ఈ వారం కథ

కొంగలొచ్చాయి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధరామయ్యకి వరసగా నాలుగోసారి కూడా వర్షాభావంచేత పంట దెబ్బతినేసింది. తాకట్టుపెట్టిన భార్య బంగారు నగలు బ్యాంక్ వారి పరమైపోయాయి. రాములమ్మ చెరువు ఆయకట్టు కింద చుట్టుప్రక్కల రైతుల ఐదువేల ఎకరాలవరకు సాగుబడి జరిగేది. అయిదెకరాల చెరువు మధ్యస్థంగా లోతు మూడు నలుమలు పదిహేను అడుగుల పైమాటే. చెరువుకి చుట్టూ పొలాలు. బోదె కాలువల ద్వారా పొలాలకి నీరందేది. పంటకాలవ ద్వారా గోదారి కాలవనుండి చెరువుకి నీరొదలడమనేది నీటిపారుదల నియంత్రణాధికారికి రైతులందరూ కలిసి చేతులు పుష్కలంగా తడిపితే కాని జరిగేది కాదు. గోదావరిలోనే పుష్కర స్నానాలకి నీరు లేక జల్లు స్నానాల్ని ఏర్పాటుచేసి రొమ్ములు విరుచుకొన్న అధికారులు కాలవల, చెరువుల నిర్వహణమీద అధికారులు ఏనాడూ శ్రద్ధ వహించలేదు.
గోదావరిలోనే నీరు లేకపోతే కాలవల పరిస్థితి వేరుగా ఎందుకుంటుంది? పంట కాలవలోకి నీరొదలాలంటే చేతి తడుపుల ప్రమాణాలు పెరిగిపోతాయి. కనుమల్లో వర్షమొచ్చి, వరదొచ్చి గోదావరి పొంగి పొరిలితే నీరంతా ఆ ఇచ్చిన సముద్రుడి పాలే. చెరువులు మట్టుకు దాహంతో ఆర్చుకుపోతూ, అడుగంటిపోతున్న నీటిగుంటలుగా రూపాంతరం చెంది జల జీవాలకి ప్రాణాంతకంగా మారాయి. చుట్టూ ఉన్న వృక్షాల వేళ్లకి నీరందక ఎండిపోసాగాయి. రాములమ్మ చెరువు గతీ ఇంతే. ఎండిపోయి రెండేళ్లు దాటింది. ఎంపికైన ప్రజా నాయకులు అయిదేళ్ళదాకా కనిపించరు. పొలాలకన్నా నగరాలలో క్రిక్కిరిసిపోయిన లక్షలాది ఓటర్ల దాహార్తి వారికి ముఖ్యం.
ఋణమాఫి పథకాల్లో నాయకులు, బ్యాంక్ అధికారులూ వాటాలడిగారు. ఇచ్చినవారిచ్చారు. అలాంటివారికి కొత్త ఋణాలు సులువుగా దొరికాయి. ఆ ఋణగ్రహీతల్లో మోతుబరి రైతులు కూడా వున్నారు. నలుగురూ పోయే బాటమ్మట నడిచిపోవాలని సిద్ధరామయ్యకి స్నేహితులు సుద్దులు చెప్పారు.
‘‘ఖాతాదారులు దాచుకొన్న సొమ్ముల్ని మనకి అప్పుగా యిస్తున్నారు. వాళ్ళకి బ్యాంకులవాళ్లు వడ్డీలిచ్చి మననుంచి స్వల్పంగా అధిక శాతం వడ్డీలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం మన కష్టాలకి వారి స్వార్థాన్ని ముడిపెట్టి ఋణమాఫీ చేయిస్తే ఆ భారం ప్రజలమీద పన్నుల రూపంలో పడుతుంది. లేదా ప్రభుత్వాలు చేసే ఋణాలమీద పడ్తుంది. ఖాతాదారులకిచ్చే వడ్డీలు పడిపోతాయి. బ్యాంకుల్లో డబ్బులు దాచుకొనేవారందరూ ధనవంతులు కారు. సంవత్సరాలు పనిచేసి, నెల నెలా ఆదా చేసుకొంటూ, పదవీ విరమణ సమయంలో లభించిన సొమ్ముల్ని స్థిరపెట్టుబడులుగా ఉంచి, ఆ వచ్చే వడ్డీయే జీవనాధారంగా బతుకుతున్నారు. ద్రవ్యోల్బణం చేత ధరలు పెరిగిపోతున్నకొద్దీ వారు దాచుకొన్న సొమ్ముల విలువ తగ్గిపోతూ వస్తుంది. ఇంతమందిని ఉసురుపెట్టి ఋణమాఫీల కోసం పరుగులు తీయడం నైతికం కాదు’’.
‘‘అందరూ ఉద్యోగాలు చేసుకొంటూపోతే, ప్రజలనోట్లో మెతుకులు పడ్డానికి నాగలి పట్టేవాడు కూడా ఉండాలిగా? చేతికొచ్చే పంట ప్రకృతి నిర్ణయిస్తుంది. ప్రకృతి అతివృష్టి, అనావృష్టిలు కలిగిస్తే రైతు జీవితం నాశనమవడం భావ్యం కాదు. ఆ భారం ప్రజలు వహించక తప్పదు. అలా ఆశించడం తప్పూ కాదు.’’
‘‘అవొచ్చు కాదనను. అయితే ఈ ఋణపథకాలు, మాఫీలు రాజకీయాలతో, దళారుల ప్రమేయంతో జరుగుతున్నాయి. సగ శాతం లబ్ధిని వారు మింగేస్తున్నారు. ఇది బ్యాంక్ ఖాతాదారులకి తీరని అన్యాయం. ఈ లావాదేవీల్లో నైతికతకు స్థానం లేదు. పశువుల కోసమని ఋణాలు తీసుకొని ఆ పశువుల్ని కొనకుండా మనలో ఎంతమంది దగా చేస్తున్నారో మనకి తెలిసిందే. ఈ మాటే అన్నానని మెలిపాక రాముడు నన్ను కొట్టినంత పనిచేశాడు. నకిలీ విత్తనాలు అంటగడ్తున్నాడని నేను ‘రంగరాజు విత్తనాల’ మీద నేరం మోపితే, తన రాజకీయ సంబంధాలతో ఋణాలు రాకుండా అడ్డుపడ్తాడని నన్ను సమర్థించిన వారొక్కరూ లేకపోయారు.’’
‘‘అయితే అఘోరించు! కానీ వడ్డీ వ్యాపారుల వెనక పరుగెడితే నిన్ను నువ్వు రక్షించుకోలేవు, నినె్నవరూ రక్షించలేరు!’’ సలహా ఇచ్చిన బలిపాక కాముడు నిట్టూర్చాడు.
సిద్ధరామయ్య కొడుకు చెన్నైలో ఓ కార్ఖానాలో పర్యవేక్షకుడుగా పనిచేస్తాడు. వచ్చే జీతంతో సదుపాయంగానే జీవిస్తాడు. లాభసాటి లేని వ్యవసాయాన్ని వదిలేసి తల్లిదండ్రుల్ని వచ్చేయమని పదే పదే అడుగుతూనే వుంటాడు. కానీ వున్న నాలుగెకరాల భూమినీ వదులుకోవడం ఇష్టం లేక మాట దాటేస్తూ వచ్చాడు. వర్షాలు రాకపోతే పంటలు పండకపోచ్చు కాని, వర్షాలు గడిచినకొద్దీ వయసు కోరికలు పెరుగుతాయి కదా? ఎకరం భూమి అమ్మేసి వయసొచ్చిన కూతురి పెళ్లి చేశాడు. భుక్తి గడవడం కోసం మరో ఎకరాన్ని అమ్మివేసి ఆ సొమ్ముని బ్యాంక్‌లో పడేసి నెల నెలా వచ్చే వడ్డీమీద బతకడం నేర్చుకొన్నాడు.
రెండు బోరు బావులు తవ్వించడానికి ఒక ఎకరాన్ని తాకట్టు పెట్టి బ్యాంక్‌లో ఋణం తీసుకోవడానికి ప్రయత్నించాడు. ‘‘ఉన్నది రెండెకరాలు?’’ అందులో ఒక ఎకరం ఋణం కోసం తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్తున్నారు. రెండెకరాల మీద మీ ఫలసాయం ఎంతొస్తుందని?’’ బ్యాంక్ అధికారి సలహా రూపంలో సౌమ్యంగానే హితవు పలికాడు.
‘‘్ఫలసాయం లేదనే పలువురు రైతులు వ్యవసాయం లాభసాటి భేరం కాదని తట్టాబుట్టా నెత్తిన పెట్టుకొని పట్టణాల్లో కూలీ బతుకుల కోసం పరుగులు తీస్తున్నారు. ఆ పరిస్థితి వస్తే నేను అదే చేస్తాను. మోతుబరి రైతులే బీద అరుపులు అరిస్తే, బీదరైతులు చేయగలిగిందేముంది? ఎకరా భూమి తాకట్టు పెడ్తున్నా కాబట్టి మీరిచ్చే ఋణానికి నష్టపోరు’’.
సిద్ధరామయ్యకి ఋణం లభించింది. ఓ సిద్ధాంతిని పిలిచి గంగపూజ చేయించి రాములమ్మ చెరువుకి ఐమూలగా రెండు బోరుబావులు తవ్వించాడు. వంద అడుగుల లోతునుంచి నాలుగు అంగుళాల గొట్టాల్లోంచి చెరువు నిండడం ప్రారంభమైంది. చుట్టుప్రక్కల గ్రామాలవారూ, రైతులూ ముక్కున వేలేసుకొన్నారు. తమకూ లాభసాటి బేరమని రైతులు మిన్నకుండిపోయారు.
అయితే, ‘‘యిదేం తెగులు నీకు?!’’ అని బలిపాక కాముడు అరిచినంత పనిచేశాడు.
‘‘అందరికీ చెరువు నీరు అందుబాటులో వుంటుంది కదాని, నా పొలంలోనే తవ్వించుకొంటే మొహమాటాలెక్కువౌతాయి. బోదె కాలువల చికాకులు తలెత్తుతాయి.’’
‘‘తల వెనక కాంతి చక్రం కోసం నువ్వు భగీరథుడిలా ప్రయత్నిస్తే, నీ వెనక గోతులు తవ్వేవారుంటారు! ఆ మాత్రం ఆలోచించుకోవద్దూ?’’
‘‘అదీ చూద్దాం. భగీరథుడు పూర్వీకుల చితాభస్మాలని తడిపి వారికి మోక్షసిద్ధి కోసం గంగని భువికి తెచ్చాడు. కాని అది భారతావనికి జీవనదిగా భాసిల్లుతోంది!’’ అన్నాడు సిద్ధరామయ్య నవ్వుతూ.
చెరువు నిండడానికి ఇరవై రోజులు పైగా పట్టింది. వారం రోజులు రైతులు ఆత్రంగా తమ తమ పొలాల్ని నారుమళ్లు వేసుకోవడానికి తడుపుకొన్నారు. తర్వాత ఓ అద్భుతం జరిగింది.
ఒక సాయంకాలం ఆకాశమార్గాన దక్షిణ భారతంలో ఎండిపోయి చెరువుల్ని నిరాశా నిస్పృహలతో దాటుకొంటూ పయనిస్తున్న సైబీరియన్ కొంగలకి రాములమ్మ చెరువు నిండు గర్భిణిలా కనిపించడంతో ఒక్కసారి రివ్వున వాలాయి. మోడులై తిరిగి చివురిస్తున్న వృక్షాలు వాటికి స్వాగతం పలికాయి. మర్నాడుదయం గ్రామవాసులకు ఒకటా, రెండా, వేలకొలది వలస పక్షులతో రాములమ్మ చెరువు సజీవ సరస్సులా కనబడింది.
ఇప్పుడు రాములమ్మ చెరువుకు మరికొన్ని పేర్లు ఆపాదించారు. సిద్ధరామయ్య చెరువు, అతిథి కొంగల చెరువు, వలస కొంగల చెరువు. ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరి కాలవ నుంచి పంట కాలవ ద్వారా రాములమ్మ చెరువుకు నీరు ఆపరాదని ప్రభుత్వం అధికారులను నిర్దేశించింది. ఎవరి ప్రమేయం లేకుండానే బ్యాంక్ ఉన్నతాధికారులు సిద్ధరామయ్య ఋణాన్ని చెల్లు కొట్టేశారు. ఈ చర్యలలో వారి వారి ప్రగల్భాలు, స్వోత్కర్షలు ప్రకటనల రూపంలో వెలువడ్డాయి.
‘‘సిద్ధా! నువ్వు నిజంగా భగీరథుడవే! విశ్వాసంలేని మనుషులకన్నా నోరులేని జీవాలకి నువ్వు అయాచితంగా చేసిన మేలు నిన్ను సదా రక్షిస్తాయి!’’ అన్నాడు బలిపాక కాముడు.
కొసమెఱుపు:పక్షి విసర్జితాలతో నీటి బలం అధికమై, పంటల్ని ఏపుగా చేసిందన్నది వేరే సంగతి.
*
-పి.వి.రమణరావు
రచయిత సెల్ నెం:9949694396

-పి.వి.రమణరావు