Others

పిల్లల స్నేహాలపై ఓ కనే్నయండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పురుషులందు పుణ్యపురుషులు వేరు’ అన్నట్లు ‘జనులందు సుజనులు వేరు’గానే వుంటారు. చందన వృక్షమున్న పరిసరాల్లో ఆ వృక్ష సుగంధ పరిమళం మిగిలిన వృక్షాలకు సోకినట్లుగా సజ్జనులతో స్నేహం దుర్జనుల్ని మంచివారుగా మారుస్తుంది. మంచి బుద్ధిగాని, చెడ్డబుద్ధిగాని ఎవరికైనా అలవాడడానికి సహవాసం ప్రధాన కారణం. ‘మంచి వాళ్ళతోనే స్నేహం చెయ్యాలి’ అన్నది పెద్దల హితోక్తి. ‘సహవాసదోషో గుణోభవంతు’ అని ఎంత చెడ్డవాళ్ళైనా బుద్ధిమంతులు, సక్రమ వర్తన కలిగిన వాళ్ళతో తిరిగితే కొన్నాళ్ళకు తప్పక మంచివారుగా మారుతారు. మంచి ప్రవర్తన, మంచి అలవాట్లు, మంచిమాటతోపాటు మంచి వారి సహవాసం సద్భావనను పెంచి, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడి మనిషిని ఉన్నతుడ్ని చేస్తుంది. పిల్లలు ఎటువంటివారితో కలిసి తిరుగుతున్నారో తల్లిదండ్రులు, టీచర్లు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. పిల్లలు ఎంత బాగా చదివినా, ఎంతో క్రమశిక్షణతో ఉన్నట్లు తల్లిదండ్రుల ఎదుట ప్రవర్తిస్తున్నా బయట ప్రపంచంలో ఎవరితోనో స్నేహం చెయ్యక తప్పదు. పిల్లలు స్నేహానికి సరియైన వాళ్ళను ఎంపిక చేసుకోకపోతే వాళ్ళ జీవితాలు దారి తప్పే ప్రమాదం ఉంది. కలిసి తిరిగే స్నేహితులు సన్మార్గులైతే చదువు, సంస్కారం లాంటి విషయాలను చర్చిస్తారు. చెడు స్వభావం కలిగి, క్రమశిక్షణ లేనివారైతే సినిమాలు, షికార్లు, విలాసాలు, వ్యసనాల గురించి మాట్లాడుతూ, వాటిని అలవాటు చేసుకుని మిగతావాళ్ళను దారి తప్పిస్తారు.
పిల్లలను అన్ని విధాలుగా తీర్చిదిద్దాలన్న తపన తల్లిదండ్రుల్లో సహజంగానే ఉంటుంది. చదువుతోపాటు వాళ్ళలో క్రమశిక్షణ, మంచి అలవాట్లు పెంచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే భవిష్యత్‌లో పిల్లల కారణంగా ఇబ్బందులు తప్పవు. విపరీతమైన స్వేచ్ఛ ఇవ్వడంవల్ల పిల్లలు పక్కదారి పట్టే అవకాశం ఉంది. విజ్ఞతతో కొంతమేర స్వేచ్ఛ ఇస్తూనే మరొకవైపు వాళ్ల ప్రవర్తనను పరిశీలిస్తూ ఉండాలి. విద్యతోపాటు క్రమశిక్షణ, ఋజువర్తన పిల్లలకు అవసరమని తల్లిదండ్రులు గ్రహించాలి. ఎలాగోలా చదువులను పూర్తిచేసి డిగ్రీలు పొందుతున్నప్పటికీ కొంతమంది పిల్లలు పెడదారి పట్టి తల్లిదండ్రులకు పలురకాల సమస్యలు తెచ్చిపెడుతున్నారు. ఆకతాయిలతో కలిసి జులాయిలుగా తిరుగుతూ కొందరు పిల్లలు చేస్తున్న ఘోరమైన తప్పిదాలు తల్లిదండ్రుల్ని ఎంతో మానసిక వ్యధకు గురిచేస్తున్నాయి.
తమ సమక్షంలో వినయ విధేయతలు ప్రదర్శించే పిల్లలు బయట క్రమశిక్షణతో ఉన్నారని చాలామంది తల్లిదండ్రుల గుడ్డి నమ్మకం. ఏదో ఒక సమస్య సృష్టించేవరకూ వారి అసలు రంగు తెలుసుకోలేరు. ఒక్కసారి సమస్యను పీకలమీదకు తెచ్చేసరికి వేదనకు గురవుతారు. తల్లిదండ్రులకు గౌరవాన్ని తేలేకపోయినా ఫర్వాలేదు గానీ వాళ్ళకి తలవంపులు తెచ్చే పనులు పిల్లలు చేయకూడదు.
నేటి ఆధునిక సమాజంలో మానవ జీవితం విలాసాన్ని కోరుతుంది. ధనముంటే అన్ని సౌకర్యాలు చెంతకొస్తాయి. ఏ సౌఖ్యమైనా అనుభవించే వీలుంది. ఆనందం, వినోదం అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రులు అధిక మొత్తంలో పిల్లలకు డబ్బులు ఇవ్వడం వలన వాళ్ళు విలాసాలకు, వ్యసనాలకు బానిసలవుతున్నారు. పాఠాలపై దృష్టి పెట్టడానికి బదులు కొందరు విద్యార్థులు సినిమాలకు, షికార్లకు తిరుగుతుంటారు. చెడ్డ స్నేహితులతో కూడి ధూమపానం, మద్యపానం లాంటి వ్యవసనాలకు అలవాటుపడుతున్నారు. మహానగరాల్లో అయితే క్లబ్బులు, పబ్బుల వెంట తిరుగుతున్నారు. పిల్లలు దర్జాగా వుండాలని ఖరీదైన వాహనాలు,సెల్‌ఫోన్లు కొనివ్వడం, వాళ్ళడినంత డబ్బు ఇస్తూ ఉంటే తమ పిల్లల పతనానికి తల్లిదండ్రులే కారణమవుతారు. తల్లిదండ్రులు వివేకంతో ఆలోచించి పిల్లలకు ఉన్నత విలువల గురించి చెప్పాలి. విలాసాలు, వ్యసనాలు అలవాట్లు చేసుకుంటే జీవితం ఎలా పతనవౌతుందో వాళ్ళకు అర్థమయ్యే రీతిలో వివరించాలి. దుష్టసాంగత్యం వల్ల భ్రష్టత్వం ఎలా కలుగుతుందో, చెడ్డవాళ్ళతో స్నేహం ఎంత ప్రమాదకరమో విశదీకరించాలి. సజ్జన సాంగత్యం గురించి, మంచి స్నేహితులు ఎలా వుంటారో తెలియజెప్పి పిల్లలు ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపేటట్లు చేయడం తల్లిదండ్రుల గురుతర బాధ్యత.

-రాజ్‌కుమార్