మెయిన్ ఫీచర్

రమణీయం... రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రో భద్రయా సచమాన ఆగాత్
స్వసారం జారో అభ్యౌతి పశ్చాత్
సుప్రకేతై ర్ద్యుభిరగ్ని ద్వితిష్ఠన్
రుశ ద్భిర్వర్లై రభి రామ మస్థాత్
- ఋగ్వేదము
మొట్టమొదటి పర్యాయంగా బీజ రూపంలో, ఋగ్వేదంలోని ఈ మంత్రంలో శ్రీరామకథ కనిపిస్తుంది. నాలుగు చరణాల్లో, శ్రీరామ కథలోని నాలుగు ప్రధాన ఘట్టాలు సంకేతింపబడినాయి. భద్రుడు అనగా సర్వమంగళ స్వరూపుడైన రామభద్రుడు, భద్రతో అనగా సర్వమంగళ స్వరూపిణి అయిన సీతతో వనమునకు వచ్చాడని, జారుడైన రావణుడు సోదరిని దుష్ట బుద్ధితో సమీపించాడని, ఆకాశాన్నంటే హర్మ్యాలు అగ్నికి ఆహుతి అయ్యాయని తన భయంకరమైన వాహినులతో రావణుడు రాముని ఎదుర్కొన్నాడని నిరుక్తకారులు ఈ మంత్రాన్ని నిర్వచించారు.
వేదవేద్యుడైన పరంధాముడు దశరధాత్మజుడైన శ్రీరాముడుగా అవతరించగా, నాదాత్మకమైన వేదం, రసాత్మకమైన రామాయణ మహాకావ్యంగా ఆవిర్భవించింది.
భారతీయ సంస్కృతికీ, ధార్మిక జీవన విధానానికి మణిదర్పణం- రామాయణం. వేదాంత దర్శనంగాను, ధర్మప్రబోధకంగాను, ఇహపర సాధకంగాను జన జీవితాన్ని ప్రభావితం చేసేది శ్రీరామకథ.
త్యాగం ప్రశంసనీయమైన గుణం. అది కలిగినవారు శాశ్వతమైన కీర్తినొంది, ఇహపర సుఖములను పొందుతారు. సత్య ధర్మములు ఎన్ని ఆటంకములకు గురియైనా చివరకు విజయాన్ని పొంది తీరుతాయన్న సందేశాన్నిస్తుంది శ్రీరామకథ.
సత్యము, ధర్మము, త్యాగము, కర్తవ్యనిష్ఠ, పితృవాక్య పరిపాలన, మాతృభక్తి, భ్రాతృప్రేమ, అనురాగము, క్షమ, స్నేహము, సౌశీల్యము, వాత్సల్యము, సహనము, సౌహార్దము మొదలగు సుగుణములచే మానవ జాతికి ఆదర్శప్రాయుడైన శ్రీరామచంద్రుని దివ్య చరిత్రము, వాల్మీకి మహర్షి సుమధుర కవిత్వమూ మిళితమై మధురాతి మధురమైన శ్రీరామకథ- రామాయణ మహాకావ్యంగా ఆవిర్భవించింది.
రామాయణం:
రామ+అయనం = రామాయణం.. అనగా రామ, అయనం అనే రెండు మాటలతో రామాయణం ఏర్పడింది. ‘అయనము’ అనే మాటకు గమనము, గమ్యము అని అర్థం. ‘‘నాన్యః పంధా అయనాయ విద్వతే’’ అన్నది వేదం. ‘అయనం’ అంటే చేరవలసిన స్థానం. దాన్ని చేర్చేది - పంధాః అనే మాట. దానే్న పరాయణమని కూడా వ్యవహరిస్తారు. పరమమైన మార్గమేదో, అది పరాయణం. ‘సత్యజ్ఞానాందరూపా సామరస్య పరాయణ’ అన్నది లలితా సహస్రనామం. కనుక ‘రామాయణం’ అంటే రాముడే గమ్యం అంటే ఆత్మ తత్త్వమే ఎప్పటికైనా మనం చేరవలసిన స్థానం.
ఇదే ఆత్మారామ తారకరామ తత్త్వం. భద్రాచల భక్తరామదాసు అందుకే ‘తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనయితిని ఓరన్నా’- ఎన్ని జన్మలనుండి చూచినా, ఏకో నారాయణుడని, అన్ని రూపులైయున్న ఆ పరమాత్ముని నామము కధ విన్నా, ఎన్ని జన్మముల చేసిన పాపము లీజన్మమున వీడునని, రామమంత్రముచే ఇది కడసారి జన్మమని కీర్తించాడు.
శ్రీరామకథ
పుత్రకామేష్ఠియాగం పూర్తి అయిన తరువాత పనె్నండో నెల అయిన చైత్రమాసంలో, నవమి తిథినాడు పునర్వసూ నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో గురుచంద్రులుండగా ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా కౌసల్యాదేవి జగత్కల్యాణ కారకుడైన శ్రీరామచంద్రుణ్ణి ప్రసవించింది. భరతుడు చైత్ర శుక్ల దశమి మంగళవారం పుష్యమీ నక్షత్రంలో తైతుల కరణం, గంధయోగంలో జన్మించాడు. లక్ష్మణుడు చైత్ర శుక్ల ఏకాదశి బుధవారం ఆశే్లషా నక్షత్రంలో, గర కరణ, వృద్ధియోగంలో జన్మించాడు. శతృఘు్నడు చైత్ర శుక్ల ఏకాదశి బుధవారం ఆశే్లషా నక్షత్రం గరకరణం, వృద్ధియోగంలో జన్మించాడు.
నాలుగు వేదముల సారమే- నలుగురు సోదరులు. రాముడు ధర్మమునకు ప్రతీక అయిన యజుర్వేదము, లక్ష్మణుడు రామనామమే సర్వశాస్తమ్రుల సారమని ఉచ్ఛరించి, రామనామమునే చింతించే ఋగ్వేదము, భరతుడు- రామనామమే తన జీవిత ఆధారముగా విశ్వసించి రామనామమును గానము చేసే సామవేదము (శంఖనాదము- వేదనాదము), శతృఘు్నడు రామ, లక్ష్మణ, భరతుల ఆజ్ఞలను శిరసావహించి అంతర్ బహిర్ శక్తులను దునుమాడి శాంతిని చేకూర్చే అధర్వణ వేదము.
విశ్వామిత్ర యాగరక్షణ
అయోధ్యకు వచ్చాడు విశ్వామిత్ర మహర్షి, యాగరక్షణకై రాముణ్ణి తీసుకొని వెళ్ళటానికి. దేహమే శాశ్వతమనుకొన్న దశరధుడు, అంతరార్థాన్ని తెలిసికోలేక, తానే వచ్చి ఆ కార్యాన్ని నెరవేరుస్తానంటాడు. ఆ సమయంలో దశరథుని వారించి విశ్వామిత్రుడు ‘‘నీ కొడుకును గైకొని చని మా కాకలి యంచు దిందుమా పిచ్చి నృపా, మాకడ బ్రశస్త మన్త్ర వ్యాకృతి కల దద్ది నేర్పెద మింతే’’ అన్నాడు, విశ్వనాధవారి రామాయణ కల్పవృక్షంలో. తన వద్ద ఉన్న శక్తివంతమైన అస్తశ్రస్త్రాలను జగత్కల్యాణానికి ఉపకరించేవాడు రాముడని గ్రహించి, అతనికి వాటిని ప్రదానం చేసే నిమిత్తం రాముణ్ణి తీసుకొని వెళ్లటానికి అయోధ్యకు వచ్చాడు విశ్వామిత్రుడు. ఇన్ని అస్తశ్రస్తమ్రులున్న విశ్వామిత్రుడు తన యాగాన్ని తను రక్షించుకోలేడా? రక్షించుకోగలడు. ఇందులో మనకి రాముని లోకళ్యాణ తత్త్వం, నిస్వార్థత, విశ్వామిత్రుని పరంగా విశదపరచబడింది.
తాటకి వధ
‘‘రామో ద్విర్నాభి భాషతే’’ రాముడు రెండు మాటలు మాట్లాడాడు. సత్యవాక్పరిపాలకుడు. ఒక భయంకర శబ్దం వినబడింది. బీభత్స భయానక రూపం కనపడింది. కొండ గుహలాంటి నోరు తెరచుకుంది. రామక్ష్మణులను మ్రింగటానికి మీదికి వస్తోంది, తాటకి. స్ర్తి హత్య దోషం అని సంశయిస్తున్న రామునితో ‘‘వ్యవధి లేదు రామా, దుర్మార్గమైనా, సన్మార్గమైనా, పాతకమైనా దోషమైనా- ప్రజారక్షణకై కర్తవ్యాన్ని నిర్వర్తించు. అది ప్రభుధర్మం’’ అన్నాడు విశ్వామిత్రుడు. వింట బాణం దూసుకుపోయింది- ప్రాణాలు విడిచింది తాటకి. మారీచ సుబాహులు వచ్చారు. సుబాహుణ్ణి బాణాగ్నికి దహించి, మారీచుణ్ణి దూరంగా పోయేటట్లు బాణాలు వేశాడు.
పాదుకా పట్ట్భాషేకం
అరణ్యవాసం చేస్తూ, చిత్ర కూటం లో ఉన్న రాముణ్ణి మరలా అయోధ్యకు తీసుకొని వెడదామని, స్వచ్ఛందంగా వచ్చిన బంధువులు ప్రజావాహినితో వచ్చాడు భరతుడు. ఆత్మతత్త్వాన్ని బోధించి, కాల ప్రాముఖ్యతను వివరించి, తన పాదుకలను భరతుని అభీష్టం మేరకు యిచ్చి పంపిన ఆత్మారాముడు- శ్రీరామచంద్రుడు. పాదుకలకు పట్ట్భాషేకించి రాముని పనుపున, రాజ్యపాలనం చేశాడు భరతుడు.
అహల్యా శాపవిమోచనం
ధూళిలో వాయుభక్షిణియై, ఒరులకు కనపడకుండా తపమొనర్చుచూ వేయి ఏండ్లు ఆశ్రమమున పంచభూత సదృశముగానున్నది ‘అహ ల్య’. రాముడింకని కొంత దూరమున ఉండగానే, అతని మేని గాలి సోకుటవలన, కాలి సవ్వడి వినుటవలన దేహ పరిమళము వ్యాపించుటవలన, శరీర నీల రత్న కాంతి గోచరించుటవలననూ ‘‘సచ్చిదానంద ఘనమల్ స్కంధత్రయము గుర్తుగానున్న ఒక చెట్టుగాని చెట్టువలె చూపట్టిన శ్రీరామచంద్రుడు, ఆతిథ్యమును స్వీకరింపవచ్చుటవలనను, శబ్ద స్పర్శ రూప రస గంధములుగా పంచ మహాభూతముల పంచతన్మాత్రలనబడే సూక్ష్మస్థితులతో పంచేంద్రియములను పొంది, స్వస్వరూపమును పొందింది అహల్య. గుణాతీత అయిన ‘అహల్య’కు పాదాభివందనం చేశాడు శ్రీరామచంద్రుడు. రాతిని నాతినిగా చేసినట్లు వ్రాయలేదు వాల్మీకి. అహల్య, గౌతముడు, ఇంద్రుడు అంటే ఎవరు? వాటికి గంభీర ఉదాత్త ఆధ్యాత్మిక రహస్యాలను యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం చెప్పింది. అందుకే అహల్యకు నమస్కరించాడు రాముడు.
శబరికి మోక్షం
ఏ ఆధారము లేక, ఎట్టి శక్తి సామర్థ్యములు కల్గియుండక, ఏ దిక్కూ తోచక, గురువైన మతంగ మహర్షి వాక్కుపై విశ్వాంతో తనకు మోక్షాన్నివ్వడానికి రాముడెప్పుడొస్తాడా అని, రాముడొక్కడే దిక్కని భావించి సంపూర్ణ దాసోహభావంతో సాత్వికభక్తి విశ్వాసములతో త్రికరణశుద్ధిగా రామచింతనతో కాలము గడుపుతోంది బక్కచిక్కిన శబరి. రాముడు శబరితో ‘‘అవ్వా నీ తల యింత ముగ్గుబుట్టయినదేమి?’’ అంటే తల అంతా నెఱిసిపోయిందన్న భావంతోను, జ్ఞాన వృద్ధురాలవు అన్న అంతర్లీన భావంతో అంటే, ‘‘ఆర్ద్రంబగా ఆ ఏకును యింత వత్తిగజేసి వెలిగింపవయ్యా’’ అన్నది శబరి. ఇది జీవాత్మ పరమాత్మల సంబంధం. ఉదాత్త, గంభీర, ఆధ్యాత్మికత రామాయణంలో తెలిసికోవలసిన ముఖ్య అంశం. శ్రీరామ నవమి పండుగకు పూర్తి స్ఫూర్తినిస్తుంది. అందుకే ‘‘ఎంతని నే వర్ణితును శబరీ భాగ్యము’’ అని కీర్తించాడు ముఖారి రాగంలో సద్గురు త్యాగరాజస్వామి.
సీత రావణునితో సంభాషణ- హెచ్చరిక
సీతారాములు ఆదర్శ దంపతులు. రావణునితో సంభాషించునపుడు, తృణము కన్నా హీనుడన్న భావముగా, ఒక గడ్డిపోచను అడ్డముగా పెట్టుకొని మాట్లాడింది సీత. ‘‘నీవు పరాక్రమశాలివే అయితే, రామలక్ష్మణులు ఆశ్రమములో లేని సమయంలో, అందునా సాధు వేషంలో మోసగించి, అపహరించవలసిన ఖర్మమేమి పట్టినదన్నది. రామబాణముతో పని లేకుండా, తన పాతివ్రత్య ధర్మనిష్ఠా శక్తి తేజము, రావణుని సంహరించగలదని హెచ్చరించింది. అదీగాక రామాజ్ఞ కూడా లేదన్న మహాదాత్త శక్తిస్వరూపిణి సీత.
ఆంజనేయుడు: అతి బలవంతుడు
రామకార్యమును సఫలము చేసిన బుద్ధిమతాంవరిష్ఠుడు, సీతా ప్రాణదాత, రామాయణ మహామాలకు కొలికిపూస వంటివాడు ఆంజనేయుడు. శ్రీరామచంద్రునికి దాసుడై, రాముని ప్రతిబింబమే దాస్య స్వరూపుడుగా వెలసినవాడు వాయునందనుడు. హనుమంతునికి మహోత్కృష్ట స్థానాన్నిచ్చాడు వాల్మీకి మహర్షి. ‘‘పాహిరామదూత జగత్ప్రాణ కుమార మాంపాహి’’ అన్న వసంత వరాళిరాగ కీర్తనలో ఆంజనేయుని తత్త్వాన్ని ముఖ్యంగా సుందరకాండలోని విశేషాల్ని హృద్యంగా అందించాడు నాదయోగి సద్గురు త్యాగరాజస్వామి. ‘‘గీతార్థము సంగీతానందము నీ తావున చూడరా మనసా సీతాపతి చరణాబ్జములిడుకొన్న వాతాత్మజునికి బాగా తెలుసురా’’ అన్న సురటి రాగ కీర్తనలో ఆంజనేయుని వైభవాన్ని దాసభక్తిని ఆత్యద్భుతంగా వివరించారు త్యాగరాజస్వామి.
కమనీయం, రమణీయం సీతాకల్యాణం
సీతా పరాప్రకృతి, రాముడు పరాత్పరుడు. వారి అనుబంధం సహజసిద్ధం, సర్వలోక రమణీయం. ‘‘్ధనుర్దర్మీయ రామాయణ ఇతిహా వాచాపార్థివం’’ అని విశ్వామిత్రుడు రాజయోగియైన మహాజ్ఞానియైన జనక మహారాజుకి ఆదేశమిచ్చాడు. ‘వత్సరామధనూః పశ్య’’ రామా ఈ ధనువును చూడుము అని గంభీరంగా పలికాడు. భావమెరిగిన రాముడు శివధనుర్భంగం చేశాడు. ఆ సందర్భంగా శ్రీరాముని ముద్దు మోముపైగల ముంగురులు అలకలు అల్లలాడుట కన్నులారా చూచిన విశ్వామిత్రుడు శ్రీరామ ఉపాసనా లక్ష్యసిద్ధిని పొందాడని, మధ్యమావతి రాగంలో, రూపక తాళంలో ‘‘అలకలల్లలాడగని ఆరాణ్ముని ఎటు పొంగెనో’’ అంటాడు త్యాగయ్య.
‘‘ఫెళ్ళుమనె విల్లు- గంటలు ఘల్లుమనె, గుభిల్లుమనె గుండె నృపులకు- ఝల్లుమనె యె జానకీ దేహమొక నిమేషమ్మునందె నయము జయము భయము ఇస్మయము గదురగా’’ శివా ధనుర్భంగము గావించిన ధీరోదాత్తుడు రాముడని హృద్యంగా వర్ణించాడు కరుణశ్రీ, శ్రీరాముల కల్యాణ ఘట్టంలో. ‘‘సీత పూజడ వెన్నుగ శిరసు వంచె, చెఱకుగడవోలె నడిమికి విరిగె ధనుస్సు’’ అని అద్వైత శృంగార భావాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు విశ్వనాథ రామాయణ కల్పవృక్షంలో.
శివధనుర్భంగం - యోగశాస్త్రాన్వయం
మనస్సును మంత్ర ధ్యానంతో లయం చేసి, లక్ష్యాన్ని సాధించాలి. ప్రణవమనే ధనుస్సుతో, బాణమనే మనస్సును సంధించి, ముక్తికాంత అనే లక్ష్యాన్ని సాధించడమనేది ఉత్తమ తత్త్వం. ఇదే జీవిత ధ్యేయం కావాలి. అదే శ్రీరామచంద్రుడు ధనుర్భంగంగావించి, సీతామాతను పరిణయమాడటంలో గల తత్త్వ రహస్యం.
భగవంతుని జీవుడు ఆశ్రయించటం- కల్యాణం, మంగళప్రదం
జీవుడు భగవంతుని ప్రతిబింబం. కావున బింబ ప్రతిబింబ విషయమే దాంపత్య జీవితం. రాముడు పరబ్రహ్మము, సీత మోక్షలక్ష్మి. సీతారాముల కల్యాణం మంగళకరం. కనుకనే, త్యాగరాజస్వామి ‘‘సీతా కల్యాణ వైభోగమే’’ అని సర్వమంగళప్రదమైన శంకరాభరణ రాగంలో గానం చేశాడు.
‘‘రాముడు లోకాభిరాముడు’’ అని రామాయణ కథాగానం చేస్తూ ‘‘అందరికీ రక్షకుడితని దెలిసి కొలువరో’’ అని త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుని కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరుని యందు చూస్తూ, హరి సంకీర్తనాచార్య అన్నమయ్య చేసిన గానం- శ్రీరామనవమికి మనకిస్తుంది శ్రీరామరక్ష.

- పసుమర్తి కామేశ్వర శర్మ