భాస్కర వాణి

తెలుగునాట కొత్త హీరోలొస్తున్నారు.. జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఒంగోలులో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నపుడు మొదటిసారి జార్జిరెడ్డి గురించి వి న్నాను. మళ్లీ ఇపుడు వింటున్నా. ఆయన గురించి తెలుసుకొన్నపుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. ఆయనపై సినిమా రావడం చాలా ఆనందంగా వుంది. ఇలాంటి అగ్రెస్సివ్ వ్యక్తుల జీవితాలు తెరపైకి రావాలి’.. ఈ ఆణిముత్యాలు పలికిన మహనీయుడు మెగాస్టార్ చిరంజీవి. జార్జిరెడ్డి సినిమా పాట విడుదల చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు చిరంజీవికున్న అజ్ఞానాన్ని, అవకాశవాదాన్ని బయటపెడుతున్నాయి. ‘సైరా’ సినిమా చూశాక ఆయనపై తెలుగు ప్రేక్షకుల్లో పెరిగిన దేశభక్తి అమాంతం మంచులా కరిగిపోయింది. ఆయనే కాదు, ఈ కథానాయకుడి కథను గురించి తెలియని కొంతమంది అమాంబాపతుగాళ్లు ‘ఇదేదో ప్రశ్నించే తత్వం’ అంటూ వరవరరావులా మాట్లాడుతున్నారు!
ఇప్పటికే ఈ మెగాస్టార్ తమ్ముడు పవర్‌స్టార్ ‘పవనిజం’ పేరుతో అర్జెంటీనా వైద్యశాస్త్ర పట్ట్భద్రుడు, బొలీవియా, క్యూబాల్లో కమ్యూనిస్టు సాయుధ పోరాటాల్లో పాల్గొన్న ‘చెగువేరా’ను- తెలుగునాట భగత్‌సింగ్‌ను చంపేసి- యువకుల మోటార్ సైకిళ్ళపై స్టిక్కర్‌గా ఎక్కించేశాడు. ఈ చెగువేరా ఫెడల్ క్యాస్ట్రో మంత్రివర్గం నుండి బయటకొచ్చి ‘కమ్యూనిస్టు విప్లవం’ తీసుకున్నాడు. మరి తలాతోకా తెలియకుండా స్టేట్‌మెంట్లు ఇచ్చే నాయకుల్లా, సినిమావాళ్లలా చిరంజీవి ఆ భ్రమల్లో పడి ‘అగ్రెస్సివ్’ పాత్రలు రావాలనడం ‘ఏం సందేశం’ ఇస్తాయో తెలుసుకున్నాడా? మరి అలాంటి అగ్రెస్సివ్ పాత్రలు ఆయుధాలు చేపడితే మీరు హైదరాబాద్‌లో నిర్మించుకున్న స్టూడియోలు, ఆకాశహర్మ్యాలు ఉంటాయా? ఇలాంటివి ప్రోత్సహిస్తే గద్దర్ గానం చేసే అమరవీరులంతా రేపటినుండి హీరోలై కూర్చుంటారు. అపుడు తెలుగునాట కథలకు కొదవుండదు. బహుశా! రాం చరణ్, అల్లు అర్జున్‌లకు కావాలసినంత పని కూడా దొరుకుతుంది.
జార్జిరెడ్డి 15 జనవరి 1947లో క్రైస్తవ మలయాళీ లీలా వర్గీస్, రఘునాథ రెడ్డి (చిత్తూరు జిల్లా) దంపతులకు జన్మించాడు. నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో చదువు కొనసాగించాడు. అదే అతని రంగస్థలం. 1967-69 మధ్యలో శ్రీకాకుళ సాయుధ పోరాటం ప్రారంభం అయ్యాక, దాని మానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేశారు. ‘మార్క్సిస్ట్ మదర్సా’లా ఇపుడు జేఎన్‌యూ ఎలా తయారైందో- నక్సలైట్లను తయారుచేసే కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు మారిన సందర్భం అది. ఆ సందర్భంగా సదరు జార్జిరెడ్డి గోదావరి హాస్టల్ పక్కన నికిల్ డస్టర్లు, కత్తులు, బ్లేడ్లు, చువ్వలు.. ఎలా ఉపయోగించాలో విశ్వవిద్యాలయంలో అమాయక విద్యార్థులకు నేర్పించడం మొదలుపెట్టాడు. ఈ గుంపునకు కాంగ్రెస్ కమ్యూనిస్టు దత్తపుత్రులైన ఎస్.జైపాల్‌రెడ్డి, కె.వి. రఘనాథరెడ్డి వంటివారు వె న్నుదన్నుగా నిలిచేవారు. జై పాల్‌రెడ్డి ఢిల్లీలో కూర్చొని మొన్నటివరకు కమ్యూనిస్టు శక్తులకు, మావోయిస్టు సానుభూతిపరులైన మేధావులకు, హక్కుల సంఘాలకు ఎలా సహాయం చేసేవాడో జైపాల్‌రెడ్డి మరణానంతరం రాసిన వ్యాసంలో- ఓ ప్రసిద్ధ పౌరహక్కుల సిద్ధాంతకర్త స్మరించుకొన్నాడు. వర్గ శత్రు నిర్మూలనలో ఆనాడు నక్సలైట్లు చేసే పాశవిక చర్యలన్నింటిపైనా జార్జిరెడ్డి పూర్తి విశ్వాసం కలిగి విశ్వవిద్యాలయంలో అలాంటి బీభత్స వాతావరణం సృష్టించాడు.
1970లో యూనివర్సిటీ క్యాంప్‌లో రాయలసీమకు చెందిన ఇద్దరు న్యాయశాస్త్ర విద్యార్థులను కత్తితో పొడిచాడు. ఉస్మానియా విశ్వవిద్యాయలంలో ఇంత పెద్ద క్రూర సంఘటన అంతకుముందెన్నడూ జరుగలేదు. దాంతో విశ్వవిద్యాలయ విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి వర్గశత్రువులయ్యారు. దాంతో విశ్వవిద్యాలయ పాలక మండలి జార్జిరెడ్డిని ‘రస్టికేట్’ చేయడంతో ఈ వాతావరణం మరింత వేడెక్కింది. నాటి న్యూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సి.సుదర్శన్ అత్యంత శీఘ్ర పైరవీ చేసి జార్జిరెడ్డి రస్టికేషన్‌ను రద్దు చేసేందుకు కృషిచేశాడు. దాంతో జార్జిరెడ్డి నాయకుడై కూర్చొని, తన కార్యకలాపాలు మరింతగా విస్తృతపరిచాడు. జార్జిరెడ్డి ఆగడాలను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఎదుర్కోవడం మొదలుపెట్టింది. ఇది జీర్ణించుకోలేక జార్జిరెడ్డి ఏబీవీపీ కార్యకర్తలపై విద్వేషం పెంచుకున్నాడు. ఆనాటి ప్రదేశ్ కాంగ్రెస్ జీపులో ఎక్కి జార్జిరెడ్డి, అతని అనుచరులు సాగించిన దమనకాండ అంతా ఇంతా కాదు. ఏబీవీపీ నాయకుడు నరసింహారెడ్డిని కిడ్నాప్ చేసి ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో వేసి తీవ్రంగా కొట్టారు. అలాగే మాజీ గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావును, నారాయణదాసును తీవ్రంగా గాయపరిచాడు. నారాయణదాసును తీవ్రంగా కొట్టి, అతను మరణించాడని వదిలిపెట్టి పబ్లిక్ గార్డెన్‌లో పడేసి తిరుగుముఖం పట్టారు. ఎంతో ఓపికగా భరించిన జాతీయవాద విద్యార్థులపై జార్జిరెడ్డి తన ముఠాతో తీవ్రంగా దాడులు చేయించాడు. ఇంద్రసేనారెడ్డి, రవీందర్‌రెడ్డిల తలకు తీవ్రంగా రక్తస్రావం అయ్యేంతవరకు చీఫ్ వార్డెన్ ఆఫీసులోనే దాడి చేశారు.
ఆ తర్వాత నాటి సీఎం జలగం వెంగళరావు ఈ నక్సల్స్ గ్యాంగుకు, ఏబీవీపీకి రాజీ కుదిర్చేందుకు ఓ సమావేశం ఏర్పాటుచేస్తే జార్జిరెడ్డితోపాటు ఎస్.జైపాల్‌రెడ్డి కూడా అందులో పాల్గొన్నాడు. వెంగళరావు ఎన్ని సుద్దులు చెప్పినా జార్జిరెడ్డి అపర చెగువేరాలా తన పంథా వదల్లేదు. చివరకు 1972 ఏప్రిల్ 14న జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికల సందర్భం గా జార్జిరెడ్డి, అతని వర్గం ఇంజనీరింగ్ హాస్టల్‌పై దాడికి దిగి ఏబీవీపీ విద్యార్థులపై మారణాయుధాలు ప్రయోగించారు. ఈ క్రమంలో జరిగిన పరస్పర దాడిలో జార్జిరెడ్డి మరణించాడు. దీన్ని ఆనాటి వామపక్ష మేధావులు, సంఘాలు తమ పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో ‘మతోన్మాదంపై పోరాటం’ అంటూ కలరింగ్ ఇచ్చాయి. జార్జిరెడ్డి సమకాలికులైన వాళ్లెందరో అనంతర కాలంలో ఆయనను హీరోగా తీర్చిదిద్దారు. అతడు పేరుకి ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్త అయినా వామపక్ష అతివాదంతో పనిచేశాడు. అతని మరణాన్ని జైపాల్‌రెడ్డి పెద్ద వివాదంగా మార్చి శవయాత్రను విశ్వవిద్యాలయం గేటు నుండి ఆరెస్సెస్ కార్యాలయం (బర్కత్‌పురా) ముందు తీసుకెళ్లి, అక్కడ ఉద్రిక్తత సృష్టించాడు. ఈ ఘటనలో 9 మంది ఏబీవీపీ సభ్యులతోపాటు 9 మంది విద్యార్థులపై కేసులు నమోదు అయ్యాయి.
175 మంది కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సోషలిస్ట్ పార్టీల ఎంపీలు దీన్ని ఆసరాగా చూపి ఆరెస్సెస్‌పై కుట్ర కేసు పెట్టాలని ఇందిరాగాంధీని వత్తిడి చేశారు. కానీ ఆరు నెలల్లోగానే ట్రయల్ కోర్టు అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఆ తర్వాత జార్జిరెడ్డి అభిమాన గుంపు చేతిలో ఎందరో జాతీయవాద విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో అన్ని విశ్వవిద్యాలయాలు ‘టెర్రరైజ్’ అయ్యాయి. దీనికి మేధావుల పేరుతో కవులు, లెక్చరర్లు సైద్ధాంతిక భూమిక రచించారు. ఆఖరుకు విశ్వవిద్యాలయాల్లో జాతీయ జెండాను కూడా అవమానించడం మొదలుపెట్టారు. జాతీయ పతాకం గౌరవం కాపాడే క్రమంలో 1980 జనవరిలో జరిగిన ఘటన తర్వాత సామా జగన్మోహన్‌రెడ్డి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. 1983 వరకు విశ్వవిద్యాలయాల్లో ఈ అరాచకం కొనసాగింది. చివరిగా ఏబీవీపీ నాయకుడు చంద్రారెడ్డి హత్యతో జార్జిరెడ్డి రక్త్ధార ఆగిపోయింది. ఇలాంటి వ్యక్తుల జీవితాలను సినిమాలుగా కులాభిమానంతో తీయడం మొదలుపెడితే కథలకు ఏం కొదవ లేదు. పాక్షికంగా రాజకీయ నాయకుడైన చిరంజీవి ఇలాంటి సినిమాలను ప్రమోట్ చేసి సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తారో తెలియజేయాలి.

-డా పి.భాస్కరయోగి bhaskarayogi.p@gmail.com