ఆంధ్రప్రదేశ్‌

ఏపీ పాలనపై పార్లమెంట్‌లో గళమెత్తండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 28: రాష్ట్రంలో కొనసాగుతున్న విధ్వంసకర పాలన, రైతులు, మహిళల పట్ల అమానుష ఘటనలపై 5 కోట్ల ఆంధ్రుల తరపున దేశంలోని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా పార్లమెంట్‌లో గళమెత్తాలని పార్టీ ఎంపీలకు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీతో చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. మంగళవారం మంగళగిరి సమీపంలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి టీడీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన 9 అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా రాజధాని అమరావతి తరలింపు, మూడు రాజధానుల ప్రకటన, దిగజారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఉపాధి హామీ నిధుల దారిమళ్లింపు, నిలిచిన పోలవరం పనులు, కండిషనబుల్ బెయిల్ షరతులను ఉల్లంఘించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రలోభాలు, రాస్తున్న లేఖలు, మీడియాపై దాడులు, ఆంక్షలు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసుల బనాయింపులతోపాటు జాతీయ అంశాలైన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక, జాతీయ జన పట్టిక తదితర అంశాలపై ఎంపీలతో చంద్రబాబు చర్చించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, అవినీతి, అక్రమాలు, విధ్వంస కార్యక్రమాలు, కేంద్ర నిధుల సద్వినియోగంలో వైఫల్యం, ఉన్న నిధులను ఖర్చు చేయకపోవడం, అప్పులివ్వలేమని బ్యాంకులే లేఖలు రాయడం, పెట్టుబడులన్నీ వెనక్కి తరలిపోవడం తదితర అంశాలన్నీ పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ నిర్వాకాల వల్ల అట్టడుగుకు దిగజారిందని పేర్కొన్నారు. ఇటీవలే ఈ వాస్తవాలను కొన్ని సర్వేలు బయటపెట్టాయని, పెరిగిన అప్పులు, వాహన కొనుగోళ్లలో మందగమనం, తగ్గిన విద్యుత్ వినియోగం వైసీపీ ప్రభుత్వ చేతకానితనాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. రాజధాని అమరావతి పరిరక్షణకు జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 42 రోజులుగా రాజధాని అమరావతిలో భూములిచ్చిన రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలను, ఆవేదనతో 30 మందికి పైగా మృతి చెందడాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని సూచించారు. మహిళలపై లాఠీఛార్జి, వందలాదిమంది రైతులను, రైతు కూలీలను జైళ్లకు పంపడం తదితర అంశాలన్నీ పుస్తక రూపంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు, జాతీయ పార్టీల పెద్దలకు, రాజ్యాంగ వ్యవస్థల పెద్దలకు అందజేయాలని సూచించారు. జాతీయ సంపద అయిన అమరావతిని ధ్వంసం చేస్తున్నారని, రూ. లక్ష కోట్ల సంపదను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. శాసనమండలి రద్దు నిర్ణయం గురించి జాతీయ పార్టీల నాయకులకు, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. గతంలో రద్దయిన కౌన్సిల్ పునరుద్ధరణకు 5 రాష్ట్రాలు, కొత్తగా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని మరో 5 రాష్ట్రాలు అడుగుతుంటే ఉన్న కౌన్సిల్‌ను రద్దు చేయడం వైసీపీ తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. ఈ సమావేశంలో ఎంపీలు గల్లా జయదేవ్, కె రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, సీతామహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
అరాచకాలపై ఎలుగెత్తుతాం
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ ఎనిమిది నెలల పాలనలోని అరాచకాలపై పార్లమెంటు ఉభయ సభల్లో గళమెత్తుతామని తెలుగుదేశం పార్టీ ఎంపీలు వెల్లడించారు. మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో లోక్‌సభ సభ్యులు గల్లా జయదేవ్, కే రామ్మోహననాయుడు, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, సీతారామలక్ష్మి మాట్లాడారు. రాజధానిని తరలిస్తామని వైసీపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో గానీ, ప్రచారంలో గానీ చెప్పలేదన్నారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం భూములు ఇచ్చిన రైతులపై ప్రభుత్వం నక్సలైట్లు, టెర్రరిస్టుల మాదిరిగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలు రాకముందే జగన్ తన నిర్ణయాన్ని వెల్లడించారని, అటువంటప్పుడు ఆ కమిటీలకు విశ్వసనీయత ఎలా ఉంటుందని ఎంపీలు ప్రశ్నించారు. న్యాయస్థానాలు కూడా ఆయా కమిటీల నివేదికలను తప్పుబట్టాయన్నారు. అమరావతిలో రూ.1500 కోట్లు ఖర్చు చేస్తే అన్ని వసతులు సమకూరుతాయని, రోడ్లు, భవనాలు చాలా వరకు పూర్తయ్యాయయన్నారు. హైకోర్టు 144, 30 యాక్ట్‌లు అమలు చేయవద్దని చెప్పినా ప్రభుత్వం వినకుండా వాటిని ప్రయోగించి ప్రజలు, ప్రజాప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై నమ్మకం లేకనే జగన్ మండలి రద్దు చేశారన్నారు. సీఎం ఆదేశాలతో స్పీకర్ తమ్మినేని సీతారాం విచక్షణ, సభ్యత కోల్పోయి ప్రవర్తించారని, మండలి రద్దు చేయడానికి జగన్‌కు ఏ అధికారం ఉందని, అదేమైనా ఆయన కుటుంబ సమస్యా అని ప్రశ్నించారు. గత ఎనిమిది నెలల వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు.
*చిత్రం... టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న అధినేత చంద్రబాబు