ఆంధ్రప్రదేశ్‌

మండలి రద్దేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: శాసనమండలి రద్దు దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై చర్చ సందర్భంగా మండలిలో జరిగిన పరిణామాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి శాసనసభలో ఆమోదించిన బిల్లుల్ని మండలి చైర్మన్ విచక్షణాధికారాల పేరుతో సెలక్ట్ కమిటీకి పంపించిన విషయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీదే పైచేయి కావటంతో మొత్తంగా మండలి రద్దుపై గురిపెట్టింది. ఈ అంశంపైనే గురువారం శాసనసభలో మంత్రులు తమ అభిప్రాయాలను
వ్యక్తీకరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆసాంతం మండలి రద్దు దిశగానే సాగింది. ఈనెల 27న సభలో చర్చించిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుందామని సీఎం చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. దీనికి తోడు గురువారం ఉదయం శాసనసభ సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగితో ముఖ్యమంత్రి జగన్ సుదీర్ఘంగా చర్చించారు. బిల్లుల ఆమోదం, మండలి రద్దు అంశాల్లో ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులు, అనుకూలతలపై ఆరా తీశారు. ప్రభుత్వం పంపిన బిల్లుల్ని మండలి సెలక్ట్ కమిటీకి పంపిన తీరు, భవిష్యత్ కార్యాచరణ, మండలి రద్దు నిర్ణయాలపై ఓ వైపు న్యాయ నిపుణులతో సంప్రతింపులు జరుపుతూ మరోవైపు శాసనసభ స్పీకర్, సహచర మంత్రులతో జగన్ సమాలోచనలు చేస్తున్నారు. టీడీపీ కనుసన్నల్లో మండలి చైర్మన్ వ్యవహరిస్తున్నారని, తప్పు చేస్తున్నానని చెప్తూనే నిబంధనలకు తిలోదకాలిచ్చి బిల్లుల్ని నిర్వీర్యం చేశారని ముఖ్యమంత్రితో సహా మంత్రులు తూర్పారపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ పంతం నెగ్గించు కోవటం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందనే సంకేతాలు అధికార పార్టీని కలవర పెడుతున్నాయి. శాసనసభలో పూర్తి స్థాయిలో మెజారిటీ ఉండి, మండలిలో బిల్లులు ఆమోదించుకునే వీలున్నప్పటికీ విచక్షణాధికారాల సాకుతో చైర్మన్ పక్కదారి పట్టించారనే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం ఏకంగా మండలి రద్దుకు దారితీసే పరిస్థితులు నెలకొన్నాయి. దేశం మొత్తంగా 22 రాష్ట్రాల్లో శాసనమండళ్లు లేవని కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రోజుకు కోటి రూపాయల ఖర్చుతో మండలి నిర్వహణ అనవసరమనే అంశాన్ని కూడా స్పష్టం చేయటంతో మండలి రద్దు తప్పదనే సంకేతాలు అందుతున్నాయి. శాసనమండలిలో టీడీపీకి 34 మంది, అధికార వైసీపీకి 9, బీజేపీకి 3, పీడీఎఫ్ సభ్యులు 6గురు, ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. మరో మూడు పదవులు ఖాళీగా ఉన్నాయి. శాసనసభలో ఆమోదించిన రెండు బిల్లులపై మండలిలో చర్చ సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే మండలి రద్దవుతుందని ముందుగానే ప్రచారం జరిగింది. దీంతో మాజీ మంత్రి, టీడీపీ సభ్యుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాధరెడ్డి టీడీపీకి వ్యతిరేకంగా వ్యవహరించారు. బీజేపీ సభ్యులు కూడా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. చైర్మన్ విచక్షణాధికారాలతోనే మండలిలో బిల్లులు సెలక్ట్ కమిటీకి అప్పగించే పరిస్థితి ఎదురైంది. తమకు సంఖ్యాబలం లేనందునే అనుకోని పరిణామాలు ఎదురయ్యాయని భావించిన ప్రభుత్వం మండలి రద్దుకు శరవేగంతో పావులు కదుపుతోంది. వైసీపీ సభ్యుల్లో ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. మండలి రద్దయితే మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పదవులు కోల్పోతారు. అయితే తాము ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేయటంతో ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. ఇదిలా ఉండగా మండలి రద్దు సంకేతాలతో టీడీపీ సభ్యులకు గాలం వేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు తెలియవచ్చింది. అధికార పార్టీ అంతర్గత వ్యూహం అదే అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా మండలి రద్దు ప్రక్రియ ఏడాది కాలం పడుతుందని అప్పటికీ మండలిలో వైసీపీదే పై చేయి అవుతుందని అప్పటి వరకు వేచి చూద్దామనే అభిప్రాయాన్ని కూడా కొందరు పార్టీ నేతలు, మంత్రులు ముఖ్యమంత్రి వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం.