద్రహాసునిదే!’ అని.
జయజయ ధ్వానాలు మిన్నుముట్టినై.
చంద్రహాసుడు వినమ్రంగా కైమోడ్చి ‘ఈ విజయాన్ని సాధించిన ఘనత నా ఒక్కడిది కాదు. అందరిదీనూ. ఇది ముఖ్యంగా కళింద్ర విజయం. అందరికీ ధన్యవాదాలు...’ అన్నాడు.
పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో వీరశివుని - సింగన్న, మంత్రి చేతనులతో కుంతలకి పంపించాడు కుళిందకుడు. జరిగిన వృత్తాంతమంతా మహారాజు అగ్నివర్మకూ, రాజ గురువు గాలవుల వారికీ విశదంగా వివరించమని చేతనుల వారికి చెప్పి పంపాడు. ఈ విజయంలో చంద్రహాసుని పాత్ర గురించి అవసరమైనంత మేరకే వారికి తెలుపమనీ కోరాడు!
18
మంత్రి చేతనుడూ, సైన్యాధ్యక్షుడు సింగన్న - వీరశివుని తీసుకుని, కుంతలపురం చేరేసరికి మధ్యాహ్నమైంది. సరాసరి రాజప్రాసాదానికి కూతవేటు దూరంలో వున్న తమ కళింద్ర భవనానికి వచ్చారు.
కుంతల పురంలో పరిస్థితులు స్థూలంగా అర్థమైనాయి.
మహారాజు అగ్నివర్మ ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉంది. ఆయనకు శే్లష్మ వ్యాధి. కార్తె బట్టి వ్యాధిలో ఉద్రేక ఉపశమనాలు ఉంటాయి.
ప్రస్తుతం అగ్నివర్మ వ్యాధి ప్రకోపంలో ఉంది. కుంతల మహామంత్రి దుష్టబుద్ధి - సైన్యాధిపతి ప్రసేనుని తన ఆధిపత్యంలో ఉంచుకుని తానే సర్వమై పరిపాలన సాగిస్తున్నాడు.
ప్రసేనుడు దుష్టబుద్ధి చెప్పుచేతలలో నడవడానికి కారణం వున్నది.
ప్రసేనునికి ఒక కొడుకు - వజ్రసేనుడు. కూతురు విరజ.
అగ్నివర్మ ఏకైక సంతానం - కూతురు చంపకమాలిని. ఆమెకు వజ్రసేనునితో వివాహం జరిపే బాధ్యత తనదిగా ఒక పథకాన్ని ప్రసేనునికి చెప్పాడు దుష్టబుద్ధి. అలాగే, విరజను తన కుమారుడైన మదనునికి భార్యగా చేయవచ్చునని ఆశ జూపుతున్నాడు.
దుష్టబుద్ధికి ఒక కూతురు. పేరు విషయ.
కుంతల మహాసామ్రాజ్యం దక్షిణాన తుంగభద్రానది, ఉత్తరాన నర్మద దరిదాపుల వరకూ, పశ్చిమాన అపర మహాసముద్రం. తూర్పున గోదావరి వరకూ విస్తరించి వున్నది.
అగ్నివర్మ ఆరోగ్య పరిస్థితుల వలన దుష్టబుద్ధి ప్రవర్తన వలన కుంతల సామ్రాజ్యంలో చాలామంది మండలాధీశ్వరులు తమకు తాము స్వతంత్ర పాలకులుగా ప్రకటించుకున్నారు. కుంతల సైనిక పాటవానికి జంకి దానికి సామంతులుగా ఉండేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల సందర్భాలలోనూ దుష్టబుద్ధి చేతివాటం గురించి రాజ్యంలోని ప్రజలందరికీ బాగానే తెలుసు. ఆ గుసగుసలు అనేక ప్రాంతాల్లో వినిపిస్తూనే ఉంటాయి. దుష్టబుద్ధి పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉన్నది.
ఈ విషయాలన్నీ సేకరించారు చేతనుడు, సింగన్న.
సాయంత్రమవుతోంది.
అర్ధముహూర్త కాలం గడిచింది.
రాజప్రాసాదం నుండీ వీరిని రమ్మని వర్తమానం వచ్చింది.
వీరు వెళ్ళేసరికి ప్రాసాదంలో రాజు అగ్నివర్మా, మహామంత్రి దుష్టబుద్ధీ, సైన్యాధ్యక్షుడు ప్రసేనుడూ వున్నారు.
రాచరిక మర్యాదలూ, మన్ననలూ అయిన తర్వాత చేతనుడు మొదలుపెట్టాడు.
కరద మండలం కళింద్రకు ఎలా పక్కలో బల్లెంగా తయారైందీ, తరచూ సైనిక చర్యలతో సరిహద్దు ప్రజలు ఎటువంటి ఇక్కట్లకు లోనౌతున్నదీ వివరించాడు. కరద మండలేశ్వరుడు వీరశివుని బంధించిన వైనాన్నీ విశదం చేశాడు.
అగ్నివర్మ ఏదో అడగబోయాడు. ఆయన అడగబోయేసరికి దగ్గు వచ్చింది. మంత్రి వైపు చూశాడు.
‘మన సైన్యాధ్యక్షులు వీరశివుని బందీగా స్వీకరించి చెరసాలలో వుంచారు ప్రభూ’ అని మళ్లీ ఒక లిప్తకాలంలోనే ‘ఏది ఏమైనా ఇలాంటి ప్రాధాన్యత కలిగిన అంశాల్లో వారు స్వతంత్ర నిర్ణయం తీసుకోవడం ఉచితమైన చర్య కాదు’ అన్నాడు దుష్టబుద్ధి.
మహారాజు చేతనుని వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.
సరిగ్గా అప్పుడే ప్రసేనుడు కూడా దుష్టబుద్ధి అభిప్రాయాన్ని బలపరుస్తూ ‘అనుచితమే కాదు, తప్పు కూడా’ అన్నాడు.
చేతనుడు వారిద్దరి మాటలను వినీ విననట్లుగా, ‘ప్రభూ! ఒక ప్రత్యేక విషయాన్ని తమకు మనవి చేసుకోవాలి’ అన్నాడు.
అగ్నివర్మకు అర్థమైంది. తమ మంత్రికీ, సేనాపతికీ కనుసైగతోనే సూచన నిచ్చాడు. వారిద్దరూ సంభ్రమించారు. అయినా తప్పదన్నట్లు నిష్క్రమించారు.
చేతనుడు చెప్పసాగేడు, ‘ప్రభూ! వీరశివుని దురాగతాలతో మేము చాలా విసిగిపోయాం. మా ప్రజలూ బాధపడినారు. మా చంద్రహాసుని గురించి మీరు కర్ణాకర్ణిగా విని ఉండవచ్చు. అతడు అమిత శౌర్య సాహసాలు గల యువకుడు. యుద్ధ విద్యలో ఆరితేరిన వాడు. అంతకు మించి పరిణత ప్రజ్ఞా, సమయస్ఫూర్తీ కలిగినవాడు. అతడు తన వ్యక్తిత్వంతో మా మహామండలేశ్వరునీ, మావంటి వారినీ అచ్చెరువొందిస్తాడు. చంద్రహాసుని చొరవ, సాహసం వలన వీరశివుని బందీ చేయగలిగాము. రక్తపాతరహితంగా కరద మండలం కుంతల భాగమైంది’ అని ఆగాడు.
‘విశేషమే. చెప్పండి’ అన్నాడు అగ్నివర్మ.
‘మేముగా స్వతంత్ర నిర్ణయం తీసుకోవటానికి కూడా అతని తర్కమే ప్రోద్భలించింది’ సింగన్న ఉత్సాహంగా చెప్పాడు.
మహారాజుకు కుతూహలం కలిగింది. ‘తర్కమా?’ అన్నాడు.
‘అవును ప్రభూ! కరదని కళింద్రలో కలపటం సాధ్యమయితే కళింద్ర మహామండలం విస్తృత భూభాగంతో, సంపదలతో, కుంతల మహాసామ్రాజ్య భాగమవుతుంది. ఒకవేళ సాధ్యం కాకపోతే కుంతల ప్రభువులకు మేముగా కలిగించే నష్టమేమీ లేదు. కారణం ఈ దండయాత్రలో సైనిక, ఆర్థిక సహాయం మేము అర్థించటం లేదు కనుక. ఇదే మహాప్రభూ! చంద్రహాసుని తర్కం. ఆ కారణం వల్లనే మేము ఈ కార్యాన్ని సాధించాము. ఇప్పుడు లబ్ధి. తమది’ అని ముగించాడు.
అగ్నివర్మ క్షణమాత్రం ఆలోచించి అడిగాడు, ‘ఈ వివరాలు మా మహామంత్రికీ, సేనాపతికీ తెలియవలసినవే కదా?’
‘అవును ప్రభూ! అవశ్యం తెలియజేయవలసినవే. అయితే చంద్రహాసుని పేరువల్లనే - మా భయం. వాని ప్రమేయాన్ని దుష్టబుద్ధి వారు హర్షించకపోవచ్చు. కుళిందకుల వారు మీకీ సమాచారాన్ని ఏకాంతంలో విన్నవించమని కోరారు’ సింగన్న అన్నాడు.
‘సరి’ పైకి మామూలుగానే అన్నా అగ్నివర్మ మనస్సులో చంద్రహాసుని గురించిన ఆలోచన మొదలయింది.
‘మరొక్క మనవి ప్రభూ! కుళిందకుల వారు వారి కోరికగా తమకు మరొక విషయమూ మనవి చేయమన్నారు. స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుని ఇటు కుంతల ప్రభువులకూ కప్పం చెల్లించకుండా అటు మాకు అనేక విధాలుగా ఇబ్బందులు కలిగిస్తూ ధూర్తతని ప్రదర్శిస్తున్న మండలాధిపతులు కళింద్రకు పక్కపక్కగా ఉన్నారు. మీకు తెలుసు. ఇప్పుడు వీరశైవునిపై విజయం సాధించినట్లు, కుంతల సైనిక సహాయాన్నీ, ఆర్థిక సహకారాన్నీ ఆశించకుండా, కళింద్ర ఆయా మండలాలపై అవసరాన్నిబట్టి సైనిక చర్య తీసుకునేటట్లు కుళిందకుల వారు మీ అంగీకారాన్ని వాంఛిస్తున్నారు ప్రభూ!’
చేతనుని అభ్యర్థనని విన్న అగ్నివర్మ ఆలోచిస్తూ కొద్దిసేపు వౌనంగా ఉండిపోయాడు. క్షణాల తర్వాత ‘మీరిప్పుడు విన్నవించిన కోరికని మాత్రం దుష్టబుద్ధి వారికీ, ప్రసేనుల వారికీ చెప్పండి’ అని ‘ఎవరక్కడ’ అంటూ భటునికి చెప్పి వారిద్దరినీ రావించాడు.
చేతనుడు చెప్పిన అంశం మీద సంభాషణ సాగింది.
దుష్టబుద్ధి అసహనంగా వున్నాడు. ‘అంటే కళింద్ర వారు తమకమహా మండలాన్ని విస్తరింప జేయదలచుకున్నారన్నమాట’ అని కటువుగానే అన్నాడు.
‘కాదు అదనపు వ్యయం లేకుండా కుంతల మహాసామ్రాజ్యాన్ని విస్తృతం చేసే బాధ్యతని వహిస్తున్నాము’ అని నిష్కర్షగానే చెప్పాడు చేతనమంత్రి.
‘బాగుంది’ అన్నాడు అగ్నివర్మ ముగింపుగా.
దుష్టబుద్ధికి మిన్నకుండక తప్పలేదు. జరిగిన పరిస్థితి అతనికి మింగుడు పడటం లేదు. పరిస్థితి తన చెయ్యిదాటి పోతున్నదనిపించింది.
చేతన సింగన్నలు సెలవు తీసుకుని కదలబోతుండగా ‘కరద మండల బాగోగులన్నీ స్థానికంగా ఉండి పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించండి. అతనికి పరిమిత సైనికాధికారాల్నీ, పాలనాధికారాల్నీ ఇవ్వండి’ అన్నాడు అగ్నివర్మ.
వెంటనే చేతనుడు ‘అవును ప్రభూ! మా ఉప సైన్యాధ్యక్షులలో ప్రముఖుడైన దక్షణ్ణకి ఆ బాధ్యతని ఇప్పటికే అప్పగించారు కుళిందకులవారు’ అన్నాడు.
‘శుభం’ అన్నాడు అగ్నివర్మ దుష్టబుద్ధి వైపు చూస్తూ.
ఆయన తప్పనిసరిగా అంటున్నట్టు ‘అవును’ అన్నాడు.
‘మీరు ఈ రాత్రి గాలవుల వారిని కలిసి కళింద్ర విశేషాలు తెలియజేయండి’ అన్నాడు అగ్నివర్మ.
‘చిత్తం, అలాగే ప్రభూ’ అన్నారు చేతనుడు, సింగన్న.
ఆ వెంటనే దుష్టబుద్ధిని ఉద్దేశించి ‘వీరి నుండి మనకు కావలసిన ఇతర వివరాలేమైనా ఉంటే తెలుసుకోండి మహామంత్రీ!’ అన్నాడు అగ్నివర్మ.
‘సరే.. ప్రభూ’ అన్నాడు దుష్టబుద్ధి.
అగ్నివర్మ తన ఏకాంత మందిరంలోకీ, మిగిలిన వారు బయటకీ కదిలారు.
19
రాత్రి...
మొదటి జాము జరుగుతోంది.
దుష్టబుద్ధి తన మందిరంలో ఉన్నాడు. ఎదురుగా ప్రసేనుడు. తమ పరోక్షంలో చేతనుడూ సింగన్నా మహారాజుకు ఏమి విన్నవించారనేది వారి మనసుల్ని వేధిస్తున్న ప్రశ్న. ఇద్దరూ సురాపానం చేయడం మొదలుపెట్టారు.
‘సైనిక భారమూ, ఆర్థిక భారమూ లేనంత మాత్రాన, సామంతులు ఎవరికి వారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే కుంతల మహా సామ్రాజ్యాధికారం ఏమవుతుంది?’ యధాలాపంగా అని అగ్నికి ఆజ్యం పోశాడు ప్రసేనుడు. ‘నిజానికి మీరూ నేనూ కలిసి చేయవలసిన రాచకార్యం కదా ఇది!’
‘అదలా ఉంచండి ప్రసేనా! మనల్ని ఇద్దరినీ ఇలా తృణీకరించటం మునుపెన్నడూ జరగలేదు. అదేకదా నా బాధంతా. ఈనాడు ఎందుకిలా అయింది?’
మాటలు సాగుతున్నవి. సురాపానమూ కొనసాగుతున్నది. ప్రతీహారి వచ్చి చేతనుడూ, సింగన్నలు మహామంత్రుల దర్శనం కోరుతున్నట్టు చెప్పాడు. దుష్టబుద్ధీ, ప్రసేనుడూ - ఇరువురూ తమను తాము సంబాళించుకుని, లేచి సమావేశ మందిరంలోకి వచ్చారు. వచ్చిన వారిని స్వాగతించారు. దుష్టబుద్ధి తెచ్చికోలు నవ్వుని అర్థం చేసుకుని మనసులోనే నవ్వుకుంటూ లోనికి వచ్చి కూర్చున్నారు - చేతన, సింగన్నలు.
‘కరదని కళింద్రలో విలీనం చేసుకున్నందువలన సామంత రాజ్య ఒప్పందాలన్నిటినీ మార్చవలసి ఉంటుంది. మీరు మరో రెండు రోజులు ఇక్కడే ఉండండి. నిబంధనలన్నిటిని తయారుచేయించి ఇప్పిస్తాము’ అన్నాడు దుష్టబుద్ధి.
‘చిత్తం. తమరెలా సెలవిస్తే అలా’ అన్నాడు చేతనుడు. తల వూపాడు సింగన్న.
‘కప్పం ప్రస్తుతం వున్న దానికి రెట్టింపు చేయవలసి ఉంటుంది’ యధాలాపంగా అన్నాడు దుష్టబుద్ధి.
‘కరద మండలం విస్తీర్ణం, సాగుభూమి, నీటి వసతి, ప్రజావసరాలు, ప్రకృతి పరిస్థితులు, ఆదాయ వ్యయాలు- అన్నీ వివరంగా గణనలు చేయించి తమకు విన్నవించుకుంటాము’
పరిచారిక ఫలరసంతో వచ్చింది. తీసుకున్నారు. కొద్దిసమయం నిశ్శబ్దంలో గడిచింది.

మిగతా వచ్చేవారం

-విహారి 98480 25600