బిజినెస్

‘పట్నం’లో మరిన్ని పరిశ్రమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 11: పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పునరుద్ఘాటించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు మనె్న శ్రీనివాస్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, హెచ్‌ఎండీఏ డైరెక్టర్ శ్రీనివాస్, చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డిలతో కలిసి మండల పరిధిలోని మంగళ్‌పల్లిలో రూ. 22 కోట్లతో నిర్మించిన హెచ్‌ఎండీఏ ఆన్‌కాన్ లాజిస్టిక్ పార్క్‌ను ఆయన ప్రారంభించారు. రూ.10 కోట్లతో ఎంపీ పటేల్‌గూడలో 200 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా పారిశ్రామిక అభివృద్ధి మన రాష్ట్రంలో జరుగుతున్నదని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ రాజధానితో పాటు పలు జిల్లాలు అనువైన ప్రాంతాలుగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ ఖ్యాతి ప్రపంచ పటంలో అలరారుతున్నదని చెప్పారు. విశ్వనగరానికి పట్టణీకరణ
వేగంగా జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ చుట్టపక్కల ప్రాంతాలతో పాటు ఇబ్రహీంపట్నం పరిశ్రమల ఏర్పాటులో అగ్రభాగాన ఉన్నదని అన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పడిన లాజిస్టిక్ పార్క్ ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు కావడం ఇక్కడి ప్రాంత ప్రజల అదృష్టమని చెప్పారు. బాటసింగారంలో మరో మూడు, నాలుగు నెలల్లో లాజిస్టిక్ పార్క్ అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు. ఎలిమినేడు గ్రామంలో 500-600 ఎకరాల విస్తీర్ణంలో ఏరోస్పేస్ పార్క్ త్వరలోనే ఏర్పాటు కానున్నదని అన్నారు. ఆదిభట్లలో మరికొన్ని ఐటీ కంపెనీల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే టీసీఎస్, టాటా ఏరోస్పేస్, ఎకో పార్క్, హిటాచీ, అపాచీ వంటి అనేక సంస్థలు ఏర్పాటయ్యాయని మంత్రి గుర్తుచేశారు. తెలంగాణ నాలెడ్జ్ స్కిల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం ద్వారా ఈ ప్రాంత నిరుద్యోగుల్లో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి వారి విద్యార్హతలకు తగిన విధంగా ఉద్యోగాలు కల్పించేందుకు చొరవ తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. స్థానికంగా ఉండే వారికి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలలో ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. పట్టణీకరణలో విచ్చలవిడితనాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే నూతన మున్సిపల్ చట్టానికి రూపకల్పన చేశామని, చట్టాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు ఆయన వివరించారు. ప్రజలకు సేవ చేసే వారే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని, తమ స్వార్థం కోసం పనిచేసే వారికి చట్టం ప్రకారం కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్‌లను తొలగించే అధికారం చట్టం ద్వారా రూపొందించినట్లు చెప్పారు. చట్టాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న తరువాతనే రాజకీయ నేతలు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన చురకలంటించారు. నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేస్తున్న కృషి శ్లాఘనీయం అని ఆయన అన్నారు. నిరంతరం నియోజకవర్గం బాగుండాలని, రాష్ట్రంలో నెంబర్‌వన్‌గా ఉండాలని ఆయన కోరుకుంటారని అన్నారు. వెనుకబడిన నియోజకవర్గం, నీటి సౌకర్యం కల్పించాలన్న తపనతో ఇప్పటికే ఎన్నోసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఇతర శాఖల మంత్రులను నిరంతరం కలుస్తూనే ఉంటారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటైన నాలుగు మున్సిపాలిటీలకు రూ.10 కోట్ల చొప్పున విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరినట్లు వెల్లడించారు. ఈ మేరకు నిధులను మంజూరు చేసేందుకు చొరవ చూపనున్నట్లు వివరించారు. కుంట్లూరులో ఎస్‌డీపీకి రూ.15 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, నిధుల కొరతతో పనులు ముందుకు సాగడం లేదని, దానిని పూర్తి చేసేందుకు మరో రూ.14 కోట్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఫార్మాసిటీ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల సరిహద్దులో ఏర్పాటు కానున్నదని చెప్పారు. ఫార్మాసిటీతో ఈ ప్రాంతానికి లాభమే తప్ప నష్టం లేదని స్పష్టం చేశారు. కొంతమంది అభివృద్ధి వ్యతిరేకులు చేస్తున్న పుకార్లు, వ్యతిరేక ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పర్యావరణానికి హాని కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ఫార్మాసిటీ ఏర్పాటుకు పూనుకుంటున్నట్లు వివరించారు. 162 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డు నలువైపులా పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని, పట్టణీకరణలో వచ్చే సమస్యలను పరిష్కరించుకోవచ్చని మంత్రి చెప్పారు. ఔటర్ రింగ్‌రోడ్డులో 19 ఇంటర్‌చేంజ్‌లు ఉన్నాయని, అన్ని ఇంటర్ చేంజ్‌లు పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ చుట్టూరా మరో ఎనిమిది లాజిస్టిక్ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇంటర్‌స్టేట్ బస్ టర్మినల్ ఏర్పాటుకు స్థలాలు గుర్తిస్తున్నామని, త్వరలోనే వాటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రైల్వే టర్మినల్‌తో పాటు మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు అందుబాటులోకి తీసుకొచ్చి ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడతామని, వేగంగా గమ్యస్థానాలకు చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జీఎస్‌టీ వచ్చిన తరువాత దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు వెసులుబాటు కల్పించామని వివరించారు. టీఎస్ ఐపాస్‌తో పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులిచ్చే విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. పారిశ్రామక రంగానికి పెద్దపీట, పరిశ్రమలకు ఆహ్వానం పలికేందుకే టీఎస్ ఐపాస్ ద్వారా వెసులుబాటు కల్పించామన్నారు. టౌన్‌షిప్ పాలసీతో కాలనీల అభివృద్ధి, పట్టణీకరణ వేగంగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం అన్నివిధాలుగా చొరవ తీసుకుంటున్నామన్నారు.
విద్యా శాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపాలని అన్నారు. ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యే పరిశ్రమలతో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. హైదరాబాద్‌కు కొద్దిదూరంలోనే ఉన్నా రెండు నియోజకవర్గాలు సమగ్రంగా అభివృద్ధి చెందలేదని, సర్వతోముఖాభివృద్ధికి చొరవ తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కృపేశ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, పల్లె గోపాల్‌గౌడ్ పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ కాలుష్యం లేని పరిశ్రమలను ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోరారు. నియోజకవర్గంలోని కొత్తగా నాలుగు మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయని, వాటిల్లో 120 కాలనీలు కొత్తగా ఏర్పడినట్లు చెప్పారు. వాటిల్లో వౌలిక సదుపాయాల కల్పనకోసం, కాలనీల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను కోరారు. నియోజకవర్గంలో కొన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయని, వాటిల్లో పరిశ్రమల ఏర్పాటుకోసం చొరవ చూపాలని అన్నారు. ఇప్పటికే ఆదిభట్ల, ఎలిమినేడు, మొండిగౌరెళ్ళి గ్రామాల్లో పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, రానున్న రోజుల్లో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు కావాలని చెప్పారు. తద్వారా నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో సాగునీటి కల్పన కోసం ఇప్పటికే శివన్నగూడెం ఎత్తిపోతల బృహత్తర కార్యక్రమానికి చర్యలు తీసుకున్నామని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా సాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీంతో బీడుగా మారిన కొన్ని వేల ఎకరాల భూములను సాగులోకి తీసుకురావచ్చని వివరించారు.