తెలంగాణ

మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, జూన్ 23: ఓటుకు నోటు ఆంశంలో ఎలాగైనా శిక్ష తప్పదనే భయంతో ఎపి సిఎం చంద్రబాబు కేంద్రాన్ని మేనేజ్‌చేసి సెక్షన్ 8ని తెరపైకి తెస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. మంగళవారం మెదక్ జిల్లా ములుగు మండల కేంద్రంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. మేనేజ్ చేయడం, మోసాలు చేయడంలో బాబును మించిన నేతలెవరూ లేరని, ఓ రాష్ట్ర సిఎంగా పనిచేసి అనుభవం ఉన్న ప్రధాని నరేంద్రమోదీ హైద్రాబాద్‌పై గవర్నర్ పెత్తనాన్ని ఎంతమాత్రం ఒప్పుకోరని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో సహా తనకు ఓటుకు నోటులో భాగస్వామ్యం ఉన్నందునే ఎలాగైనా తప్పించుకునే లక్ష్యంతో ప్రశాంతంగా ఉన్న హైద్రాబాద్‌లో అల్లర్లకు కుట్రలు పన్నుతున్నట్లు కనిపిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుచేసిన వారెవరైనా శిక్షను అనుభవించాల్సిందేనని తెలిపారు. అయితే ఫోన్ ట్యాపింగ్ పేరిట టిడిపి నేతలు రాద్ధాంతం చేస్తుండగా, అసలు టీఆర్‌ఎస్ సర్కార్ ఏ ఒక్కరి ఫోన్ కూడా ట్యాపింగ్ చేయలేదని చెప్పారు. హైద్రాబాద్‌లో సెక్షన్ 8ని అమలు చేస్తే మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టి గతంలో చెప్పిన విధంగానే తిరిగి సీమాంధ్ర నేతలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇంటి నిర్మాణం అనుమతిపై కూడా గొడవలకు తెరలేపుతుండడం బట్టి చూస్తే అనుకున్నది సాధించే వరకు బాబు ఎంతకైనా తెగిస్తారని ఆరోపించారు. తెలంగాణతోపాటు హైద్రాబాద్‌పై ఇతరుల పెత్తనాన్ని సహించేది లేదని, అందరితో సిఎం కెసిఆర్ చర్చించి శాంతియుత ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, నేతలు మడుపు భూంరెడ్డి, జహంగీర్, మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.