మెయిన్ ఫీచర్

చట్టసవరణ సరే.. నేరప్రవృత్తి నివారణ ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

18 ఏళ్లలోపు వారంతా బాలలేనని, వారి పట్ల ఎలాంటి వివక్ష ఉండరాదని
ఐక్యరాజ్య సమితి గతంలోనే స్పష్టం చేసింది. ఈ లక్ష్యంతో బాలల హక్కుల కోసం గతంలో నిర్వహించిన సదస్సులో మన దేశం కూడా గొంతు కలిపింది.
ఈ దిశగా ఆలోచిస్తే-
‘బాలల న్యాయచట్టాని’కి ఇపుడు కేంద్రం చేసిన సవరణలు ఐరాస లక్ష్యాలకు విరుద్ధమని, రాజ్యాంగంలో నిర్దేశించిన సమానత్వ హక్కు (ఆర్టికల్-14)కు, జీవితానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ (ఆర్టికల్-21)కు భంగం కలిగిస్తాయని విమర్శకుల తాజా వాదన.

‘పదిహేనేళ్ల పిల్లలు తీవ్ర నేరాలకు పాల్పడితే- బాలల న్యా య చట్టాన్ని (జువనైల్ జస్టిస్ యాక్ట్) మళ్లీ సవరిస్తారా..? బాలనేరగాళ్ల వయోపరిమితిని మరోసారి తగ్గిస్తారా..?’- అంటూ రాజ్యసభలో ఓ విపక్ష ఎంపీ ప్రశ్నించడం ఎంత సమంజసంగా ఉందో, బాలల న్యాయచట్టం సవరణ బిల్లును ‘పెద్దల సభ’లో ఆగమేఘాలపై మూజువాణీ ఓటుతో ఆమోదించడం అంతే విమర్శల పాలవుతోంది.
***
‘నిర్భయ’ ఉదంతంలో మూడేళ్ల జైలుశిక్షను అనుభవించిన బాల నేరస్థుడు విడుదల కావడంపై మహిళా సంఘాల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తిన నేపథ్యంలో రాజ్యసభ చట్టసవరణకు ఆమోద ముద్ర వేసింది. భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని ఇలా చట్టసవరణ చేయడం ప్రభుత్వ తొందరపాటు చర్య అని విపక్షాల నుంచి, బాలల హక్కుల్ని హరిస్తున్నారంటూ విమర్శకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ- బాలనేరస్థుల సంస్కరణ, పునరావాసానికి సంబంధించి ప్రభుత్వం బిల్లులో ఎలాంటి ప్రతిపాదనలు చేయకపోవడం గమనార్హం. అత్యాచారాలు, హత్యలు వంటి అత్యంత క్రూరమైన నేరాల్లో నిందితులు 16-18 ఏళ్ల మధ్య వారైనా- వారిని పెద్దలుగానే పరిగణించి సంబంధిత చట్టాల ప్రకారమే ఇకపై కేసులు విచారిస్తారు. ఈ వయసువారు స్వల్ప తీవ్రత కలిగిన నేరాలకు పాల్పడితే వారిని 21 ఏళ్లు నిండాక పెద్దలుగా పరిగణిస్తారు. నిజానికి 1986 నాటి బాలల న్యాయచట్టం (జువనైల్ జస్టిస్ యాక్ట్) ‘కిశోర బాలురు’ అంటే 16 ఏళ్లలోపు, ‘కిశోర బాలికలు’ అంటే 18 ఏళ్లలోపు వారని నిర్వచించింది. అయితే, 2000 సంవత్సరంలో చేసిన చట్టసవరణలతో కిశోర బాలుర వయసు 18 ఏళ్లకు పెరిగింది. యావత్ దేశాన్ని అట్టుడికించిన ‘నిర్భయ’ ఘటనలో, ఆ తర్వాత అనేక ఉదంతాల్లో 16-18 ఏళ్లలోపు బాలురు అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడుతున్నట్లు భారీ సంఖ్యలో కేసులు నమోదుకావడంతో బాలల న్యాయచట్టానికి మళ్లీ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ‘నిర్భయ’పై జరిగిన సామూహిక అత్యాచారంలో అత్యంత పాశవికంగా ప్రవర్తించిన ఓ నేరగాడు అప్పటికి 17 ఏళ్ల ఏడు నెలల వయసున్న మైనర్ బాలుడు. ఈ కారణంగానే మూడేళ్ల జైలుశిక్ష పూర్తయిన నేపథ్యంలో అతడిని బాహ్య ప్రపంచంలోకి విడుదల చేయక తప్పలేదు. శిక్ష ముగిశాక ఆ బాలనేరస్థుడు విడుదల కావడం సహజంగానే నిర్భయ తల్లిదండ్రుల్లోను, మహిళా ఉద్యమకారుల్లోను తీవ్ర ఆవేశం రగిల్చింది. ‘చట్టాలను మార్చడానికి ఇంకా ఎంతమంది నిర్భయల అవసరం ఉంది?’- అంటూ నిర్భయ తల్లిదండ్రులు జ్యోతిసింగ్, బద్రీసింగ్ పాండే మరోసారి దిల్లీలో ఆందోళనకు దిగడమే కాదు, మైనర్ నిందితుడిని విడుదల చేయరాదంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చట్టం తమ చేతులు కట్టేయడంతో మైనర్ నిందితుడి విడుదలను తాము అడ్డుకోలేమని సుప్రీం కోర్టు నిస్సహాయత వ్యక్తం చేసింది. ‘ప్రస్తుత చట్ట ప్రకారం మైనర్ నిందితులను మూడేళ్లకు మించి నిర్బంధంలోకి తీసుకోలేం.. శిక్షాకాలాన్ని ఇంకా పెంచాలంటే చట్టసవరణ జరగాల్సిందే..’ అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘బాలలు, పెద్దల మధ్య విభజన రేఖగా 18 ఏళ్ల వయసును రాజ్యాంగబద్ధంగా చట్టం నిర్దేశించినపుడు ఈ విషయంపై కోర్టులో విచారణకు తావుండదు..’ అని గతంలోనే సుప్రీం కోర్టులోని త్రిసభ్య ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. ప్రస్తుత చట్ట ప్రకారం ఎలాంటి అవరోధాలు లేకపోవడంతో నిర్భయ కేసులో మైనర్ నిందితుడిని విడుదల చేయక తప్పలేదు. ఇలా విడుదల చేయడం పట్ల మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో- ఇన్నాళ్లూ అటకెక్కిన ‘సరికొత్త బాలల న్యాయచట్టా’న్ని రాజ్యసభలో హడావుడిగా చర్చించి సవరణలు చేశారు. కేవలం చట్టసవరణ చేసి చేతులు దులుపుకున్నంత మాత్రాన దేశంలో పరిస్థితులు సమూలంగా మారిపోతాయని ఎవరూ అనుకోలేరు. బాల నేరస్థుల్లో పరివర్తన తేవడం, వారిని సంస్కరించడమే తమ లక్ష్యమని ఇపుడు చట్ట సవరణ తెచ్చినా- అందుకు అనుగుణంగా ఎలాంటి చర్యలూ లేవు. బాలలు ఏ కారణంగా నేరాలు చేస్తున్నారు? వారిని అందుకు పురికొల్పుతున్న సామాజిక పరిస్థితులు ఏమిటి? పిల్లల పెంపకం, అందుబాటులో బూతు వెబ్‌సైట్లు, సినిమాల ప్రభావం, పేదరికం, అసాంఘిక శక్తుల ప్రభావం.. వంటి అంశాలపై దృష్టి సారించకపోతే ఎన్ని చట్టసవరణలు చేసినా పరిస్థితిలో మార్పు అసంభవం. బాల నేరస్థుల అంశాన్ని భావోద్వేగాలతో కాకుండా, పిల్లల మనసులను విషపూరితం చేస్తున్న పరిస్థితులను అధ్యయనం చేసి, సమస్యలను గుర్తించడమే కాదు.. వాటికి పరిష్కార మార్గాలను శాస్ర్తియ పద్ధతిలో అనే్వషించాలి. ఇందుకు చట్టంలో తగిన మార్గదర్శకాలను, విధి విధానాలను నిర్దేశించాలి. వయో పరిమితిని పెంచితే కొందరికి శిక్షలు పడతాయోమో కానీ, అసలు సమస్యకు అసలైన పరిష్కారం దుర్లభమే.
50 శాతం నేరాలు మహిళలపైనే..
బాల నేరస్థులు పాల్పడిన నేరాల్లో 50 శాతానికి పైగా మహిళలపై అకృత్యాలేనని, 2012-14 మధ్యకాలంలో అలాంటి అకృత్యాలు 92 శాతం మేరకు పెరిగాయని జాతీయ నేరగణాంకాల నమోదు సంస్థ (ఎన్‌సిఆర్‌బి) నివేదికలు ఘోషిస్తున్నాయి. అత్యాచారాలు, అత్యాచార యత్నా లు, హత్యలు, హత్యాయత్నాలు, లైంగిక వేధింపులు, మహిళల పట్ల అమర్యాద ప్రవర్తన, యాసిడ్ దాడులు, కిడ్నాప్‌లు, అక్రమ నిర్బంధం వంటి నేరాలకు సంబంధించి 2012-14 మధ్యకాలంలో బాల నేరస్థులపై 18,012 కేసులు నమోదయ్యాయి. అత్యాచారాలపై 2012లో 1,175 కేసులు, 2013లో 1,884 కేసులు, 2014లో1,989 కేసులు నమోదయ్యాయి. మహిళల కిడ్నాప్‌లపై 2012లో 789, 2013లో 1,121, 2014లో 1,455 కేసులు, హత్యలకు సంబంధించి 2012లో 990, 2013లో 1,007, 2014లో 2,838 కేసులు, మహిళల గౌరవాన్ని భంగపరచడంపై 2012లో 183, 2013లో 312, 2014లో 113 కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన అత్యాచారం కేసుల్లో 28 శాతం, కిడ్నాప్ కేసుల్లో 18.7 శాతం, మహిళల్ని అగౌరవ పరచడంలో 20 శాతం, హత్యలకు సంబంధించి 15.8 శాతం కేసుల్లో బాల నేరస్థులు నిందితులు కావడం గమనార్హం.
నేరాలెందుకు చేస్తున్నారు..?
ఎలాంటి నేరాలైనా దోషులకు వయసును బట్టి శిక్షలు విధించాలనడం సరికాదని, నేరతీవ్రత ఆధారంగా శిక్షలుండాలని, చట్టాలను సవరించడం కన్నా ప్రస్తుత వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని పలువురు మేధావులు, బాలల హక్కుల కార్యకర్తలు సూచిస్తున్నారు. తీవ్ర నేరాలకు కఠిన శిక్షలు పడడం న్యాయమే అయినప్పటికీ- మానసిక పరిపక్వత లేని బాల నేరస్థుల విషయంలో మాత్రం మానవీయ కోణంలో వ్యవహరించాలన్నదే ‘బాలల న్యాయ చట్టం’ ఉద్దేశం. 16-18 ఏళ్లలోపు వారు క్రూరమైన నేరాలకు బరితెగిస్తున్న తీరు భయాందోళనలకు గురి చేసిన నేపథ్యంలో ఇపుడు చట్ట సవరణ తంతును పూర్తిచేశారు. భారత శిక్షాస్మృతి (ఐపిసి) ప్రకారం ఏడేళ్లకు మించి జైలుశిక్షలు పడే నేరాలకు సంబంధించి 16-18 ఏళ్లలోపు వారిని పెద్దలుగానే భావిస్తూ చేసిన తాజా చట్ట సవరణ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇపుడే ఏమీ చెప్పలేం. చట్టంలో మార్గదర్శకాలు, వాటి అమలు తీరుపైనే అంతా ఆధారపడి ఉంటుంది. నేరాల వైపు బాలలు ఎందుకు ఆకర్షితులవుతున్నారు? వారిని అందుకు ప్రేరేపిస్తున్న పరిస్థితులను నియంత్రించడం ఎలా?- అన్న విషయాలపై చిత్తశుద్ధితో దృష్టి కేంద్రీకరించకుంటే ఎలాంటి చట్టసవరణలు చేసినా ఫలితం అంతంత మాత్రమే. పరిసరాలు, పెంపకం, పేదరికం, బూతు వెబ్‌సైట్లు, అశ్లీల సినిమాలు, విలువల పతనం, తల్లిదండ్రుల నిర్లక్ష్యం వంటి అంశాలపై అందరూ దృష్టి సారిస్తే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదు. ఈ దిశగా ప్రయత్నాలు చేయాలంటే ఇళ్లలో తల్లిదండ్రులు, బడుల్లో టీచర్లు, సమాజంలో స్వచ్ఛంద సంస్థలు.. ఇలా ఎవరికివారు బాధ్యత తీసుకుంటేనే బాలల్ని నేరాల బారి నుంచి తప్పించడం సాధ్యమవుతుంది.