కథ

పేపర్ ప్లేట్ (కథల పోటీలో ఎంపికైన రచన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిరిమిట్లు గొలిపే లైట్లు, బాణాసంచా కాల్పులు, దాని ప్రక్క పెద్ద టెంట్ దాని చుట్టు రంగురంగుల ఇంద్రధనుస్సు రంగుల క్లాత్‌లతో, ముస్తాబుతో చేసిన ఆ పరిస్థితులు చూస్తుంటే నిన్నటి వరకు చూసిన పనికిరాని కంపు కొడుతున్న పోరంబోకు స్థలమేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతటి పెంట వున్నా టెంట్ వేసి డెకరేట్ చేస్తే రంగి, రంగనాయకమ్మ అయినట్లుందనడానికి ఇదే ఉదాహరణ అన్నట్లు కనపడుతుంది ఈ స్థలం. టెంట్‌లో గులాబీల గుబాళింపు, మల్లెల మకరందాలు, చామంతుల సోయగాలు, పొద్దుతిరుగుడు పరిమళాలు, వివిధ సువాసనల కలయిక, రంగుల పూలు కంటికి మాత్రమే కాదు, మనస్సు దోచుకునే పెద్ద పచ్చి పూల స్టేజి, దానిపైన మహరాజ కుర్చీలో ముదురు గోధుమ రంగు సూట్ మరియు బూట్, బుగ్గని చుక్క, నొసటికి బాసికం కట్టి, మెళ్లో పెద్ద చైన్, కుడిచేతికి బ్రాస్‌లెట్, ఎడమ చేతికి రిస్ట్‌వాచీతో చక్కనైన పెళ్లికొడుకు. లైట్ వయొలెట్ రంగు, చెకీలు అతికిన ఫుల్‌త్రెడ్ ఫ్యాన్సీ ఓవర్ వర్క్ చీరకు తగినట్టే, డిజైన్‌లతో ఉన్న ప్యాచ్‌వర్క్ జాకెట్, మెడలో చంద్రహారం, అరవంకీలు, తలలో పాపిడి బిళ్ల, చెవులకు పెద్ద దుద్దులు, సన్నని నడుముకి బంగారు వడ్డాణం, గోరింటాకుకు కాలం చెల్లిపోవడంతో రెండు చేతులకు కోన్‌లతో అలంకరించిన చామనఛాయ రంగు మగువకు, బుగ్గ చుక్క, మెరుపులతో కూడిన బాసికం, పెళ్లిబొట్టు స్టిక్కర్‌తో పాటు సంప్రదాయానికి తగినట్లు తిలకంతో పెట్టిన బొట్టు, కాటుక కళ్లను చూడగానే ఆకట్టుకునే చుక్కలాంటి పెళ్లికూతురు కూర్చున్నారు. అది చూసేసరికి కన్నుల పండువగా కనిపిస్తుంది.
అతిథులను ఆహ్వానించే బఫూన్ బొమ్మలు, మ్యూజికల్ నైట్ జరుగుతుంటే, తెల్లవారుఝామున పెళ్లని సందకాడే కాబోయే దంపతులను కూర్చోపెట్టి ఆశీర్వదిస్తున్నారు. కోలాహలంగా, ఆహ్లాదంగా సాగుతున్న ఆ పెళ్లి వేడుక ఆ గ్రామంలో వారికి, వివాహానికి వచ్చిన బంధువులకు చాలా కొత్తగా, వింతగా ఉంది. ఎందుకంటే పెళ్లి కాకుండానే ఆ జంటను ఆశీర్వదించమంటుంటే... గాని ఏదో విధంగా జరిగిపోతున్న విషయాన్ని కాదనకుండా, అందరూ ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుకుంటున్నారు. వారిలోనున్న వృద్ధ దంపతులు కాంతయ్య, కనకమ్మ, వారి మేనల్లుడు రాంబాబు, అతని భార్య భ్రమరాంబ వచ్చి పలుకరించి, వారి వెనకాలే కూర్చున్నారు. పెళ్లికి వచ్చిన వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో...
గ్లాస్కో పంచె, లాల్చీ, మెరిసిన జుట్టు, రోషానికి లోటు లేదన్నట్టు మెరిసిన మీసాలతో, శరీరంలో పట్టుతగ్గని కాంతయ్య, పక్కనే ముదురు ఆకుపచ్చ రంగు పెద్ద అంచు పట్టుచీరలో, సాంప్రదాయకమైన రవికతో, పాత రూపాయి బిళ్లంత కుంకుమ బొట్టు, ముడతలు పడిన చర్మంతోపాటు ఎన్నో అనుభవాలను తనలో మడత పెట్టినట్లు కనిపించే కనకమ్మ. వృద్ధజంట కొత్త జంటను మించి ముచ్చట్లాడుకుంటుంటే, తమ ప్రక్క ఒక ప్రపంచముంది, జనం వున్నారని గాని, తమను ఎవరైనా చూస్తున్నారనే తలంపు కూడా వారికి రావడం లేదు. స్టేజీ మీదకు వెళ్లి వచ్చిన ముసలమ్మ తన చేతిలోని అరటిపండు తన భర్త చేతిలో పెడితే తాను ‘నాకెందుకులే కనకము’ అనగానే ‘నాకు చెందినది ఏదైనా మీదే కదండీ’ అంది కనకము. అరటిపండును వొలిచి తను సగం తిని, మిగిలిన సగం తన భార్యకు ఇవ్వడంతో ఎంతో వయ్యారాలు వొలకబోస్తూ ‘నాకు వద్దు లేండీ’ అంది.
‘నాలో సగం నీవు, నీలో సగం నేను. మనమిద్దరం ఫిఫ్టీ, ఫిఫ్టీ కదా అందుకే మన ఇద్దరకూ సమానమే’ అంటుంటే రాంబాబు మనసుకు వారిద్దరూ వృద్ధ రతీ మన్మథుల్లా కనిపిస్తూన్నారు.
‘ఏమండీ! ఏమిటీ విడ్డూరమంటారు?’ అంది కనకమ్మ.
‘ఏ విషయం?’ అన్నాడు కాంతయ్య.
‘పెళ్లి రాత్రి ఒంటి గంటకు’ అన్నారు, పెళ్లి కాకుండానే కూర్చోబెట్టి ఆశీర్వదించమంటున్నారేమిటండీ? ఇలాంటివి ఎపుడైనా మనం చూశామంటారా?’
‘అది కాదే కనకం. మారుతున్న రోజులు. మారుతున్న పద్ధతులు ఇవన్నీ సహజం’
‘అలా అయితే దీన్ని ఏమంటున్నారో?
‘రిసెప్షనంట’
‘రిసెప్షనంటే ఏమిటి?’
‘పెళ్లి తర్వాత స్టేజి మీద, భార్యాభర్తలకు మెళ్లో దండలు వేసి కూర్చోపెడుతున్నారు. బంధువులు, మిత్రులు, పెద్దలు స్టేజి మీదకు వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. అదే విధంగా రిసెప్షన్‌కు వచ్చిన వారు బహుమతులు గాని, కట్న కానుకలు గాని నూతన వధూవరులకు అందిస్తూన్నారు. ఈ మధ్యకాలంలో అర్ధరాత్రో, తెల్లవారుఝామున ముహూర్తాలు వస్తూంటే, బంధువులు, కావలసిన వారు వెళ్లిపోతున్నారని ఈ కొత్త తంతును మొదలుపెట్టారు. ఏదో పెంట మీద టెంట్‌ను రెడీమేడ్ పందిరిగా వేసి, అక్కడే వంటలు వండి వడ్డిస్తున్నారు. చాలామంది జనం వస్తారు. ఇప్పుడు చాలా హడావిడీ, స్పీడు, కంప్యూటర్ యుగంలో, కొత్త జంటను చూస్తారో చూడరో గాని, బఫే మీల్సంటూ నచ్చిన ఆహారాన్ని నిలబడి దూడల్లా తినేసి, ఆర్కెస్ట్రా, మ్యూజికల్ నైట్‌ల వంటివి ఉంటే వాటిని చూసుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోతున్నారు’ అన్నాడు కాంతయ్య.
‘ఆహా! ఎంత సునిశితమైన పరిశీలన, ఎంత చక్కగా ఈనాటి ఈ వివాహ వ్యవస్థను వివరిస్తున్నాడు’ అనుకున్నారు పక్కనే ఉన్న రంభ, రాంబాబులు.
‘అవునండీ! ఆనాటి మల్లెల సువాసన లేదు. మనస్సులో మమతానురాగాలు లేవు. ఎవరైనా బంధువులు వస్తే, ఆప్యాయంగా పలుకరిస్తూ ఎదురెళ్లి కాళ్లు కడుగుకోవడాన్కి నీళ్లు, తుడుచుకోవడానికి తువ్వాలు, తాగడానికి లోటాతో నూతి నీళ్లు గాని, చల్లగాని ఇచ్చి ఎంతో ఆదరంగా పలుకరించేవారు, గాని ఈనాడు సువాసన వెదజల్లే మిషన్లు, స్వాగతం పలికే బఫూన్ బొమ్మలు, వచ్చామో రాలేదో కూడా పట్టించుకునే నాథుడే కరువైపోయారు’ అంది కనకం.
‘పెళ్లి తంతు జరుగుతున్నంతసేపు పంతులుగారు ఏమి చెబుతున్నారో, అదే చేస్తూ మనస్సంతా పెళ్లి మీదే లగ్నమయేది. గాని ఇపుడు చూపులు దేవుడి వైపు, చిత్తం చెప్పుల మీద అన్నట్లు తయారైంది’ అన్నది కనకం.
‘ఏమైందిపుడూ!’ అంటూ కొంత వెటకారంగా సాగదీశాడు కాంతయ్య.
‘ఏదో పెద్దవాళ్లం కదాని అక్షింతలు వేయమని మనల్ని స్టేజి పైకి పంపిస్తే అక్కడ ఆ ఫొటోలు, వీడియోలు తీసేవాళ్లు, తాతగారు మీరటువైపు, బామ్మగారు మీరిటువైపు అంటూ దంపతులమైన మనల్ని విడగొట్టి, ఆశీర్వదించమంటాడా ఆ కుర్రపీనుగా? ఏమనుకుంటున్నాడీడు? అడిగేవారు లేరనుకుంటున్నారో ఏమో!’ అంటూ కోపంగా కనకం అనగానే,
‘పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరికిందట! అలా ఉంది వీళ్ల వాలకం’ అంటూనే ‘మారుతున్న కాలంతోపాటు మనం కూడా మారాలి. లేదంటే చాదస్తపు ముండా కొడుకులంటూ పిలవను కూడా పిలవరు. పిలిచిన మనల్ని పట్టించుకోరు. వెనుకటి మా పెద్దమ్మ ప్రతిదానికి ఇలానే అంటుందని మా చిన్నమ్మగారి చిన్నోడు కూతురు పెళ్లికి మా చెల్లి ఇంటికెళ్లి శుభలేఖ ఇచ్చి, అక్కడే వున్న మా పెద్దమ్మను పిలవడం మానేశాడు, దానితో మా వదిన దగ్గర చెప్పుకుని ఎంత బాధపడిందంటావు! అందుకే కొన్ని విషయాలు మనం మరిచిపోవాలి’ అంటూ భార్యను సున్నితంగా మందలిస్తుంటే చూసిన రాంబాబుకు ఆ భార్యాభర్తల మధ్య అవగాహనకు కాస్తంత నవ్వు, ఇంకొంచెం ఆశ్చర్యం కలిగాయి.
‘మన పెళ్లికి ఫొటోలు, వీడియోలు లేవనేగా మన మనస్సులో పదిలపరచుకున్న భావాలు, నాటి చిలిపి సంఘటనలు, మన మనస్సును విడిచిపోలేదు కదండీ!’ కనకం అంటూండగా, ‘జీవితంలో తొలి స్పర్శ మధురానుభూతులు, వీడియోలు, ఫొటోలలో ఉంటుందంటావా కనకం’ అంటూ కాంతయ్య ‘మన అనుభవాలు మననం చేసుకోవడానికి, అయితే వీడియోలు అక్కర్లేదు. అవి ఎప్పుడూ మనలో పదిలంగానే ఉంటాయి. కాని మన ఫీలింగ్స్ ఎదుటి వారు చూడడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి’ అన్న మాటలు వినేసరికి ఒక్కసారిగా రాంబాబు, తన భార్య వంక ఓరచూపులు చూశాడు.
‘వీడియోలు, ఫొటోలు ఏం చేసుకుంటారు’ అంటూ మళ్లీ అమాయకంగా అడిగింది కనకం.
‘మనం మన మనస్సులో పదిలపరచుకున్న ఊహలను, వీళ్లు ఫొటోలు, వీడియోలలో చూసుకుని స్మరించుకుంటారు అసలే కంప్యూటర్ యుగం. చూసుకోవడానికి కూడా ఖాళీ ఉండదు’ అంటూ ప్రస్తుత పరిస్థితులను చక్కగా తెలియజేస్తున్నాడు కాంతయ్య.
‘రాబోవు కాలంలో పెళ్లిళ్లు ఎలా ఉంటాయంటారు?’ అని ఆమె అనగానే ‘కార్యం ముందు కల్యాణం తర్వాత అంటారేమో’ అన్న ముసలోడి రసికతకు పక్కనే ఉన్న రాంబాబు, భ్రమరాంబలకు చాలా ఆశ్చర్యం వేసింది.
ఈలోపులో కాంతయ్య ‘కనకమా, ఓసీ కనకమా.. కాస్తంత భోజనం చేద్దామా?’ అంటూ రాగాలు తీయగానే ‘పెళ్లివాళ్లు పిలుస్తారు కదా అపుడు వెళదాం’ అంటూ నెమ్మదిగా అంది.
‘ఈ రోజుల్లో ఇది చాలా అత్యాశ, నీవు అలా కూర్చుంటే భోజనాలు అయిపోతాయి రా బంగారం’ అంటూ ఎంతో ప్రేమగా పిలిచేసరికి రాజ్‌కపూర్, నర్గీస్ దత్‌లా ఇద్దరూ భోజనాల లైన్లోకి వెళ్లారు.
కాంతయ్య ప్రేమను చూసిన భ్రమరాంబ ‘మీరు వున్నారూ ఎందుకు? ఎప్పుడైనా అంత ఇదిగా పిలిచారా?’ అనగానే, ‘ఆ వయసు వస్తే నేను కూడా అలానే చేస్తానులే’ అంటూ రాంబాబు అనగానే కిలకిల నవ్వుకుంటూ, ఆ పెద్దవాళ్ల వెనుకే రంభ, రాంబాబులు కూడా కదిలారు.
భోజనాల క్యూ చాలా పెద్దదిగానే ఉంది. అయితే మధ్యాహ్న భోజనం దగ్గర బడి పిల్లల్లా నెట్టుకోవడం లేదు గాని, తుఫాను బాధితుల్లా వరుసగా వెళ్లి భోజనాలు పెట్టించుకుంటున్నారు. ఇది చూసిన కనకం ‘ఏమిటీ ప్రారబ్దం. ఏమిటీ పద్ధతులు. గుడి దగ్గర భోజనాలు పెడుతుంటే నిలబడినట్లు’ అనగానే,
‘అలా అనకు ప్రస్తుతం ఇదే ఫ్యాషన్. ఇంకేమైనా అంటే విన్నవాళ్లు, నిలబడి తినే వాళ్లు బాధపడతారు’ అంటుండగానే నెమ్మదిగా ప్లేట్స్ ఇచ్చే కౌంటర్ దగ్గరకు చేరారు వారు.
తెలుపు ప్యాంట్, దానిపైన చారల చొక్కా, పైనో టోపీతో యూనిఫార్మ్‌లోని కేటరింగ్ కౌంటర్‌లోని అబ్బాయి ఒక పేపర్ ప్లేట్ ఇచ్చాడు.అది తీసుకుని ముందుకు వెళ్లేసరికి, రెండు రకాల స్వీట్లు, మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, ఫ్రైడ్ రైస్, బిర్యాని, ఉల్లి చట్నీ, పాలక్ పన్నీర్, జీడిపప్పు కూర, పప్పు మామిడికాయ, గోంగూర మషూరూమ్స్ కర్రీ, పొటాటో సిక్స్‌టీ ఫైవ్, కొత్త ఆవకాయ, చిప్స్, సాంబార్‌తో పాటు రైస్, ఫ్రూట్ సలాడ్స్, కాస్ట్‌లీ ఐస్‌క్రీమ్స్, ఇలా వరుసగా ఒక్కొక్కటి వేసేసరికి, ప్లేట్ నిండిపోయింది. అందరూ నిలబడి ఏదో విధంగా తినేస్తున్నారు. ఏమి తినాలో, ఏమి మానాలో తెలియని తికమక పరిస్థితిలో నడుచుకుంటూ కొందరూ, నిలబడి కొందరు, ఖాళీగా వున్న కుర్చీల్లో కూర్చుని మరి కొందరు భోజనాలు చేస్తూన్నారు.
‘ఏమండీ! ఆ రోజుల్లో పెళ్లిళ్లకు ఉదయానే్న ఇంటింటికెళ్లి, గ్రామాన్నంతా పిలిచి పచ్చని పందిట్లో చాపలు వేసి సరిపోకపోతే చుట్టుపక్కల వాళ్ల ఇంటి అరుగుల మీద గాని, గదుల్లో గాని, కూర్చోబెట్టి, కావలసినవన్నీ అడిగి అడిగి మరీ కొసరి, కొసరి వడ్డిస్తుంటే, కావలసినవారు కావలసినన్ని వేయించుకుని తినడం, బావమరదులు వేళాకోళంగా కొసరి కొసరి వడ్డిస్తుంటే బలవంతంగా తినడం, తినిపించడం ఎంతో సరదాగా, సంతోషంగా ఉండేదంటారు?’ అన్న కాంతం మాటలకు,
‘మధ్యాహ్నం సున్నడులు గాని, అరిసెలు గాని వారి తాహతును బట్టి వేసి, ముద్దపప్పు, పనసపొట్టు, గుమ్మడికాయ దప్పళం, కొత్త చింతపండు చారు, మజ్జిగ వేస్తే ఎంత ఆబగా ఆవురావురుమంటూ తినేసేవాళ్లం’ అన్నాడు కనకయ్య.
‘ఇప్పుడు ఒక బూరె వేస్తుంటే షుగరని కొందరు, ఫ్యాషన్‌కు మరి కొందరు, విస్తరిలోనే తినకుండా వదిలివేస్తున్నారు. అపుడు ఉదయమే రోజూ చద్దన్నంగాని, తర్వాణీగాని తినేవాళ్లం కాబట్టి టిఫిన్‌గా బూరెలు కావలసినన్ని వడ్డిస్తుంటే, ఎంతో సంతృప్తిగా ఆరగించేవాళ్లం’
‘ఈ రోజుల్లో ప్రతిరోజు టిఫిన్ చేసుకు తినడంతో ఎవరో గాని ఆసక్తి చూపడం లేదు’ అన్నాడు కాంతయ్య.
‘ఆ రోజుల్లో కాఫీ, టీలు ఎవరో గాని తాగేవారు కాదు దానితో పెళ్లికి తెచ్చిన బూరేపల్లి బెల్లంతో టీ కాసి ఇస్తే చాలా ఆనందంగా తాగేవారు’
‘మామయ్యా! ఆనాటికి, ఈనాటికి పెళ్లిళ్లలో వచ్చిన మార్పులు చెప్పండి’ అని రాంబాబు అడగ్గానే,
‘ఏముంది రాంబాబూ! ఆ రోజుల్లో సన్నాయి మేళం పెడితే, మీ పెళ్లి నాటికి బ్యాండ్ మేళాలు, మరిప్పుడు మ్యూజికల్ నైట్‌లంటూ గంతులు వేస్తున్నారు. అలాగే బంధువులందరూ కొన్ని రోజులు ముందుగానే వచ్చి, పెళ్లి పనులు చక్కబెడితే, సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, బావలు, బావమరుదులు కూడా ఆ సమయానికి వచ్చి భోంచేసి, కనీసం సుముహూర్తానికి కూడా ఉండకుండా పరాయి వాళ్లల్లా వెళ్లిపోతున్నారు. గతంలో మా ఇంటిలో వాళ్లు అలానే చేసారు అని చెబుతున్నారు. అలా అలా నెమ్మదిగా బంధుత్వాలు, బాంధవ్యాలు రోజురోజుకి నీరస పడిపోతున్నాయి’ అన్నాడు కాంతయ్య.
కనకం కల్పించుకుని, ‘మేము గ్రామంలో పెళ్లి అవుతుంటే ప్రతి ఇంటి నుండి కొంతమంది వెళ్లి, పసుపు, కుంకుమ, పిండి, కారం, వడ్లు దంచడం, ఇంకా కావలసిన వాళ్లైతే ఇంటికి సున్నాలు వేయడం, ఒకటేమిటి ఓ పక్క ముఖ్యమైన బంధువులు మరోపక్క గ్రామస్థులతో పెళ్లి కళ వచ్చేది. గాని ఇపుడు, ఒక్కరోజు కూడా పెళ్లి కళ లేకుండా ఎవరెవరో వచ్చి వాళ్ల పనులు వాళ్లు చక్కబెట్టడం, ముఖ్యమైన వాళ్లు అతిథుల్లా వచ్చి భోజనం ఎపుడు పెడతారా అని చూసి తినేసి వెళ్లిపోవడం’ అంది.
‘కాదండీ పెద్దమ్మగారు, ఇపుడు ఆడ, మగ అనే తేడా లేకుండా సంపాదించకపోతే గాని ఇల్లు గడవడం లేదు దానితో ఉద్యోగాలు, వ్యాపారాలు చేయడం వలన క్షణం తీరిక లేకపోవడంతో ఎవరికి వారు ఇలా వచ్చి అలా వెళ్లిపోవలసి వస్తుంది’ అంది భ్రమరాంబ.
‘రాబోవు కాలంలో పెళ్లిళ్లు కూడా ఇంటర్నెట్‌లో చూసి, అక్కడి నుండే ఆశీర్వదించే రోజులు వస్తాయేమోనన్న అనుమానం కలుగుతుంది’ అన్నాడు రాంబాబు.
‘అది కాదురా అబ్బాయి మనమెంత మారినా, మనమెక్కడ ఉన్నా మన సంప్రదాయాలు, ఆచారాలు మరిచిపోయి, ఇతరుల సంస్కృతికి బానిసలు కాకూడదు. ఎందుకంటే, మన కట్టు, బొట్టు, నడక, నడత ఇవన్నీ మనకు మన పూర్వీకులు అందించిన వరాలు. వాటిని విడిచి పెట్టడం అంటే నేల విడిచి సాము చేస్తున్నట్లే. గురజాడ అప్పారావుగారు చెప్పినట్లుగా, ‘ఏ దేశమేగిన ఎందుకాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం’ అదే విధంగా మన సంస్కృతీ సంప్రదాయాలు, ఆచారాలు మనం కాపాడుకోవాలి’ అన్నాడు కాంతయ్య.
అలా కబుర్లతో కాలక్షేపం జరుగుతుండగానే, భోజనాలు ముగియడం, సుముహూర్తానికి సమయం అవడంతో, స్టేజి మీద నుండి నూతన వధూవరులను కిందకు తీసుకువచ్చారు. తర్వాత పెళ్లికూతురును తీసుకొచ్చి ప్రదానంతో పెళ్లిని పురోహితులు చాలా సందడిగా బహు సంప్రదాయంగా జరిపిస్తున్నారు. పెళ్లిలో తంతును చూసిన ప్రతివారు తమ ఊహాలోకాలలో విహరిస్తూ, మధ్యమధ్యలో బంధుమిత్రులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యమైన వారు తప్ప మిగిలిన వారు తెల్లవారేసరికి వెళ్లిపోయారు.
ఇక ఇంట్లో పెళ్లికూతురు తల్లి పరిమళ, తండ్రి కామేష్, ముఖ్యమైన కొంతమంది బంధువులున్నారు. అదే రోజు సాయంత్రం గర్భాదాన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో మధ్యాహ్నం నుండి వచ్చే వియ్యాల వారికి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు వధువు తల్లిదండ్రులు, మిగిలిన చుట్టాలు. ఆ కార్యక్రమం కూడా పూర్తవడంతో మిగిలిన బంధువులు ఎవరి దారిన వారు వెళ్లడంతో ఇల్లంతా బోసిపోయినట్లయింది.
నాలుగు రోజులు గడిచేటప్పటికి, పెళ్లికొడుకు తండ్రి వచ్చి మా కోడలును పంపించండని చెప్పి వెళ్లినాడు. కూతురును తొలిసారి పంపించడానికి ఇక రెండే రోజులున్నయి. కావలసిన సరుకులు, సామాన్లు అన్నీ సిద్ధం చేసుకుంటూనే కుటుంబ సభ్యులకు, ముఖ్యమైన బంధువులకు, మిత్రులకు కబుర్లు ఫోన్ ద్వారా కామేష్, పరిమళలు చెబుతున్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి మా అమ్మాయిని తొలిసారి పంపిస్తున్నాము రావాలని అక్కడ ఉన్న ఆచారం ప్రకారం అరవై కుటుంబాల వాళ్లకి చెప్పి వచ్చారు. కామేష్ కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉంటే, పరిమళకు కూడా ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు చెల్లెళ్లు మొత్తం మీద పది మంది కలవారే.
తెల్లవారితే కూతురు కూడా వెళ్లి, ఆ మూడు రోజులు ఉండడానికి ఒక్కరు కూడా అంగీకరించలేదు. ప్రతివారు ఏదో కారణం సాకుగా చెబుతున్నారు. పిల్లల పరీక్షలనీ, సెలవులు లేవనీ, మొనే్న వచ్చామని, ప్రయాణం చేయలేమని, వొంట్లో బాగోలేదని, మా అత్తవారు తరఫు పెళ్లి ఉందని, ఫంక్షన్ ఉందని అక్కడకు వెళ్లాలనీ, అనారోగ్యమని, ఇటు పరిమళ తరఫు వారు, కామేష్ తరఫు వారు ఇదే సమాధానం.
తొలిసారి వెళ్లి కూతురు అత్తింట్లో కంచం కడితే కడుక్కుపోతుందని, తుడిస్తే తుడుచుకుపోతుందని ఎప్పుడో నానమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఎలా పంపాలనే ఆలోచనతో కామేష్ బాధ పడుతుంటే, ఆ విషయం తెలిసిన పరిమళ మనోవ్యధలో మునిగిపోయారు.
‘మనం మన సంపాదనంటూ ఎప్పుడూ ఎవరింటికి సరిగా వెళ్లేవాళ్లం కాదు. ఎప్పుడూ మనం చదువు, చదువు అంటూ మన పిల్లలకు, బంధువులెవరో, తెలియకుండా పెంచాం. దీనితో ఈవేళ మన పరిస్థితి ఇలా మారుతుందని’ పరిమళ అనగానే, కామేష్ మనసు లోతుల్లో తెలియని బాధ మొదలైంది. ‘పోటీ ప్రపంచంలో ఎప్పుడూ ఆర్థికంగా ఎదగాలనే తపనే తప్ప బంధుత్వాలు, బంధాలు గురించి ఆలోచించని మనకు మనుషులు, మనసులు, మమతలు అనే ఆలోచనలు కలిగాయంటే, మనం ఇతరులతో ప్రవర్తించిన విధానం, ఫలితమే అనిపిస్తుంది’ అంటుంటే, పరిమళ కల్పించుకుని, ‘జరిగిందేదో జరిగింది. జరగవలసింది ఆలోచించండి’ అన్నది.
తన మనస్సంతా గతంలో తాను చేసిన సహాయ సహకారాలు, తన నుండి ఉపకారం పొందిన చుట్టాలు, బంధువులు, ఎందుకిలా మారిపోయారు వంటి ఆలోచనలతోపాటు, తన వారిళ్లలో జరిగిన కార్యక్రమాలకు ఎప్పుడు హాజరైంది, ఎలా సహకరించాడో ఒక్కొక్కటి సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌లా కనిపించి తన మనస్సంతా గందరగోళంగా తయారైంది.
రాత్రి పావుతక్కువ పది కావస్తోంది. ఎదురింట్లో నుండి ఎఫ్.ఎం. రేడియోలో పాట వినపడుతోంది. డెబ్బై దశకంలో విడుదలైన ‘తాత-మనవడు’ సినిమా నుండి పాటను ఫోన్ ద్వారా కోరిన శ్రోతలు మాళవిక అనగానే తన చిన్నకూతురు మాటలా ఉందేమిటాని పరిమళతో అన్నాడు కామేష్ ‘ఇందాకనే ఫోన్ చేస్తే మన సమస్యను చెప్పాను’ అంది పరిమళ. ‘అనుబంధం ఆప్యాయత అంతా ఒక బూటకం - ఆత్మశుద్ధికై మనుషులు ఆడుకునే నాటకం’ కామేష్ పాటను వింటూ చాలాసార్లు తన పిల్లలకు పాత సినిమాల్లోని పాటలను పరిచయం చేయడంతో తన సమస్యకు తన చిన్నకూతురు పరిష్కారం చూపిందన్న ఆనందంతో లేచి బయటకి వెళ్లాడు. ఏదైనా సమస్య వచ్చినపుడు పాత సినిమాలోని ఆణిముత్యాలు విని తన సమస్యను తానే పరిష్కరించుకునే కామేష్ బంధువుల మీద కోపాన్ని విడనాడి, తను చేయవలసిన పని తను నిర్ణయించుకున్నాడు.
తను సరుకులు తెచ్చుకునే డిపార్ట్‌మెంటల్ స్టోర్‌కి వెళ్లి కేరీ బ్యాగ్‌తో ఒక పేకెట్ తెచ్చి, తన భార్య చేతికి అందించాడు ‘ఏమిటి తెచ్చారు?’ అని అడిగిన పరిమళకు ‘ఉదయానే్న చెబుతాను. భోజనం చేద్దాం పద’ అన్నాడు. భోజనం చేసి ప్రశాంతంగా పడుకుని ఉదయానే్న లేచారు.
పరిమళ సామాన్లు అన్నీ సర్దుతోంది. వెళ్లడానికి టాక్సీలు, సుమోలు వచ్చాయి. తిరిగి వచ్చేవారికి కూడా వాహనాలు పెట్టించారు. అప్పగింతలు అన్నీ చెబుతున్నారు. ఇంతలో కామేష్ వచ్చి కేరి బ్యాగ్‌లో వున్న పేపర్ ప్లేట్ పేకెట్ తీసి, అత్తింటికి వెళుతున్న కూతురు చేతికి ఇచ్చాడు.
‘ఏమిటి నాన్నా! ఈ పేపర్ ప్లేట్స్?’ అన్న ప్రశ్నకు బదులుగా కన్నీళ్లు నిండిన కళ్లతో ‘అత్తవారింట్లో నీవు తొలిసారి వెళ్లినపుడు కంచం కడిగితే కడుక్కుపోతుంది. తుడిస్తే తుడుచు పోతుందంటారని ఎపుడో చిన్నపుడు మా నాన్నమ్మ మన గ్రామంలో తొలిసారి వెళ్లే మా పక్కింటి అక్కతో అంది. అందుకని నీవు కంచం కడగరాదమ్మా! మనకు ఎంతమంది బంధువులున్నా, కావలసిన వారున్నా నీతో వచ్చి ఉండడానికి ఎవరికీ తీరిక లేదంటమ్మా! కన్నతల్లి రాకూడదు. నీకన్నా చిన్నదైన చెల్లిని పంపకూడదంటారు. అందుకని నీవు ఈ పేపర్ ప్లేట్‌లో భోజనం చేసి నీ ప్లేట్‌ను డస్ట్‌బిన్‌లో వేయమ్మా’ అనేసరికి అక్కడకు చేరిన ప్రతివారికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
ఈ రకమైన పరిస్థితులకు కారణాలు కొన్ని మనం చేసుకున్నవే. ఎందుకంటే మనకు రోజు బాగానే గడిచిపోతుంది. క్షణం తీరిక లేదంటూ ఎవరింట్లో ఏమి జరిగినా వెళ్లకపోతే చివరకు ఇలానే జరుగుతుంది. బంగారు పళ్లానికైనా నిలబడాలంటే మట్టిగోడ కావాలంటారు. డబ్బు ఎంత సంపాదించినా చివరకు పది మందిని సంపాదించుకోకపోతే ఇలానే ఉంటుంది అంటూ గుసగుసలాడుకుంటున్నారు.
‘బంధాలు భారమై, మమతలు మాసిపోయి, మనుషుల మధ్య ఆర్థిక బంధాలు తప్ప, మరే విధమైన ఋణానుబంధాలు లేకపోతే, ఇలానే ఉంటుంది. మనుషులు నాటకాలు ఆడవచ్చు గాని, మనస్సులు నాటకాలు ఆడితే ఇటువంటి పర్యవసానాన్ని ఎదుర్కొనక తప్పదు. అందుకే మనుషులమైన మనం మనసున్న మనుషులుగా ఉండాలి, గాని అవసరమైనంత డబ్బు సంపాదించే మనుషులు గానే బతకాలి తప్ప, డబ్బు మాత్రమే సంపాదించే మరమనుషులుగా మారరాదని కోరుకుంటున్నాను. జరిగినదేదో జరిగిపోయింది. భవిష్యత్తులో మీరైనా మీ అత్తింట్లోగాని, పుట్టింట్లోగాని, ఏవైనా కార్యక్రమాలు జరిగితే పాల్గొని, అందరితో హాయిగా కలివిడిగా ఉండమని’ కామేష్ తన కూతురి చెప్పి అత్తింటికి పంపించాడు. వాహనాలన్నీ వరుసగా వెళుతున్నాయి.
వారిని సాగనంపి ఇంట్లోకి వస్తుంటే మ్యూజిక్ ఛానల్‌లో ‘బ్రతుకంత బాధగా కన్నీటి ధారగా మనసున మనసై, బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన, అదే చాలును, అదే..’ అన్న పాట వినబడుతోంది. చిన్నప్పటి నుండి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని అత్తవారింటికి తొలిసారి పంపించినందుకు కొంత బాధ, తన ఆలోచన లోపంతో అందరికి దూరమవడం మరికొంత బాధ, ఆ పాటలో భావముతో కామేష్ కళ్లు చెమ్మగిల్లాయి.

- ఎం. బాలాజీ
ప్రభాకర్‌నగర్ కాలనీ,
గంగలకుర్రు అగ్రహారం,
అంబాజీపేట మండలం, తూ.గో.జిల్లా. 9492260018

- ఎం. బాలాజీ