సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు .. 17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11
రంగరాజు రామచంద్రరాజు గారి ఇల్లెక్కడండి?’ అడిగేడు యుగంధర్, తనకి ఎదురైన ఓ మనిషిని.
‘తెలియదు’ చెప్పి, ఆగకుండా వెళ్లిపోయాడతను.
సాలూరుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మక్కువ గ్రామం. నిన్న రాత్రి సాలూరు చేరుకుని ఓ లాడ్జిలో దిగేడు యుగంధర్. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని బస్సులో మక్కువ గ్రామం వచ్చాడు. నాలుగు రోడ్ల కూడలి చుట్టూ విస్తరించిన చిన్న ఊరది. అక్కడే రకరకాల షాపులున్నాయి. ‘పార్వతీపురం, సాలూరు’ అంటూ అరుస్తున్నారు ఆటో వాళ్లు.
ఆ కూడలిలో నిలబడి చుట్టూ పరిశీలనగా చూశాడు యుగంధర్. ఓ మూల నేలలో కర్రపాతి దానికి గొడుగు కట్టి ఆ నీడలో కూర్చున్నాడో వృద్ధుడు. అతని ముందు పాత చెప్పులు, చెప్పులు బాగు చెయ్యడానికి ఉపయోగించే పరికరాలు చిరిగిన గోనెసంచి మీదున్నాయి. పని లేకపోవడంతో జనాన్ని చూస్తున్నాడతను.
‘పెద్దాయనా! రంగరాజు రామచంద్రరాజు గారి ఇల్లెక్కడ?’ అతన్ని సమీపించి అడిగేడు యుగంధర్.
ఆరడుగుల పొడవున్న యుగంధర్ని ఎగాదిగా చూసి అన్నాడతను,
‘సచ్చిపోనారు బాబూ!’
‘ఎప్పుడు?’
‘శానాకాలమైంది’
యుగంధర్ ఓ క్షణం ఆలోచించి ప్రశ్నించేడు.
‘ఆయన బంధువులు ఎవరైనా ఉన్నారా?’
‘తెల్దండి’
‘రామచంద్ర రాజుగారి గురించి తెలిసిన మనిషి ఎవరూ లేరా?’
‘బాపడు ఉన్నాడండి. ఆరి దగ్గర శానాకాలం పని చేశాడు. ఇంతకీ తమరెవరండీ?’ అడిగేడతను.
ఆ వృద్ధుని కళ్లు అమాయకంగా ఉన్నాయి. శరీరమంతా ముడతలు పడింది. జీవనం కష్టంగా సాగుతున్న దానికి గుర్తుగా చొక్కా, పంచె మాసి ఉన్నాయి. ఆ వయసులో కష్టపడటమంటే చిన్న విషయం కాదు.
‘విశాఖపట్నం నుంచి వచ్చాను పెద్దాయనా! రామచంద్రరాజు గారి గురించి తెలుసుకోవాలని వచ్చాను’ చెప్పాడు యుగంధర్.
తలపంకించాడా వృద్ధుడు.
‘ఆరు మక్కువ గ్రామంలో పెద్ద భూస్వామి బాబూ! రెండొందల ఎకరాల భూమి, లంకంత కొంప ఉండేది. ఆరు పోయాక అవన్నీ అమ్మేశారు’ చెప్పాడు.
‘ఎవరు అమ్మేశారు?’
‘ఆ బోగట్టా నాకు తెల్దు బాబూ!’
‘సరే... బాపడు ఎక్కడుంటాడు?’
‘ఆ తోవలో కూసింత దూరం పోతే కుడిపక్క అరటితోట ఉంటుంది. అందులో పాక వేసుకున్నాడు’
అతనికి కృతజ్ఞతలు చెప్పి ఆ రోడ్డులో నడవసాగేడు యుగంధర్. నాలుగు రోడ్ల కూడలిలో తప్ప ఆ దారిలో మనుషులు తిరగడం లేదు. ఊరు చుట్టూ కొండలు, మరి కొంత దూరం వెళితే అడవి. ఇరవై నిమిషాల తర్వాత కుడివైపు రోడ్డుకి ఆనుకుని కనిపించింది అరటితోట. అరటి చెట్ల మధ్య నుంచి లోపలికి నడిచాడు యుగంధర్.
‘ఎవరది?’ ఖంగుమని ఎడమ వైపు నుంచి దూసుకొచ్చింది ప్రశ్న. ఆగి అటు దృష్టి సారించాడు యుగంధర్. గునపంతో అరటి పిలకలు తీస్తున్న మనిషి కనిపించాడు.
‘బాపడు కావాలి’ అన్నాడు యుగంధర్.
‘ముదిరిన గెలలు లేవు’ చెప్పాడతను.
‘అరటి గెలల కోసం రాలేదు. బాపడుతో మాట్లాడాలి’
‘నేనే బాపడ్ని. ఏం మాట్లాడాలి?’ అడిగేడు కదలకుండా.
‘రంగరాజు రామచంద్ర రాజుగారి గురించి మాట్లాడాలి...’
గునపాన్ని నేల మీద వదిలిపెట్టి నిటారుగా నిలబడ్డాడతను. రెండు చేతులు పైకెత్తి ఆకాశానికి నమస్కారం చేశాడు. ఆ తర్వాత నడుముకి కట్టిన తువ్వాలు విప్పి దులిపి భుజం మీద వేసుకున్నాడు. యుగంధర్‌ని సమీపించి కళ్లు చిట్లించి చూస్తూ అడిగేడు.
‘తమరెవరు? ఎక్కడ నుంచి వచ్చారు? మా పెదరాజుగారు మీకెలా తెలుసు?’
‘కూర్చుని మాట్లాడుకుందాం’
బాపడు పాకలోకి వెళ్లి ఓ పాత కుర్చీ తెచ్చి నీడలో వేశాడు. యుగంధర్ కూర్చున్నాక పక్కనే రాయి మీద చతికిలబడ్డాడు.
‘నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. పెదరాజుగారు ఓ కుర్రాడ్ని పెంపకానికి తీసుకున్నారని తెలిసింది. ఆ కుర్రాడు ఏమయ్యాడు?’
‘ఆడు పెద్ద మాదచ్చోదు..’ అని, ఆలోచనల్లో మునిగిపోయాడు.
‘రాజుగారికి పిల్లలు లేరా?’
బాపడు ఆలోచనలకి అడ్డు కట్ట వేసిందా ప్రశ్న.
‘బంగారు బొమ్మలాంటి కూతురుండేది. ఆయమ్మ వైజాగ్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ప్రాణంలా చూసుకునే కూతురు అలాంటి పని చేసినందుకు పులిలాంటి పెదరాజుగారు కుంగిపోయి పిల్లిలా అయిపోయేరు. ఎన్ని రోజులు గడిచినా ఆయన తిరిగి మామూలు మనిషి కాలేదు. ఎవరినైనా పెంచుకోమని దిగులు కొంత తగ్గుతుందని డాక్టర్ బాబు చెప్పాడు. చిన్నపిల్లల్ని ఆ వయసులో పెంచడం కష్టం కాబట్టి కాస్త వయసు వచ్చిన కుర్రాడి కోసం వెదికి ఒరిస్సా నుంచి సాహుగాడిని తెచ్చారు. ఆడు గొప్ప మాయగాడు’
‘ఏం చేశాడు?’ ఆసక్తిగా అడిగేడు యుగంధర్.
‘రాజుగారికి రెండొందల ఎకరాల భూమి ఉండేది. అంతేకాదు, ఊళ్లో చాలా ఆస్తులు ఉన్నాయి. వాటి వ్యవహారాలు, బ్యాంకులో డబ్బు జమ చెయ్యడం వంటి పనులు సాహుకి అప్పగించారు. ఒకరోజు అలమండలో ఓ రాజుగారింట్లో పెళ్లికి భార్యతో వెళ్లారు పెదరాజుగారు. ఆరు తిరిగొచ్చేసరికి కొంత డబ్బు, బంగారం తీసుకుని పారిపోయాడు వెధవ...’
బలరామ్ సాహు మీద బాపడికి పీకల దాకా కోపం ఉండటానికి కారణం అర్థమయింది యుగంధర్‌కి.
‘పోలీసు కంప్లైంట్ ఇవ్వలేదా?’
‘ఇచ్చారు బాబయ్యా! ప్రయోజనం లేకపోయింది. డబ్బు, బంగారం పోయినందుకు పెదరాజుగారు బాధపడలేదు. పది ఎకరాల భూమి, ఒక ఇల్లు సాహుకి ఇవ్వాలని అప్పటికే నిర్ణయించుకున్నారు. మంచి పిల్లని చూసి పెళ్లి చేద్దామనుకున్నారు. కాని వాడు విషపురుగని నిరూపించుకున్నాడు’
‘రాజుగారి భార్య ఎక్కడున్నారు?’
‘పెదరాజుగారు పోయేక అమెరికా నుంచి కూతురు వచ్చింది బాబూ! ఆస్తులు మొత్తం అయినకాడికి అమ్మేసి అమ్మని తీసుకుని అమెరికా వెళ్లిపోయిందా అమ్మ. రాజుగారిది పెద్ద మనసు కాబట్టి ఆరు పోవడానికి నెల ముందు ఈ మూడెకరాలు నాకు రాసిచ్చారు. ఏడేళ్ల వయసులో రాజుగారి లోగిలిలో పనికెళ్లి అక్కడే ఉండిపోయాను. రాజుగారి చదువు, పెళ్లి, కూతురు పుట్టడం నా కళ్లతో చూశాను. ఆరి దానధర్మాలు, తుపాకి పేల్చడంలోని నైపుణ్యం నాకు తెలుసు. రాత్రి చల్లని వెనె్నల్లో నేలమీద వెల్లకితలా పడుకుని గుండెలమీద కూతుర్ని నిద్రపుచ్చడం తెలుసు. భోజనానికి కూర్చునే ముందు ‘బాపడికి పెట్టావా?’ అని అమ్మగార్ని అడగడం ఇంకా నా చెవుల్లో మారుమ్రోగుతోంది. రాజుగారి వయసు నా వయసు ఒక్కటే బాబూ! ఆ దేవుడు నన్నొగ్గేసి మారాజుని తీసుకుపోయేడు’ అతని గొంతు గద్గదమై పొడి కళ్లు చెమర్చాయి.
కాసేపు వౌనంగా ఉండి అతను తేరుకున్నాక అడిగేడు యుగంధర్.
‘అయితే బలరామ్ సాహు ఏమయ్యాడో తెలియలేదా?’
‘లేదు బాబూ! దొరికితే నా చేతులతో పీక పిసికి చంపేసేవాడిని’ కోపంగా అన్నాడు.
‘పోలీసులు కూడా ఏమీ చెయ్యలేకపోయారు అంతేనా?’
‘అంతే బాబూ! సాహుగాడు రాజుగారి పనుల మీద సాలూరు వెళ్లి వచ్చేవాడు. సాలూరులో చదువుకుంటున్న ఓ పిల్లని తీసుకుపోయాడని చాలా కాలం తర్వాత తెలిసింది. అందులో నిజమెంతో ఆ భగవంతుడికే తెలియాలి’
తన దర్యాప్తు అంత తేలిగ్గా పూర్తి కాదని అర్థమయింది యుగంధర్‌కి.
* * *
‘చెప్పరా అబ్బీ..’
‘వివేక్‌గాడి పని పూర్తయింది’
‘గుడ్...’
‘రేపు మాజీ మంత్రి ఒకతను విశాఖపట్నం వస్తున్నాడు. అతను గ్రీన్ పార్క్‌లో దిగుతాడట. జాస్మిస్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు. పాత కస్టమరే కాబట్టి ఇన్‌స్ట్రుమెంట్ పంపడం లేదు’
‘పొలిటికల్‌గా ప్రస్తుతం అతని పరిస్థితి ఏమిటి?’
‘మంత్రిగా ఉన్నప్పుడు రెండు చేతులతో సంపాదించాడు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఓ గ్రూప్‌ని తయారుచేశాడు. ఇంటెలిజెన్స్ ద్వారా అదంతా తెలుసుకుని ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి సాక్ష్యాలు చూపించి మంత్రివర్గం నుంచి తప్పించాడు ముఖ్యమంత్రి. ఒకప్పటి ఉప్పెనలో ఎమ్మెల్యే అయ్యేడు తప్ప నియోజకవర్గంలో పెద్దగా పలుకుబడి లేదు’
‘ఈసారి గెలవడా?’
‘కష్టం. రాష్ట్ర విభజన జరిగాక కొంతకాలం వౌనంగా ఉండిపోయి ఇప్పుడు సమైక్యం అంటున్నాడు. సొంత పార్టీ వాళ్లే అతన్ని నమ్మరు’
‘సరే... ఇన్‌స్ట్రుమెంట్ పంపకు’ చెప్పి కాల్‌కట్ చేశాడు గంగోత్రి.
ఇంతలో వాచ్‌మాన్ రెడ్ కలర్ వ్యానిటీ బ్యాగ్ టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయాడు.
సాగర్‌నగర్ చివర పొలాల్లోని ఆ బిల్డింగ్ ఆవరణని చీకటి చుట్టుముట్టింది. బిల్డింగ్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. పదడుగుల ఎత్తు కాంపౌండ్ వాల్‌కి తోడు లోపల చెట్లు దట్టంగా ఉండటంతో చీకటి మరింత చిక్కబడింది. బ్యాగ్ ఇచ్చాక వాచ్‌మేన్ మెయిన్ గేటు పక్కనున్న గదిలోకి వెళ్లిటార్చి ఆపేసి తలుపు మూసుకున్నాడు.
గంగోత్రి వ్యానిటీ బ్యాగ్‌తో తన రూములోకి ప్రవేశించాడు. ఎప్పటిలా డ్రాయర్ నుండి రమ్, క్లాసు, వాటర్ బాటిల్ తీశాడు. గ్లాసులో రమ్ పోసుకుని నీళ్లు కలిపి సగం తాగేడు. సొరుగు లాగి చిన్న కీ తీసి వ్యానిటీ బ్యాగ్ లాక్ తెరిచాడు. జిప్‌లాగి జాగ్రత్తగా ఓపెన్ చేశాడు. లోపల వీడియో కెమెరా ఉంది. దాని నుండి సి.డి. తీసి డివిడికి ఇన్సర్ట్ చేశాడు.
బెడ్ మీద పద్మాసనం వేసుకుని కూర్చున్న ఏభై దాటిన వ్యక్తి రూపం తెర మీద ప్రత్యక్షమైంది. అతను తన కుడి వైపు తిరిగి,
‘రా...’ అన్నాడు.
‘రమ్మంటుంటే..’ రెండు క్షణాల తర్వాత తిరిగి అన్నాడు.
పాతికేళ్లు నిండని అమ్మాయి మంచాన్ని సమీపించింది. అతను చెయ్యి సాచి ఆమెను పట్టుకుని తన కాళ్ల మీద వెల్లకితలా పడుకోబెట్టుకున్నాడు. తలవంచి పెదాలు అందుకోబోయాడు. ఆ అమ్మాయి తల పక్కకి తిప్పడంతో బుగ్గని ముద్దాడాడు. వయసులోనే కాదు తన శరీరంలో సగం కూడా లేని ఆ పిల్లతో...
ఆ గదిలో జరుగుతున్నదంతా స్పష్టంగా రికార్డయ్యింది. కెమెరా బెడ్‌కి ఎదురుగా ఉంచడంవల్ల గదిలోని మిగతా భాగం కనిపించడం లేదు. అరగంటసేపు దాన్ని చూసి ఆపేశాడు గంగోత్రి. అలాంటివి ఎన్నో చూసి ఉండటంవల్ల వింత అనిపించలేదు అతనికి. తనని ఎవరూ గమనించడం లేదని తెలిస్తే మనిషి మృగంలా మారిపోతాడు.
గోడ గడియారం చూసి పది దాటడంతో సెల్ అందుకుని ఓ నెంబర్ డయల్ చేశాడు. అవతలి మనిషి లైనులోకి వచ్చాక చెప్పాడు.
‘చెన్నైకి పది టికెట్లు బుక్ చెయ్యాలి. రేపటికి సరిగ్గా అరవై రోజులకి అడ్వాన్స్ రిజర్వేషన్. సావిత్రి, దమయంతి పేర్లకి మరో ఎనిమిది పేర్లు కలపాలి. హౌరా మెయిల్ అయితే బెటర్...’
సెల్ టేబుల్ మీద పడేసి గ్లాసులో మిగిలిన రమ్ తాగేసి ఆలోచనల్లో మునిగిపోయేడు.
దక్షిణ తమిళనాడులో అరవాన్ అనే దేవుడి గుడి ఉంది. సంవత్సరానికి ఒకసారి అక్కడ పండుగ జరుగుతుంది. దేశంలోని హిజ్రాల్లో అధిక శాతం మంది ఆ పండుగ రోజున అరవాన్ దేవాలయానికి వెళతారు. రెండు రోజులపాటు అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి.
ఆ పండుగలో ప్రధాన అంశం హిజ్రాలు అరవాన్‌ని పెళ్లి చేసుకుని ఓ రాత్రి దేవుని భార్యగా ఉండటం. మరునాడు తన భర్త మరణించాడని విధవరాలు కావడం. గుడిలోని పూజారి హిజ్రాల మెడలో అరవాన్ దేవుని తరఫున తాళి కడతాడు. మరునాడు ఉదయం అదే పూజారి కత్తితో తాళి తెంపేసి గాజులు పగలగొడతాడు. భర్తని కోల్పోయిన హిజ్రాలు విలపిస్తారు.
ఈ తంతుకు ముందు అందాల పోటీలు జరుగుతాయి. అందులో గెలుపొందిన హిజ్రాకి వెండి కిరీటం తొడుగుతారు. ప్రపంచంలో జరిగే అందాల పోటీల మాదిరిగానే జడ్జీలు ఒక్కో ఈవెంట్‌కి మార్కులు వేస్తారు. ఇదంతా హిజ్రాల ఆధ్వర్యంలో జరుగుతుంది. అరవాన్ దేవాలయానికి ఎన్నిసార్లు వెళ్లినా పెళ్లి మాత్రం ఒక్కసారే చేసుకోవాలి.

-మంజరి 9441571994