భాస్కర వాణి

మీడియాలో సంయమనం ఏదీ? ఎక్కడ??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి క్రైస్తవ మతపెద్ద పోప్ విదేశీ పర్యటనకు సిద్ధమయ్యాడట. వెళ్లే ముందు ఆయన అనుచరులు- ‘అక్కడ మీడియా ప్రశ్నలతో ఇబ్బంది పెట్టవచ్చు. వారితో మాట్లాడేటపుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి’ అని చెప్పి పంపారట. పోప్ విమానాశ్రయంలో దిగగానే విలేఖరులు ఆయనను చుట్టుముట్టి ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు. చాలా ప్రశ్నలకు ఆయన వౌనంతోనే సమాధానం ఇచ్చారు. చివరకు ఓ విలేఖరి ‘‘పోప్ గారూ! ఈ నగరంలో రెడ్‌లైట్ ఏరియాను సందర్శించి అక్కడి బాధితులకు ఏదైనా ఓదార్పు విషయాలు చెప్తారా?’’ అన్నాడు. ఈ విషయంలో ఏం మాట్లాడినా తాను ఇరుక్కుపోతానని- ‘అసలు ఈ నగరంలో రెడ్‌లైట్ ఏరియాలున్నాయా?’ అని పోప్ ఎదురు ప్రశ్నించాడు. అంతటితో పాత్రికేయుల సమావేశం ముగిసింది. కానీ మరుసటి రోజు అన్ని పత్రికల్లో ‘రెడ్ లైట్ ఏరియా గురించి ఆరాతీసిన పోప్!’ అని తాటికాయంత అక్షరాలతో హెడ్డింగులు పెట్టారట!
పాత్రికేయ విలువలు దిగజారుతున్న తరుణంలో వార్త ఎలా వక్రీకరణకు గురవుతుందో తెలిపే సంఘటన ఇది. ఇటీవల దేశంలో వరసగా జరుగుతన్న సంఘటనల్లో ప్రసార మాధ్యమాల పాత్ర ఎలా ఉంది? ఎలా ఉండాలన్న అంశంపై ఇప్పుడు సమాజంలో తీవ్ర చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం- తప్పుడు వార్తలు రాసే లేదా సృష్టించే విలేఖరులపై తీవ్ర చర్యలు ఎలా ఉండాలో కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ ఓ ఉత్తర్వు ఇచ్చింది. దీనిపై రాజకీయ వర్గాలతోపాటు, పాత్రికేయ లోకం భగ్గుమంది. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకొని ఈ విషయాన్ని చల్లార్చారు. ఇప్పటికే పత్రికలపై ఫిర్యాదులు చేయడానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్ మీడియాపై ఫిర్యాదులకు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ ఉన్నాయి. అయినా సమాచార మంత్రిత్వ శాఖ ఈ విషయంపై ఎందుకు ముందడుగు వేసి, మళ్లీ వెనక్కి తగ్గింది? ఇందుకు ఎన్నో కారణాలున్నాయి. ఫిర్యాదులు చేయడం మొదలుపెడితే ఏ పత్రికా మిగలదు, ఏ టీవీ నడవదు. అందుకోసం ప్రసార మాధ్యమాలు స్వీయ నియంత్రణ పాటించాలి.
‘వార్త పవిత్రం- వ్యాఖ్య మీ ఇష్టం’ అన్న సూత్రాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఇష్టారీతిన అనుసరించడం తగదు. వార్త వెంబడి చెప్పే వ్యాఖ్య కూడా సహేతుకంగా ఉండాలి. విషయావగాహనను, భాషా సామర్థ్యాన్ని వదలిపెట్టి సెంటిమెంట్లను రగిలించే పని చేయకూడదు. వ్యక్తిగత కక్షలను, కార్పణ్యాలను వ్యవస్థపై రుద్దే ప్రయత్నం చేయకుండా మీడియా వ్యవహరించాలి. తమ సిద్ధాంతపరమైన ఆలోచనల ప్రభావం వార్తలపై, వ్యాఖ్యలపై ఉండకూడదు. మన దేశంలో మీడియా ఈ రోజు రాజకీయాలతో కలగాపులగం అయినందున ఏది నకిలీ వార్తో, ఏది నిజమైన వార్తో తెలియడం లేదు. మనకు నచ్చనివాళ్లను చౌకబారుగా విమర్శించడం సరికాదు. గతంలో చాలా గొప్ప పాత్రికేయులను మన మాధ్యమ రంగం తన నెత్తిన పెట్టుకున్నది. ముఖ్యంగా ‘24 గంటల న్యూస్ చానళ్లు’ వచ్చాక వార్తలను ఎప్పటికప్పుడు వేడిగా వండి వడ్డించాలన్న తపనతో బ్రేకింగ్ న్యూస్‌లూ, షాకింగ్ న్యూస్‌లూ ఎక్కువయ్యాయి. గత ఇరవై రోజులనుండి తె లుగు చానళ్లలో సింహభా గం ఏపీకి ‘ప్రత్యేక హోదా’పై చ ర్చను చేస్తున్నాయి. ఇప్పటివరకు ఆంధ్ర ప్రాంతంలో సామాన్యులకు నరేంద్ర మోదీ పెద్దగా ముఖపరిచయం ఉండేది కాదు. ఇప్పుడు ఏ టీవీ పెట్టినా మోదీని ‘విలన్’గా చూపిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే- రాజకీయ నాయకులు తమ శత్రుపక్షాలను వేసే ప్రశ్నలను కూడా అంతే ఆవేశంలో టీవీ చర్చలు నడిపే యాంకర్లు అడుగుతున్నారు. కొన్ని చానళ్లయితే దేశ ప్రధాని అన్న మర్యాద కూడా పాటించకుండా మోదీని తూర్పారబడుతున్నాయి. ఈ చర్చల్లో జర్నలిస్టు మేధస్సు కూడా సరిపోక, సైకాలజిస్ట్‌లతో విశే్లషణ చేయించి ప్రధానిని దుర్మార్గునిగా కొన్ని మీడియా సంస్థలు చిత్రీకరిస్తున్నారు. నరమేధం చేసిన ఐసిస్ ఉగ్రవాదుల మనస్తత్వాన్ని అంచనా వేసినట్లు ‘పోస్ట్‌మార్టమ్’ చేస్తున్నారు. రాజకీయ నేతలు అవకాశవాదం కోసం ఉపయోగించే ‘దుర్బల మనస్తత్వ రాజనీతి’ని మీడియా ఉపయోగించడం అనైతికం.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీపై ఇటీవల సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలు వెలువరించింది. దానిపై వరుస సెలవులు వచ్చినందున కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయలేకపోయింది. ఈ విషయమై కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలని కాంగ్రెస్, కమ్యూనిస్టు, బహుజన సమాజ్, సమాజ్‌వాదీ పార్టీలు సంకల్పించాయి. పది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో నెగ్గేందుకు ‘బ్రిటీష్ ఎనలటికా’ అనే సంస్థను మన దేశంలోకి ఆహ్వానించినట్లు ప్రసిద్ధ ‘రిపబ్లిక్’ న్యూస్ చానల్ బయటపెట్టింది. కులాల మధ్య చిచ్చుపెట్టడానికే ఆ సంస్థను మన దేశంలోకి ఆహ్వానించి పని అప్పగించినట్లు ప్రఖ్యాత జర్నలిస్టు ఆర్నాబ్ గోస్వామి ‘రిపబ్లిక్’ చానల్‌లో వీడియోలు విడుదల చేశాడు. అది నిజమేనా? అన్నట్లు తాజాగా జరిగిన ‘్భరత్ బంద్’ హింసాత్మకంగా మారింది. భాజపా పాలిత రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో ఎక్కువగా హింస చెలరేగింది. దాదాపు 10 మందికి పైగా చనిపోయారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దళితులపై ప్రేమకన్నా భాజపాను, మోదీని అపఖ్యాతిపాలు చేయడమే విపక్షాల ప్రధాన ఎజెండా. లింగాయత్‌లకు మైనారిటీ హోదా కల్పించి కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని కర్నాటక సీఎం సిద్ధ రామయ్య ప్రయత్నించగా, ‘ఇదంతా ఎన్నికల ఎత్తుగడ’ అని తేలిపోవడంతో- ‘సుప్రీం కోర్టు తీర్పు’ అనే కొత్త పల్లవిని కాంగ్రెస్ పార్టీ అందుకొంది. ఈ ఎపిసోడ్‌లో మీడియా పాత్ర తక్కువేమీ కాదు. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషలకు సంబంధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేటపుడు మీడియా కొంత సంయమనం పాటించకపోతే రాజకీయ నాయకుల ఉచ్చులో పడడం ఖాయం. అంతేకాకుండా ప్రజల మధ్య ఇనుపగోడలు నిర్మాణం అవుతాయి. మరీ ముఖ్యంగా భిన్న పార్శ్వాల సిద్ధాంతాలున్న మనలాంటి దేశంలో అవి మరింత రావణకాష్ఠం రగిలిస్తాయి.
దేశంలో ప్రతి సమస్యనూ మోదీ ప్రభుత్వ మెడకు కట్టేందుకు జరుగుతున్న ప్రయత్నంలో- మీడియా కూడా ‘తిలా పాపం తలా పిడికెడు’ అని పంచుకొంటే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. మన దేశంలో సిద్ధాంతపరంగా లెఫ్ట్‌వింగ్ మీడియాదే పైచేయిగా ఉంటోంది. గతంలో ప్రధాన స్రవంతి మీడియాలో రైట్‌వింగ్ ఆలోచనలకు స్థానం తక్కువ. ఇపుడు సోషల్ మీడియాను రైట్‌వింగ్ సింహభాగం ఆక్రమించడం సూడో సెక్యులర్ గుంపునకు సుతరామూ ఇష్టం లేదు. దేశంలోని దాదాపు 650 టీవీ చానళ్లు తమ ఇష్టారీతిన వ్యవహరించడం మితిమీరిన స్వేచ్ఛే. ప్రాప్తకాలజ్ఞత లేకుండా రాజకీయ నాయకుల్లా మాధ్యమాల్లోని వ్యక్తులు సంయమనం కోల్పోతే ఎలా ఉంటుందో పది రోజుల క్రితం ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళితో ‘తలంటుకున్న’ వైనం మనం చూశాం. పత్రికల్లో విశే్లషణ నింపాదిగా, ఆలోచనాత్మకగా జరిగేందుకు అవకాశం ఉంది. కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో జరిగే చర్చలు, వార్తలు, వ్యాఖ్యానాలు తీవ్ర ఉద్రిక్తతలను కలిగిస్తాయి. వీక్షకుణ్ణి ఏదో ఒకవైపు నిలబడే వరకు చేసే ప్రయత్నం ఉద్విగ్నతతో కూడి ఉంటుంది.
ఔచిత్యం పాటించకుండా ఏదో ఒక అంశానికి ‘లీడ్’ ఇవ్వాలన్న ఆతృత ప్రజల మధ్య సంఘర్షణ పెంచేదిగా ఉండకూడదన్నది జి.ఎస్.వరదాచారి లాంటి సీనియర్ పాత్రికేయులు తన ‘జ్ఞాపకాల వరద’లో చెప్పుకొన్నారు. దీనికితోడు సామాజిక మాధ్యమం కూడా చాలా చైతన్యవంతం కావడంతో- భావ పరంపర కాస్త భావ సంఘర్షణగా మారుతోంది. సోషల్ మీడియా సమాచార మార్పిడి చేసే వ్యవస్థగా మాత్రమే కాకుండా, ప్రతి వ్యక్తి దగ్గరకు వద్దన్నా వాలే సాధనంగా మారింది. ఇందులోని వార్తలు, పోస్టింగులు ఒక వ్యక్తిని రాత్రికి రాత్రే విలన్‌గా మార్చగలవు. నాయకుణ్ణి చేయగలవు! ఈ వ్యవస్థలన్నీ ‘తొండ ముదిరి ఊసరవెల్లి’గా మారితే రాజ్యాంగానికి, దాని మూల సూత్రాలకు రక్ష ఎవరు?
ఒకప్పుడు కరపత్రమో, పోస్టరో వ్యక్తుల మనోభావాలపై ప్రభావం చూపేది. అది ఒకవేళ తప్పుడు ప్రచారమైతే కూడా తెలుసుకొనే అవకాశం ఉండేది. మరి ఇప్పుడు ఒక తప్పుడు వార్తను సమాజంలోకి వదలిపెట్టే వ్యక్తిని, దానిని వ్యాప్తి చేసే వ్యక్తిని పట్టుకోవడానికి ఎంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలి! కోట్ల సంఖ్యలో పరిణతి లేని వార్తా సృష్టికర్తలను పట్టుకోవడానికి ఎంతమంది సిబ్బందిని ప్రభుత్వం ఉపయోగించాలి! ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవడానికి రాజ్యాంగ స్ఫూర్తి, నైతికత, స్వీయ నియంత్రణ అనివార్యం. ఈ మూడు లక్షణాలను ప్రధాన స్రవంతి ప్రసార మాధ్యమాలు పాటిస్తే సామాజిక మాధ్యమాలకూ మార్గదర్శనం జరుగుతుంది. ఇలా జరగనందునే నేడు ప్రసార మాధ్యమాల వార్తా వ్యాఖ్యలపై సోషల్ మీడియా చమత్కారాలు సృష్టించడం మనం చూస్తూనే ఉన్నాం.
విలువల కోసం బ్రతికిన పాత్రికేయులను పత్రికలకు మాత్రమే పరిమితం చేసి, తనకు ఏమీ పట్టనట్లు, వ్యాపారం కోసమే చేస్తున్నామన్నట్టు ఎలక్ట్రానిక్ మీడియా వ్యవహరించడం పిల్లి పాలు త్రాగడమే. కొందరి పదవులు కాపాడడం, మరికొందరిని అధికారంలోకి తేవడం, తమ అక్కసును ఇతరులపై కక్కడం మాత్రమే మీడియా పని కాదు. మీడియా రంగంలో కూడా అయోగ్యులూ, కుక్షింభరులూ, ఆత్మస్తుతి పరనిందానంద పరులూ, ఉద్యోగార్థులూ ఉంటే సమాజానికి మంచి నేర్పించేదెవరు? ప్రతి విషయాన్ని సంచలనంగా మార్చే సంస్కృతి పోతేనే ప్రజాస్వామ్య చట్రంలోని ‘్ఫర్త్ ఎస్టేట్’ మరింత బలపడుతుంది. సమాజంలో మురికిని సమూలంగా కడిగే సంస్కర్తగా ఉండాల్సిన మాధ్యమ రంగం- తాను మురికిని పులుముకొనడం వాంఛనీయం కాదు. సంఘర్షణను నివారించడానికి బదులు- స్వలాభానికి, ప్రలోభానికి లొంగిపోవడమూ సరికాదు.

-డా. పి భాస్కరయోగి bhaskarayogi.p..gmail.com