ఆంధ్రప్రదేశ్‌

పారదర్శకంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తంగా ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు 6.39 లక్షల మంది, ఇంటర్ పరీక్షలకు 10.65 లక్షల మంది హాజరు అవుతున్నారన్నారు. మార్చి 4 నుంచి 23 వరకూ ఇంటర్, మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకూ టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇంటర్ పరీక్షలకు సంబంధించి 1411 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ రెండు పరీక్షల కోసం కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. టెన్త్ పరీక్షలకు 2923 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో విద్యార్థులు సాధించిన మార్కులను జాబితాలో యథావిథిగా పొందుపరుస్తామన్నారు. ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థుల ఫలితాలను మాత్రం గతంలో మాదిరిగా గ్రేడింగ్ విధానంలో ఇస్తామన్నారు. ఉన్నత చదువులు, పోటీ పరీక్షల సమయంలో గ్రేడింగ్ విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పకడ్బందీగా టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. కాపీయింగ్ నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరీక్షలు జరిగే గదుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమాధానాలు రాసేందుకు 24 పేజీల బుక్‌లెట్ ఇస్తామన్నారు. టెన్త్ పరీక్షలకు 156, ఇంటర్‌కు 130 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఇన్విజిలేటర్లను, ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు జంబ్లింగ్ విధానం ఏర్పాటు చేశామన్నారు. 35 వేల మంది ఇన్విజిలేటర్లు అవసరం అవుతారని, అవసరమైతే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేవలు వినియోగించుకుంటామన్నారు. వెబ్‌సైట్ల ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో ఇంటర్ బోర్డు కమిషనర్ రామకృష్ణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ బోర్డు రమేష్ తదితరులు పాల్గొన్నారు.