ఈ వారం కథ

ఛాలెంజ్! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం ఏడుగంటలవుతూంది.
ఇంటిముందు లాన్‌లో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్న సుధాకర్- వినిపించిన అడుగుల చప్పుడకి తలెత్తి, తన మేడ పక్కన ఓ మూడు గదుల పోర్షన్‌లో నివాసం ఉంటున్న వ్యక్తి శంకరాన్ని గుర్తుబట్టి.. ‘ఏవిట’న్నట్టు ప్రశ్నార్థంగా మొహం పెట్టాడు. ‘‘రండి..కూర్చోండి’’ అని కూడా అనలేదు.

మూతి చుట్టూ మీసంలా అంటుకున్న చాక్లెట్‌ని నాలికతో నాకుతూ ఆ పక్కనే లాన్‌లో బాల్‌తో ఆడుకుంటున్న సుధాకర్ కొడుకు డైవర్ట్ అవటంతో.. ఆ బాల్ వచ్చి శంకరం మొహానికి తగిలింది. తనని ఢీకొట్టిన ఆ బంతిని జాగత్తగా టీపాయిమీద పెట్టి, తన మాటలకి సుధాకర్ నొచ్చుకోకూడదని మృదువుగా, నెమ్మదిగా, లోగొంతుకలో సంభాషణ ప్రారంభించాడు శంకరం.
‘‘మీ ఇంట్లో.. పార్టీలు జరుగుతున్నప్పుడు..’’
‘‘ఊఁ.. జరుగుతున్నప్పుడు..?’’ .. ‘పొద్దునే్న ఏవిటీ సొద’’ అన్నట్టు చూశాడు సుధాకర్.
‘‘ఆ పార్టీల్లో.. వాడిన ఎంగిలి ప్లేట్లూ, గ్లాసులూ మా ఇంట్లో పడుతున్నాయి. మాకు చాలా అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉంటోంది.. చేతులు కడిగిన నీళ్ళు కూడా మా తలల మీద పడి మళ్లీ మళ్లీ స్నానాలు చెయ్యాల్సి వస్తోంది. ఇకమీదట అలా పడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండమని కొంచెం మీ వాళ్లకి చెప్పండి..’’ మొహమాటపడుతూ.. నసుగుతూ అన్నాడు శంకరం.
రాత్రి నిషా తాలూకు హంగోవర్ తగ్గుతూండడంతో ఈ లోకంలోకి వచ్చాడు సుధాకర్..
‘‘ఏవిటీ.. పార్టీలో వాడిన ఎంగిలి ప్లేట్లూ, గ్లాసులూ మీ దొడ్లోకి వచ్చి పడడంవల్ల మీకు ఇబ్బంది కలుగుతోందా? ప్చ్ ప్చ్.. కావొచ్చు. కానీ ఏం చెయ్యలేం. మన ఆహ్వానం మీద పార్టీలకి వచ్చిన గెస్ట్‌లని ‘‘అలా వుండు.. ఇలా చెయ్యి’’ అని శాసించటం మర్యాద కాదు కదా?.. అక్కడికి చెత్త బుట్టలు పెట్టాం. తిన్నాక చేతులు కడుక్కోవాలి కదా? ఏదో గాలివాలుకి ఓసారి ఆ నీళ్ళు మీ మీద పడి వుంటాయి.. అంతే. అయినా పనిగట్టుకు వచ్చి ఇలా నాకు చెప్పే బదులు.. ఇక్కడ పార్టీ జరుగుతున్న కాసేపూ మీవాళ్ళు ఆ వైపు రాకుండా ఇంట్లోనే ఉండిపోతే.. ఎలాంటి సమస్యా వుండదు కదా..? పనిమనిషికి ఓ పది రూపాయలు పడేస్తే చెత్తంతా క్లీన్ చేసేస్తుంది’’ ఉపాయం చెప్పాడు సుధాకర్.
తిరిగి ఏదో చెప్పబోతున్న శంకరాన్ని ఆగమంటూ సైగ చేసి ‘‘మీకు అసౌకర్యంగా వుందని పార్టీలూ సరదాలూ అన్నీ మానుకుని ముక్కు మూసుకుని మూల కూర్చుని తపస్సు చెయ్యలా?..’’ అసహనాన్ని వ్యక్తంచేస్తూ గొంతు పెంచాడు.
‘‘అబ్బెబ్బే నా ఉద్దేశ్యం అది కాదండి. పిల్లలు తెలీక అలా విసిరిపడేస్తున్నట్టున్నారు. కాస్త వాళ్ళని కంట్రోల్ చేస్తే..’’ ఆగాడు శంకరం.
‘‘పార్టీలో పిల్లలనైనా, పెద్దల్నైనా కంట్రోల్ చెయ్యటం సభ్యతగా వుంటుందా? నలుగురు పిల్లలు కలిస్తే ఆటలతో, ఆకతాయి పనులతో, అల్లరితో ఎలా హోరెత్తిస్తారో.. డ్రింక్ చేసిన పెద్దలూ.. వాళ్ళ టెన్షన్‌లని మర్చిపోవటానికి పిల్లలని మించి అల్లరి చేస్తారు. మీ ఇంట్లో ఫంక్షన్ అయినా గెస్టులు ఇలాగే ప్రవర్తిస్తారు. కాస్త సర్దుకుపోతే అసలు పేచీయే వుండదు కదా..’’. ఈ చిన్న విషయానికి గొడవకొచ్చావా అన్న భావం గొంతులో పలికించాడు సుధాకర్. అవాక్కయ్యాడు శంకరం.
‘‘మీరు నా మీద కంప్లైంట్ చెయ్యటానికి మా ఇంటికి వచ్చారు కాబట్టి.. నేనూ ఓ మాట చెప్పాలి. మీ ఇంట్లోంచి పొద్దునే్న టీవీలో ఏవో బోధనలూ, సుప్రభాతాలూ ఫుల్ వాల్యూంలో నా బెడ్‌రూమ్‌లోకి వినిపిస్తూ నా నిద్రని డిస్టర్బ్ చేస్తున్నాయి. నేనెప్పుడైనా కంప్లైంట్ చేశానా?’’ తనెంత మంచివాడో గొంతు పెంచి మరీ చెప్పాడు సుధాకర్.
సుధాకర్ చేసిన ఎదురు కంప్లయింట్ పచ్చి అబద్ధమని తెలిసినా.. విభేదించకుండా వౌనంగా వెనుతిరిగి ఇంటికొచ్చాడు శంకరం.
‘‘ఇంకోసారి అలా పడేస్తే ఊరుకోమని గట్టిగా చెప్పొచ్చారా? వాళ్ళేమన్నారూ?’’ ఆత్రంగా అడిగిన భార్య కామాక్షికి సుధాకర్ అన్నవన్నీ పొల్లుపోకుండా చెప్పాడు శంకరం.
‘‘ఓహో.. ఆయనగారేదో దబాయించేసరికి నోటిమీద వేలేసుకుని ‘యస్సర్’ అంటూ వెనక్కి వచ్చేస్తారా? ... అవన్నీ శుభ్రం చెయ్యటానికి నేను పడుతున్న కష్టం మీకంటికి కనిపించట్లేదా? అన్నిటికీ మనమే సర్దుకోవాలా?’’ పూనకం వచ్చినదానిలా అరవసాగింది కామాక్షి.
ఆమె ఉగ్రరూపానికి కంగారుపడ్డ శంకరం, ‘‘కాస్త నెమ్మదిగా మాట్లాడు కామాక్షి. ఎవరైనా వింటే బాగుండదు. ఇరుగూ పొరుగూ వాళ్ళం చిన్న చిన్న విషయాలకి పోట్లాడుకుంటే మనశ్శాంతి వుండదు. అయినా నీకు తెలుసుగా, నేనెవరితోనూ గొడవపడనని.. ఎవ్వరినీ నొప్పించనని’’ అన్నాడు పీలగా ధ్వనించే స్వరంతో.. ఆమెని అనునయించడానికి విఫల ప్రయత్నం చేస్తూ.
‘‘అయితే.. నాన్నా.. ఈసారి వాళ్ళింట్లో పార్టీ జరుగుతున్నపుడు వాళ్ళు విసిరిన వాటిని నేను నా క్రికెట్ బాట్‌తో తిరిగి వాళ్ళ మేడ మీదికి పడేలా సరదాగా సిక్సర్లు కొట్టనా? అప్పుడు అంకుల్ మొహం చూద్దామా?..’’ అల్లరిగా నవ్వుతూ అడిగాడు శంకరం చిన్నకొడుకు.
‘‘నోర్ముయ్యరా.. వాళ్ళేదో చేసారని మనమూ చేస్తామా?’’ కొడుకుని కసిరాడు శంకరం.
‘‘రాసుకో నాయనా.. సూక్తిముక్తావళి. ఎదుటివాడు మన మీద వుమ్మినా కోపం తెచ్చుకోరాదు. సర్దుకుపోవాలి. వాళ్ళకి గట్టిగా చెప్పే గట్స్ ఈ దొరగారికి లేవు. అసలు నేను బతికివుండగా.. శ్రీశ్రీశ్రీ మీ నాన్నగారు.. ఈ భూమీద ఎవరినైనా, ఆఖరికి పిల్లినైనా ఒక్క క్షణకాలం భయపెట్టడం ఈ కళ్ళతో చూస్తానా? అంతా నా ఖర్మ’’ చేతులు తిప్పుతూ విసురుగా లోపలికి వెళ్లిపోయంది కామాక్షి.
ఏ విషయాన్నయినా నిక్కచ్చిగా ఎదుటివారికి చెప్పలేని తన స్వభావాన్ని అలుసుగా తీసుకుని బయట ఎంతోమంది హేళనగా, తేలికగా మాట్లాడుతున్నా పట్టించుకోని శంకరానికి- భార్య కూడా లోకులతో సమానంగా మాట్లాడటం బాధ కలిగిస్తున్నా.. అతని సాధు స్వభావం దాన్నీ సహించింది.
శంకరం మెతకతనానికి బహుమతిగా.. ఎంగిలి వస్తువులే కాకుండా.. ఖాళీ పేస్టు, షేవింగ్ క్రీం ట్యూబులూ కూడా పడుతున్నాయి శంకరం దొడ్లోకి.
రోజులు గడుస్తున్నాయి.. ఓ రోజున..
స్థలం నగరంలోని ఓ చౌరస్తా.. సమయం సాయంత్రం ఆరు గంటలు... పక్షులు గూళ్ళకి చేరే మునిమాపు వేళ.. సన్నగా వాన కూడా పడుతోంది.
ట్రాఫిక్ నిబంధనలనకి మెటిక్యులస్‌గా పాటించే శంకరం ఎల్లో లైటు చూసి, తన స్కూటర్‌కి బ్రేక్ వేసి ఆగాడు. పక్కనే వచ్చి ఆగింది రాయంచలాంటి ఓ కారు.
ఇంతలో.. అదే సమయంలో.. కారు వెనకాలే వేగంగా వస్తున్న ఓ వాటర్ టాంకర్.. ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్‌ని చూసి, ఫోర్స్‌బుల్‌గా బ్రేక్ నొక్కటంతో కంట్రోల్ తప్పి.. శంకరం స్కూటర్ పక్కన భాగాన్ని ఢీకొట్టింది. శంకరమయితే నిలదొక్కుకున్నాడు గానీ.. బండి డివైడర్‌మీదకి పడిపోయింది. అరకిలో స్వీట్ బాక్స్, కూతురి బర్త్‌డే కోసం కొన్న కొత్త గౌను మట్టిపాలయ్యాయి. తన కష్టార్జితం ఇలా కావటం చూసి శంకరం మనస్సు విలవిలలాడింది. కోపంగా వెనక్కి తిరిగి టాంకర్ వైపు చూశాడు. ఇంజన్ ఆపు చేసి, కాబిన్లో తాపీగా సిగరెట్ కాల్చుకుంటున్న డ్రైవర్‌ని చూస్తూనే ఒళ్ళు మండి, అటు నడిచి, కాబిన్ తలుపు తట్టాడు..
‘‘ఏంట’’న్నట్టు.. తల ఎగరేస్తూ నిర్లక్ష్యంగా చూశాడు టాంకర్ డ్రైవర్..
‘‘చూసుకుని నడపవా బండిని?’’ అంటూ, పడిపోయిన తన వెహికల్‌వైపు, వస్తువుల వైపు చూపించాడు శంకరం. వాన పడుతూండడంతో త్వరగా ఇళ్ళకి చేరుకోవాలనే ఆత్రుతలో వున్న జనం ఈ విషయం పట్టించుకోవడంలేదు.
మింగేసే పెద్దపులిలా చూసాడు డ్రైవరు. టాంకర్ ఇంజన్‌ని ఆపుజేసి, ‘‘ఏమంటన్నవ్? ట్రాఫిక్‌లో బళ్ళు అపుడప్పుడు గుద్దుకుంటయని తెల్వదా? ఏదో జర్ర తగిలితే గొడవకొస్తున్నవ్?.. నీ యవ్వ.. ఇప్పుడు ఆటి ఖరీదు నేను నీకివ్వాల్నా?.. పది రూపాయలు పడేసి మల్ల గొనుక్కోక.. గింత చిన్నదానికి పెద్ద లొల్లి పెడతవా..’’ డ్రైవర్ నోట్లోంచి వస్తున్న సారా వాసనకీ, వాగుడికి తల గిర్రున తిరిగిపోతుంటే.. మొహం వేలాడేసుకుని, తన స్కూటర్ దగ్గరికి వచ్చాడు శంకరం వౌనంగా.
‘‘నిజంగా ఎంత నిర్భాగ్యపు బతుకు తనది!?.. తన ఇంటి కాంపౌండ్‌ని వాడింటి డస్ట్‌బిన్‌లా వాడుకునే సుధాకర్‌గాడికి, తన సంపాదనమీద ఇల్లు నడిపే తన ఇల్లాలికి, ఆఖరికి నడి రోడ్డుమీద తనకి బండి గుద్దించిన ఓ తాగుబోతు డ్రైవర్‌గాడికి కూడా అలసయిపొయ్యడు తను. నిజంగానే తనది చేతకానితనమా?! తను అసమర్థుడా?!..’’ ఆలోచనలతో వేడెక్కిన తలని విదిలిస్తున్న శంకరం... కిసుక్కున నవ్విన శబ్దం చెవిలో పడటంతో, అసంకల్పితంగా పక్కనే వున్న కారులోకి తొంగిచూసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని వున్న సుధాకర్‌ని గుర్తుబట్టి నిర్ఘాంతపోయి, సిగ్గుతో ముడుచుకుపోయాడు.
ఎప్పటిలాగే సుధాకర్, ‘నీ లెవెల్ ఇంతే.. ఎవ్వరూ నిన్ను ఖాతరు చెయ్యరు’ అన్న భావం కళ్ళతో వ్యక్తంచేస్తూ, ఎగతాళిగా నవ్వుతూంటే కోపం పట్టలేక వుడికిపోయాడు. సహనం కంట్రోల్ తప్పింది. టాంకర్ డ్రైవర్‌కి సుధాకర్ కారుని తర్జనితో చూపిస్తూ.. లోనుండి పొంగివచ్చిన ఆవేశంతో.. ఉక్రోషంతో.. ‘‘ఒరేయ్! నాలాంటి మెతకవాళ్ళమీద కాదురా నీ ప్రతాపం... నీకు దమ్ముంటే.. నిజంగా నువ్వు మగాడివైతే.. అదిగో ఆ కారుకి.. ఒక్కసారి నీ టాంకర్‌తో ఢీకొట్టిచూడు.. దిమ్మతిరిగిపోతుంది.. ఆ తర్వాత నువ్విలా పొగరుగా ఒక్క మాటన్నా మాట్లాడగలవేమో చూద్దాం.. ఛాలెంజ్ రా ఛాలెంజ్’’ అంటూ.. గొంతులోని నరాలు చిట్లేలా అరిచాడు.
తాగివున్న టాంకర్ డ్రైవర్ ముఖం ఎర్రబడింది.. కణతలమీద నరాలు ఉబ్బాయి. పళ్ళు గిట్టకరచి లోలోనే తిట్టుకుంటూ ఇంజన్ స్టార్ట్ చేసి, చెవులు చిల్లులు పడే ధ్వనితో బా..గా రైజ్ జేసేశాడు.
శంకరం ఛాలెంజ్ విన్న సుధాకర్ ఒక్కసారిగా అదిరిపడి.. రేర్ మిర్రర్‌లోంచి తన వెనకే వున్న టాంకర్ వైపు చూశాడు. ఫుల్‌గా తాగిన మత్తులో వున్న టాంకర్ డ్రైవర్, శంకరం ఛాలెంజ్‌ని సీరియస్‌గా తీసుకుని, తన కారుని నిజంగానే ఢీకొట్టేస్తాడేమోనన్న బ్రాంతికి లోనయ్యాడు. ఆ భ్రాంతి అతగాడి మెదడుని బ్లాంక్ చేసెయ్యడంతో అసంకల్పితంగా కారుని ముందుకిరించబోయి.. ట్రాఫిక్ సిగ్నల్ ‘రెడ్’లోనే ఉండడంతో.. స్పీడుగా ‘యు’ టర్న్ తీసుకుంటూ.. ‘్ఠప్’ అన్న శబ్దానికి ఉలిక్కిపడి.. బ్రేక్ వేసి ఆపాడు.. ట్రాఫిక్ లైటు రెడ్ కలర్‌లోకి మారేలోపల ‘యమ’ స్పీడులో సర్రున దాటెయ్యకపోతే స్వర్గానికి వెళ్ళే ఎస్కలేటర్ తప్పిపోతుందేమో అన్న భయంతో.. మెలికలు తిరుగుతూ వేగంగా వస్తున్న ఓ మోటార్ సైకిల్ విసురుగా ‘యు టర్న్’ చేస్తున్న సుధాకర్ కారుని ఢీకొట్టి ఆగకుండా దూసుకుపోయింది. కారు ఎడం వైపు హెడ్‌లైటు పగిలిపోంది. సొట్టపడ్డ డోర్ బిగుసుకుపోయింది.
కారు అడ్డు తొలగడంతో.. గ్రీన్ లైట్ పడగానే... టాంకర్ డ్రైవర్ సుధాకర్ కేసి ఓసారి యధాలాపంగా చూసి వేగంగా సిగ్నల్ దాటి వెళ్లిపోయాడు. తనని శంకరం ఫూల్ చేశాడని గ్రహించిన సుధాకర్.. ఉడికిపోతూ, పళ్ళు నూరుకుంటూ, కారులో మొహం చాటేసుకున్నాడు.
తను టాంకర్ వాడితో చేసిన చిన్న ఛాలెంజ్‌తో ఇన్నాళ్ళూ తనని ఇబ్బందిపెడుతూన్న సుధాకర్‌ని కొద్దిసేపయినా భయపెట్టగలిగానని గ్రహించిన శంకరం... వానజల్లు తనని నిలువెల్లా తడిపేస్తున్నా పట్టించుకోకుండా.. నడి రోడ్డుమీద వున్నానన్న విషయం కూడా లెక్కచెయ్యకుండా.. లోనుండి.. ‘తనూ సమర్థుడే’ అన్న భావం తన్నుకొస్తుండగా.. ఉబికిన ఛాతీతో.. గుండెల్లోని ఆవేదన చల్లారేలా.. మనసారా హాయిగా.. పగలబడి నవ్వుతున్నాడు. *

రచయిత్రి సెల్ నెం: 9849745233

-శ్రీమతి రాఘవ.టి.