మెయిన్ ఫీచర్

పసిడిపంటల ‘సాగర్’కు అరవై వసంతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక ఆలోచన లక్షలాది రైతు కుటుంబాల తలరాతను మార్చివేసింది. ఆ వజ్ర సంకల్పం ముక్త్యాల సంస్థానాధిపతులు రాజా రామగోపాల కృష్ణమహేశ్వరప్రసాద్ (ముక్త్యాల రాజా)ది. ముక్త్యాల కోట కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున ఉంది. ఆ కోట నదికి ఎత్తయిన ప్రదేశంలో ఉంది. కోటలోనుంచి చూస్తుంటే- చాలా లోతులో కృష్ణానది ప్రవహిస్తూ కనిపిస్తుంది. రాజావారు తమ కోటపైనుంచి- నిత్యం పరవళ్లు తొక్కుతూ, ఉరకలువేస్తూ పారే నదీ ప్రవాహాన్ని గమనిస్తూ గంటల తరబడి గడిపేవారు. కృష్ణా ప్రవాహం లాగానే ఆయన మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉండేవి.
‘లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయగలిగిన నీరు నదిలో ప్రవహిస్తూ సముద్రంలో వృథాగా కలిసిపోతున్నదే! ఈ నదిపై ఆనకట్ట కడితే, పంట కాలువల ద్వారా పొలాలకు మళ్లిస్తే ఎంత బాగుండును..’-అనే ఆలోచన తన మదిలో మెరిసిన వెంటనే రాజావారు దానికి కార్యరూపం ఇచ్చారు. వెంటనే కొందరు ఇంజనీర్లను సంప్రదించారు. 1908లో కల్నల్ ఎల్లిస్, కల్నల్ సి.టి. మాల్లింగ్స్ అనే బ్రిటిష్ ఇంజనీర్లు విజయవాడకు 40 మైళ్ల ఎగువన పులిచింతల వద్ద ఒక ప్రాజెక్ట్ కట్టేందుకు వీలుందని కనుగొని, దానికి డిజైన్ చేసి ప్రాజెక్ట్ రిపోర్టు తయారుచేసినట్లు రాజావారికి తెలియజేశారు. కానీ, ఎందువల్లనో దీని నిర్మాణం అప్పట్లో చేపట్టలేదు. ఆ ప్రాజెక్టు రిపోర్టుకోసం రాజావారు ప్రభుత్వ కార్యాలయాలన్నీ గాలించారు. చివరికి అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో రిపోర్టు దొరికింది. 1908లో 2,000 పేజీలతో ప్రచురితమైన ప్రాజెక్టు డిజైన్ రిపోర్టును ఎన్నో వ్యయ,ప్రయాసలకోర్చి సంపాదించారు. పులిచింతల ప్రాజెక్టువల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని డెల్టా ఆయకట్టు భూములకు స్థిరంగా నీరు రిజర్వు చేయవచ్చని భావించారు. సుప్రసిద్ధ ఇంజనీరు డాక్టర్ కె.ఎల్.రావుగారికి ఆ రిపోర్టు ఇచ్చి ప్రభుత్వంతో పునఃపరిశీలనకు తీవ్రంగా ప్రయత్నించారు. పులిచింతల ప్రాజెక్టు సాధించాలని ఉద్యమించారు. రాజావారు రోజుకు 30 గ్రామాలు పర్యటించి ప్రజలను తన ఉపన్యాసాల ద్వారా చైతన్యపరిచారు. ‘అన్నపూర్ణమ్మ మన పులిచింతలమ్మ’అనే కవితను గానం చేశారు. పులిచింతల ఆందోళనలో రాజావారికి డాక్టర్ కె.ఎల్.రావు, మోటూరి, ఆచార్య రంగా, వావిలాల గోపాలకృష్ణయ్య, నార్ల వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులు సహకరించారు.
ప్లానింగ్ కమిషన్ పులిచింతల చిన్న ప్రాజెక్టు అనీ, కొత్తగా ఆయకట్టు భూములకు నీరు అందే అవకాశం లేదనే సాకుతో కొట్టివేసింది. అయితే, కృష్ణానదిపై ఆనకట్ట నిర్మించాలనే పట్టుదలతో ఒక పెద్ద ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని రాజాగారు నడుం బిగించారు. అటువంటి ఆలోచనలోంచి పుట్టిందే ‘నందికొండ ప్రాజెక్టు’ (నాగార్జునసాగర్). నాగార్జునసాగర్ రాజావారి మానస పుత్రిక. ఆయన స్వయంగా నల్లమల అరణ్యంలో స్థలానే్వషణకు బయల్దేరారు. ఈ ఘట్టం వీరి జీవితంలో ప్రముఖంగా చెప్పుకోదగింది. ఎండలో,వానలో రాత్రింబవళ్లు ఆ కీకారణ్యంలో కొండలు, కోనల్లో ఎన్నో రోజులు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో వారిని డాక్టర్ కె.ఎల్.రావు, వావిలాల గోపాలకృష్ణయ్య, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ నరసింహయ్య వంటి ప్రముఖులు అనుసరించారు. ఎక్కువ భాగం కాలినడకనే రాళ్లు, రప్పలు, తుప్పలు, పొదలు తొలగించుకుంటూ మార్గాన్ని సుగమం చేసుకుంటూ కృష్ణానదీ ప్రవాహప్రాంతాల్లో పర్యటించారు. రోహిణీకార్తె ఎండలో సైతం అతి ప్రయాసతో చేసిన ప్రయాణం వృథాకాలేదు. అక్కడ ఆశాజ్యోతిలా కొండ ప్రదేశం కనిపించడంతో ఎంతో ఆనందం కలిగింది. అక్కడైతే పెద్ద జలాశయం కట్టవచ్చు. కానీ, ఆ నీటిని భూభాగంలోకి మళ్లించాలంటే చాలా ఖర్చవుతుంది. ప్రభుత్వం ఒప్పుకోకపోవచ్చునని డాక్టర్ కె.ఎల్.రావుగారు అనగానే మళ్లీ ప్రయాణం సాగించారు. ఎంతో వ్యయప్రయాసల తర్వాత ఇప్పుడు నాగార్జునసాగర్ డ్యామ్ కట్టిన ప్రాంతాన్ని కనుగొన్నారు. ఆ ఉన్నతమైన నదీ లోయను చూసి మహానందపడిపోయారు. కుడి గట్టు నిట్టనిలువుగా, ఎడమగట్టు కొంత తక్కువ ఎత్తులో ఏటవాలుగా నదీ గర్భప్రదేశంతో సహా అది నల్లరాతి మయంగా ఒక కట్టని డ్యామ్‌గా కనబడింది. ఆ ప్రదేశం ఫొటోలను తీసుకుని వెనుదిరిగారు. తర్వాత రాజావారు మైసూరు ప్రభుత్వంలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ నరసింహయ్యను, రిటైర్డ్ ఇంజనీర్ జి.గోపాలాచార్యులను ప్రాజెక్టు రిపోర్టు తయారుచేయడానికి నియమించుకున్నారు. వీరికి నెల జీతాలు ఏర్పాటుచేశారు. ప్రాజెక్టు కాలంలో లోతైన కనుమ ఉండడం వల్ల ఎతె్తైన ఆనకట్ట నిర్మించడంతో అపారమైన జల విద్యుశ్ఛక్తి జనిస్తుంది. ఎడమవైపు కాలువను గోదావరి వరకూ పొడిగించవచ్చు. తెలంగాణలో పది లక్షల ఎకరాలు, ఆంధ్ర ప్రాంతంలో 18 లక్షల ఎకరాలు సాగయ్యే విధంగా ప్రాజెక్టు రిపోర్టు తయారైంది. నందికొండ ప్రాజెక్టు రిపోర్టును మద్రాసు ప్రభుత్వం ఒప్పుకోలేదు. దానికి కారణం ఉంది. శ్రీశైలం పైన కృష్ణాపెన్నార్ ప్రాజెక్టు నిర్మించి నీళ్లను మద్రాసు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. ప్రభుత్వం విముఖత చూపడంతో రాజావారు ప్రజా ఉద్యమం లేవదీశారు. కృష్ణా తీరవాసులు సంక్షేమ సంఘం’ ఏర్పాటుచేశారు. దీనికి చల్లపల్లి రాజా శివరామప్రసాద్ అధ్యక్షుడిగా, జంధ్యాల వేంకట సోమయాజులు కార్యదర్శిగా వ్యవహరించారు. నందికొండ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మద్రాసు ప్రభుత్వం కృష్ణా పెన్నారు ప్రాజెక్టు మంచిదనీ, అసలు నందికొండ ప్రాజెక్టు మిథ్య అనీ పత్రికా ప్రకటనలు ఇచ్చి ఉద్యమాన్ని నీరుకార్చాలని ప్రయత్నించింది. మద్రాసు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సంక్షేమ సంఘం నిశ్చయించింది. రాజావారు ఊరూరా సభలు పెట్టించి ప్రతిఒక్కరికీ పావలా ఇచ్చి ‘నందికొండ ప్రాజెక్టుకావాలని’ కేంద్ర ప్రభుత్వానికి టెలిగ్రామ్స్ ఇప్పించారు. మహాజర్లమీద మహాజర్లు పంపించారు. ఈ విషయమై వావిలాల గోపాలకృష్ణయ్య ఢిల్లీ వెళ్లి ప్లానింగ్ కమిషన్ మంత్రి గుల్జారీలాల్ నందాను కలుసుకున్నప్పుడు ఆయన ఒక గదిలో నిండిపోయిన టెలిగ్రామ్స్ చూపించారట! రాజావారి సంకల్పబలం వల్ల కేంద్ర ప్రభుత్వం డాక్టర్ ఖోస్లా అనే ఇంజనీర్‌తో కమిటీ వేసింది. ఖోస్లా రాక తెలిసి రాజావారు విజయవాడ నుంచి 260 మైళ్ల పొడవునా వంద ఆర్చీలు పెట్టి స్వాగత ద్వారాలు, 60 కార్లు ఏర్పాటుచేశారు. కరపత్రాలు వేయించి గ్రామాల ప్రజలను సమీకరించి వారందరికీ భోజనాలు ఏర్పాటుచేశారు. ఖోస్లాగారు ప్రాజెక్టు ప్రాంతాన్ని చూడటానికి వచ్చినప్పుడు మద్రాసు ప్రభుత్వం సహకరించలేదు. చీఫ్ ఇంజనీర్ వెంకటాచారి గుంటూరు వరకు వచ్చి అక్కడికి దారిలేదు అని తప్పుకున్నారు. అప్పట్లో గుంటూరు నుంచి మాచెర్లవరకు మాత్రమే రైలుమార్గం ఉంది. మాచెర్ల నుంచి బెల్లంకొండవారిపాలెం వరకు మట్టిబాట మాత్రమే ఉండేది. అక్కడినుంచి నందికొండ ప్రాంతానికి దారిలేదు. మరి ఖోస్లాగారికి ప్రాజెక్టు ప్రాంతం చూపించడం ఎలా? అప్పుడు తలగుడ్డ అనంతయ్య బెల్లంకొండవారిపాలెం గ్రామస్థుల సహాయంతో అడవిని నరికించి జీప్‌పోయే దారి రెండురోజుల్లో తయారుచేయించారు. కొత్తగా వేసిన దారిలో ఖోస్లాను జీప్‌లో తీసుకెళ్లి ప్రాజెక్టు స్థలం చూపించారు. ఖోల్లా ఆ స్థలం చూసి- ‘ఇది భగవంతుడు మీకు ఇచ్చిన అమూల్యమైన వరం’ అని మెచ్చుకున్నారు. అప్పటి గవర్నర్ త్రివేది నందికొండ ప్రాజెక్టు వ్యవహారాన్ని ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో చర్చించి ఆమోదింపజేశారు. 1954 డిసెంబర్ 17న గవర్నర్ నందికొండ ప్రాజెక్టు నిర్మాణ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర, హైదరాబాద్ ప్రభుత్వాలు డ్యామ్ నిర్మాణానికి ఉమ్మడిగా చేతులు కలిపాయి. అపర భగీరథుడిగా రాజావారిని ప్రజలు కీర్తించారు. 1955 డిసెంబర్ 10న ప్రాజెక్టుకు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. 1948లో ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ మూలంగా రాజావారికి భరణంగా లభించిన లక్షన్నర రూపాయలు నాగార్జునసాగర్ ఆమోదం కోసం జరిపిన ఉద్యమాల కోసం ఖర్చుపెట్టారు. కొసమెరుపు ఏమిటంటే- జవహర్‌లాల్ నెహ్రూ డిసెంబర్ 10, 1955న చేసిన శంకుస్థాపన ఉత్సవానికి గానీ, ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి 1967 ఆగస్టు 4న ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాలువలకు నీటిని వదిలినప్పటి ఉత్సవానికి గానీ రాజాగారిని ఆహ్వానించకపోవడం విచిత్రం.

chitram...

నిర్మాణ సమయంలో..

-సిహెచ్.శివరామ ప్రసాద్