ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వాసుపత్రుల్లో ఏసీబీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం): ఏసీబీ అధికారులు తాజాగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులపైన దృష్టి సారించారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ పీ సీతారామాంజనేయులు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. మందుల కొనుగోలు, పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగినట్లు సమాచారం అందడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏసీబీ మెరుపుదాడులు నిర్వహించింది. 13 బృందాలుగా ఏర్పడి వందమంది ఏసీబీ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి శాఖలోనూ పారదర్శకంగా పనులు జరగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆదేశించిన నేపథ్యంలోనే ఈ వరుస దాడులను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మందులు, వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు చేపట్టారు. వైద్యాధికారుల హాజరుకు సంబంధించి ఆరా తీశారు. ప్రైవేటు క్లినిక్‌లను ఏర్పాటు చేసుకున్న వైద్యులు చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రులకు గైర్హాజరవుతున్నట్లు గుర్తించారు. ఇక అవుట్‌పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్‌లను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా మందుల కొనుగోలు, నాసిరకం మందుల కొనుగోలు చేసి పెట్టిన బిల్లులపై వివరాలు సేకరించారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సోదాల్లో వైద్యులు యూనిఫారం ధరించకపోవడం, ఆస్పత్రిలో సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయకపోవడం, మందుల స్టాక్‌కు సంబంధించి బోర్డు ఏర్పాటు చేయకపోవడం, మందుల నిల్వలకు, రిజిస్టర్‌లో పేర్కొన్న దానికి భిన్నంగా ఉండటం, రోగులకు అందించే ఆహారానికి సంబంధించి నిబంధనలు పాటించకపోవడం, రక్త పరీక్షల కేంద్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి విధులు నిర్వహించడం వంటి వైఫల్యాలను గుర్తించారు.
విజయనగరంలో 2014 నుంచి పని చేయని అంబులెన్స్‌కు సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాకపోవడం, మార్చురీ నిర్వీర్యం, ప్రహరీగోడ కూలి పడి ఉన్నా పట్టించుకోకపోవడం, బాత్‌రూములు సరిగా లేకపోవడం వంటి అవకతవకలు బయటపడ్డాయి. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి తనిఖీల్లో పలు వైఫల్యాలు వెలుగు చూశాయి. హాజరు, ఆహారం వంటి అంశాల్లో నియమాలు పాటించకపోవడం, అదేవిధంగా శవాల గది వెనుక వంటగది నడపడం వంటివి వెలుగు చూశాయి. తూర్పుగోదావరి జిల్లా తుని ఆస్పత్రిలో మందుల నిల్వల్లో అవకతవకలు గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం ఆస్పత్రిలో డాక్టర్, నర్సింగ్ సూపరింటెండెంట్, హెడ్ నర్సు గైర్హాజరును గుర్తించారు. అదేవిధంగా రోగులకు మధ్యాహ్నం భోజనం 12 గంటలకే ఇవ్వాల్సి ఉండగా ఒకటిన్నర అయినా పెట్టకపోవడం, ఒక్కో డైట్ మెనూలో 3.5 కేజీల వరకు కొరత ఉండటం గుర్తించారు. కృష్ణాజిల్లా గుడివాడ ప్రభుత్వాస్పత్రిలో రోగులకు ఇచ్చే డైట్‌లో అక్రమాలు, అదేవిధంగా పని చేయని అంబులెన్స్‌కు డ్రైవర్ జీతం కింద ఆస్పత్రి అధికారులు 2019 జూలై నుంచి ఇప్పటి వరకు 4,13,996 లక్షలు డ్రా చేసినట్లు కనుగొన్నారు. 27మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉన్నప్పటికీ శుభ్రత లేకపోవడం గుర్తించారు. అదేవిధంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లోని ఆస్పత్రుల్లో జరిపిన సోదాల్లో కూడా దాదాపు ఇదే తరహా అక్రమాలు, అవకతవకలతోపాటు ఆరోగ్యశ్రీ పథకం అమలు, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహన వినియోగం, శానిటేషన్, మందులు కొనుగోలు, రోగులకు ఇచ్చే ఆహార నియమాలు, వైద్యులు, సిబ్బంది హాజరు వంటి అంశాల్లో భారీ ఎత్తున వైఫల్యాలు కొనుగొన్న ఏసీబీ అధికారులు ఈ సోదాలు రెండోరోజు శుక్రవారం కూడా కొనసాగించనున్నారు.