Others

ఆమెకి చూపు వచ్చేసింది..! ( వార్త-వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వార్తలన్నీ నిజాలు కావు.. అయితే, సంఘటనలుగా వెలుగుచూసే వార్తల్ని మాత్రం నమ్మాల్సిందే. ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తోంది ఈ ఘటన. అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో మేరీఎన్ ఫ్రాంకో అనే 70 ఏళ్ల అంధురాలు తన యింట్లో నడుస్తూ నడుస్తూ ఇటీవల కిందపడిపోయింది. వెల్లకిలా పడిపోవడంతో ఆమె మెడకీ, మోచేతికీ గట్టి దెబ్బలు తగిలాయి. 1995లో కారు ప్రమాదంలో మేరీఎన్ గాయపడటంతో వెనె్నముకకి శస్త్ర చికిత్స జరిగింది. అప్పటి నుంచి ఆమెకు రెండు కళ్లూ చూపును కోల్పోయాయి. అంధత్వం ఏర్పడ్డాక ఇన్నాళ్లూ తన పెంపుడు పిల్లి, కుక్క సాయంతో ఆమె ఇంటి పనులు చక్కబెట్టుకుంటోంది. ఇటీవల ఆమె నేలపై పడిపోవడంతో మళ్లీ శస్తచ్రికిత్స తప్పనిసరైంది. న్యూరోసర్జన్ డాక్టర్ జాన్ అఫ్‌సర్ చాలా కష్టపడి వెనె్నముకకి నాలుగు గంటల సేపు సర్జరీ చేశాడు.
ఆసుపత్రి గదిలో మర్నాడు ఉదయం తనకు స్పృహ రాగానే ఆమె కళ్లు తెరిచింది. ఆశ్చర్యం..! తెరచి వున్న కిటికీలోనుంచి సూర్యోదయం, మేఘాలు, చెట్లూ,పక్షులూ ఆమెకి కనబడ్డాయ్! ఆ షాక్ నుంచి తేరుకుని ‘నాకన్నీ కనబడుతూ వున్నాయర్రా!’ అంటూ ఆమె గట్టిగా అరిచింది.
ఆమెకన్నా ఎక్కువ ఆశ్చర్యపోయాడు న్యూరోసర్జన్. గతంలో ఆపరేషన్ చేసినపుడు ఒక రక్తనాళం ఏదో మెలికపడిపోయి వుంటుంది. ఈసారి అది సవ్యంగా మారి ఆమె మెదడుకి రక్తం సరఫరా అయివుంటుంది’ అన్నాడు ఆ డాక్టర్.
మేరీఎన్ కూతురు మెక్సికోలో ఉంటోంది. కుటుంబ సభ్యులతో ఆమె తన తల్లి వద్దకు పరిగెత్తుకు వచ్చింది. తన కూతుర్నీ, ఏడుగురు మనుమల్నీ, మరో ఇద్దరు మునిమనవల్నీ మొట్టమొదటిసారి చూసుకుని మేరీఎన్ కేకలు వేసింది పట్టరాని సంతోషంతో. ‘కాటరాక్టు వుందమ్మా నీకు..’ అన్నాడు డాక్టరు. ‘నో ఆపరేషన్’ అన్నదామె. ‘నాకీ చూపు చాలు దేవుడా! నాకీ అదృష్టం చాలు డాక్టరూ!’ అంటూ తన పెంపుడు కుక్క వెంట పరుగులు తీసింది డెబ్భై ఏళ్ళ బామ్మగారు ఏడేళ్ల పాపాయిలా. జీవితం అంటే ఇంతేనేమో. ఒక్కోసారి ఓ లైటు స్విచ్ వేస్తే మరో లైటు వెలుగుతుంది మరి!
మెహబూబాకి మహిళాభివందనం!
జమ్ము-కాశ్మీర్ రాజధాని నగరం ఇటీవల జమ్మూ నుంచి శ్రీనగర్‌కు మారింది. చలికాలం తర్వాత ఈ మార్పు ఏటా జరిగేదే. కానీ, ఈసారి కాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రి మెహబూబా ‘దర్బార్ మూవ్’కి (కొత్తకొలువు) తరలివస్తోంది. ఆమెకు గౌరవ వందనం చేసే పోలీసు బలగాల మోహరింపు కూడా చరిత్రలో మొట్టమొదటి మార్పు తీసుకుంది.
ముఖ్యమంత్రికి ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇవ్వటానికి ఇండియన్ రిజర్వ్ పోలీసు దళంలోనుంచి 90 మంది చాకుల్లాంటి పోలీసుల్ని ఎంపిక చేశారు. ఈ తొంభై మందిలో 30 మంది మహిళా పోలీసుమణులున్నారు.
గౌరవ వందన దళానికీ కూడా పోలీసు అధికారిణి సందీప్ కౌర్ నాయకత్వం వహించింది. అదీ విశేషం! జమ్ము-కాశ్మీర్ డిజిపి కె.రాజేంద్ర- ‘ఇది అపురూప సంఘటన’ అంటూ మురిసిపోయాడు. కాశ్మీర్‌లో రాజధాని మార్పుకు ‘దర్బార్ మూవ్’ అన్నది అధికారిక నామధేయం. తిరిగి నవంబర్‌లో రాజధాని జమ్మూకి వెళ్లిపోతుంది. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. రెండు ప్రాంతాలకీ కూడా స్వయం పరిపాలనా హక్కులిచ్చేస్తే బాగుంటుందని వృద్ధ కాశ్మీర్ నాయకుడు షేక్ అబ్దుల్లా సందేశం ఇచ్చాడు.

ఒక ‘కంగారు’ ..
భూతదయ రకరకాలుగా వుంటుంది. దక్షిణాఫ్రికాలో స్కాట్ మాన్సక్ అనే పోలీసు చిన్న ‘కంగారూ’ పిల్లని పెంచుకుంటున్నాడు. అది ‘క్యూ’ అనే ఊళ్లో పోలీస్ స్టేషన్‌లో తనను కాపాడిన కానిస్టేబుల్ చొక్కాలోకి దూరిపోయి, అదే తన తల్లి పొట్ట సంచీ అనుకుని హాయిగా బజ్జుంటోంది. ఒక హైవేమీద జోరుగా వస్తున్న ఒక కారు కింద ఓ కంగారూ పడిపోయింది. పాపం తల్లి కంగారూ చచ్చిపోయింది. దాని పొట్ట సంచీలో వున్న పిల్ల గిలగిలలాడుతూ బతికే వుంది. ఈలోగా పెద్ద గండభేరుండ పక్షిలాంటి గద్దలు ఈ కంగారూ పిల్లని ఎగరేసుకుపోదాం అన్న ప్రయత్నంలో వచ్చాయి.
పోలీస్ స్కాట్ యేసన్ ఆ గద్దల్ని తరిమి, కంగారూ బిడ్డని అక్కున అదుముకున్నాడు. ‘క్యూజో’ (అంటే వూరి పేరు కలిపాడన్నమాట) అంటూ పేరు పెట్టి దాన్ని పెంపుడు జంతువుగా స్వీకరించాడు. అతనెక్కడికి పోయినా, ఆ క్యూజో కిందకు దుముకుతూ తిరిగి అతని చొక్కా జేబులోకి ఎగిరి దాక్కుంటుంది.
ఆస్ట్రేలియాలో ఈ జంతువును ‘కాంగ్రూ’ అంటారు, మనం ‘కంగారూ’ అంటూనే పిలుస్తున్నాం. ‘కంగారు’పడకండి. ఇది మనకి ఎక్కడా దొరకదు కేవలం ఆస్ట్రేలియా అడవుల్లో తప్ప. చిన్న అలికిడికి కూడా ఈ ‘కాంగూ’లు కంగారుపడిపోయి దుముకుతూ పారిపోతాయి! అదే వాటి పేరు కూడా.

నాన్న కోసం సాహసం..
హిమాచల్‌ప్రదేశ్ పేరే చెబుతోంది అది మంచుకొండల ప్రాంతమని. అక్కడ భారీ శకటాలను నడపడం అంటే డ్రైవర్లకు నిత్యం మృత్యుగహ్వర ప్రయాణమే! పర్వతాల అంచున వేలాడే మార్గాలలో అనుభవజ్ఞులైన పురుష చోదకులే ప్రాణాలరచేత బెట్టుకుని వాహనాలను నడుపుతారు. ఇటువంటిచోట సీమా ఠాకూర్ అనే ఇరవై రెండేళ్ల సాహస యువతి ఈమధ్య భారీ శకటాన్ని తోలుతూ కొండ మార్గం పట్టింది. ‘మా నాన్న కోరిక తీర్చడానికే ఈ సవాల్ స్వీకరించాను’ అంటోంది సీమ. ఈ పర్వత సానువులమధ్య రోడ్డు ప్రమాదాలలో ఏటా కొన్ని వందలమంది గల్లంతైపోతూ వుంటారు. మరణాల సంఖ్య కూడా వందల్లో వుంటుంది. ఆమె తండ్రి ఈ కొండ ప్రాంతాల్లోనే బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ గత ఏడాది మరణించాడు.
‘ఈ మంచుకొండల అందాలను చూస్తూ బస్సు డ్రైవర్‌గా నా పేరు నిలబెట్టమ్మా!’- అంటూ తండ్రి సీమను పెంచాడు. ‘తండ్రి మరణించాడు గనుక ఎలాంటి సాహసాలకూ వెళ్లకుండా పెళ్లి చేసుకుని సుఖపడు’- అంటూ అందరూ సీమకు సలహాలు ఇచ్చారు. ‘నాన్న కోరిక కన్నా నా ప్రాణాలు ఎక్కువ కాదు. కొండల మధ్య వందలాది ప్రయాణీకుల్ని, సరుకుల్నీ రవాణా చేస్తూ నాన్నకి నివాళులర్పిస్తా’ అంటూ తన బస్సు నడిపేందుకు సిద్ధమైంది. జయహో బేటీ!

-వీరాజీ