రాష్ట్రీయం

అసెంబ్లీలో కాల్‌కలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం
రోజా సస్పెన్షన్ ఎత్తివేసే వరకు సభ జరగనివ్వం: జగన్
సస్పెండ్ చేసైనా జరుపుతాం: యనమల
హైదరాబాద్, డిసెంబర్ 19: ఆంధ్ర అసెంబ్లీలో వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా సస్పెన్షన్ వ్యవహారంపై అధికార, విపక్ష ఎమ్మెల్యల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి సభలో ఎటువంటి అజెండా చర్చించకుండానే సోమవారానికి వాయిదాపడింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, మంత్రి యనమల రామకృష్ణుడికి మధ్య మాటల సంవాదం చోటుచేసుకుంది. శాసన సభ నిబంధనలకు విరుద్ధంగా తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేయడం తగదని, రూల్ బుక్ ప్రకారం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల వరకు మాత్రమే సస్పెన్షన్‌ను పరిమితం చేసే అధికారం ఉందన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయకుంటే సభ జరగనిచ్చేది లేదని జగన్ తెగేసి చెప్పారు. శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు బదులిస్తూ అసెంబ్లీ సుప్రీంఅని, కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవని, ఏడాదిపాటు విధించిన సస్పెన్షన్‌ను తిరగతోడే ప్రసక్తిలేదని కరాఖండిగా చెప్పారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు రూలింగ్ ఇస్తూ వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజాపై ఏడాదిపాటు విధించిన సస్పెన్షన్ కొనసాగుతుందని, దీనిపై చర్చకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అధికార, విపక్ష పార్టీల వాగ్వాదాల మధ్య సభ రెండుసార్లు సభ వాయిదా పడింది. మూడోసారి సమావేశమైనప్పుడూ సభ నియంత్రణలోకి రాకపోవడంతో సభను సోమవారానికి స్పీకర్ వాయిదా వేశారు.
సభ ప్రారంభమైన తర్వాత కాల్‌మనీ వ్యవహారంపై తమకు మాట్లాడేందుకు అనుమతించాలని బిజెపి సభ్యుడు విష్ణుకుమార్ రాజు స్పీకర్‌ను కోరారు. ఈ అంశంపై ఇప్పటికే చర్చ ముగిసిందని స్పీకర్ చెప్పగా, పది నిమిషాల పాటు మాట్లాడేందుకు అనుమతివ్వాలన్నారు. మరోరూపంలో వస్తే సమయం ఇస్తామని స్పీకర్ తెలిపారు. అనంతరం ప్రతిపక్షనేత జగన్ లేచి తమ ఎమ్మెల్యే రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. శాసనసభ నిబంధనలు 340 ప్రకారం ప్రస్తుత శాసనసభ సమావేశాల వరకే సస్పెన్షన్‌ను కొనసాగించేందుకు రూల్స్ అంగీకరిస్తాయన్నారు. లేని అధికారంతో ఒక మహిళా సభ్యురాలి హక్కులను ఎలా కాలరాస్తారని ప్రశ్నించారు. అసెంబ్లీ రూల్స్ ద్వారా నడుస్తుందని, ప్రతిపక్షం ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసుకుంటే పోతే ఏమి ప్రయోజనమన్నారు. మంత్రులు అచ్చెంనాయుడు ఎన్నోసార్లు అన్‌పార్లమెంటరీ పదాలు వాడితే ఇదే చేశారా? ముఖ్యమంత్రి చంద్రబాబు అంతు చూస్తామంటూ వేలు చూపించి బెదిరించారు, ఏం చర్య తీసుకున్నారు? రూల్ బుక్‌లో లేనప్పుడు ప్రత్యేకాధికారాలు వాడొచ్చు. ఇలా సస్పెండ్ చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం విఫలమవుతుంది. దయచేసి రోజాపై విధించిన ఏడాది సస్పెండ్ తొలగించండి అని జగన్ కోరారు. అన్యాయం జరుగుతుంటే ప్రతిఘటిస్తాం అన్నారు. రోజా కేవలం కాల్‌మనీ పదాన్ని కామ అన్న అబ్రివేషన్‌లో మాట్లాడారని ఇందులో తప్పేముందని ప్రశ్నించారు.
మంత్రి యనమల బదులిస్తూ హౌస్ తీసుకున్న నిర్ణయం సర్వోన్నతమైనదని, స్పీకర్ నిర్ణయంపై సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకోలేదన్నారు. కించపరిచే విధంగా సభ్యురాలు వ్యాఖ్యలు చేశారన్నారు. సభను ప్రశ్నించే అధికారం సభ్యులకు లేదన్నారు. గతంలో ఇందిరాగాంధీని కూడా లోక్‌సభలో అనర్హత వేటు వేశారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సస్పెన్షన్‌ను ఎత్తివేసే ప్రసక్తిలేదని, కావాలంటే సరైన పద్ధతిలో రావాలన్నారు. హౌస్‌ను ప్రతిష్టంభింపచేయడం తగదని, ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రతి రోజూ రద్దవుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు సభను జరగనివ్వమంటే కుదరదని, కావాలంటే సస్పెండ్ చేసుకోమంటున్నారని, చివరకు అదే పని చేస్తామన్నారు. ఈ గందరగోళం మధ్య సభ ఒకసారి వాయిదా పడింది. సభ మళ్లీ సమావేశమైన తర్వాత ప్రతిపక్షనేత జగన్ మాట్లాడుతూ శాసనసభ ఆవరణలోకి రావడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే రోజాపట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, ఆమె అనారోగ్యంతో ఉన్నారని చెప్పారు. గతంలో తొమ్మిది రోజులు ఆసుపత్రిలో ఉండి వచ్చాచరన్నారు. బిపి, చక్కెర లెవెల్స్ పడిపోయాయన్నారు. తాను వినమ్రంగా స్పీకర్‌ను కోరుతున్నానని, ఎవరికి ఎటువంటి ఉద్దేశాలూ ఆపాదించడం లేదని, సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్నారు. గతంలో కరణం బలరాం అనే ఎమ్మెల్యేను సస్పెండ్ చేసినా ఎథిక్స్ కమిటీ సిఫార్సు మేరకు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ జోక్యం చేసుకుని సస్పెండైన సభ్యుడు లేదా సభ్యురాలు సభలోకి, ప్రాంగణంలోకి రావడానికి వీలులేదని, క్వార్టర్స్‌ను కూడా ఖాళీ చేయించాలని నిబంధనలో ఉందని చెప్పారు. మంత్రి యనమల మళ్లీ జోక్యం చేసుకుని ఈ విషయమై స్పీకర్ తగిన నిర్ణయం తీసుకుని సభను నిర్వహించాలని కోరారు. స్పీకర్ శివప్రసాదరావు మాట్లాడుతూ సస్పెన్షన్‌ను పునపరిశీలించే అవకాశం లేదన్నారు. దీంతో సభ మళ్లీ వాయిదాపడింది. తిరిగి సభ సమావేశమైన తర్వాత వైకాపా సభ్యుల నినాదాల మధ్య మంత్రులు ఆరు బిల్లులను ప్రవేశపెట్టారు. అనంతరం సభ సోమవారానికి వాయిదాపడింది.