సబ్ ఫీచర్

పేరెంట్స్ ప్రోత్సాహం కెరీర్‌కు సోపానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు పెరిగి యుక్తవయస్సు వచ్చినా, వారి ఆలోచనల్లోనూ, ఆభిరుచుల్లోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నా చాలామంది పేరెంట్స్ ఇంకా చిన్న పిల్లలగానే చూస్తుంటారు. ప్రతి సందర్భంలోనూ ‘‘నీకేమీ తెలీదు నువ్వు చిన్నపిల్లవు, నోర్మూసుకో’’ లాంటి పద ప్రయోగాలను విసురుగా ప్రయోగిస్తుంటారు. కానీ ఈ రకం ప్రవర్తన, అభిప్రాయాలు తప్పు అంటున్నారు మానసిక విశే్లషకులు.
ఎందుకంటే మరీ పసిపిల్లలు వేరు, పది పనె్నండేళ్ల వయసువారు వేరు.. ఇక ఇరవై ఏళ్ళు వచ్చిన పిల్లల భావాలు, ఆవేశాలు, ఆలోచనలు చాలా చాలా డిఫరెంట్‌గా మారిపోతాయి. ఒకోసారి వారి చేష్టలకు కళ్ళెం వేయడం కూడా కష్టంగానే వుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 20 ఏళ్ళు దాటిన పిల్లల్ని ఇంకా చిన్నపిల్లలుగా చూడవద్దు. వాళ్ళు ఎదుగుతున్నారు. కాలేజీలు దాటి యూనివర్సిటీలు, ఉద్యోగాలకు ఎగబాకి బోలెడు బాధ్యతల్ని సమర్థంగా మోస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి.
అలా గుర్తించి వారి అభిప్రాయాలకు, ఆలోచనలకు విలువిచ్చిననాడు వారిలో ఆత్మవిశ్వాసం పెరగటమే కాకుండా మరింత సమర్థవంతంగా తమ బాధ్యతలను నిర్వహించే వీలుంటుంది. తమ పొరపాట్లను అలవాట్లను కూడా ఎనాల్సిస్ చేసుకుని సవరించుకునే అవకాశమూ వుంటుంది.
అలా కాకుండా ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు తమ పెద్దరికాన్ని, ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో చీటికి మాటికీ కసురురుకోవడాలు, విసురుకోవడాలు చేస్తుంటే కొంతమంది పిల్లల్లో ఆత్మన్యూనతాభావం పెరుగుతుంది. నలుగురిలోకి రావడానికే బిడియపడిపోతుంటారు. తమలో తామే ముడుచుకుపోతుంటారు. మరికొందరు పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేక భావాలను పెంచుకుంటూ ద్వేషభావాలను పెంచుకుంటారు. మరికొంతమంది పిల్లలు తిరగబడి గొడవలు పడి పెద్దవాళ్ళ మనసును గాయపరచేందుకు కూడా వెనుకాడరు.
వారికి కావలసింది స్వేచ్ఛ. తమ ఆలోచనలను, భావాలను గౌరవించేవారు, అభినందించేవారు కావాలి. అయితే స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనము, దురలవాట్లను అలవాటుచేసుకునే వాటికి రాచమార్గం కాకూడదు. అసలు ముందు ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణాజ్ఞానం కావాలి. ఈ విషయంలో మాత్రం పేరెంట్స్, అధ్యాపకులు తప్పకుండా ఒకటికి పదిసార్లు చెప్పాల్సిందే. నిజాలు చేదుగా వున్నా చెడు విషయాల గురించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి యువతతో చర్చించాలి.
యుక్తవయసు వచ్చిన పిల్లలు పిల్లలు కాదు స్నేహితులతో సమానం. అలా వారిని ట్రీట్ చేస్తూనే చాలా విషయాలను చర్చిస్తూ వాటిలో ఉన్న మంచి చెడులను విశే్లషించి చెప్పాలి. అపుడే స్వేచ్ఛ, సరైన విధానం అలవడుతుంది. టెక్నాలజీ అంతకంతకూ విస్తరిస్తున్న ఈ రోజుల్లో పెద్దవాళ్ళు తమ అభిప్రాయాలను, విధానాలను మార్చుకోవాల్సిన అవసరం వుంది. కాలం తెచ్చే మార్పులు ముందుగా ప్రభావితం చేసేది కుర్రకారునే. అయితే మంచితోపాటు చెడు కూడా వేయి కోరల విషనాగుల్లా బుసలుకొడుతున్న పరిస్థితులూ ఉన్నాయి. కొన్ని విషయాలు పేరెంట్స్ గుర్తుంచుకోవాల్సి వుంటుంది. యువతీ యువకులు తీసుకునే మంచి నిర్ణయాలను, విజయాలను ప్రశంసించండి. అపుడే వాళ్ళు ధైర్యంగా మరిన్ని విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా కొత్తగా రెక్కలు వచ్చిన విహంగాల్లాంటి వారి భావాలకు, ఆలోచనలకు అడ్డు తగలకండి. అలా అని మితిమీరిన స్వేచ్ఛను, విపరీత పోకడలను అనుమతించకండి.
యువతలోని బలాలను, బలహీనతల్ని గమనించండి. దారి తప్పుతున్న వేళ కఠినంగానైనా దారిలోకి తీసుకోండి. అలాగని హింసించి మాత్రం కాదు. తప్పుదారిలో వెళితే జరిగే పరిణామాలను వివరించి అర్థమయ్యేట్లు చెయ్యాలి.
తప్పకుండా కుటుంబ విషయాల్లో వారిని భాగస్వాముల్ని చెయ్యండి. చిన్న చిన్న బాధ్యతలు అప్పగించి వారినే పూర్తిచేయమనండి. అవి వారికి పాఠాల్లా ఉపయోగపడతాయి.
వారి అభిరుచుల్ని, అలవాట్లను గౌరవించండి. వాటిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటును అందించండి. చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ వాళ్ళు బిజీగా వున్నా ప్రతిరోజూ వారితో నాలుగు మాటలు మాట్లాడే వీలు కల్పించండి.
ఊహలు.. ఆలోచన్లు పెరిగేకొద్దీ యువతలో ఉత్సాహం పెల్లుబుకుతుంటుంది. ఆ ఉత్సాహాన్ని సరైన కెరీర్‌లో సెటిలయ్యేలా తోడ్పాటునందించడం తల్లిదండ్రుల తక్షణ కర్తవ్యంగా భావించాలి.

-హిమజారమణ