బిజినెస్

పెట్టుబడులకు స్వర్గ్ధామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 9: వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని రకాల అనుకూల పరిస్థితులతో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గ్ధామంగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం నిర్వహించిన డిప్లమాటిక్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరస్పర ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునే దిశగా పెట్టుబడులకు సంబంధించి వివిధ ఒప్పందాలు కుదుర్చుకునే లక్ష్యంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సుకు దక్షిణ కొరియా, ఇంగ్లాండ్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, మంగోలియా, తదితర 35 దేశాలకు చెందిన 50 మంది ప్రతినిధులు, 16 మంది రాయబారులు పాల్గొనడం పట్ల ప్రతీ ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుజరాత్ తర్వాత అత్యంత పొడవైన 970 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, ఆరు విమానాశ్రయాలు, నాలుగు ప్రధాన ఓడరేవులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 62 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని రకాల అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఒక రకంగా చెప్పాలంటే పెట్టుబడులకు స్వర్గ్ధామం ఆంధ్రప్రదేశ్ అని ఆయన పునరుద్ఘాటించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచేవారికి ప్రభుత్వపరంగా అన్ని విధాలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటే పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని విధాల అవకాశం ఉంటుందని అదేవిధంగా కేంద్రంతోనూ, సమీప రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా లాంటి రాష్ట్రాలతో సత్సంబంధాలు కలిగి ఉండడం కూడా ఇందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం అధికారానికి వచ్చి కేవలం 60 రోజులయిందటూ, ఈ 60 రోజుల్లోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి పలు విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు సంక్షేమానికి సంబంధించి పలు వినూత్న పథకాలను ప్రవేశ పెట్టామన్నారు. ముఖ్యంగా అవినీతిలేని పారదర్శకతతో కూడిన పాలన అందించేందుకు ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో దేశానికే ఒక రోల్ మోడల్‌గా ఉండే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించే ప్రభుత్వం అని, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చే సంస్థలు అందుకు సంబంధించిన జాబితాను అందిస్తే ప్రభుత్వం వెంటనే అవసరమైన తోడ్పాటును అందిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఫార్మాసూటికల్, ఆటోమొబైల్, స్టీల్, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులకు అంధప్రదేశ్ అన్నివిధాల అనుకూలంగా ఉందన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఈ సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధులకు సీఎం విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా విమానాశ్రయాలు, ఓడరేవుల అభివృద్ధి, విజయవాడ, విశాఖ, గుంటూరు నగరాల్లో మెట్రోరైళ్ల వ్యవస్థను అందుబాటులోనికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. అంతేకాక వ్యవసాయ రంగంతో పాటు ఆక్వా రంగం కూడా రాష్ట్రంలో పెద్దఎత్తున విస్తరించిందని, ఈ రెండు రంగాలు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అంతేకాక పరిశ్రమలకు కావాల్సిన భూమి, నీరు, విద్యుత్ వంటి ఇతర వౌలిక సౌకర్యాలపరంగా ఆంధ్రప్రదేశ్ చాలా స్వయం సమృద్ధితో ఉందని పేర్కొన్నారు.
అంతేగాక గోదావరి, కృష్ణానదుల అనుసంధాన ప్రక్రియ పెద్దఎత్తున కొనసాగుతోందని, దీనివల్ల రాష్ట్రం వ్యవసాయ, పారిశ్రామిక, తదితర రంగాల్లో మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని సీఎం జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చాక వివిధ రంగాల్లో కల్పించే ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకు కేటాయించే విధంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలోని వివిధ విద్యుత్తు సంస్థలు సుమారు 20 వేల కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాయని అందుకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (సీపీఎం)పై పునఃసమీక్ష చేసి లోపాలను సరిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలకు అవినీతిరహిత, పారదర్శకతతో కూడిన పాలనను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాల పెట్టుబడిదారులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వపరంగా అందుకు అన్ని విధాల పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం జగన్మోహనరెడ్డి మరోకసారి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఐటీ శాఖామాత్యులు మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఉక్కు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రానికి సుదీర్ఘమైన సముద్రతీరం ఉండడం పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనుకూలం అని అన్నారు. ఓపెక్ (ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్‌పోర్ట్స్ కంట్రీస్) దేశాల నుండి కూడా పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో తొలుత కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఎకనమిక్ డిప్లమసీ అండర్ స్టేట్స్ డివిజన్ అదనపు కార్యదర్శి పి హరీష్ స్వాగతోపన్యాసం ఇస్తూ భారతదేశానికే ధాన్యాగారం (రైస్ బౌల్)గా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీడీపీలో మూడవ స్థానంలో ఉందని పేర్కొన్నారు. పారిశ్రామికంగా కూడా మెరుగైన అభివృద్ధి సాధించేందుకు ఎన్నో అనుకూల పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని ముఖ్యంగా బ్లూ ఎకానమిక్ అభివృద్ధికి లాజిస్టిక్స్ రంగ అభివృద్ధికి ఎంతో అనుకూలంగా ఈ ప్రాంతం ఉందని పేర్కొన్నారు. అనంతరం ఈ డిప్లమాటిక్ అవుట్ రీచ్ కార్యక్రమం ప్రారంభోత్సవ సెషన్ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల హై కమిషనర్లు, అంబాసిడర్లు, కౌన్సిల్ జనరళ్లు, రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.