బిజినెస్

సింగపూర్ కంపెనీలకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించేలా తమ ప్రభుత్వ విధానాలు ఉంటాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హామీ ఇచ్చారు. పెట్టుబడులు పెట్టే కంపెనీలకు పూర్తి సహకారం ఉంటుందన్నారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియాన్ నేతృత్వంలో పారిశ్రామికవేతల బృందం మంగళవారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమైంది. ఈ సమావేశంతో తెలంగాణ-సింగపూర్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కావడానికి దోహదం చేస్తుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తెలంగాణలో సింగపూర్‌కు చెందిన పలు కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలు విజయవంతంగా కొనసాగిస్తున్నాయని కాన్సుల్ జనరల్ గుర్తు చేశారు. వివిధ రంగాలలో సింగపూర్ అనుభవాలను తాము ఉపయోగించుకుంటున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో శిక్షణ, ఫార్మా, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టూరిజమ్ తదితర రంగాలలో తాము గణనీయమైన ప్రగతి సాధించామని ఈ రంగాలలో తెలంగాణకు పూర్తి సహకారం అందించనున్నట్టు కాన్సుల్ జనరల్ వెల్లడించారు. తమ ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద ఏకీకృత ఫార్మా క్లస్టర్‌ను ఏర్పాటు చేయబోతుందని, దీనికి సింగపూర్‌కు చెందిన కంపెనీ సహకారమే తీసుకుంటున్నట్టు మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గణనీయమైన పారిశ్రామిక ప్రగతి సాధించినట్టు మంత్రి వివరించారు. అంతర్జాతీయంగా అనేక వివిధ దేశాలకు చెందిన పెట్టుబడులు తెలంగాణకు తరలి వచ్చినట్టు వివరించారు. పెట్టుబడులు పెద్దఎత్తున తరలి రావడానికి కారణం తాము
అమలు చేస్తున్న పారిశ్రామిక విధానమేనని అన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న టిఎస్-ఐపాస్ ఇండియాలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానంగా పేరుగాంచిందని చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలువడం కూడా పెట్టుబడులు తరలి రావడానికి మరో కారణంగా మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సింగపూర్ కంపెనీలకు వివరించడానికి అక్కడి పారిశ్రామికవేత్తలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కాన్సుల్ జనరల్‌కు మంత్రి సూచించారు. తమ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకున్న అవకాశాలను పరిశీలించడానికి ఐటీ పార్కులు, టి-హబ్‌లను సందర్శించాల్సిందిగా మంత్రి కేటీఆర్ కోరారు. వచ్చే ఏడాది తాము నిర్వహించబోయే బయో ఏషియా సదస్సులో సింగపూర్‌లోని ఫార్మా కంపెనీలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని మంత్రి కేటీఆర్ కోరారు. పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రశంసించారు. టీఎస్-ఐపాస్ పారిశ్రామిక విధానం ప్రోత్సహకరంగా ఉందని ఆయన కొనియాడారు.

*చిత్రం...మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన సింగపూర్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందం