మెయన్ ఫీచర్

కాంగ్రెస్‌కు ‘గ్రేటర్’ విషమ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరొక వారం రోజులలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో ఎవరు గెలవగలరన్నది ఆసక్తికరంగా మారటానికి పలు కారణాలున్నాయి. ఇది తెలంగాణలోనే గాక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆసక్తికరమైంది. అందుకు కూడా కొన్ని కారణాలున్నాయి. అట్లానే వివిధ కారణాలవల్ల ఈ ఎన్నికలు అధికార పక్షమైన టిఆర్‌ఎస్‌తోపాటు ప్రతిపక్షాలలోని కాంగ్రెస్‌కు, టిడిపి బిజెపి కూటమికి ముఖ్యమవుతున్నాయి. కాని దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించినపుడు అందరికన్నా కాంగ్రెస్‌కు ఈ ఫలితం విషమ పరీక్ష కానున్నది. దాన్ని వారు ఏ విధంగా ఎదుర్కొని గ్రేటర్‌లోని మొత్తం 150 వార్డులలో ఎన్నింటిని గెలవగలరో చూడవలసి వుంది. తాము అధికారంలోకి రాగలమన్న విశ్వాసం వారిలో కనిపించడం లేదు. గతంలోవలె మజ్లిస్‌తో పొత్తు ద్వారా అధికారానికి కూడా ఈసారి అవకాశం లేదు. మజ్లిస్‌కు టిఆర్‌ఎస్‌తో పరోక్ష అవగాహన ఉంది. తాము స్వయంగా ఆధిక్యత సాధించగలమన్న అధికార పక్షం ప్రకటన నెరవేరని పక్షంలో టిఆర్‌ఎస్, మజ్లిస్ కలిసి అందుకు ప్రయత్నిస్తాయన్నది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కనుక కాంగ్రెస్ పార్టీకి మిగిలిన ప్రశ్న టిడిపి- బిజెపి కూటమికన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తామా లేక తక్కువ అన్నదొక్కటే. ఆ పార్టీకి విషమ పరీక్ష అంటున్నది గ్రేటర్ మున్సిపాలిటీని చేజిక్కించుకోగలరా లేదా అన్నది కాదు. టిడిపి-బిజెపి కన్నా ముందుకు పోగలరా లేదా అనేదే!
చూడబోగా అందరికీ ఈ స్పష్టత ఉన్నట్లుంది. క్రమంగా అందరూ ఇదే ప్రశ్నకు వస్తున్నారు. స్వయంగా కాంగ్రెస్ నాయకులు, ఇతర పార్టీల వారు, ప్రజలు, పరిశీలకులు కూడా. ఇదే అభిప్రాయం పొరుగున గల తెలుగు రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పడుతున్నట్లున్నది. తెలంగాణ రాజకీయ పరిణామాలపై అక్కడ ఆసక్తి ఉండటం సహజం. అదీ గాక హైదరాబాద్ నగరం ఇంకా అక్కడివారి మస్తిష్కాలలో ఉండటంతోపాటు నగరంలో వారి ఆర్థిక, సామాజిక సంబంధాలు కొనసాగుతున్నాయి, హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని కావటమనే సాంకేతిక స్థితికి మించినదది. ఉద్యమం ద్వారా కొత్త రాష్ట్రం సాధించి అధికారానికి కూడా వచ్చిన టిఆర్‌ఎస్, హైదరాబాద్-రంగారెడ్డిలో తనకు మొదటినుంచి గల బలహీనతలను అధిగమించగలదా? తమ రాష్ట్రంలో అధికారపక్షమైన టిడిపి తెలంగాణ జిల్లాలలో దెబ్బతినిపోయిన తర్వాత కనీసం చివరి స్థావరమైన గ్రేటర్‌లోనైనా పట్టు నిలుపుకోగలదా లేదా? నగరంలో తగినంత బలంగల బిజెపి తెలంగాణకు మద్దతునిచ్చి కూడా జిల్లాల్లో సీట్లు గెలవలేకపోయిన స్థితిలో హైదరాబాద్‌లో తనను తాను ఎంతవరకు నిరూపించుగోగలదు? ఆంధ్రప్రదేశ్‌లో పుంజుకునే అవకాశాలు సమీప భవిష్యత్తులో కన్పించని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి జిహెచ్‌ఎంసిలో ఏ విధంగా ఉండవచ్చు? అన్నవి వారి ప్రశ్నలు. నిజానికి తెలంగాణలో వినిపించే ప్రశ్నలకు, వీటికి చాలా వరకు పోలికలున్నాయి.
గ్రేటర్ ఫలితాల ప్రభావం తెలంగాణలోనే గాక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉండగలవన్నది గుర్తించవలసిన విషయం. ఫలితాలు కొంత అటు ఇటు అయినా టిఆర్‌ఎస్, మజ్లిస్ కలిసి అధికారానికి రావటం ఖాయమన్న భావన రెండు రాష్ట్రాలలో ఇప్పటికే చాలావరకు ఏర్పడినట్లు కనిపిస్తున్నది. అది జరగకపోతే బాగుండునని, టిడిపి-బిజెపి కూటమి ఆధిక్యత సంపాదించాలని కోరుకుంటున్న వారు రెండు రాష్ట్రాలలో ఒకే స్థాయిలో ఉండటం గమనించదగ్గది. అందుకు కారణాలను ఊహించటం కష్టం కాదు. అదే సమయంలో, గ్రేటర్‌లోని రాష్ట్రేతర ఓటర్లలో క్రమంగా మారుతున్న దృష్టి పోలింగ్ తేదీ నాటికి ఏ స్థాయికి చేరవచ్చుననేది ఒక కీలక ప్రశ్నగా మారింది. చివరకు ఒకవేళ టిఆర్‌ఎస్ గెలిచినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇక ఆ పార్టీ గురించి, తెలంగాణలో భవిష్య రాజకీయాల గురించి సందేహాలు ఏమైనా ఉంటే తీరిపోయి ఒక నిశ్చితాభిప్రాయం ఏర్పడగలదని చెప్పవచ్చు. మరొకవైపు టిడిపి-బిజెపి కూటమి గురించిన అంచనాలు అదే ప్రకారం ఉంటాయి. వారి సీట్ల సంఖ్య హెచ్చుతగ్గులను బట్టి ఈ అంచనాలకు ఇంకా స్పష్టత వస్తుంది.
చివరగా మిగిలింది కాంగ్రెస్- ఆ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఎట్లుందో కనిపిస్తున్నదే. అటువంటి స్థితిలో గ్రేటర్‌లోగాని, ఆ మాటకు వస్తే తెలంగాణలోగాని మెరుగుపడితే ఆంధ్రప్రదేశ్ కాంగెస్‌కు క్షేత్రస్థాయి ప్రయోజనం ఏమైనా వుంటుందో లేదో అనుమానమేగాని, మానసికంగా మాత్రం కొంత ఊరట కలుగుతుంది. నదికి ఆవలి ఒడ్డున ఉన్న దీపాన్ని చూసి చలి కాచుకోవటం పద్ధతిలోనన్నమాట. ఆ దీపం వెలగనట్లయితే ఆ మాత్రం చలి అయినా తీరదు. మొత్తానికి ఇటువంటి ఆశ నిరాశల మధ్య ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వాదులు గ్రేటర్ ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికలలో తమ పరిస్థితి ఏమి కానున్నదో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకత్వానికి ముందే తెలుసు. కనీసం తెలంగాణలోనైనా ఫలితాలు ఆశాజనకంగా లేకపోవటం వారికి అదనపు నిరాశను కలిగించింది. రాజధాని అయిన హైదరాబాద్‌పైగల చివరి ఆశలు అంత గట్టిగా లేవు గాని పార్టీ కనీస స్థాయిలో నిలవాలన్నది వారి కోరిక. అది కూడా ఆ మేరకు నది అవతల దీపం కాగలదు. అంతిమంగా ఫలితాలను బట్టి ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వాదులపై ఉంటుంది. అక్కడి సాధారణ ప్రజలకు సంబంధించి ఇక ఆ పార్టీని మరింత కిందకు తోసి వేస్తారు. సాధారణ ఎన్నికలలో తగినన్ని ఓట్లతో 20కిపైగా సీట్లు సంపాదించినా, టిఆర్‌ఎస్‌కు దీటుగా ఎదగగల సూచనలు ఇప్పట్లో లేవనుకుంటారు. దాని పర్యవసానంగా స్థానిక కాంగ్రెస్‌పై కూడా చూపు మరింత తగ్గుతుంది.
గ్రేటర్ ఎన్నికల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆసక్తిని ఈ విధమైనది కాగా, తెలంగాణలో ఈ ఫలితాలు తక్కిన అన్ని పార్టీలకన్నా కాంగ్రెస్‌కు విషమ పరీక్ష కావటం ఎందుకో చూడాలి. పైన అనుకున్నట్లు, సంపూర్ణ ఆధిక్యం కాకపోయినా కనీసం టిడిపి-బిజెపి కూటమికన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకోవటం కాంగ్రెస్‌కు రాజకీయంగా, నైతిక స్థైర్యం కోసం కూడా అవసరం. టిఆర్‌ఎస్ కన్నా మించకపోతే అది అధికార పక్షమని చెప్పవచ్చు. అధికార దుర్వినియోగపరచిందని, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసారని ఆరోపించవచ్చు. ఆ విధంగా ప్రతిష్ఠను నిలబెట్టుకునేందుకు ప్రయత్నించవచ్చు. మజ్లిస్ కన్నా తగ్గితే పాతబస్తీ పరిస్థితి ఎప్పుడూ వేరేనని సరిపెట్టవచ్చు. కాని టిడిపి-బిజెపి కన్నా వెనుకబడితే చెప్పుకునేందుకు ఏమీ ఉండదు. తాము ఒంటరిగా పోటీ చేసామని, వారిది రెండు పార్టీల కూటమి అని వాదించజూస్తే అది సాంకేతికంగా సరైనది కావచ్చు గాని రాజకీయాలలో అందుకు విలువ వుండదు. ప్రతిష్ఠ నిలవబోదు. అదిగాక మరికొన్ని పరిస్థితులున్నాయి. గ్రేటర్‌లో కాంగ్రెస్ బలం ఎవరికీ తీసిపోదనే పేరు మొదటినుంచి ఉంది. ఎక్కువ పర్యాయాలు మేయర్ పదవి వారికే లభించింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తమ ప్రభుత్వమన్న ప్రచారం గట్టిగానే చేస్తున్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి బిజెపి పట్ల సానుకూలత ఉన్నా టిడిపిపై వ్యతిరేకత ఉంది. గత సార్వత్రిక ఎన్నికల దరిమిలా నగరంలో టిడిపి గణనీయంగా బలహీనపడిందనే అభిప్రాయం ఉంది. వలసలు రెండు పార్టీలనుంచి ఉన్నాయి గాని టిడిపి నుంచి ఇంకా ఎక్కువ. తెలంగాణకు చెందిన రెండు బలమైన సామాజిక వర్గాలు టిడిపి కన్నా కాంగ్రెస్‌లో ఎక్కువగా ఉన్నాయి. పాతబస్తీని అట్లుంచితే కొత్త హైదరాబాద్‌లో, సికిందరాబాద్‌లో గణనీయమైన సంఖ్యలోగల ముస్లిములు, క్రైస్తవులతోపాటు ఇతర పేద వర్గాలవారు మొదటినుంచి కాంగ్రెస్‌తో ఉంటూ వస్తున్నారు. ఇటీవలి మాసాలలో వారు తగినంతగా టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తున్నా, కాంగ్రెస్ బలాన్ని తేలికగా కొట్టివేయలేము. ఇవిగాక కాంగ్రెస్ నాయకులకు, అభ్యర్థులకు ఆర్థిక వనరుల కొరత లేదు. పార్టీ అధికారంలో ఉండగా వారు బాగా సంపాదించారు. ఇటువంటివన్నీ ఉన్నపుడు మామూలుగానైతే కాంగ్రెస్‌కు టిడిపి-బిజెపికన్నా ఎక్కువ సీట్లు రావాలి.
కాని వస్తాయా లేదా అన్నదే విషమ పరీక్ష. పైన కన్పించే అనేక అనుకూలమైన అంశాలకు విరుద్ధంగా పనిచేసేవి కూడా కొన్నున్నాయి. కనుకనే పరిస్థితి అనుమానాస్పదమవుతున్నది. పార్టీకి గ్రేటర్‌లో బలమైన నాయకత్వం లేకుండా పోయింది. బలమంటే కండబలం, ఆర్థిక బలమని కాదు. సమర్థంగా, తెలివిగా వ్యవహరిస్తూ అందరినీ వెంట తీసుకుపోయేవారు, నగర ప్రజలలో గౌరవ మర్యాదలు కలవారని అర్థం. హైదరాబాద్ నగర ప్రజలు ఒకప్పటివలె లేరు. కొత్తతరం వచ్చింది. ఆధునికత పెరుగుతున్నది. ఆలోచనలు మారుతున్నాయి. సమస్యలతో సర్దుకుపోయే ధోరణి తగ్గుతున్నది. ప్రజలు ప్రశ్నించటం, అవసరాల కోసం వత్తిడి చేయటం పెరుగుతున్నది. గల్లీ నాయకుల ప్రాబల్యం తగ్గి ప్రజలు తమ కుటుంబాల స్థాయిలో, వ్యక్తిగతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలుగువారు కాని ఓటర్ల సంఖ్య పెరుగుతున్నది. ఈ రోజున అత్యధికుల దృష్టి గతకాలపు రాజకీయ బంధాలకన్నా ఎక్కువగా పౌర సదుపాయాలు, అభివృద్ధిపైనే. ఈ విధంగా వెనుకటి బంధాలు సడలిపోతుండటం కాంగ్రెస్‌కు కలిసి వచ్చేది కాదు. ఈ కొత్త పరిస్థితులకు తగినట్లు ఎదిగిన నాయకులు, ప్రజలలో విశ్వాసాన్ని కల్పించగలవారు కాంగ్రెస్‌లో ఎవరంటే పేర్లు చెప్పటం తేలిక కాదు. పోనీ రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని చూసి ఈ స్థానిక ఎన్నికలలో ఓటు వేయాలన్నా, ఇదే విధమైన బలహీనతలు అక్కడా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు ఇది వౌలికమైన సమస్యగా మారింది. క్షేత్ర స్థాయిలో దీని ప్రభావం ఉన్నపుడు ఓటర్లకు విశ్వాసం కలగటం తేలిక కాదని వేరే చెప్పనక్కరలేదు.
నిజానికి సాధారణ ఎన్నికల నాటినుంచే కాంగ్రెస్‌ను ఈ పరిస్థితులు వెన్నాడుతున్నాయి. రాష్ట్రం ఇచ్చింది తామేనన్న ప్రచారం ఎన్నికలలో పనిచేయకపోవటం, ఓట్లు- సీట్లు తమ అంచనాలకన్నా బాగా తగ్గటం, ఆ తర్వాత ప్రతి ఎన్నిక, ఉప ఎన్నికలోనూ దెబ్బతినటం, తమ సభ్యులు, ఇతర నాయకులు వరుసగా వలసపోతుండటం, సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐక్యంగా కృషి చేయవలసిన సమయంలో కుమ్ములాటలు యధావిధిగా కొనసాగటం, పార్టీ పరిస్థితి జాతీయ స్థాయిలోనూ దయనీయంగా మారటం వంటివన్నీ కలిసి ఇక్కడ కాంగ్రెస్‌ను రాజకీయంగా బలహీనపరుస్తున్నాయి. నైతిక స్థయర్యాన్ని బాగా దెబ్బతీస్తున్నాయి. కనీసం భవిష్యత్తులోనైనా పరిస్థితి బాగుపడుతుందా అంటే అదీ అగమ్యగోచరంగానే ఉంది. వీటన్నింటిమధ్య గ్రేటర్ ఎన్నికలు వారికి విషమ పరీక్షగా మారటం సహజమైన విషయం. ఓడటం ఇతర పార్టీలకైనా సమస్యే. కాని వారికి కలిగే నష్టంకన్నా కాంగ్రెస్‌కు కలిగేది చాలా ఎక్కువ. టిఆర్‌ఎస్, టిడిపి, బిజెపిలకు మరో అధికారం మరోచోట ఉంది. కాంగ్రెస్‌కు ఏమీ లేదు. కనుక నైతికంగా అందరికీ మించిన దెబ్బ అవుతుంది.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)