ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరు నిర్మానుష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 22 : కోవిడ్-19 (కరోనా వైరస్)ను నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి పిలుపు మేరకు ఆదివారం చేపట్టిన జనతా కర్ఫ్యూ జిల్లాలో విజయవంతంగా కొనసాగింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ ఈ స్వీయ నిర్బంధం కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. అయితే జిల్లాలో తెల్లవారుజాము నుంచే ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు. రాత్రి తొమ్మిది తర్వాత కూడా నెల్లూరు నగరంలో జనసమ్మర్థం పెద్దగా కనిపించకపోవడం విశేషం. పాలు, కూరగాయలు వంటి ముఖ్య నిత్యావసర వస్తువులను శనివారం రాత్రే కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళ్లడంతో ఆదివారం ఉదయం ఎటువంటి అవసరాల కోసం రోడ్డుపైకి రావాల్సిన పనిలేకుండా పోయింది. ఆర్టీసీ బస్సులను పూర్తిగా రద్దు చేశారు. ఒకటీ, రెండు రైళ్లు మినహా రైళ్ల రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించాయి. గూడ్సు రైళ్లు, ఒకటీ అరా ట్రాన్స్‌పోర్టు వాహనాలు జాతీయ రహదారిపై కనిపించాయి. టీ అంగడి మొదలు పెద్ద పెద్ద దుకాణాలు, హోటళ్ల వరకూ అన్ని పూర్తిగా మూతపడ్డాయి. గ్రామాలకు వెళ్లే దారులు మొదలు జాతీయ రహదారుల వరకూ అన్ని నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. నగర ప్రముఖులు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌తో పాటు ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తదితర టీడీపీ నాయకులు సైతం జనతా కర్ఫ్యూలో పాల్గొని ఇళ్లలోనే ఉంటూ కుటుంబసభ్యులతో గడిపారు. కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, ఎస్పీ భాస్కర్‌భూషణ్ ఇతర జిల్లాస్థాయి అధికారులు ఇళ్లలోనే ఉంటూ పరిస్థితిని సమీక్షించారు.
*చిత్రం...వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో కళతప్పిన సూళ్లరుపేట టోల్‌ప్లాజా