ఆంధ్రప్రదేశ్‌

వర్షాలతో రైతులు రాలేరనే వాయదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: వర్షాల వల్ల రైతులంతా హాజరుకాలేరన్న భావనతోనే నేలపాడులో ఆప్రాంత రైతుల విజ్ఞప్తుల మేరకు సోమవారం జరగాల్సిన ప్లాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఈ నెల 25న అమరావతిలో ఆరు లేన్ల సీడ్ యాక్సిస్ రోడ్డుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారని, సాధ్యమైనంత మేర అదేరోజు నేలపాడు ప్లాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని అనుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. సోమవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్లాట్ల కేటాయింపును అత్యంత పారదర్శకంగా ఆన్‌లైన్‌లో లాటరీ పద్ధతిలో నిర్వహించ దలిచామన్నారు. ఇందుకోసం భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. ముందుగా ఈ నెల 21 నుంచి 24 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఆన్‌లైన్ లాటరీ డెమోను తుళ్లూరు సిఆర్‌డిఎ కార్యాలయంలో చూడవచ్చన్నారు. ఆరు లేన్ల రహదారికి అనుబంధంగా మొత్తం 29 గ్రామాలను కలిపేలా మరో ఏడు రహదారుల నిర్మాణానికి కూడా త్వరలో టెండర్లు పిలువనున్నామన్నారు. గత 200 సంవత్సరాల కాలంలో 20.13 మీటర్ల మేర ముంపు నమోదైందని చెప్పారు.

సంగీతా చటర్జీకి బెయిల్ పొడిగింపు
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు. జూన్ 20: ఎర్రచందనం మహిళా స్మగ్లర్ కోల్‌కతాకు చెందిన సంగీతాచటర్జీకి కలకత్తా కోర్టు బెయిల్ మరిన్ని రోజలు పాటు పొడిగించింది. దీంతో ఆమెను అరెస్టు చేయడానికి వెళ్లిన చిత్తూరు పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది. కోల్‌కతాకు చెందిన ఎర్రచందనం బడా స్మగ్లర్ లక్ష్మణన్‌ను ఇటీవల చిత్తూరు పోలీసులు అరెస్టు చేసి కడప జైలుకు తరలించారు. అప్పటి నుంచి అతని రెండో భార్య అయిన కలకత్తాకు చెందిన సంగీతాచటర్జీ ఎర్రచందనం అక్రమ రవాణలో బడా స్మగ్లర్ల మధ్య ఆర్థిక లావాదేవీలను నిర్వహించడంతో పాటు పలువురు స్మగ్లర్లతో చేతులు కలిపి ఎక్రచందనం వ్యాపార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇటీవల కోల్‌కతాలో ఆమె ఇంటిపై దాడులు చేసి పలు బ్యాంకు లాకర్లను, ఇతర విలువైన పత్రాలను సీజ్ చేయడం పాటు ఆమెను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా, ఆమెకు అక్కడి కోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. దీంతో తదుపరి చిత్తూరు పోలీసులు అక్కడ బ్యాంకులో ఉన్న సుమారు రెండు కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరాణాలను స్వాధీనం చేసుకొన్నారు. సంగీతాచటర్జీ తనకు ఆరోగ్యం సక్రంగా లేదని తన బెయిల్‌ను పొడిగించుకుంటూ వస్తోంది.

జెఎన్‌టియుకెకు కాపు, బిసి
విద్యోన్నతి పథకం పరీక్ష బాధ్యతలు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జూన్ 20: ఆంధ్రప్రదేశ్‌లో కాపు విద్యోన్నతి, బిసి విద్యోన్నతి పథకాలను నూతనంగా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను కాకినాడ జెఎన్‌టియుకెకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఎపి ఎంసెట్, ఎపి పిజిఈసెట్‌లను రెండేళ్లుగా వర్సిటీ విజయవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో కాపు విద్యోన్నతి, బిసి విద్యోన్నతి ప్రవేశ పరీక్షల బాధ్యతలను కూడా తమకే ప్రభుత్వం అప్పగించిందని వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ చెప్పారు. ఈ పథకం కింద కాపు సామాజికవర్గానికి చెందిన 500 మంది, బిసి వర్గాలకు చెందిన 500 మంది మొత్తం వెయ్యి మంది విద్యార్థులకు సివిల్ సర్వీసుల్లో శిక్షణకు ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 9 నుండి 12 నెలల పాటు దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 9 కేంద్రాల్లో ఉచితంగా శిక్షణ కల్పిస్తామని చెప్పారు. శిక్షణ కాలంలో నెలకు రూ.10వేల రూపాయల వంతున స్ట్ఫైండ్ సహా భోజన, వసతి, పుస్తకాలు తదితర అన్ని రకాల సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.
బ్రిటన్ ‘టెక్ రాకెట్ షిప్’ గడువు పొడిగింపు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూన్ 20: యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్రిటన్ ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే ‘టెక్ రాకెట్ షిప్’ అవార్డుల ఎంపికకు 2016-17 సంవత్సరానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు బ్రిటిష్ హైకమిషన్ ప్రాంతీయ సలహాదారు సుబ్బలక్ష్మి సుబ్రమణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా అంకుర సంస్థలు (స్టార్టప్స్) అత్యుత్తమ టాలెంట్ కలిగిన 10 మంది యువ పారిశ్రామికవేత్తల్ని ఎంపిక చేసి బ్రిటన్ దేశంలోని పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులను కలిసేందుకు ఆ దేశానికి పంపుతామని తెలిపారు. ఈ అవార్డుల్ని బ్రిటన్ దేశ వాణిజ్యం, పెట్టుబడుల భారత సంస్థ గత మూడేళ్లుగా ప్రవేశపెట్టి యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తోందన్నారు. ఈ ఏడాది ఎంపికైన పారిశ్రామికవేత్తలకు బ్రిటన్ దేశ వెంచర్ క్యాపిటలిస్టులు, అనుభవం కలిగిన పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియల్ లీడర్లతో సమావేశపరిచి వారి సలహాలు, సూచనలు అందిస్తామన్నారు.
వాగు నీటిగుంతలో పడి తల్లీ, కొడుకు మృతి
శావల్యాపురం, జూన్ 20: గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం బొందిలిపాలెం గ్రామ సమీపంలో సోమవారం వాగులోని నీటిగుంతలో పడి తల్లి, కొడుకు మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జ్ఞానంపూడి గ్రామానికి చెందిన ఆవుల యోగమ్మ(38), ఆమె కుమారుడు యోగేంద్రకుమార్(14) కలిసి గేదెలు మేపుకునేందుకు పొలానికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో గేదెలు నీళ్లు తాగేందుకు వాగులో ఉన్న గుంతలో దిగాయి. వాటిని తోలే ప్రయత్నంలో యోగేంద్రకుమార్ నీటి గుంతలో పడిపోయాడు. కొడుకుని రక్షించే ప్రయత్నంలో యోగమ్మ కూడా జారి గుంతలో పడటంతో పైకి రాలేక ఇద్దరూ మృతి చెందారు. సమీపంలోని పశువుల కాపరులు వచ్చే సమయానికే వీరు మృతి చెందారు.
కోస్తా, సీమల్లో చెదురుమదురు వర్షాలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 20: విదర్భ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, మధ్య భారతంలో ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రాగల 24 గంటల్లో చెదురు, మదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రం అంతటా విస్తరించిన నేపథ్యంలో కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
సాంకేతికతతో పాటు సృజనాత్మకత ఉండాలి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 20: సృజనాత్మకత లోపిస్తే సాంకేతికత సునామీలో కొట్టుకుపోతామని రాష్ట్ర ప్రభుత్వ ఐటి సలహాదారు జె.ఎ.చౌదరి పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన తనను కలిసిన విలేఖరులతో మాట్లాడారు. ఏ రంగంలోనైనా కొనసాగేందుకు సృజనాత్మకత జోడించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ప్రపంచంలో పేరేన్నికగన్న కొన్ని కంపెనీలు సృజనాత్మకతను జోడించకపోవడంతో ప్రస్తుతం అవి కనుమరుగయ్యాయన్నారు. అమెరికాలోని ఒక వర్సిటీ కూడా ఇదే కారణంతో స్థలాలు, భవనాలను విక్రయించే పరిస్థితి నెలకొందని వివరించారు. టెక్నాలజీ, డిజిటలైజేషన్ కారణంగా భవిష్యత్తులో అనేక మార్పులు రానున్నాయన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాయంలో ఏర్పాటు చేయనున్న ఇన్నోవేషన్ సెంటర్ 18 నెలల్లో పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభిస్తుందని తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, స్టాన్‌ఫోర్డు వర్సిటీ, తదితర ప్రముఖ సంస్థలతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఈ ఇన్నోవేషన్ సెంటర్‌లో వారి విభాగాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా జరుపుతున్న చర్చలు కొలిక్కిరావాల్సి ఉందన్నారు.