ఈ వారం కథ

భవిష్యద్దర్శనం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీ సంస్థకి పోటీగా ఈశాన్య భారతంలో ఇంకో సంస్థ ఉత్పత్తి ప్రారంభించబోతోంది. వచ్చే సీజన్‌నుండి మార్కెట్‌లు ఇబ్బడి ముబ్బడిగా వాళ్ల ప్రోడక్టులతో నిండబోతున్నాయి. అమ్మకాలు లేక, గోడౌన్లలో స్టాక్ కదలక మీ ఫేక్టరీ ఉత్పత్తి ఆపేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ జెఎండ్ జె సంస్థ అధికార్ల సమావేశంలో ముఖ్య సలహాదారు కార్తికేయ తన ప్రసంగం ప్రారంభించాడు.
నిజానికి జెఅండ్ జె సంస్థ ప్రభుత్వ ప్రైవేటు రంగాల సంయుక్త సంస్థ. చాలా ప్రభుత్వ సంస్థలకు భిన్నంగా లాభాలు నామమాత్రంగా నైనా వస్తూనే వున్నాయి. ఈ మధ్యనే పగ్గాలు చేపట్టిన ఐఎఎస్ అధికారి లబ్ధప్రతిష్టుడు. ఎక్కడ బాధ్యతలు తీసుకున్నా తనదంటూ ఒక ముద్ర వేయడానికి ప్రయత్నిస్తాడు. సంస్థ లాభదాయకత పెంచాల్సిన అవసరం వుందని వ్యూహాత్మకంగా పైవాళ్లకి చెవినిల్లు కట్టుకుని పోరి సఫలీకృతుడయ్యాడు. కార్యాచరణలో భాగంగా కన్సల్టెంట్లు వచ్చారు. నెలరోజులపాటు సంస్థ కార్యకలాపాలు నిశితంగా పరిశీలించి అన్ని స్థాయిల ఉద్యోగులతో చర్చలు జరిపారు. వారు తయారుచేసిన ప్రణాళికే ఇప్పటి సమావేశపు ముఖ్య ఎజెండా.
‘‘మేం చెప్పొచ్చేది ఏమిటంటే మీ మేనేజిమెంటు కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకునే సమయం ఆసన్నమైంది. విజన్ ట్వంటీకి ప్రిపేర్ అవ్వాలి’’ కార్తికేయ తన ప్రసంగం కొనసాగిస్తున్నాడు.
‘‘మొదటిది మీరు ప్లాంట్ విస్తరణ చేయాలి. ఉత్పత్తి సామర్ధ్యం రెట్టింపు చేయాలి. ప్రొడక్ట్‌ని స్టోరు చేసేందుకు రెండు పెద్ద గోడౌన్లను నిర్మించాలి. ప్రారంభంలో యాజమాన్యం అవసరానికి మించి భూమిని సేకరించింది. ఇప్పుడు అది వరమైంది. ప్రత్యేకంగ స్థల సేకరణ కూడ చేయనక్కర్లేదు.’’
సమావేశంలో వున్నవారికి సందేహాలు కార్తికేయ మాటలకి. ‘స్థలం సంగతి సరే విస్తరణ ప్రాజెక్టుకి కొత్తగా పెట్టుబడులు ఎక్కడనుంచి వస్తాయి?’
‘‘మీరు బేగింగు సెక్షన్ నిర్వహణలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మైక్రో లెవెల్లో మేము అబ్జర్వు చేసిన ప్రకారం అక్కడ ప్రతిరోజు మీరు చాలా లాభం కోల్పోతున్నారు.’’
‘‘అంటే?‘‘ అరచినంత పని చేసాడు బేగింగు విభాగాధిపతి. మొత్తం ఫాక్టరీ అంతటిలోను అతని విభాగం అత్యంత సమర్ధంగా నిర్వహించబడుతున్నదని పేరుపడ్డది.
‘‘నలభై కేజీల బేగులలో మీరు మొత్తం రోజుకి మూడు వేల ఐదు వందల టన్నుల డిఎపిని మార్కెట్లోకి వేగన్ల ద్వారా ట్రక్కుల ద్వారానో తరలిస్తున్నారు. తూనికలు, కొలతల శాఖ ప్రకారం ప్రతి బేగ్‌లోను ఉత్పత్తి ఒక యాభై గ్రాములు అటు ఇటు వుండవచ్చు. కాని క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏమిటి? మీ ఆటోమేటిక్ బేగింగు మిషన్స్ సెటింగులు ఓ నూట యాభై గ్రాములు అధికంగానే పెడుతున్నారు. ఎందువల్ల?...కేవలం మార్కెట్‌నుంచి ఫిర్యాదులు వస్తాయేమో అన్న భయంతో... అదే మీరు మెషిన్ సెటింగు సవరించి బేగ్‌లో యాబై గ్రాములనుండి వంద గ్రాములు తక్కువగా నిండేట్టు చేస్తే ఏడాదికి మనం వన్ మిలియన్ టన్నులకు పైగా అమ్మే ప్రాడెక్టు మీద మనకు లాభం ఎంత ఉంటుందో ఆలోచించండి.’’
‘‘ఇది అనైతికం. అన్నదాతలను మోసం చేయడమే. ఇప్పటికే ప్రభుత్వ సబ్సిడీ ఎత్తివేయడంతో డిఎపి ధర వెయ్యిరూపాయలు దాటి వాళ్లు చితికిపోతున్నారు. సమావేశంలో నిశ్శబ్దం భంగం చేస్తూ అరచినంత పని చేసాడు పిచ్చయ్య. అతగాడు డిఎపి ప్లాంటు షిఫ్ట్ ఇంజనీరు.
కార్తికేయ ఓ నిముషంపాటు తత్తరపడ్డాడు.
‘‘మిస్టర్ పిచ్చయ్యా ఇందులో మోసం ఏముంది? చట్టంలో వున్న వెసులుబాటునే ఈయన ఉపయోగించుకోమంటున్నాడు. అయినా ఇది అసెంబ్లీ కాదు వాదోపవాదాలకి. కేవలం సూచనలు, నిర్ణయాలు ప్రకటించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసాం. ఇక్కడ మన సలహాదారులు చెప్తున్న వాటిని అమలు చేసే బాధ్యత కూడా మీదే అని గమనించాలి...’’ అత్యున్నత అధికారి కార్తికేయకి వత్తాసు వచ్చాడు.
ఆ హెచ్చరికతో వెనక్కి తగ్గారు అధికారులందరూ. పేరుకి మేధోమథనం అని సమావేశానికి పిలిచినా కేవలం యాజమాన్యం ఆదేశాలు ఇవ్వటానికే అని అర్ధమైంది.
కార్తికేయ కొనసాగించాడు. ‘‘అయినా నేను చెప్పింది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మేం అధ్యయనం చేసినవి...
ఇక్కడ కంపెనీ కడుతున్న హెల్త్ బిల్లులు లక్షలు దాటుతున్నాయి. మిడిల్ ఏజ్‌లో వున్న వాళ్లు ఓబెసిటీ, బిపి, సుగరు, గుండెజబ్బుల పాలబడుతున్నారు. మూల కారణం కేంటీన్‌లో ఇస్తున్న హైప్రోటీన్, హైకార్బో హైడ్రేడ్ ఫుడ్. నిజానికి రోజుకు రెండు వేల ఐదువందల కెలోరీలకి మించి ఒక ఫేక్టరీ ఉద్యోగికి భోజనం ఇవ్వనవసరం లేదు. మెనూలో తగిన మార్పులు చేస్తే ఒకే దెబ్బకి రెండు పిట్టలు కొట్టినట్టు మీ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, మీ సబ్సిడీ కేంటీన్ నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి.
మీ రిక్రియేషన్ బడ్జెట్ కూడా ఎక్కువే. మోడ్రన్ గాడ్జెట్లుతో ఈ రోజుల్లో ఎంటర్‌టైన్‌మెంటు నట్టింట్లో అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు కంపెనీ బాధ్యత తీసుకోవడం ఎందుకు? ఏనివర్సిరీలు, సేఫ్టీ డే ఉత్సవాలు జరుపుకోవడం ఎందుకు?..ఏక్సిడెంట్లు అయినపుడు గాయపడిన ఉద్యోగులను కార్పొరేట్ హాస్పిటల్‌లో వైద్యం ఇప్పిస్తున్నారు చట్టప్రకారం గవర్నమెంటు హాస్పిటల్ సరిపోగా...కార్తికేయ బయటపెట్టిన ప్రతిపాదనలలో సింహభాగం అధికారుల, ఉద్యోగుల సంక్షేమం కోసం చేసే వ్యయంలో తగ్గింపులే.
‘‘ఇక ఆఖరుగా మేము సజెస్టు చేస్తున్నది గోల్డెన్ హేండ్ షేక్..ఉద్యోగులు ముఖ్యంగా మేనేజర్ స్థాయివాళ్లు ఏభై ఏళ్లు దాటిన వాళ్లు వైదొలగాలి. వాళ్ల స్థానంలో కొత్తవాళ్లని తీసుకుంటే జీతాల బిల్లు తగ్గుతుంది. బిజినెస్ స్కూళ్లనుంచి వచ్చిన మెరికల్లాంటి కుర్రాళ్లు ఇప్పుడు లభిస్తున్నారు దేశంలో...’’
సమావేశంలో కలకలం రేగింది. ‘తమకు ఉద్వాసన జరగబోతోందా ఏమిటి? చాలామంది ఇప్పడిప్పుడే తమ పిల్లలను సెటిల్ చేయడంలో తలమునకలై ఉన్నారు. స్వర్ణ కరచాలనం పేరుతో ఎంత ఎక్కువ పరిహారం ఇచ్చినా ఆర్థిక పరిస్థితులు తారుమారు అవుతాయే’
‘‘ఈ రెంటి గురించి విధి విధానాలు తయారవుతున్నాయి. మీరందరి పూర్తి సహకారం యాజమాన్యానికి ఉంటుందని ఆశిస్తున్నాం.’’ అంటూ కార్తికేయ తన ప్రసంగం ముగించాడు.
‘‘గొప్ప సలహాలిచ్చారు! లాభాలు కాదు, ముందు వచ్చేది కార్మిక అశాంతి. మన ఎమ్‌డి కుక్కతోకను పట్టి గోదారి ఈదుతున్నాడు. విస్తరణ విస్తరణ అంటున్నారు కానీ వీళ్లేమిటి స్టడీ చేసారు? మన మెషినరీ, ఎక్విమెంట్లు అన్నీ పదిహేను వందల టన్నులు డిఎపి రోజుకు ఉత్పత్తి చేసేందుకు వీలుగా డిజైన్ చేసారు. గవర్నమెంటు అనుమతి వెయ్యి టన్నులకే వున్నా, ఇప్పుడు ఎక్కువ ఉత్పత్తికి అనుమతి తెచ్చుకుంటే చాలదా? ఇన్నాళ్లు తక్కువ లోడుతో ప్లాంట్ రన్‌చేసి కడుపులో చల్ల కదలకుండా గడిపేసారు మన ఇక్కడి మిడిల్ మేనేజిమెంటు కేడరు...’’ వ్యాఖ్యానించాడు పిచ్చయ్య రవితో సమావేశం అయ్యాక బయటికి వస్తూ..
‘‘మనకేల, నువ్వు గమ్మున ఉండు. ఎవరికీ కన్‌సెర్న్ లేదు చూసావా. విఆర్ తీసుకుంటే ఎంత
వస్తుందన్న లెక్కల్లో పడ్డారు అప్పుడే అందరూ..?’’ అన్నాడు రవి.
ఎనిమిదేళ్ల అనుభవంతో జెజె సంస్థ
ప్రారంభంలో చేరాడు పిచ్చయ్య. ప్రాజెక్టు నిర్మాణంలో కమిషనింగ్‌లో ఎన్నో సాంకేతిక సమస్యలు పరిష్కరించాడు. ప్రతిభావంతుడు, పనిమంతుడే కానీ లౌక్యం తెలియని వాడు. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు. ఫలితంగా ప్రాజెక్టు దశలోనే చాలామంది అధికారులకు శత్రువు అయ్యాడు. ప్లాంటు కమిషన్ అయిన తర్వాత వచ్చిన పదోన్నతుల జాబితాలో అతని పేరు లేదు.
‘‘నాకు పూర్వానుభవం ఉంది. నా సమర్ధతలో లోపం ఎంచేందుకు లేదు. ఆ మాటకొస్తే నేను ఇక్కడ వున్న ఆపరేషన్స్ మేనేజర్ కంటె ఎక్కువ డిఎపి ప్రొడ్యూస్ చేస్తాను. నాకు అన్యాయం చేస్తారా?’’ ఉక్రోషంగా అన్నాడు అతడు.
ఆ మాటలు ఆ నోటా ఈనోటా పడి చేరవలసిన వారికి చేరాయి. మరో మూడేళ్లు పిచ్చయ్యకు పదోన్నతి అనధికారికంగా నిషిద్ధం అయింది. ఆ తర్వత మరో మూడేళ్లు.
‘నీ గత వైభవాల సంగతి మాకక్కరలేదు. డిగ్రీ వచ్చిన తర్వాత ఉన్న అనుభవమే పరిగణనలోకి తీసుకున్నాం. నీకు కంప్యూటర్ క్వాలిఫికేషన్ లేదు. పూర్వ సంస్థలో నువ్వు నాన్ సూపర్‌వైజర్‌వైనా ఇక్కడ ఆఫీసరుగా ఇచ్చాము. అదే ఎక్కువ!’ ప్రభుత్వ ప్రైవేటు రంగాలు రెండింటి అవలక్షణాలు పుణికి పుచ్చుకుని సంస్థలో నచ్చని వాళ్లని అణగదొక్కడానికి నెపాలు వెతుక్కోనవసరం లేదు.
రవి సలహా ఇచ్చాడు తన పిచ్చయ్యకి. ‘‘జిఎమ్‌ను కలిసి రిక్వెస్టు చేయి. అయిందేమో అయింది. ఇకనైనా నీకు మోక్షం ఇవ్వమని..సలహా ఇచ్చాడు మిత్రుడు. మనం ఇద్దరం ఒకేసారి జాయిన్ అయినా, నాకంటె మూడు గ్రేడులు కింద ఉన్నావు నువ్వు...అతన్ని ప్రాధేయపడితే తప్పక మనసు కరుగుతుంది’’
‘‘అసలు నేరస్థుడు వాడేకదా, అల్పులు, నీచులు, ముడుపుల రాయుళ్ల వెనక ఉండి ఇక్కడ చక్రం తిప్పుతున్నాడు. వాడే తిన్ననైన వాడైతే కంపెనీకి ఇబ్బడి ముబ్బడిగ లాభాలు వచ్చేవి. వాడిని ఎప్రోచ్ అయేది ఏమిటి.’’
‘‘అవన్నీ నిజమే. అయినా నీకు జరగాల్సింది చూడు. అతగాడి చేతిలో నీ ప్రమోషన్ ఉంది. తప్పదు! వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్లు పట్టుకున్నాడు. మా మేనమామతో చెప్పిద్దాం. ఆయన లేబర్ కమిషనరు. వీళ్లు చచ్చినట్టు వింటారు. నాకు క్రమం తప్పకుండా ప్రమోషన్లు వస్తున్నాయంటే ఆయన చలవే.’’ నచ్చచెప్పబోయాడు రవి.
‘సింహము జీర్ణతృణంబు మేయునే?’ అన్న స్థాయిలో మిత్రుడి సహాయం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాడు పిచ్చయ్య. కార్తికేయ మార్గదర్శకత్వంలో యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. స్వచ్ఛంద విరమణ పథకం అమలైంది. ఏభై శాతం మంది సాంకేతిక ఉధ్యోగులు తగ్గారు. విస్తరణ మాత్రం నిధుల కొరతతో వాయిదా వేసారు.
బిజినెస్ స్కూళ్లనుంచి వచ్చిన వారు మేనేజిమెంటు స్థానాలకు రిక్రూట్ అయ్యారు. ‘‘వీళ్లంతా ఐఎఎస్‌లు, పొలిటీషియన్ల పుత్రరత్నాలు, ఆశ్రీతులు. ముక్కుపచ్చలారని వాళ్లు. బిజినెస్ స్కూళ్ల బేక్ గ్రౌండ్. చూస్తూ ఉండు ఒకటి రెండు ఏళ్లలోనే జంప్ అవుతారు కేవలం వాళ్ల రిస్యూమ్‌లో అనుభవం ఏడ్ చేసుకోవడానికి జాయిన్ అవుతారు.’’ పిచ్చయ్య జోస్యం చెప్పాడు. అలాగే వాళ్లు వచ్చారు. కాని పని వాతావరణం పాడయేందుకు కారకులయ్యారు. మా పదోన్నతి అవకాశాలు దెబ్బతిన్నాయని కిందిస్థాయి వారు ఆందోళనలు, సహాయ నిరాకరణలు చేసారు. కొత్తవారు వెళ్లిపోయినా పిడుక్కీ బియ్యానికీ అదే మంత్రం అన్నట్టు వ్యవహరించారు.
ఉత్పత్తి విభాగంలో అనుభవజ్ఞులైన వారిని స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ద్వారా బయటికి పంపేయడంతో ఉత్పత్తి కుంటు పడింది. వాసి కూడా దెబ్బ తింది.
జె అండ్ జె సంస్థ బేగులలో సరుకు తక్కువ నింపుతున్నారని, నాణ్యత లేని డిఎపి అమ్ముతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు. పోటీదారుల వ్యూహాలతో గిరాకీ తగ్గి సంస్థ అమ్మకాలు పడిపోయాయి విపణివీధిలో. కంపెనీ షేర్ విలువ అధః పాతాళానికి పడిపోయింది.
‘‘అయ్యవారిని చేయబోతే కోతి తయారైంది. లాభాల మాట అటుంచి నష్టాల ఊబిలో కూరుకుపోతున్నది చూసావా?’’ అంటున్నాడు పిచ్చయ్య.
సలహాదారులు తమ ప్రతిపాదనను మళ్లీ తెరమీదకు తెచ్చారు...‘‘ఇకనైనా బేంక్‌లనుంచి ఆర్థిక సంస్థలనుంచి అప్పులు తీసుకుని విస్తరణ చేయండి. ఎక్కువ ఉత్పత్తి చేస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. తప్పక మీరు గట్టెక్కవచ్చు.’’
కర్మాగారం విస్తరణకు పూనుకున్నది సంస్థ. అప్పుల కోసం ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. అతి కష్టంమీద పూర్తయింది విస్తరణ.
‘‘మన కంపెనీ పరిస్థితి ఎంత దిగజారిందో చూసావా! ఆస్తులు తెగనమ్మినా తీరవు వీళ్లు చేసిన అప్పులు. నేను చెప్పలే? ‘అరచేతిలో వైకుంఠం చూపారు గానీ మేన్‌పవర్ ఏదీ, నైపుణ్యాలు ఏవీ? ఎప్పటికి ప్లాంటు ఫుల్‌లోడ్ రన్ అవుతుంది? మార్కెటులో ఎప్పటికి లాభాలు వస్తాయి? ఎండమావుల వెంట పరుగులే! బిఎఫ్‌ఐఆర్‌కి బ్యూరోఫర్ ఇండస్ట్రియల్ రీకన్‌స్ట్రక్షన్’కి రిఫర్ చేయడం తప్పదు’’ పిచ్చయ్య ఉవాచ.
ప్రభుత్వ పెద్దలు ఆలోచనలో పడ్డారు. ‘దివాళా స్థితి రాకముందే సంస్థను అమ్మి పడేస్తే పోలే. నిర్వహణ చికాకులుండవు. పునరుద్ధరణ తలకెత్తుకోనవసరం లేదు. పైపెచ్చు ప్రభుత్వ ఖజానాకు నిధులు సమకూడతాయి’ అనుకున్నారు. చివరకు నిర్ణయం అయింది. సంస్థను ప్రైవేటుపరం చేయాలి.
‘‘తెలివిగా ప్రభుత్వ రంగ కంపెనీని అమ్మకానికి పెట్టారు. గవర్నమెంటులో వున్నవాళ్లు, ఎమ్‌డి, కన్సల్టెన్సీవాడు, డబుల్ ఏజెంట్లుగా పనిచేసిన ఉన్నతాధికారులు ఈ మొత్తం వ్యవహారంలో రకరకాలుగా డబ్బులు చేసుకుని ఉంటారు. మూడువందల ఏకరాల ప్రాంగణం, రోజుకి పదిహేను వందల టన్నుల డిఎపి ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన మెషినరీ, బిల్డింగులు, స్టోరేజి గోడౌన్లు..విస్తరణ చేసి మరీ ఫ్యాక్టరీ పళ్లెంలో పెట్టి అప్పచెప్తున్నారు ప్రైవేటు రంగానికి చూడు.’’ పిచ్చయ్య అడిగిన వారికి, అడగని వారికి చెప్తున్నాడు.
పారిశ్రామిక దిగ్గజాలు కారు చౌకగా వస్తున్న సంస్థను కొనేందుకు పోటీపడ్డాయి. గెలిచింది అదే రంగంలో ఉన్న హీరమండల్ ఇంటర్నేషనల్. ఎవరూ ఊహించనంత బిడ్ వేసి జెఅండ్‌జె సంస్థని చేజిక్కించుకుంది.
‘‘మనల్ని కొన్న వాళ్లది ఫక్తు వ్యాపార ధోరణి. అన్ని వౌలిక సౌకర్యాలు ఉన్న ఫేక్టరీ. తుంబలు తుంబలుగా ఇప్పుడున్న వైట్ కాలర్ స్ట్ఫాని తగ్గిస్తారు. టెక్నికల్ మేన్‌పవర్‌ను కూడా సొంత ఫేక్టరీనుంచి సర్దుబాటు చేసి మరీ నడిపించేయగలరు. అదే ధైర్యం. బిడ్ ఎక్కువ వేసి కొనేసారు..’’పిచ్చయ్య తన వ్యాఖ్యానాలు ఆపడం లేదు.
‘‘మేనేజిమెంటు మార్పుతో మనకేమీ ఇబ్బంది లేదుకదా, మన కనవసరమైన వాటి జోలికి పోకు పిచ్చయ్యా. విమర్శలు, విశే్లషణలు మాని మన పని మనం చూసుకోవాలి. ఇప్పుడైనా నీ పంథా మార్చుకో! నీ ప్రతికూల ధోరణితో ఇంతకాలం ఉద్యోగాభివృద్ధి లేకుండా చేసుకున్నావు. లక్షల రూపాయలు నష్టపోయావు. కొత్త యాజమాన్యం పనితనానికి ప్రాధాన్యం ఇస్తారు..దయచేసి విను..నా మిత్రుడు కాస్త అనుకూల ధోరణి అలవరుచుకుని ప్రతిభకి తగినన గుర్తింపు తెచ్చుకుంటే నాకంటే సంతోషించే వారు వుండరు’’
‘‘ఈజ్ ఇట్ సో?’’
‘‘అవును. ఇంకోటి తెలుసుకో. పూర్వంవాళ్లు నీ ప్రమోషన్లుమాత్రమే ఆపేసారు. వీళ్లు ప్రైవేటు మేనేజిమెంటు. నచ్చని వాళ్లకి ఉద్వాసన చెప్పడానికి ఏమాత్రం వెనుకాడరు’’ హెచ్చరించాడు రవి.
‘’సో వాట్?’’
రవికి ఆవేశం కట్టలు తెంచుకుంది.
‘‘ఏమిటి నీ ధైర్యం. ఉద్యోగం పోయినా పర్వాలేదా? ఎపుడో ఎదగడం ఆగిపోయిన జీతంతో నీ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే అంతంతమాత్రం. పేస్లిప్ నిండా కోతలే. అందరి దగ్గరా చేబదుళ్లే. ఉద్యోగం ఊడగొట్టుకుని ఎలా తీరుద్దామని? మీ వాళ్ల గురించి ఐనా ఆలోచించవా? ఎంతసేపూ మనవి కాని విషయాల గురించి విమర్శలు విశే్లషణలు చేయడమేకానీ నీ నిర్వాకం కారణంగా నీ భార్యాబిడ్డలు, పేరంట్సు అందరూ రోడ్డున పడతారన్న ఇంగితం లేదూ?’’ ఎన్నాళ్లనుంచో స్నేహితుడి మీద పేరుకుంటున్న ఆగ్రహం వెళ్లగక్కాడు.
‘‘అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు మై ఫ్రెండ్! నీకో రహస్యం చెప్పనా? ఇప్పుడు నా దగ్గర మన కంపెనీ షేర్లు ఏభై వేలు ఉన్నాయి. కంపెనీ పతనావస్థలో ఉన్న మూడేళ్లు ముందు చూపుతో దఫదఫాలుగా నాలుగున్నర ఐదున్నర రూపాయల మధ్య నేను కొన్నవి. పండగ ఎడ్వాన్సులు పిఎఫ్ లోన్లు విత్‌డ్రాలు చేసి మరీ కొన్నాను. నువ్వు అడపా దడపా నాకిచ్చిన చేబదుళ్లు వెనక్కి ఇవ్వకుండా ఉండడానికి కూడా కారణం అదే. ఇప్పుడు సంస్థ చేతులు మారడంతో షేర్ వేల్యూ ఎంతకి ఎగబాగిందో తెలుసా. అక్షరాల నూట అరవై రూపాయలకి...నాకు ఇన్నాళ్లు జరిగిన లాస్‌కు ఇరవై రెట్లకి పైగా రికవర్ అయింది. ఉన్నషేర్లు అన్నీ అమ్మేస్తున్నాను. నా శ్రేయోభిలాషివి. ఇప్పుడు నువ్వు చేయాల్సిందంతా నీ వంతుకు వచ్చేదెంతో లెక్కలు వేసుకోవడమే.’’ ధీమాగా నవ్వుతున్నాడు పిచ్చయ్య.

*

-చింతా జగన్నాధరావు , సెల్ నెం: 9848236995