బిజినెస్

పరిశ్రమల్లో ఇంధన పొదుపుపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : పరిశ్రమల్లో ఇంధన పొదుపుపై దృష్టి సారించాలని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ అధికారులను ఆదేశించారు. ఏపీ ట్రాన్స్‌కో, తూర్పు, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థల ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమలు ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయని, ఈ రంగంలో ఇంధన పొదుపుపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) దృష్టి సారించిందని చెప్పారు. 2030 నాటికి దేశంలో ఇంధన పొదుపు ద్వారా 1.8 లక్షల కోట్ల రూపాయలను ఆదా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. 165 మిలియన్ టన్నుల చమురుకు ఈ ఆదా సమానమని తెలిపారు. దీన్ని సాధించేందుకు వీలుగా ప్యాట్ (పెర్ఫార్మ్, అఛీవ్, ట్రేడ్) అనే పథకం ప్రారంభించిందని తెలిపారు. ఈ పథకంలో అన్ని రాష్ట్రాలు చురుగ్గా పాల్గొనాలని బీఈఈ కోరిందన్నారు. ఈ పథకం అమల్లో మార్గదర్శకంగా వ్యవహరించాలని ఏపీని కోరుతూ బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే లేఖ రాశారని వెల్లడించారు. ఉత్పత్తి అవుతున్న ఇంధనంలో 40శాతం మేర పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారన్నారు. ప్రస్తుతం 347 మిలియన్ టన్నుల చమురుకు సమామైన ఇంధనం వినియోగిస్తున్నామని, 2031 నాటికి ఇది 443 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు లేఖలో తెలిపారన్నారు. ప్యాట్ పథకం అమలు చేయడం ద్వారా పారిశ్రామిక రంగంలో గణనీయమైన మార్పులు వస్తాయన్నారు. ఇంధన పొదుపు వల్ల వ్యయం తగ్గడమే కాకుండా ఖర్చు తగ్గించే సాంకేతిక పరిజ్ఞానం పారిశ్రామిక రంగానికి ఊతం ఇస్తుందన్నారు. రాష్ట్రంలో ప్యాట్ సైకిల్-1 కింద ఇప్పటికే 150 కోట్ల రూపాయల విలువైన ఇంధన పొదుపు చర్యలు పారిశ్రామిక రంగంలో చేపట్టామన్నారు. ఈ ఏడాది చివరికి ప్యాట్ సైకిల్-2 కింద దాదాపు 400కోట్ల రూపాయల మేర ఇంధన పొదుపు సాధించనున్నట్లు వెల్లడించారు. ఈమేరకు 34మంది వినియోగదారులను గుర్తించామన్నారు. ఇంధన పొదుపు లక్ష్యంగా ప్యాట్ పథకం ప్రారంభమైందని, దీని అమలు వల్ల విద్యుత్ వినియోగం తగ్గడమే కాకుండా, ఉత్పత్తి వ్యయం కూడా తగ్గి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. భూమి, నీరుతో పాటు విద్యుత్ సరఫరా కూడా పారిశ్రామిక అభివృద్ధికి కీలకమని, తక్కువ ధరకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ద్వారా పరిశ్రమలను ఆకట్టుకోవచ్చన్నారు. ప్యాట్ పథకం పరిధిలోకి వచ్చే విద్యుత్ పంపిణీ సంస్థలు, రైల్వేలు, చమురు రిఫైనరీలు సహా 54 పరిశ్రమలను గుర్తించామని తెలిపారు. అందరి సహకారంతో బీఈఈ లక్ష్యాలను సాధిస్తామని శ్రీకాంత్ వివరించారు. సమావేశంలో ట్రాన్స్‌కో జేఎండీలు చక్రధర్‌బాబు, ఉమాపతి, ఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి, ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...విద్యుత్ వెలుగుల్లో ఓ పరిశ్రమ