భాస్కర వాణి

భావోద్వేగాల ‘బాబు’ రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ధ్వనికి ప్రతిధ్వని తప్పదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఈ రోజు నేను ఒక వ్యక్తిపై ఎమోషన్స్ వెళ్లగక్కితే, మళ్లీ నాకు అవి ఒక రోజు తప్పవు’ - అని ఓ ప్రసిద్ధ మానసిక తత్వవేత్త అన్నారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే అలాంటి ఎమోషన్స్ రెచ్చగొట్టి ఎన్నికల్లో విజయం సాధించాలని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సర్వే సర్వత్రా విన్పిస్తున్నమాట. నిజానికి బాబు చరిత్రను క్షుణ్ణంగా చదివినవారు వైఎస్, కేసీఆర్ మాత్రమే. ఇపుడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యయనం నడుస్తున్నది. 2014లో భాజపా, జనసేనలను మిత్రపక్షాలుగా చేసుకొని ఎన్నికల బరిలోకి దిగిన బాబుకు విజయం నల్లేరుపై నడక అయ్యింది. ఎపుడు ఏ సూత్రం ఎక్కడ వాడాలో బాగా తెలిసిన రాజకీయ గణికుడు, ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలిసిన రాజకీయ ఘటికుడు చంద్రబాబు అని ఆయన మనస్తత్వం విశే్లషించిన వాళ్లకు తెలుసు. అయితే రాజకీయాల్లో ఎల్లకాలం అవకాశవాదానికి తావు ఉండదు. దాని పరిమితులు దానికి ఉంటాయి.
భాజపాతో పొత్తు బెడిసికొట్టిన తర్వాత రోజూ అదే పనిగా మోదీని తిట్టడం మొదలుపెట్టాడు బాబు. ‘అతి సర్వత్ర వర్జయేత్’- ప్రజలు కూడా ‘అతి’ని స్వీకరించరు. రోజూ తన అనుచర గణంతో అనుకూల మీడియాలో ప్రధానిని బూతులు తిట్టించడాన్ని చదువరులు చాలామంది ఏవగించుకొన్నారు. మొదట ఉత్తర -భారత, దక్షిణ-భారత అనీ, తర్వాత తెలుగు ప్రజల ఆత్మగౌరవం అనీ, ఆ తర్వాత తనపై నేరుగా దాడి జరుగుతుందని చంద్రబాబు గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. తనపై వచ్చే ప్రతి రాజకీయ ఆరోపణతో తెలుగు ప్రజలకు నష్టం వాటిల్లుతుందన్న సెంటిమెంటును ప్రజల్లోకి తీసుకొని వెళ్లడాన్ని బాబు, ఆయన అనుకూల మీడియా వారు పనిగా పెట్టుకున్నారు. భాజపాను, మోదీని దోషిగా చూపించాలనే ప్రయత్నం కొంతవరకు ఫలించిందనే చెప్పవచ్చు.
మొదట చంద్రబాబు అక్కసును మోదీ అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఢిల్లీలో కొంతకాలంగా బాబు చేస్తున్న అనవసర యాగీ మోదీని ఆలోచించేట్లు చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా కన్నా- చంద్రబాబు, లోకేశ్, ఇతర మంత్రుల, టీడిపి నాయకుల అవినీతిపై మోదీ గుర్రుగా ఉన్నందునే ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయని అంతర్గతంగా జరుగుతున్న చర్చ. వాజపేయిలా మోదీ చంద్రబాబుకు పెద్దరికం ఇవ్వకపోగా, తీవ్రంగా మందలించినందువల్లనే రెండు పార్టీల పొత్తు పెటాకులైందని ఢిల్లీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఆంధ్రలో ప్రభావం చూపలేని భాజపాను విలన్‌ను చేసి తన ప్రాబల్యం నిరూపించుకొన్న చంద్రబాబు- ఇటీవలి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌పై ఇలాగే ఒంటికాలిపై లేచాడు. ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్, ఖమ్మంలలో చేసిన ప్రచారం పైకి ‘పొంగులా’ కన్పించింది. కానీ అది వికటిస్తుందని కాంగ్రెస్ పార్టీకి కూడా తెలియదు.
ఆంధ్రా, సీమ ప్రాంత్రాల నుండి వచ్చి ఎందరో హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏ ర్పరచుకొన్నారు. వారు తె లంగాణ ఉద్యమ సమయంలో ఎలాంటి ఇబ్బందికి గురికాలేదు. కానీ ఇటీవల తెలుగుదేశం చేస్తున్న ఒక విష విఫల ప్రయోగం జాతుల మధ్య సంఘర్షణగా ఉంది. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ వీటన్నిటికీ చెక్ పెట్టి బాబుతోపాటు కాంగ్రెస్‌ను కూడా రాజకీయంగా కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. ఎన్నికలు అయ్యాక కేసీఆర్ తన సహజ ధోరణిలో ఒక రాజకీయవేత్తగా ‘రిటర్న్ గిఫ్ట్’ ఇవ్వాలని వ్యంగ్యంగా అన్నాడు. ఆ తర్వాత ఓసారి ఒడిశాకు వెళ్తూ మధ్యలో విశాఖ శారదాపీఠం దర్శించాడు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓసారి ఆంధ్రకు వెళ్లొచ్చాడు. ఇంతకుమించి వాళ్లు బాబును ఏమీ అనలేదు. కానీ ఆ రోజునుండి బాబు అనేకసార్లు కేసీఆర్‌ను రెచ్చగొడుతూనే ఉన్నాడు. కేసీఆర్, మోదీ, జగన్, పవన్‌లు అమాయకుడినైన తనపై యుద్ధానికి వచ్చారని సానుభూతి కోసం రోజూ ఏదో ఒక మీటింగ్ పెట్టి చర్వితచర్వణంగా చెప్తూనే ఉన్నాడు. పురంధేశ్వరి కుమారుడు వైఎస్ జగన్‌ను కలిస్తే అది కూడా మోదీ చేయించాడని చెప్పడం బాబుకున్న అభద్రతా ధోరణికి అద్దం పడుతున్నది. ఇపుడివన్నీ దాటిపోయి ఐటీ గ్రిడ్స్ కేసులో తెలంగాణపై యుద్ధానికి తెలుగుదేశం తలపడుతున్నది. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన వ్యవస్థలు తమ రాష్ట్రాల గురించి మాట్లాడడం కూడా రాజకీయం చేస్తున్న దౌర్భాగ్య స్థితికి ఆయన తెర తీసారు.
ఒక సమస్య వచ్చినపుడు- కోర్టులు, పోలీసులు, సీబిఐ, సిఐడి, ఈడి, ఎన్నికల కమీషన్.. లాంటి సంస్థలు కాకుండా ఇంకెవరు దాన్ని పరిష్కరించాలి? ప్రతిదానిని పార్టీ, కులం , ప్రాంతం దృక్కోణాల్లో చూస్తే మన సమస్యలను ఏ దేశం వాళ్లు విచారించాలి? ఐటీ గ్రిడ్స్ కేసులో ఒకవేళ వైకాపా తప్పు చేస్తే తెలుగుదేశం నేతలు ఎందుకు ముందుగా ఫిర్యాదు చేయలేదు. ఒక సమస్య వచ్చినపుడు దానిని పోలీసులు లేదా దర్యాప్తు సంస్థల పరిధిలోనే ఉంచే విజ్ఞత మన రాజకీయాలకు కొరవడిందా? తెలంగాణ ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేస్తే దానిపై పరువునష్టం దావా వేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? ఎన్నికల ముందు కేసీఆర్‌ను రెచ్చగొట్టి, ఆయన ఏదైనా మాట్లాడితే దానిని ఆంధ్రా-తెలంగాణ సెంటిమెంట్‌గా మార్చాలన్న దురూహ కాక ఇంకేమిటి? డేటా చోరీ కేసుకన్నా ముందే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రా పారిశ్రామికవేత్తలపై కఠినంగా వ్యవహరిస్తోందని అని చంద్రబాబు ఆరోపణలు మొదలుపెట్టారు. నిజానికి తెలంగాణ ఆర్థిక కుబేరుల్లో నారా లోకేశ్, నారా భువనేశ్వరి కూడా ఉన్నారు కదా? మరి వారికి ఏమైనా జరిగిందా? ఎం దరో ఆంధ్ర ప్రాంత టీడిపి నాయకులు కోట్ల ఆస్తులు హైదరాబాద్‌లో సంపాదిస్తే వారిపై ఈగనైనా వాలిందా? పదేళ్లు ఉమ్మడి రాజధాని అంటూ కబుర్లు చెబుతున్నవాళ్లకు హైదరాబాద్ పోలీసుల వైఖరి దుర్మార్గంగా కనిపించిందా?
రోజూ ప్రజాస్వామ్యం అని మాట్లాడే బాబు ప్రభుత్వం టీటీడీని, దేవాదాయ శాఖను ఎందుకు సమాచార హక్కు చట్టం పూర్తి స్థాయిలోకి తీసుకురాలేదు. సాలీనా 3500కోట్లకు పైగా హిందువులు వేస్తున్న హుండీ సమర్పణలు, కానుకలను వేసిన వాళ్లకే తెలుసుకొనే హక్కు లేదా? చంద్రన్న కానుకలు, అన్న క్యాంటీన్లు వంటి ఇతర పథకాలలో కేంద్రం భాగస్వామ్యాన్ని ఎప్పుడైనా ఒప్పుకొన్నారా? కొందరు టీవీ సంస్థల అధినేతలు ఈమధ్య బరితెగించి బాబు వెంట నిలుస్తున్నారు. ఇది పాత్రికేయ విలువలకు గొడ్డలిపెట్టు లాంటిది! ఇపుడు ప్రపంచ సమస్య అంతా ఏపీకి ప్రత్యేక హదాలోనే ఉంది అన్నట్లు ప్రైమ్‌టైమ్ చర్చల్లో వాదోపవాదాలు చూసి జనం నవ్వుకుంటున్నారు. దానికి మోదీని బలిచేయడం టీవీ చానళ్లు పనిగా పెట్టుకున్నాయి. మొన్నటివరకు మోదీ, కేసిఆర్, జగన్, పవన్ అన్న దూషణలతో సాగిన ఈ వ్యవహారంలో- ఒక్కసారిగా పవన్‌ను ఇందులోంచి ప్రక్కకు జరిపారు. ఇటీవల పవన్‌కళ్యాణ్ బాబుతో ఎన్నికలకు కలిసి వెళ్తారని జరుగుతున్న ప్రచారానికి ఇదొక సంకేతంగా కన్పిస్తున్నది. ఎందుకంటే బాబు ఏనాడూ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన పాపాన పోలేదు. 1983లో కాంగ్రెస్‌ను తుంగలో తొక్కి ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి వెళ్లాడు. అదే ఎన్టీఆర్‌కు ఆయన ఘోర పరాభవం రుచి చూపించి 1995లో తెలుగుదేశాన్ని హస్తగతం చేసుకొన్నారు. ఆ తర్వాత 1998లో యునైటెడ్ ఫ్రంట్‌కు హ్యాండ్ ఇచ్చి 2004లో బిజెపికి, 2009లో టీఆర్‌ఎస్‌కు, 2013లో వామపక్షాలకు, 2018లో మళ్లీ బిజెపికి.. ఇలా ఒకరిని వదిలేసి ఇంకొకరిని పట్టుకోవడం రాజకీయ వ్యూహం అనుకున్న బాబు ఇక ఇపుడు కాంగ్రెస్ పంచన చేరాడు. చివరకు ఆయన పొత్తు పెట్టుకోకుండా పోయింది వైకాపాతోనే! ఇప్పటివరకూ భాజపా, వామపక్షాల భుజాలపై స్వారీ చేసిన చంద్రబాబు ఆయా పార్టీల కేంద్ర నాయకత్వాలను తన జేబులో పెట్టుకొని చక్రం తిప్పాడు. ఇపుడు భాజపా కేంద్ర నాయకత్వం కళ్లు తెరిచింది కానీ వామపక్షాల ఉలిపికట్టె దారి మాత్రం మారలేదు.
ఇలాంటి రాజకీయ అస్థిర మనస్తత్వం వున్న వ్యక్తిగా బాబు కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించడం ఉత్తరాది నాయకులకు ఇష్టమూ లేదు, నమ్మకమూ లేదు. కానీ మోదీపై అక్కడున్న కొందరు నాయకుల గుడ్డి వ్యతిరేకత బాబుకు స్థానం కల్పించింది. భాజపాకు ఏపీలో ఎన్ని స్థానాలొస్తాయో చెప్పలేం గానీ చంద్రబాబును మానసికంగా దెబ్బతీయడంలో అమిత్ షా, రాం మాధవ్ వ్యూహం ఫలించింది. దాని పర్యవసానమే డేటాచోరీ వరకు వెళ్లింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ‘్ఫర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ వున్న చంద్రబాబు సత్యం తెలుసుకుంటే మంచిది. ‘రాజకీయాన్ని పదవుల కోసం వాడుకోవాలి కానీ పదవులను రాజకీయాల కోసం వాడకూడదు’ అని గుర్తించాలి. యూటర్న్‌లు మంచివే కానీ అవి వికటిస్తే విశ్వాసం సన్నగిల్లుతుంది. 18-09-1995న మహానటుడు ఎన్టీఆర్ తీవ్ర ఆవేదనతో మాట్లాడుతూ- ‘రాజ్యం కోసం తండ్రిని చంపి న కొడుకులు, మామల కాళ్లు నరికిన అల్లుళ్ళు ఉన్నారని చరిత్రలో వుంది. అదే పునరావృతమవుతోంది. పదవులు శాశ్వతం కాదు. డబ్బు శాశ్వతం కాదు. ఈ ద్రోహం మాత్రం చరిత్రపుటల్లో మిగిలిపోతుంది’ అన్నారు. ఈ యూటర్న్‌లు ద్రోహాలుగానే చెప్పవచ్చు. వాటి తీవ్ర పర్యవసానమే ఈనాటి ఆంధ్రప్రదేశ్‌లో ‘చంద్రుడి’కి పడుతున్న గ్రహణం!

డా॥ పి. భాస్కర యోగి bhaskarayogi.p@gmail.com