సబ్ ఫీచర్

అణగారిన బ్రాహ్మణులకు ఆసరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్క్షేమానికి పెద్దపీట వస్తూ, అసహాయులకు అండగా నిలుస్తూ ముందుకెళుతున్న కేసిఆర్ నాయకత్వంలోని తెరాసా ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, ఈ బడ్జెట్‌లో బ్రాహ్మణ సంక్షేమం కోసం నిధులను కేటాయించడం అభినందించాల్సిన విషయం. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తన బడ్జెట్ ప్రసంగంలో ‘‘సమాజంలో ఇతర వర్గాల లాగానే, బ్రాహ్మణ సమాజంలో పేదలున్నారని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి బ్రాహ్మణ సంక్షేమం కోసం ఈ బడ్జెట్‌లో రూ.100కోట్లను కేటాయిస్తున్నది. అంతేకాదు ఈ నిధి విధి విధానాలను ఖరారు చేస్తాం’’ అన్నారు.
బ్రాహ్మణుల స్థితిగతులు రోజురోజుకూ క్షీణించిపోతున్నాయి. ఎంతోమంది బ్రాహ్మణులకు రోజు గడవడమే కనాకష్టమైపోతున్నది. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బ్రాహ్మణులకు ఎంతో ఆసరాగా నిలుస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. బ్రాహ్మణుల్లో వైదిక బ్రాహ్మణులు, నియోగులు, అయ్యవార్లు, ఆరాధ్యులు, మధ్వలు, వైఖానసలు తదితరులు ఉన్నారు. వీరందరికి ప్రభుత్వం ద్వారా లాభం చేకూరుతుంది. పేద బ్రాహ్మణుల జీవన స్థితిగతులపై అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తే, వారి సామాజిక స్థితిగతుల వివరాలు మరిన్ని అందే అవకాశముంది.
నిన్నటి వరకు గుర్తించని వర్గాలలోని పేదరిక సమస్యను గుర్తించి వారి సంక్షేమం కోసం ముందడుగు వేయడం ద్వారా ప్రభుత్వం అభివృద్ధి పట్ల తన సమగ్ర దృక్పథాన్ని చాటుకుంది. గ్రామీణ సమాజం స్వయం సమృద్ధితో సాగినంతకాలం అన్ని వృత్తుల వారికి మాదిరిగానే తమ కులవృత్తి అయిన పౌరోహిత్యం, అర్చకత్వం, వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తూ బ్రాహ్మణులు జీవనం గడిపారు. అయితే కాలనుగుణంగా వచ్చిన మార్పులు గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని కులవృత్తులను దెబ్బతీసినట్లే, బ్రాహ్మణుల వృత్తిపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా వీరి పరిస్థితి దిగజారిపోయింది. పౌరోహిత్యం చేసేవారు రైతుల ఇళ్లల్లో జరిగే శుభాశుభ కార్యాలను నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంతో జీవించేవారు. అదేవిధంగా అర్చక వృత్తిని సాగించేవారు, గుడికి సంబంధించిన భూమిపై వచ్చే ఆదాయంతో జీవనం గడిపేవారు. అయితే వ్యవసాయం గిట్టుబాటు కాక రైతుల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోయిది. వారిపై ఆధారపడి జీవించే బ్రాహ్మణుల పరిస్థితీ దయనీయంగా మారింది.
అనాదరణకు గురవుతున్న దేవాలయాల్లో భక్తులు హారతి పళ్లెంలో వేసే డబ్బులకోసం దీనంగా చూసే బ్రాహ్మణులు ఎందరో. ఆషాఢం వచ్చినా, మూఢం వచ్చినా ముహూర్తాలు లేకపోయినా బ్రాహ్మణుల వంటింట్లో పిల్లి లేవదు. శుక్రవారమో, శనివారమో తప్ప మిగతా రోజుల్లో భక్తులు దేవాలయానికి రారు. దీంతో ఆదాయం ఉండదు. ఆకలిని, దారిద్య్రాన్ని బయటకి చెప్పుకోలేని ఆత్మాభిమానంతో బ్రాహ్మణులు కుమిలిపోతున్నారు. రేషన్‌కార్డుపై వచ్చే బియ్యం కోసం ఎదురుచూసే కుటుంబాలు ఎన్నో..పౌరోహిత్యం వృత్తిలో ఉండే వారికి పిల్లనివ్వడానికి ఆడపిల్లల తల్లిదండ్రులు ముందుకు రావడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికీ ఆరవై శాతం బ్రాహ్మణులు అరకొర చదువులు చదివి పురోహితం మీద ఆధారపడి అంతంత మాత్రం బతుకులే గడుపుతున్నారు. సినిమా, టీవీ, తదితర సాంస్కృతిక రంగాల్లో బ్రాహ్మణులు కనిపించరు. వ్యాపార రంగంలో బ్రాహ్మణుల భాగస్వామ్యం నామమాత్రంగా కూడా లేదు. రాజకీయాల్లో కూడా అక్కడొకరు, ఇక్కడొకరు తప్ప పెద్దగా కనిపించరు. సామాజిక గౌరవం కొద్దో గొప్పో ఉన్నవారు కనుక ఇటు చిన్న వృత్తులలో ఇమడలేక, పురోహితం, అర్చక వృత్తులు తప్ప వేరే మార్గం లేక సతమతమవుతున్నారు. పట్టణాలకు వలస వచ్చినవారు అక్కడి దేవాలయాలలో నాలుగైదు వేల రూపాయలు వేతనంగా పొందుతున్నారంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. బాగా ఆదాయం ఉన్న దేవాలయాల్లో రూ.10 వేలకు మించి ఆదాయం లభించని స్థితి. పెరిగిపోతున్న జీవన వ్యయం, ఆడపిల్లల పెళ్ళిళ్ల ఖర్చు, ఆనారోగ్యం పాలైతే అసుపత్రి ఖర్చు జీవితాలను మరింత కుంగదీస్తున్నాయి. మరోవైపు ఓట్ల రాజకీయాల్లో, జనాభా తక్కువ ఉన్న బ్రాహ్మణులు ఎవరికీ పట్టరు. గొంతెత్తి సమస్యలు చెప్పుకునే చైతన్యం లేక, చెప్పుకున్నా వినే నాథుడు లేక బ్రాహ్మణులకు సమాజంలో ఊపిరాడని స్థితి. ఎవరికీ పట్టని, ఎన్నికల్లో లాభించని బ్రాహ్మణ సమాజం గోడును అర్థం చేసుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశాల దృక్పధాన్ని అభినందించి తీరవలసిందే.
అసలింతకీ..రాష్ట్రంలో బ్రాహ్మణులెంతమంది ఉన్నారనేది ఇతమిద్ధంగా లెక్కలు లేవు. బహుశా 6 నుంచి 12 లక్షల వరకు ఉండవచ్చునని ఒక అంచనా. మెజారిటీ దాదాపు 85-95 శాతం వరకు 50కి పైగా నగరాల్లో ఉంటే, మిగిలిన ఏ కొద్దిమందో ఇంకా గ్రామాలను అంటిపెట్టుకొని ఉన్నారు. సాధారణంగా గ్రామానికి ఒకటి లేదా రెండు కుటుంబాలకు మించి లేవు. ఒక అంచనా ప్రకారం సుమారు 10 శాతానికి పైగా 65 ఏళ్ల వయసు పైబడినవారే. ఇటువంటి వృద్ధులకు వృద్ధాశ్రమం నెలకొల్పడం మంచిదని కొందరి సలహా. ప్రభుత్వ పథకాల్లో బ్రాహ్మణులకు భాగస్వామ్యం, వేదపాఠశాల ఏర్పాటు, అపర కర్మలకు వౌలిక వసతుల ఏర్పాటు, బ్రాహ్మణ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం, హెల్త్‌కార్డులు, పంచాంగం రూపొందించడంలో ప్రత్యేక శిక్షణ వంటి కార్యకలాపాలు ప్రభుత్వం చేపట్టవచ్చు. ప్రతి గ్రామంలోని దేవాలయంలో బ్రాహ్మణ పూజారి నియామకం, ధూప దీప నైవేద్యాలకు తగిన ఏర్పాట్లు చేయడం, బీద బ్రాహ్మణులకు రుణ సదుపాయం కల్పించవచ్చు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బ్రాహ్మణ సంక్షేమ నిధి నిర్ణయం దోహదపడగలదు. అందువల్ల బ్రాహ్మణ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన కె. చంద్రశేఖర్‌రావు అభినందనీయులు.

-వనం జ్వాలా నరసింహారావు సెల్: 08008137012