బిజినెస్

కియా.. రయ్.. రయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 8: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ‘కియా’ సంస్థ అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని ఎర్రమంచి వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ ఇండియా తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేసిన మొట్టమొదటి కారును గురువారం ప్రారంభించింది. తద్వారా ఈ కేంద్రం నుంచి భారీ స్థాయిలో సెల్టోస్ కార్ల తయారీని కియా ప్రారంభించినట్లయింది. అంతర్జాతీయ సాంకేతికతతో కూడిన రోబొటిక్స్, ఆర్ట్ఫిషియల్ ఇంటలిజెన్స్‌తో తయారైన కియా సెల్టోస్ మిడ్ ఎస్‌యూవీ కారును రోల్ ఔట్ సెరిమొనీలో అసెంబ్లీ లైన్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తరఫున రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో పాటు జిల్లా మంత్రి శంకరనారాయణ, కియా మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూక్యూన్ షిమ్, దక్షిణ కొరియా అధికార ప్రతినిధి షిన్‌బాంగ్ తదితరులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ కూక్యూన్ షిమ్ మాట్లాడుతూ భారత దేశంలోని ఉత్పత్తి కేంద్రం నుంచి తమ మొట్టమొదటి ఉత్పత్తి కియా సెల్టోస్ బయటకు తీసుకురావడం తమకు అందరికీ భావోద్వేగ క్షణమన్నారు. ఏపీలోని అనంతపురం జిల్లాలో 2017లో కియా తయారీ కేంద్రం పనులు ప్రారంభించామన్నారు. ఈ ఏడాది జనవరిలో ట్రయల్ రన్ నిర్వహించి, రికార్డు సమయంలో కార్ల ఉత్పత్తిని ప్రారంభించామన్నారు. ఏపీ ప్రభుత్వం అందించిన అమూల్యమైన సహకారంతో ఇదంతా సాధ్యమైందన్నారు. ఈ ప్లాంట్‌లోని సిబ్బంది, తామంతా అవిశ్రాంతంగా భారతదేశంలో కియా ఇండియా మోటార్స్ భవిష్యత్ నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. భారతదేశ మార్కెట్‌కు తగ్గట్టుగా ఈ కార్లను రూపకల్పన చేశామన్నారు. ఏడాదికి 3 లక్షల కార్లు ఉత్పత్తి సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. వీటిని విక్రయించేందుకు జూలై 16న బుకింగ్స్ ప్రారంభించామన్నారు. తొలిరోజే 6000 కార్లు బుక్ అయ్యాయన్నారు. అడ్వాన్స్ బుకింగ్ ఆరంభించిన 3 వారాల్లోనే 23,300 కార్లను వినియోగదారులు బుక్ చేసుకున్నారన్నారు. ఈనెల 22న దేశంలోని 206 సేల్స్ పాయింట్స్, 265 టచ్ పాయింట్లలో సెల్టోస్ కార్లను ఆవిష్కరించి, అదే రోజు బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు అందజేస్తామని చెప్పారు. మొట్టమొదటి సెల్టోస్ మా వాగ్దానానికి, భారతదేశ మార్కెట్ పట్ల తమకున్న నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. అనంతపురం ప్లాంట్‌లో హైబ్రీడ్, ఎలక్ట్రిక్ వాహనాలను సైతం తయారు చేసే సామర్థ్యం ఉందన్నారు. కియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా 160 నగరాల్లో కియా డీలర్‌షిప్స్ వద్ద బుకింగ్స్ మొదలయ్యాయని సీఈఓ తెలిపారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కారును ఆవిష్కరించడానికి మునుపు భారత దేశంలో 20 లక్షల కిలోమీటర్లు పైగా విభిన్న, అత్యంత సవాళ్లతో కూడిన భూభాగాలు, రహదారులు, వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించిన తర్వాత అనంతపురంలోని తమ అత్యాధునిక కేంద్రంలో భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించామన్నారు. ఈ సెల్టోస్ కారు బీఎస్-6 స్టాండర్డ్స్ కలిగి ఉంటుందని, పవర్‌ఫుల్ బ్రాండ్‌తో స్మార్ట్ స్ట్రీమ్ ఇంజన్‌తో 3 వేరియంట్లలో మార్కెట్లోకి వస్తుందన్నారు. 1.5 పెట్రోల్, 1.5 డీజిల్, ఈ-సెగ్మెంట్‌లో మొట్టమొదటి సారిగా 1.4 టర్బో పెట్రోల్ వేరియంట్‌లో వస్తోందన్నారు. ఈ మిడ్ ఎస్‌యూవీ 3 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్స్-7డీసీటీ, ఐవీటి, 6 ఏటీతో పాటు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను సైతం అందిస్తుందని వివరించారు.