ఈ వారం కథ

అమ్మనీడ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాగ్యనగరం ఇంకా చలి చీకటి ముసుగు పూర్తిగా తొలగించుకోలేదు. తెల్లవారబోతున్నవేళ.. హుస్సేన్ సాగర్ జలాలు కూడా చలికి వణికిపోతూ నిశ్శబ్దంగా నీరెండ కోసం ఎదురుచూస్తున్నాయి. దూరంగా ఓ స్ర్తిమూర్తి ఆకారం టాంక్‌బండ్ రెయిలింగ్ వెంబడి మెల్లగా నడుచుకుంటూ వస్తోంది. తలపైనుంచి ముందుకి ముసుగు జార్చుకున్న ఆమె మొహం సరిగ్గా కన్పించటం లేదు. ఆమె చేతిలో పసిపాప- ఏదో పీడకల వచ్చినట్లు కెవ్వుమంది. ఆ తల్లి ఆర్తిగా బిడ్డని హృదయానికి హత్తుకుని జోకొట్టింది. బిడ్డ ఆదమరిచి నిద్రపోతోంది. అమ్మఒడిలో ఉన్న భద్రత ఈ ప్రపంచంలో మరెక్కడా కన్పించదు కదా!
ఆమె వణికే చేతులతో పాపని చుట్టిన శాలువా సరిచేసింది. పాప నోట్లో పాలసీసా పీక ఉంచింది. చివరిసారిగా అన్నట్లు ఓసారి పాప నుదుటిపై సున్నితంగా ముద్దుపెట్టింది. మళ్ళీ ఓసారి గాఢంగా హృదయానికి హత్తుకొని పాప బుగ్గలు, తలపై మరిన్ని ముద్దులతో పాటు కన్నీళ్లనూ వర్షించింది. పాప ఓసారి ఉలిక్కిపడి మళ్లీ నిద్రలోకి జారుకుంది. ఆమె దగ్గర్లో వున్న ఓ సిమెంటు బెంచీమీద దుప్పటి పరిచి పాపని పడుకోబెట్టి శాలువా జాగ్రత్తగా కప్పింది. ఓసారి పాపకేసి చూసి భారంగా వెనుదిరిగిన ఆమె పరుగులాంటి నడకతో రెయిలింగ్‌పై కాలు పెట్టి హుస్సేన్ సాగర్‌లోకి దూకేసింది.
అర్జంటు కేసు చూసేందుకు చీకట్లో బయల్దేరిన డాక్టర్ సుమంత్ కారు టాంక్‌బండ్‌పై ఆ సంఘటనకు ఆగిపోయింది. అతను క్షణం కూడా ఆలోచించకుండా, ఒక్క ఉదుటున ఆమె దూకిన చోటే దూకేశాడు. అతి కష్టం మీద ఆమెను ఒడ్డుకు చేర్చాడు. అంతగా ఆలస్యం కాలేదు కాబట్టి ప్రాణం దక్కింది. చలికి తడి బట్టల్లో ఆమె వణికిపోతోంది. ఒకళ్ళిద్దరు ఆసక్తిగా చేరుతున్నారు.
‘ఏం లేదు.. పొరపాటున కాలు జారింది.. వాకింగ్‌కి వచ్చాం’ సర్ది చెప్పాడు సుమంత్. వాళ్ళు ఒక్క క్షణం చూసి వెళ్లిపోయారు. ఆమె అతనికేసి కృతజ్ఞతగా నమస్కరించింది. ఇంతలోనే తెలివి తెచ్చుకున్నదానిలా ‘నా పాప.. నా పాప..’ అని అరుస్తూ టాంక్‌బండ్ బెంచీవైపు పరిగెత్తసాగింది. ‘ఆ బెంచీ ఏది? పాపని ఎక్కడ ఉంచాను?’ అంటూ అన్ని బెంచీల కేసి పరిగెత్తి వెదుకుతూ ‘నా పాప.. నా పాప’ అని గట్టిగా ఏడుపుమొదలుపెట్టింది. సుమంత్‌కేం చెయ్యాలో పాలుపోవటం లేదు. ‘పాపా..’ అని కేక వేసి స్పృహ తప్పి పడిపోయింది.
***
హాస్పిటల్‌లో సేద తీరిన ఆమెను రెండు రోజుల తర్వాత తన ఇంటికి తీసుకొచ్చాడు సుమంత్. ఇంట్లో ఆడవాళ్ళెవరూ ఉన్నట్లు లేదు. సుమంత్ పెళ్లి ఫొటోలో భార్య కన్పిస్తుంది. మరి ఇంట్లో ఆవిడ కన్పించదే? ఆలోచిస్తున్న ఆమెకి కాఫీ కప్పు అందిస్తూ అడిగాడు.
‘ఇప్పుడు చెప్పండి.. మీ పేరు.. మీరు ఎందుకు చావాలనుకున్నారు? పాప అన్నారు.. పాప పోయిందా?’
ఆమె రెండు సిప్‌లు కాఫీ తాగి మొహమాటంగా కప్పు పక్కనే ఉంచింది. ‘నా పేరు నవ్య. అమ్మ ఉంది. నాన్న లేడు. మాది గుంటూరు జిల్లా నరసరావుపేట. నా పెళ్లి ఓ మోసగాడితో జరిగింది. అతనికి నేను మూడో భార్యనని నాకు పాప పుట్టాకే తెలిసింది. నాకు మరో దిక్కు లేదు. కన్నబిడ్డను చంపలేక బెంచీమీద వదిలాను. ఏ దయామయులో పెంచి పెద్ద చేస్తారని ఆశించాను. నేను చచ్చిపోవాలనుకున్నా.. కానీ, బతికాను.. పాపని పోగొట్టుకున్నాను. పాప తప్ప నాకీ ప్రపంచంలో ఎవరూ లేరు డాక్టర్!’ రెండు చేతుల్లో మొహం దాచుకుని రోదించింది.
‘్ధర్యంగా ఉండండి నవ్యా.. జీవితం జీవించటానికే గానీ బలవంతాన ముగించడానికి కాదు. నా గురించి చెప్తే- నేనిలా ఎందుకు మాట్లాడుతున్నానో అర్థమవుతుంది. ఈ ఫొటోలో నాతో ఉన్నది నా భార్య కల్పన. మేమిద్దరం ప్రేమించుకుని పెద్దల్ని కాదని పెళ్లి చేసుకున్నాం. కల్పనకి పిల్లలు పుట్టరని తేలింది. ఆమెకి క్యాన్సర్ ఎటాక్ అయింది. నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమన్నది కానీ నేను ఒప్పుకోలేదు. మనస్తాపంతో మతి పోగొట్టుకుని మానసిక వైద్యం తీసుకుంటున్నది. ఈ లోకంలో నాకు కల్పన తప్ప ఎవరూ లేరు..’
సుమంత్ కాసేపాగి మళ్లీ చెప్పాడు.
‘మనిషి జీవించటానికి ఎన్ని కారణాలుంటాయో మరణించటానికీ అన్ని కారణాలుంటాయి. మనిషి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే- తర్వాతి కాలంలో ఆ ఆవేశం ఎంత అసమంజసమో అన్పిస్తుంది. మీ పాప కోసం ఆరా తీయగా ఎవరో జర్నలిస్టు తీసుకెళ్ళాడని తెలిసింది. వర్రీ కాకండి, పాప వచ్చేస్తుంది’ అనునయంగా చెప్పాడు. నవ్య కొంచెం కుదుటపడింది. అతని సంస్కారం పట్ల ఆమెకు గౌరవం పెరిగింది.
‘డాక్టర్ గారూ.. నాకేదైనా ఉద్యోగం...’ మెల్లగా అంది.
‘నేనూ ఆలోచించాను. మా హాస్పిటల్‌లో క్లరికల్ పోస్ట్ ఉంది. చేయగలరనుకుంటాను’ సాలోచనగా అన్నాడు.
‘చేస్తాను డాక్టర్. నా పాప..’ మళ్లీ అభ్యర్థనగా అంది.
‘రేపు డ్యూటీలో జాయిన్ అవండి. నాకు టైమయింది. నేను భోజనానికి రాను. కిచెన్‌లో అన్నీ వున్నాయి. పనిమనిషి గంగమ్మని అడగండి. అన్నీ చూపిస్తుంది. వంట చేసుకుని తినేయండి. గంగమ్మకి మీరు మా కజిన్ అని చెప్పాను. మీరూ అంతే చెప్పండి. టేక్ రెస్ట్’ అంటూ హడావుడిగా హాస్పిటల్‌కి వెళ్లిపోయాడు సుమంత్. నవ్య కొంచెం రిలాక్సయి ఇల్లంతా తిరిగి చూసింది. త్రిబుల్ బెడ్‌రూం ఇల్లు. బయట గార్డెన్. అంతా పొందికగా సర్ది ఉంది. అతని గదిలో కల్పన నవ్వుతున్న పెద్ద ఫొటో, బోలెడు చీరలు.. అతనామెను ఎంతగా ప్రేమిస్తున్నాడో గుర్తుగా. ఇంతగా ప్రేమించే భర్త ఎందరికి దొరుకుతాడు? కానీ, ఆమెది దురదృష్టమే. ప్రేమని అనుభవించే పరిస్థితి దేవుడీయలేదు.
తను ఎలాంటి కలలుకన్నది! అమ్మానాన్నల్ని కాదని శ్రీహరిని ప్రేమించి చేసుకుంది. ఆ దిగులుతోనే నాన్న పోయారు. శ్రీహరి గోముఖ వ్యాఘ్రమని తెలుసుకోలేకపోయింది తను. పాప పుట్టాక అతనికి తాను మూడో భార్య అని తెలిసి కుంగిపోయింది. చావు తప్ప మరో దారి కన్పించలేదు. శ్రీహరి రోజూ పెట్టే హింస ఆ ఆలోచనని మరింత బలపరిచింది. ఈ గతం వదిలేదు కాదని అనుకుంది. స్నానం చేసి వంట చేసి భోజనం చేశాక కొంత ప్రాణం కుదుటపడింది. వంట చేసేటప్పుడు గంగమ్మ సాయం చేస్తూనే ఒకటే కబుర్లు చెప్పింది. అవన్నీ కల్పన గురించే.
‘ఆయమ్మ ఎంత మంచిదంటారు.. బగమంతుడు సల్లగా సూడకపోయాడు’ అంటూ వాపోయింది. మంచం మీద వాలితే మళ్లీ ఈగల్లా ముసిరే ఆలోచనలు.. మోసం చేసిన భర్తను నిలదీస్తే అతడు- మగాడిననే అహం చూపించాడు, పశుబలంతో కొట్టాడు. తలని గోడకేసి బాదాడు. స్పృహ తప్పి పడిపోయిన తనని వదిలివేసి వెళ్లిపోయాడు. బతుకుపై విరక్తి చెంది, పాపతో టాంక్‌బండ్ చేరింది- పాపనెత్తుకొని దూకాలనే.. కానీ, తనలోని మాతృత్వం ఒప్పుకోలేదు. తాను మాత్రం చావాలనుకున్నా- సుమంత్ వల్ల బతికింది.
సాయంత్రం వస్తూనే సుమంత్ కొన్ని పుస్తకాలు తెచ్చాడు.
‘ఇవి చదవండి.. చాలా ఉపయోగపడతాయి’.
అతను తన పట్ల చూపే శ్రద్ధకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకొని ఆ పుస్తకాలు చూసింది. స్వామి వివేకానంద రచనలు. డిగ్రీ చదువులకన్నా మనిషిని మనిషిగా నిలిపే జ్ఞానమిచ్చే రచనలవి. డాక్టర్ సుమంత్ ఇంట్లో తాను ఎంతకాలం ఉండాలి? ఉద్యోగంలో చేరి, తన కాళ్ళమీద తాను నిలబడాలి. పాపని తెచ్చుకోవాలి.
ఓ రోజు సుమంత్ వెంట వెళ్లి ఆయన భార్య కల్పనని మానసిక వైద్యశాలలో చూసింది. ఈ లోకంతో సంబంధం లేనట్లుగా ఉన్న ఆమె స్థితిని చూసి జలజల కన్నీళ్ళు రాలాయి. తన జీవితాన్ని నిలబెడుతున్న ఈ దంపతుల కోసం తాను చేయగలిగిందేదైనా చేయాలి. అలాంటి అవకాశం తనకి వస్తే బాగుండు.
***
దాదాపు నెల రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి వస్తూనే సుమంత్ మొహం వెలిగిపోతోంది.
‘పాప ఆచూకీ తెల్సింది నవ్యా.. జ్వరం, డిహైడ్రేషన్‌తో నా హాస్పిటల్‌లోనే అడ్మిట్ చేశారు. ఆ జర్నలిస్టు పాప వివరాలు చెప్పాడు’
‘నిజంగానా? ఎంత శుభవార్త చెప్పారు. పదండి పాపని తెచ్చుకుందాం’ నవ్యలోని తల్లి మనసు ఆరాటపడింది.
‘పాపకి జ్వరం తగ్గి కోలుకోవటానికి ఇంకా వారమైనా పడుతుంది. డిశ్చార్జి చేశాక అతని ఇంటికెళ్లి అన్నీ వివరించి పాపను తెచ్చుకుందాం. అతను పెళ్లి చేసుకోలేదు. అందుకే పాప పట్ల మమకారం పెంచుకున్నాడు’ అన్నాడు.
ఆ రోజు సాయంత్రం నవ్య సుమంత్‌తో వెళ్లి, పాపని పెంచుతున్న జర్నలిస్టుకి పూర్తి వివరాలు చెప్పి, నమ్మకం కలిగించి పాపని ఇంటికి తెచ్చుకుంది. ఆ జర్నలిస్టు దిగులు పడుతూనే- ఒక తల్లిని బాధ పెట్టడం ఇష్టం లేక వదల్లేక వదల్లేక పాపకి వీడ్కోలు పలికాడు. ఇంటికి వచ్చాక సుమంత్ చెప్పాడు.
‘నవ్యా! మీకు అభ్యంతరం లేకపోతే పాపని దత్తత చేసుకుంటాను. మీ చేతుల మీదుగా పెరుగుతుంది. నా ఆస్తి, హాస్పిటల్, హోదా వారసత్వంగా పాపకి దక్కుతాయి.. పాప పేరు..?’
‘చిన్మయి..’ అంది నవ్య. ‘చిన్మయిని మెడిసిన్ చదివిస్తాను. పాప ఉంటే కల్పనకు కొంత నెమ్మది దొరకవచ్చు. తను ఇంక మూడు.. నాలుగేళ్ళ కంటే ఎక్కువ కాలం... అందుకే అమ్మగా అంతవరకైనా..’ అతని కంఠం దుఃఖంతో పూడుకుపోయింది.
నవ్య చప్పున ముందుకు వచ్చి రెండు చేతులు జోడించింది. ‘డాక్టర్ గారూ! మీరు నాకు పునర్జన్మ ప్రసాదించిన దేవుడు. మీ మాటే నా మాట..’ అని నిద్రపోయేందుకు వెళ్లింది. రకరకాల ఉద్వేగాలతో నిద్రపట్టటం లేదు. తను పాపని ఈ జన్మలో మళ్లీ చూస్తాననుకోలేదు. ఈనెల రోజులు చిన్మయి లేని జీవితం ఎంత అల్లకల్లోలంగా ఉందో! పాపని తనతో చేర్చిన సుమంత్ కోసం ఏదైనా చేయాలనుకుంటున్నది. ఇది వాళ్ళకి చేయటం కాదు.. నిజానికి పాప కోసమే! చిన్నారికి భద్రత, మంచి భవిష్యత్ ఉంటే ఇంకేం కావాలి? అయితే పాప కోసం తను మాత్రం ఇక్కడే ఉండాలి. ఇది సాధ్యమా? లోకం హర్షిస్తుందా! అయినా, లోకం తన కష్టాలను పట్టించుకుందా? .. ఇలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది నవ్య.
మర్నాడు ఉదయమే జర్నలిస్టు ఇంటికి వెళ్లి ఆధారాలు చూపి పాపని ఇంటికి తీసుకువచ్చారు. పాప వెంటనే గుర్తుపట్టి తన మీదికి వాలటం చూసి నవ్య మనసు పొంగిపోయింది. సన్నిహితులకు పార్టీ ఇచ్చి చిన్మయిని తన దత్తపుత్రికగా పరిచయం చేశాడు సుమంత్. నవ్య తన కూతురికి సేవలు చేస్తూ.. బంగారుకలలు కంటూ సుమంత్ హాస్పిటల్‌లోనే పనిచేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుంటోంది. సుమంత్ మొదటిసారి చిన్మయి చేత తనను ‘ఆంటీ’ అని పిలిపించినప్పుడు నవ్య మనసు చిన్నబోయింది. చిన్నూకి తనిప్పుడు అమ్మకాదు ‘ఆంటీ’ మాత్రమే! తన మనసుకి సర్ది చెప్పుకుంది పాప కోసం. కల్పనని చిన్నూకి తల్లిగా పరిచయం చేశాడు సుమంత్. తరచూ చిన్నూను హాస్పిటల్‌కి తీసికెళ్లి అక్కడ కల్పనను చూపించేవాడు. కల్పన మొదట్లో ముడుచుకుని చూస్తూ ఉండిపోయేది. క్రమంగా చిన్నూని చూడగానే నవ్వి, చేతులు చాపి దగ్గరికి పిలిచేది. పాప చేరువవుతున్నకొలదీ మృత్యువు కల్పనకు దగ్గరవుతూ వచ్చింది. అమ్మగా ఆనందిస్తూనే కల్పన సుమంత్ జీవితంలోంచి మాయమై కల్పనగానే మిగిలిపోయింది. కల్పన మరణంతో సుమంత్ నెల రోజులు దాకా ఇంటి నుంచి బయటికి రాలేదు. మనిషి మనసును ఇంత సున్నితంగా తయారుచేసి, ప్రేమ నింపిన దేవుడు నిజంగా ఉంటే- అతన్ని శిక్షించాల్సిందే అన్పించేంతగా రోగిష్టివాడిలా తయారయ్యాడు డాక్టర్ సుమంత్.
‘అందరికీ అన్నీ చెప్పే మీరే ఇలా అయిపోతే ఎలా? పాపని చూడండి. ఎంతగా డీలా పడిపోయిందో.’ అంటూ సుమంత్‌ని ఓదార్చింది నవ్య. చిన్మయి సన్నిహితత్వంతో ఈ లోకంలోకి వచ్చాడు. మళ్లీ హాస్పిటల్‌కి వెళ్లడం మొదలుపెట్టడు. రిలీఫ్‌గా నిట్టూర్చింది నవ్య.
***
క్రమంగా చిన్మయి పెరిగి పెద్దవుతోంది. నవ్యకి, సుమంత్‌కి చిన్మయి ఆట పాటలు, చదువే లోకమయ్యాయి. సుమంత్ హాస్పిటల్‌లో నవ్య రోజూ కొన్ని గంటలు పనిచేస్తుంది. చిన్మయి మెడికల్ కాలేజీలో చేరింది.
‘ఏంటి నాన్నగారూ.. నవ్య ఆంటీ ఇంకా ఎన్నాళ్లు మనింట్లో ఉంటుంది? ఇపుడు నా పన్లన్నీ నేనే చేసుకోగలను. ఆమెను బయటికి పంపేయండి. మా ఫ్రెండ్సంతా ఆవిడ గురించి తలా ఒక మాట...’ అని చిన్మయి చెబుతోంది. వెంటనే ఆమె చెంప ఛెళ్ళుమంది. ఉక్రోషంగా, బాధగా తండ్రికేసి చూసింది చిన్మయి.
‘చిన్నంతరం, పెద్దంతరం లేదూ! ఆవిడ నీకు తల్లితో సమానం. ఇంకోసారి ఇలా మాట్లాడావంటే..’ ఎర్రబారిన కళ్ళతో విసురుగా బయటికి వెళ్లిపోయాడు సుమంత్.
‘ఆవిడంటే అంత అభిమానమెందుకో? తన ఫ్రెండ్స్ అంటున్నది నిజమేనేమో!’ చిన్మయిలో అపార్థాలకు బీజం పడింది. సుమంత్ ఎదుట లేనపుడు రకరకాలుగా చేతలతో, మాటలతో నవ్యని హింసించటం, అవమానించటం చేస్తోంది. తన పనులేవీ చేయనీయటం లేదు. ఎలాగైనా బయటికి సాగనంపాలి.. ఇదే ఆ అమ్మాయి పట్టుదల.
ఆ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు నవ్య రాలేదు.
‘ఆంటీని పిలు’కూతురితో చెప్పాడు.
‘లేదు’ తలదించుకుని ముభావంగా ఇడ్లీ తింటూ చెప్పింది చిన్మయి.
‘ఎక్కడికెళ్లింది?’ చురుగ్గా చూశాడు.
‘తెలీదు’ నిర్లక్ష్యంగా జవాబిచ్చింది.
‘నువ్వేమైనా అన్నావా?’ విసురుగా అడుగుతూనే సగంలోనే ప్లేటు వదిలేసి చేయి కడుక్కుని నవ్య గదిలోకివెళ్ళాడు. ఇనే్నళ్లుగా ఒక్కసారి కూడా ఆ గదిలోకి అడుగుపెట్టని సుమంత్ మొదటిసారిగా ఆమెమీది సానుభూతితో వెళ్లాడు. చాలా నిరాడంబరంగా ఉన్న ఆ గదిలో మాతృమూర్తి బొమ్మకింద అణకువగా ఉంచిన ఉత్తరం తప్ప నవ్యకి సంబంధించిన మరే వస్తువూ లేదు. వణికే చేతులతో ఉత్తరం తీసి చదివాడు.
‘డాక్టర్ గారూ...
క్షమించండి. చిన్నూ మనసులో అనుమానం పెనుభూతంగా మారి మనందర్నీ కమ్మేయకముందే మీకు చెప్పకుండా వెళ్లిపోతున్నాను. చావాలనుకున్న నన్ను కాపాడి, నా బిడ్డకు ఉన్నతమైన జీవితాన్నిచ్చి డాక్టర్ని చేస్తున్నారు. వచ్చే జన్మలోనైనా మీ రుణం తీర్చుకొనే శక్తి నాకు కలగాలని దేవుడ్ని వేడుకుంటున్నాను. చిన్నూకి ఏమీ చెప్పొద్దు. నిర్మలమైన సరస్సులో కలతల అలలు రేగుతాయి. ఎప్పటికీ నా చిన్నూకి మీరే సర్వస్వం. సెలవ్.. -నవ్య
‘ఎంత పనిచేశావు నవ్యా?’ అంటూ కూలబడిపోయాడు సుమంత్.
కాలం ఎవ్వరికోసం ఆగదు. నవ్య ఎక్కడుందో ఆచూకీ దొరకలేదు. చిన్మయి డాక్టర్‌గా సుమంత్ కట్టించిన ‘కల్పన ఛారిటబుల్ క్యాన్సర్ హాస్పిటల్’లో రోగులకు వైద్యం అందిస్తోంది. ఆమె పెళ్లి మరో డాక్టర్‌తో నిశ్చయమైంది. నవ్య కచ్చితంగా ఈ పెళ్లికి రావాలి. అయితే- ఆమె ఎక్కడుందో తెలీదు. పేపర్‌లో పెళ్లిపత్రిక అచ్చు వేయించి ఆహ్వానం పలికాడు సుమంత్. ‘అమ్మ హృదయాలయం’ వృద్ధాశ్రమంలో సేవలు అందిస్తూ జీవితం వెళ్ళదీస్తున్న నవ్య అనుకోకుండా చిన్మయి పెళ్లిపత్రికను పేపర్‌లో చూసి ఆనందంతో పొంగిపోయింది.
చిన్మయి పెళ్లి మండపం దగ్గర్లో- ఒక మూల ఒదిగి నిలబడి కూతురి పెళ్లి వేడుకని కళ్ళనిండా నింపుకొని ఆనందిస్తూన్న నవ్యని సుమంత్ ఒక్కడే గుర్తించి సంబరపడ్డాడు.
‘ఎంతగా మారిపోయింది?’ అనుకుని బాధపడ్డాడు. ఆమె అతన్ని మాట్లాడొద్దని కళ్ళతోనే వారించింది. అతను గుర్తించనట్లే ప్రవర్తించాడు.
***
హాస్పిటల్‌లో డ్యూటీలో వున్న చిన్మయి- ‘ఆగమేఘాలపై రావాలం’టూ తండ్రి నుంచి ఫోన్ రావడంతో హడావుడిగా బయలుదేరింది. కారు స్వయంగా నడుపుతున్న సుమంత్‌లో గాంభీర్యం చూశాక- పలకరించే సాహసం కూడా ఆమెలో లేదు. కారు ‘అమ్మ హృదయాలయం’ ఎదుట ఆగింది. అక్కడ గుంపుగా వృద్ధులు. అక్కడ సహ వృద్ధుల మధ్య నవ్య అచేతనంగా ఆఖరి ప్రయాణానికి సిద్ధంగా ఉంది.
తనను ఎత్తుకొని లాలించిన ఆ చేతులు ఎండు కట్టెల్లా.. తన కోసం ఆరాటపడిన ఆంటీ.. కాదు.. కాదు.. అమ్మ..! పాలిపోయిన మొహం, నెరిసిన ముగ్గుబుట్టలాంటి జుట్టు.. అమ్మేనా..? ఎంత దారుణంగా తాను అవమానించి వెళ్ళగొట్టినా, తన భవిష్యత్తు కోసం తల వంచుకొని నిందని మోస్తూ వెళ్లిపోయింది. వెళ్ళిపోతూ ఆమె రాసిన ఉత్తరం కారులో నాన్న ఇస్తే చదివిన చిన్నూకి కళ్ళముందు చీకటి గోళాలు మిగిలాయి. ‘అమ్మా.. అమ్మా’ అంటూ పసిపాపలా రోదించింది.
‘చిన్నూ..’ అంటూ ఆ చేతులు తననిక చుట్టుకోవు.. ప్రేమగా చూసే ఆ కళ్ళు శాశ్వతంగా నిద్రపోతున్నాయి.
‘ఈ ముసలావిడకి ఇంత డబ్బున్న కూతురుందా?’అని అంతా ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు.
‘డాక్టర్ చిన్మయి మీరే కదూ! మీ అమ్మగారు మీకీ ఉత్తరం ఇమ్మన్నారు’ అంటూ మేనేజర్ ఓ ఉత్తరం, చిన్న సంచీ ఇచ్చాడు. కన్నీటి తెరల మధ్య మసక మసకగా అక్షరాలు...
‘అమ్మలూ చిన్నూ...
నిన్నిలా పిలవటమే నాకిష్టమని నీకూ తెలుసు. పెద్దింటి బిడ్డవూ, కోడలివి కూడా అయ్యావంటే, డాక్టర్‌గా ఎదిగావంటే అదంతా సుమంత్ గారి దయవల్లే తల్లీ! నువ్వనుకున్నంత నీచురాల్ని కానమ్మా. నీ భవిష్యత్ కోసమే డాక్టర్ బాబు పంచన చేరాను. ‘అమ్మా!’ అనే పిలుపుకి దూరమయ్యాను. కన్నబిడ్డతో ‘ఆంటీ’ అని పిలిపించుకున్నాను. సుమంత్‌గారు దేవుడమ్మా.. వారి రుణం మనం తీర్చుకోలేనిది. నేను పోయాకైనా ‘అమ్మా’ అని పిలుస్తావు కదూ! ఏ లోకాన ఉన్నా విని ఆనందిస్తాను. నాలాంటి తల్లులకి నువ్వు చేతనైన సేవ చేస్తే సంతోషిస్తాను. తల్లి పోయినా- అమ్మప్రేమ బిడ్డల్ని నీడలా కాపాడుతూనే వుంటుంది ! నీకొక బిడ్డ పుడితే బాగా తెలుస్తుంది తల్లీ! దురదృష్టవంతురాలైన ఈ అమ్మని క్షమించగలితే క్షమించు..’
-అమ్మ కాలేకపోయిన అమ్మ
చిన్మయి కన్నీరు ఆ ఉత్తరాన్ని తడిపేసింది. తుపానులో ఊగే లేత మొక్కలా రోదించింది చిన్మయి. సుమంత్ ఓదార్పుగా ఆమె వీపు తట్టి దగ్గరికి తీసుకుని అనునయించాడు. అమ్మ ఆఖరి యాత్ర దగ్గరుండి జరిపించింది చిన్మయి. అమ్మ సంచీ నిండా తను చిన్నప్పుడు వాడిన పాల సీసా, ఆట వస్తువులు, అమ్మతో పాపగా ఫోటో... అన్నీ కన్నీటి జ్ఞాపకాలే!
‘కల్పన ఛారిటబుల్ క్యాన్సర్ హాస్పిటల్’ పక్కనే- ‘నవ్య హృదయాలయం’ పేరుతో చిన్మయి స్థాపించిన వృద్ధాశ్రమంలోకి అడుగుపెట్టగానే.. అక్కడ చేతులు జోడించి వినమ్రంగా నమస్కరిస్తూ కన్పించే స్ర్తి మూర్తి పాలరాతి విగ్రహం నవ్యే!
*

-సి.భవానీదేవి రచయత్రి సెల్: 98668 47000