బాల భూమి

అత్యాశ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తాతయ్యా మోసపోవడం అంటే ఏమిటో చెప్పవా?’
‘అత్యాశకు పోయి నిజం కాని మాటలను నమ్మడమే’
‘మరి ఎలా మోసం చేస్తారు?’
‘మన బలహీనతని ఆయుధంగా చేసి ఉచ్చులోకి దించుతారు. కళ్లుకప్పి అంతా కాజేస్తారు’
‘అర్థం కాలేదు తాతయ్యా!’
‘సరే! మోసపోయిన ఒక పులి కథ చెప్తాను వినండి’
‘సరే తాతయ్యా!’
* * *
అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో బోలెడన్ని జంతువులు పక్షులు నివసిస్తున్నాయి. వాటిలో పులి కూడా ఒకటి. ఠీవిగా నడుస్తూ రాజసం వొలకబోస్తూ దర్జాగా జీవించేది.
ఆకలేసేటప్పుడు మాటువేసి జంతువుని వేటాడి కడుపునిండా తిని హాయిగా నిద్రపోయేది. పులి తినగా మిగిలిన దాన్ని నక్కలు, హైనాలు, రాబందులు తినేవి. రానురాను ‘నేను వేటాడకపోతే వీటికి పస్తులే’ అనే భావన పులిలో పెరిగిపోయింది. ననె్నవరూ మోసం చేయలేరు అని డాంబికాలు పలికేది.
ఓ రోజున భోరున వర్షం పడుతోంది. వాతావరణం బయట చల్లగా ఉంది. గుహలో ఉన్న పుల్లలతో మంటను పెట్టి చేపలను పుల్లకు గుచ్చి కాల్చుకుని తింటోంది నక్క. అదే సమయంలో తడుచుకుంటూ గుహలోకి వచ్చింది పులి. నక్కను చూసి ఆశ్చర్యపోయింది.
‘నక్క బావా! ఏమిటీ సంగతి? వర్షం కారణంగా ఒక్క జంతువు దొరక్క నేను ఆకలితో ఉన్నాను. నువ్వేమో హాయిగా తింటున్నావు? ఎలా?’ అని ప్రశ్నించింది.
నా కోడీ కుంపటీ లేకుంటే తెల్లారదన్నట్లు తాను వేటాడకపోతే మిగిలిన జంతువులు పస్తులుంటాయనుకుంది పులి. నక్కను చూడగానే తన కళ్లను తానే నమ్మలేకపోయింది.
‘అదేదో నాక్కూడా చెప్పవా? రోజూ వేటాడలేక పోతున్నాను’ అని నక్కని బ్రతిమాలింది పులి.
అసలే ఆకలి మీద ఉంది. చెప్పకపోతే తినేస్తుందేమో అని భయపడింది నక్క.
‘దానికేం భాగ్యం! చెప్తాను. మేక మాంసం పట్టుకెళ్లి మర్రిచెట్టు కింద పెడితే చాలు. రోజూ మనకి ఆహారం ఉచితంగా లభిస్తుంది. ఈ చేపలు అలా వచ్చినవే’ అంది నక్క.
నక్క మాటలు ఎంతో నమ్మశక్యంగా అనిపించాయి పులికి.
వర్షం తగ్గగానే మేకని వేటాడి మర్రిచెట్టు దగ్గరికి ప్రయాణమయ్యింది.
కష్టపడక్కర్లేకుండా రోజూ ఆహారం దొరుకుతుందనే ఆశతో ముందూ వెనకా చూసుకోకుండా నడిచి వేటగాళ్లు పన్నిన ఉచ్చులో పడిపోయింది పులి.
మర్నాడు వేటగాళ్లు వచ్చారు. ‘మన పంట పండింది. దీని గోళ్లు, చర్మం అమ్ముకుంటే మనకు బోలెడు సొమ్ము’ అని అనుకున్నారు.
వారి మాటలు విన్న పులి - ‘అయ్యో కష్టపడ్డానికి ఇష్టపడక అయాచితంగా వచ్చే దాని కోసం ఆశ పడ్డాను. ప్రాణాల మీదికి తెచ్చుకున్నాను. మిగిలిన జంతువులకు ఆహారంగా మిగిలాను’ అని లబోదిబోమని ఏడ్చింది.
చూశారా పిల్లలూ... అత్యాశకు పోయి పులి ఎలా మోసపోయి ప్రాణాల మీదికి తెచ్చుకుందో.. అందుకే ఉచితంగా ఇచ్చేవాటి కోసం ప్రాకులాడకూడదు.

- పి. కాశీవిశ్వనాథం 9494524445