బిజినెస్

పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల్లో మెగా ఫెస్టివల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 14: ఆధ్యాత్మిక, సాంస్కృతిక, విద్య, వినోద, విజ్ఞాన, ఆహార ఫెస్టివల్స్ లాంటి 9 మెగా ఫెస్టివల్స్‌ను 9 ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల్లో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పర్యాటక శాఖ ప్రగతిని సమీక్షిస్తూ అన్నారు. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్, సింగపూర్ ఫెస్టివల్ తరహాలో ఏటా భారీగా వేడుకలు నిర్వహించాలని సూచించారు. విశాఖ ఫెస్టివల్‌కు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలలో ఇటువంటి ఫెస్టివల్స్ ఏడాదంతా జరిగేలా రూపకల్పన చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రానికి పర్యాటక రంగం ప్రధాన ఆదాయ వనరుగా రూపొందుతుందన్నారు. రాష్ట్రంలో 148 పర్యాటక స్థలాలున్నాయని చెబుతూ, రాష్ట్రానికి ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య 2 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని ముఖ్యమంత్రి తెలిపారు. విదేశీ టూరిస్టులు రావాలంటే మన రాష్ట్రంలో వసతి సదుపాయాలు చాలినన్ని లేవని, విశాఖలో కేవలం 5 వేల హోటల్ రూములే ఉంటే, సింగపూర్‌లో 60 వేల హోటల్ రూములున్నాయని తెలియజేశారు. కాగా, పర్యాటక ప్రదేశాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని, ఫైవ్‌స్టార్, త్రీస్టార్ హోటళ్లు, రిసార్ట్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సృజనాత్మకతతో పర్యాటక కేంద్రాల అభివృద్ధికి సూచనలు చేయాలని, పర్యాటక రంగ అభివృద్ధికి కలెక్టర్లు చొరవ తీసుకోవాలని కలెక్టర్ల సమావేశం సందర్భంగా అన్నారు. పర్యాటక శాఖ కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ చేసిన సూచనలకు స్పందిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మున్ముందు పర్యాటక రంగమే పట్టుకొమ్మ అవుతుందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు, ఆర్థిక వనరుల సృష్టిలో టూరిజం కీలకపాత్ర వహిస్తుందని సిఎం విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, గండికోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చెప్పారు. ఏడాదిలో 76 రోజులు ఏదో ఒక ఫెస్టివల్స్ ఉంటాయని, ఆధ్యాత్మిక టూరిజం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, తిరుపతి-శ్రీకాళహస్తి, కడప-ఒంటిమిట్ట.. ఇలా పలు పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఆకర్షణీయమైన ప్యాకేజీలను రూపొందించాలని సిఎం కోరారు. జనవరిలో నిర్వహించే జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి అధికారులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గత జన్మభూమి-మా ఊరు సమస్యలన్నీ పరిష్కారం కావాలని, లేనిపక్షంలో ఆయా మంత్రులు, కలెక్టర్లు బాధ్యత వహించాలన్నారు. క్రితంసారి జన్మభూమిలో సమస్యలు పరిష్కరించకుండా మళ్లీ ఎందుకు వచ్చారని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి రాకూడదన్నారు.

14 నెలల గరిష్ఠానికి
రిటైల్ ద్రవ్యోల్బణం
నవంబర్‌లో 5.41 శాతంగా నమోదు
మైనస్ 1.99 శాతానికి టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా నాలుగో నెల పెరుగుతూ, నవంబర్ నెలలో 14 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 5.41 శాతంగా నమోదైంది. ఆహారోత్పత్తుల ధరల్లో చోటుచేసుకున్న పెరుగుదలే దీనికి కారణమవగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నిర్వహించే తర్వాతి ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్ల తగ్గింపు అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ద్రవ్యోల్బణం కూడా ఈసారి రుణాత్మక స్థాయిని తగ్గించుకుంది. వరుసగా 13వ నెల మైనస్ స్థాయిలోనే టోకు ద్రవ్యోల్బణం నమోదైనప్పటికీ అక్టోబర్‌లో మైనస్ 3.81 శాతంగా ఉన్న సూచీ.. నవంబర్‌లో మైనస్ 1.99 శాతానికి పెరిగింది. పప్పు్ధన్యాలు, ఉల్లిగడ్డ ధరలు అధికంగా ఉండటమే దీనికి కారణం. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆర్‌బిఐ గవర్నర్ రాజన్‌తో
బ్యాంకర్ల సమావేశం
ముంబయి, డిసెంబర్ 14: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌ను సోమవారం పలువురు బ్యాంకర్లు కలిశారు. రాజన్‌ను కలిసిన బ్యాంకర్లలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ చీఫ్ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంక్ సారథి శిఖా శర్మ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధినేత్రి ఉషా అనంతసుబ్రమణ్యన్‌తోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, ఐడిబిఐ, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్ చీఫ్‌లున్నారు. ఈ సందర్భంగా బ్యాంకింగ్ రంగంలో ప్రమాదకర స్థాయికి చేరిన నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ లేదా మొండి బకాయిలు) సమస్యపై రాజన్‌తో బ్యాంకర్లు చర్చించారు. 2017 మార్చి నాటికి బ్యాలెన్స్ షీట్లను క్లీన్ చేసుకోవాలని ఆర్‌బిఐ గడువు విధించినది తెలిసిందే. ఈ క్రమంలో తాజా సమావేశం ప్రాధాన్యతను సంతరించుకోగా, ఈ కలయిక సాధారణంగానే జరిగిందని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ అరుణ్ తివారీ విలేఖరులకు తెలిపారు. రాజన్‌తోపాటు ఆర్‌బిఐ డిప్యూటి గవర్నర్లు ఎస్‌ఎస్ ముంద్రా, ఆర్ గాంధీ, బ్యాంకింగ్ రెగ్యులేషన్, సుపర్‌విజన్ శాఖల అధికారులు కూడా బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.

వృద్ధిరేటు మున్ముందుకు: ఫిచ్ రేటింగ్స్
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: భారతీయ సావరిన్ రేటింగ్‌ను స్థిరమైన, బిబిబి మైనస్‌గా యథాతథంగానే ఉంచింది గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్. పెట్టుబడులకు ఈ రేటింగ్ అత్యంత దిగువ స్థాయి. అయినప్పటికీ ఆసియా పసిఫిక్ దేశాల్లో నెలకొన్న మందగమనం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు సంకేతాల మధ్య కూడా భారత్ జిడిపి వృద్ధిరేటు ఇకముందు కొనసాగగలదన్న ఆశాభావాన్ని ఓ నివేదికలో సోమవారం ఫిచ్ వ్యక్తం చేసింది. కాగా, వచ్చే ఏడాది ఆసియా దేశాల వృద్ధిరేటు 6.3 శాతంగా ఉండొచ్చని ఫిచ్ ఈ సందర్భంగా అంచనా వేసింది. ఇంతకుముందు ఈ అంచనా 6.5 శాతంగా ఉంది.

వృద్ధిరేటుకు సవాళ్ళే: హెచ్‌ఎస్‌బిసి
ముంబయి, డిసెంబర్ 14: వృద్ధిపథంలో కొనసాగుతున్న భారత్.. మున్ముందు ఆ వృద్ధిరేటును కొనసాగించడం కష్టసాధ్యమేనన్న అభిప్రాయాన్ని విదేశీ బ్రోకరేజ్ హెచ్‌ఎస్‌బిసి వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడిచమురు ధర 110 డాలర్ల నుంచి 40 డాలర్ల దిగువకు పడిపోవడం భారత్‌కు కలిసొచ్చిందని, అయితే ఇకముందు ఇలాగే ధరలు ఉంటాయన్న భరోసా లేదన్న హెచ్‌ఎస్‌బిసి.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను పెంచాలన్న 7వ వేతన సంఘం సిఫార్సు అమలైతే భారత ద్రవ్యలోటు భారం పెరుగుతుందని హెచ్చరించింది. వచ్చే ఏడాది భారత్ వృద్ధి పరుగులు మందగిస్తాయని సోమవారం పేర్కొంది.

హైదరాబాద్ మార్కెట్‌లోకి ఆడీ క్యు7

హైదరాబాద్, డిసెంబర్ 14: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ.. హైదరాబాద్ మార్కెట్‌లోకి సోమవారం ఎస్‌యువి శ్రేణిలో సరికొత్త క్యు7 మోడల్ కారును తీసుకొచ్చింది. ముంబయి, న్యూఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 72 లక్షల రూపాయల నుంచి 77.5 లక్షల రూపాయలుగా ఉంది. శక్తివంతమైన 45 టిడిఐ ఇంజిన్‌ను కలిగిన క్యు7 గరిష్ఠ వేగం గంటకు 234 కిలోమీటర్లు. కేవలం 7.1 సెకండ్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. లీటర్‌కు 14.75 కిలోమీటర్ల మైలేజీనిచ్చే ఈ కారులో ఎన్నో అత్యాధునిక సదుపాయాలున్నాయని, వినియోగదారులు 100 శాతం సంతృప్తి పొందగలరన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా ఆడి హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వీ వ్యక్తం చేశారు.

సోమవారం హైదరాబాద్‌లో విడుదలైన ఆడీ క్యు7

పెట్టుబడులకు జపాన్ సిద్ధం

వౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
అమరావతి నిర్మాణంలో జపాన్ టెక్నాలజీ
మిత్సుబిషి ఇండియా సిఎండి వెల్లడి

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 14: భారత్‌లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సిద్ధంగా ఉందని ఆ దేశానికి చెందిన ప్రముఖ సంస్థ మిత్సుబిషి కార్పొరేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మసకాజు సకకిడా అన్నారు. సోమవారం ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జపాన్ భాషా, సమాచార కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్నందున ఈ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ఆసక్తి చూపుతోందన్నారు. ఇదిలాఉండగా ఇటీవల జపాన్ ప్రధాని భారత్‌లో పర్యటించి బుల్లెట్ రైలు, న్యూక్లియర్ టెక్నాలజీ, రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా నిర్మించనున్న రాజధాని అమరావతి నగరానికి జపాన్ టెక్నాలజీని వినియోగించనున్నట్టు తెలిపారు. ప్రధానంగా వౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తామన్నారు. దేశంలో జపాన్ భాషా కేంద్రాన్ని ఈ ఏడాది జనవరిలో అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేశామని, రెండో కేంద్రాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నెలకొల్పామని చెప్పారు. ఇకపోతే భారత ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్నందున దానిని కూడా దృష్టిలో పెట్టుకుని జపాన్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తోందని వివరించారు.
జపాన్ భాష నేర్చుకున్న వారికి జపాన్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయన్నారు. సహజ వనరుల వినియోగంలో కూడా జపాన్ పరిజ్ఞానం ఎంతగానో దోహదపడుతుందన్నారు. భారత్-జపాన్ భాగస్వామ్య పెట్టుబడుల్లో కూడా జపాన్ పరిజ్ఞానం ఉన్న వారికి తొలి ప్రాధాన్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎయు వైస్ ఛాన్సలర్ జిఎస్‌ఎన్ రాజు, డాక్టర్ చల్లా రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

27 నెలల కనిష్టానికి రూపాయి
డాలర్‌తో పోల్చితే 21 పైసలు క్షీణించిన విలువ
ముంబయి, డిసెంబర్ 14: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం మరింతగా క్షీణించింది. 67 రూపాయల దిగువ స్థాయికి చేరి 27 నెలల కనిష్టాన్ని తాకింది. శుక్రవారం ఫారెక్స్ ట్రేడింగ్‌తో చూస్తే 21 పైసలు పతనమై 67.09 వద్ద స్థిరపడింది. మంగళ, బుధవారాల్లో జరిగే ద్రవ్యసమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ సుధీర్ఘకాలం అనంతరం కీలక వడ్డీరేట్లను పెంచబోతోందన్న సంకేతాలు కూడా రూపాయి విలువని దిగజార్చాయ.
అమెరికాలో తయారీ కేంద్రాన్ని అమ్మేసిన సన్ ఫార్మా
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఔషధరంగ దిగ్గజం సన్ ఫార్మా అమెరికాలోని ఒహియోలోగల తయారీ కేంద్రాన్ని నాస్ట్రమ్ లాబొరేటరీస్‌కు అమ్మేసింది. ఈ మేరకు సోమవారం సన్ ఫార్మా తెలియజేసింది. అయితే ఎంత మొత్తానికి విక్రయించిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. అమెరికా ఉత్పాదక వ్యాపారాన్ని ఏకీకృతం చేయడంలో భాగంగా ఈ అమ్మకానికి దిగింది సన్ ఫార్మా. కాగా, ఈ ఏడాది మార్చిలో ర్యాన్‌బాక్సీని సన్ ఫార్మా 4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినది తెలిసిందే.