మెయిన్ ఫీచర్

తెలిసి చేసే తప్పుల్ని ఏమనాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి నవనాగరిక యుగంలో మీడియా, ఇంటర్నెట్ కారణంగా అనేకానేక అంశాలపై అన్ని వర్గాల్లో అవగాహన పెరిగింది. ఒక వస్తువు గురించి, ఒక ప్రదేశం గురించి, ఒక వ్యాధి గురించి, ఒక పుస్తకం గురించి.. ఇలా ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో సెర్చ్ చేస్తే క్షణాల్లో స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. ఆధునిక సాంకేతికత ఇంతగా వెల్లివిరుస్తున్నా, ఏయే కారణాల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో అవగాహన ఉన్నప్పటికీ- చాలామంది తెలిసే తప్పులు చేస్తున్నారు. చేయకూడనిది చేయడం, చేయాల్సింది విస్మరించడం ఎంతోమందికి ఒక అలవాటుగా మారిపోయింది. ఒకప్పుడు ఇంతగా జ్ఞానం లభ్యమయ్యే అవకాశాలు లేనప్పుడు- ఆ కాలం వాళ్ళు తప్పులు, పొరపాట్లు చేసారంటే కొంత అర్థముంది. కానీ, తెలిసి చేస్తున్న ఈ కాలపు మనుషుల తప్పులను ఏమనాలి...?
ధూమపానం చెడ్డ అలవాటని అందరికీ తెలిసిన విషయమే. చుట్ట,బీడీ,సిగరెట్ తాగితే ఊపిరితిత్తులు పాడైపోతాయనీ, ఈ అలవాటు గుండెజబ్బులకు దారి తీస్తుందని ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధూమపానం చేసేవాళ్లకీ, వారిపక్కనున్న వాళ్లకీ పొగ వల్ల హాని తప్పదని అందరికీ తెలిసిందే. సిగరెట్లు తయారుచేసే కంపెనీలే ప్యాకెట్ మీద చిన్న అక్షరాలతో ‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’ అని ముద్రిస్తారు. అయినా ఏ మాత్రం లెక్క చేయరు ధూమపాన ప్రియులు. జర్దా, పాన్ పరాగ్, గుట్కా, ఖైనీలు వంటి పొగాకు ఉత్పత్తులను నమలడం నోటి క్యాన్సర్లకు దారి తీస్తుందని అందరూ రోజూ వింటూనే వుంటారు. ఆ వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్న వాళ్ళ ఫొటోలు పత్రికల్లో, హెల్త్ ఛానల్స్‌లో చూస్తూనే ఉంటారు. అయినా యువకులు, మధ్య వయస్కులు ఆ అలవాటుకు బానిసలైపోతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో గుట్కాలను నిషేధిస్తే చాలా రాష్ట్రాల్లో ఇవి యథేచ్ఛగా అమ్ముడుపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపదు. ‘బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నేరం’ అని అక్కడక్కడా బోర్డులు పెడుతున్నా తప్పు చేసిన వారికి జరిమానాలు విధిస్తున్న దాఖలాలు లేవు.
ఇక, పరిమితికి మించి మద్యం సేవించేవాళ్ళకు కాలేయం దెబ్బతినటం, గుండెజబ్బులు రావటం తథ్యమని డాక్టర్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కాయకష్టం చేసుకునే వాళ్లు, భారీగా సంపాదించే వారు మద్యం మత్తులో మునిగితేలుతున్నారు. రోజుకూలీల్లో చాలామంది తమ సంపాదనలో సగభాగాన్ని మద్యానికే తగలేయడం, తాగిన మత్తులో భార్యాపిల్లల్ని హింసపెడుతుండడం నేడు నిత్యం కనిపించే దృశ్యాలే. బాగా చదువుకున్నవారు, కొందమంది వైద్యులు సైతం మద్యానికి అలవాటు పడుతున్న ఉదంతాలు లేకపోలేదు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు సైతం బెల్టుషాపులు, కల్లు, సారాయి దుకాణాలు ప్రతి వీధిలో ఏర్పాటు చేయిస్తున్నారు. మద్యం అమ్మకాలు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరుగా మారుతోంది. ఈ విషయమై నేతలను నిలదీస్తే- ‘ప్రభుత్వ ఖజానాకు డబ్బులు తెచ్చిపెట్టేది ఎక్సయిజ్ డిపార్ట్‌మెంటే కదా.. జనం తాగకపోతే అది నిండేది ఎలా..?’ అని బహిరంగంగానే సమర్ధించుకుంటున్నారు. విదేశీ సంస్కృతి పేరిట విచ్చలవిడి తనంతో వింత పోకడలకు పోతున్న ఈ మాయదారి అల్ట్రామోడ్రన్ యుగంలో ఇప్పుడు కొందరు ఆడవాళ్ళు సైతం మద్యం, ధూమపానానికి బానిసలవుతున్నారు. కుటుంబ వ్యవస్థ పదిలంగా ఉండాలని కోరుకునేవారికి ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆడయినా, మగయినా వ్యసనాలకు ఎవరు దాసోహం అయిపోతున్నా వారి ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులకు చేటు తప్పదు.
జూదం ఒక వ్యసనమని అందరికీ తెలుసు. జూదంలో పెట్టే పందేల కారణంగా కొంప, గోడు, పొలం, పుట్రనే కాదు రాజ్యాలకు రాజ్యాలే పోగొట్టుకుని.. చివరికి ఆలిని సైతం జూదంలో ఓడిపోయిన ధర్మరాజు గురించి పురాణాలు చదివాం, విన్నాం. ఈ కాలంలోనూ పల్లెల నుంచి పట్నాల వరకూ జూదం యథేచ్ఛగా సాగిపోతూనే ఉంది. ఘనమైన మన సంస్కృతీ, సంప్రదాయాలను మనవాళ్ళు మర్చిపోయినా, పల్నాటి వీరుల కాలం నాటి కోడిపందేలను మాత్రం ఇంకా మర్చిపోకుండా ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. పాచికలాటలు పోయినా పేకాటలు మాత్రం జోరుగానే కొనసాగుతున్నాయి. జూదంలో ఎంత పోగొట్టుకున్నా- ‘ఏదో ఒక మంచిరోజు రాకపోతుందా?’ అన్న ఆశ పేకాటరాయుళ్ళను స్థిమితంగా ఇంటిపట్టున ఉండనివ్వదు. ‘ప్రభుత్వ పేకాట స్థావరాలు’ అని బోర్డులు పెట్టి ప్రభుత్వం బాహాటంగా ప్రోత్సహించకపోయినా క్లబ్బుల్లో భారీగా సాగుతున్న పేకాట మీద దాడులు చేయటం లేదన్నది మాత్రం అందరికీ తెలిసిన బహిరంగ రహహ్యమే. ‘అర్ధరాత్రి ఒంటిగంటవరకూ క్లబ్బుల్లో, పబ్బుల్లో మీ ఇష్టం వచ్చినట్లు తాగితందనాలాడి, ఆటాడి, ఐటం సాంగులకు స్టెప్పులేసుకోండి.. ఏం ఫర్వాలేదు... ఒంటిగంట తర్వాత మాత్రం తూలుతూ అయినా సరే ఇంటికెళ్ళితీరాలి..’ అని మాత్రం ప్రభుత్వం ఒక రూల్ పెట్టింది. ‘ఎంత తాగినా దానికి శిక్ష లేదు గానీ తాగి వాహనం నడిపితే మాత్రం ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కింద చాలానాలు రాసిపడేస్తాం...’ అని తాగుబోతులను కాస్త దయతలిచే ట్రాపిక్ రూల్ ఒకటి కంటితుడుపు చర్యగా పెట్టారు. ‘తాగితే వంటిమీద స్పృహ ఉండదనీ.. ఆ పరిస్థితిలో అతను స్కూటరో, కారో నడిపితే అవతలివాడిని చంపడమో, అతను చావడమో వంటి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంద’ని అందరికీ తెలిసిన విషయమే. అయినా వాహనాలను నడుపుతారు ‘డోసు’ బాబులు. ట్రాఫిక్ పోలీస్ కంటపడకుండా గల్లీల గుండా ఇల్లు చేరుకోవాలి.
ఇలా ‘చెయ్యకూడద’ని తెలిసే చాలామంది చేస్తున్న పనులు అనేకం ఉన్నాయి. అవి నేరమనీ, తప్పని తెలిపినా అలవాటుగా కొంత... నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో మరికొంత అలా చేసుకుంటూనే పోతున్నారు. ‘బహిరంగ ప్రదేశాలలో మల, మూత్ర విసర్జన తప్పు, అని అందరికీ తెలుసు. పైగా స్వచ్ఛ్భారత్ పేరిట పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ చీపుర్లు పట్టుకుని సెలబ్రటీలు రోడ్లు ఊడ్చిన సందర్భంలో ప్రభుత్వం దీనికి ఒక చట్టం కూడా తెచ్చింది. కానీ, అది అమలు అవుతున్న జాడ ఎక్కడా కనబడటం లేదు. బహిరంగ ప్రదేశాలలో కాలకృత్యాలు తీర్చుకోవటం అన్నది మన దేశంలో పాతకాలం నుంచి వచ్చిన పాడు అలవాటు. ఈ యుగంలోనయినా ఆ అలవాటు పోయి టాయిలెట్స్ సౌకర్యం రావాలి కదా. ‘అలాంటివి మాత్రం అడక్కండి...’ అని వాదించేవారికి ఎంత చెప్పినా ఎలా అర్థమవుతుంది? తెలివితక్కువ వాడు ఎవరు చెప్పినా వింటాడేమో గానీ, ‘అన్నీ నాకే తెలుసు’ననుకుంటూనే తప్పులు చేసేవాడు ఎవరు చెప్పినా వినడానికి సుముఖత చూపడు.

-కె.వాణీచలపతిరావు