ఆంధ్రప్రదేశ్‌

ఆగని ఆందోళనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 18: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనను ఉపసంహరించుకోవాలని, రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ప్రారంభమైన ఆందోళనలు, నిరసనలు 32వ రోజు సైతం ఉద్ధృతంగా కొనసాగాయి. భూములు ఇచ్చి రోడ్డున పడ్డామని, ప్రాణాలైనా అర్పించి అమరావతిని రాజధానిగా కొనసాగించేలా చూస్తామని, 29 గ్రామాల రైతులు, మహిళలు, వివిధ జేఏసీల నేతలు భీష్మిస్తున్నారు. ఉద్దండరాయునిపాలెం, తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం తదితర రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు, నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వెలగపూడిలో రైతులు దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్రాసు ఐఐటీ నివేదికపై అనేక అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఓ పక్క తాము ఎటువంటి నివేదిక ఇవ్వలేదని, మద్రాసు ఐఐటీ నిపుణులు చెప్తుంటే మంత్రులు మాత్రం మద్రాస్ ఐఐటీ నివేదిక ఇచ్చిందని వాస్తవ దూర ప్రకటనలు చేస్తున్నారని, దీనిపై సీబీఐ విచారణ నిర్వహించి నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. శనివారం తుళ్లూరులో దళిత రైతు సంఘాల నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించగా మరికొంత మంది రైతులు సెల్‌టవర్ ఎక్కి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. తుళ్లూరుకు చెందిన ప్రవీణ్, సాంబయ్య, బ్రహ్మయ్య, శివ అనే నలుగురు యువ రైతులు సెల్ టవర్ ఎక్కి అమరావతిని సాధించుకునేందుకు తమ ప్రాణాలనైనా అర్పిస్తామని, స్థానిక ఎమ్మెల్యే ఇక్కడకు రావాలంటూ నినాదాలు చేశారు. చివరకు పోలీసులు వారి తల్లిదండ్రులతో మాట్లాడించే ప్రయత్నం చేసి సఫలీకృతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆయా ప్రాంతాల్లో నిరసన దీక్షలు జరుగుతున్న నేపథ్యంలో జాతీయ జెండాలు, రైతు జెండాలు చేతబూని డప్పుల చప్పుళ్ల మధ్య తమ నిరసన గళాన్ని వినిపించారు. మందడంలో గత కొద్దిరోజులుగా ప్రైవేటు స్థలంలో నిరసన దీక్షలు చేస్తున్న మహిళలు, రైతులు శనివారం ఒక్కసారిగా ప్రధాన రహదారిపైకి చేరి ఆందోళన నిర్వహించారు. అయితే పోలీసులు అడ్డుకుని రోడ్డుపై ఆందోళనలకు అనుమతి లేదని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా ఎండలోనే నిరసన దీక్ష కొనసాగించారు. రాజధాని మార్పు విషయంలో ముఖ్యమంత్రి జగన్ మనసు మారాలని కోరుతూ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో యాగం చేశారు. ఈ యాగాన్ని ఈనెల 26వ తేదీ వరకు కొనసాగిస్తామని శివస్వామి పేర్కొన్నారు. చివరిరోజు 153 మంది పీఠాధిపతులతో కలిసి భారీ యాగాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విశాఖ స్వరూపానందేంద్ర స్వామి అమరావతికి మద్దతు తెలపాలని శివస్వామి కోరారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంతో పాటు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాబ్యాలెట్‌కు ఏకపక్షంగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఓట్లు పోలయ్యాయి. ఉండవల్లిలో ఎమ్మెల్సీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజా బ్యాలెట్‌లో పాల్గొని అమరావతికి మద్దతుగా ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ తుగ్లక్ పాలనతో రాష్టవ్య్రాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేసులు పెడితే ఉద్యమం ఆగదని, రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. అలాగే జిల్లా కేంద్రమైన గుంటూరు నగరంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించగా మొత్తం 4211 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 2 నోటా, 16 మూడు రాజధానులు కావాలని ఓట్లు రాగా, మిగిలిన 4,193 ఓట్లు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని వచ్చాయి. కాగా ఈనెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడి, జైల్‌భరో, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వార్తలు వెలువడుతుండటంతో పోలీసులు రాజధాని ప్రాంత రైతులు, నిరసనకారులకు ముందస్తు నోటీసులు జారీచేశారు. అసెంబ్లీ సమావేశాలకు ఆటంకం కలగడమే కాకుండా శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని, ఈ దృష్ట్యా ఎటువంటి ఆందోళనలు నిర్వహించవద్దని నోటీసుల్లో పేర్కొన్నారు.
రేపు విజయవాడ నుంచి చలో అసెంబ్లీ
విజయవాడ: రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 20వ తేదీ రాజకీయాల కతీతంగా అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీని విజయవంతం చేయాలని అమరావతి పొలిటికల్ జేఏసీ కన్వీనర్, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపు ఇచ్చారు. ఉదయం 10 గంటలకు విజయవాడలోని ధర్నాచౌక్ నుండి ప్రారంభమయ్యే ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలిరావాలని ఒక ప్రకటనలో కోరారు.
విజయవాడలో కొవ్వొత్తుల ర్యాలీ
విజయవాడ: ముఖ్యమంత్రి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అమరావతిలోనే రాజధాని ఉంటుందని ప్రకటన చేసే వరకు తమ ఆందోళన ఆగదని మహిళలు స్పష్టం చేశారు. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం రాత్రి విజయవాడ నగరంలో అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
20న అసెంబ్లీ ముట్టడి
గుంటూరు: గతంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన దుర్మార్గాలను మరింపించేలా నేడు ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. జగన్మోహన్‌రెడ్డి పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే దాని గురించి స్వయంగా ఆయన కేబినెట్ మంత్రే వాస్తవాలు వెల్లడించారన్నారు. శనివారం మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల మనసులో ఉన్నదే మంత్రి నోటి నుంచి వచ్చిందన్నారు. అమరావతి ఉద్యమంలో పదుల సంఖ్యలో రైతులు చనిపోయినా ముఖ్యమంత్రి ఒక్క రోజు కూడా వారి మరణాల గురించి మాట్లాడకపోవడం అందుకు నిదర్శనమన్నారు.
తాబేదార్లుగా వైసీపీ ఎమ్మెల్యేలు: ధూళిపాళ్ల
రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించే నిర్ణయాన్ని సమర్థిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల తీరు చూస్తుంటే వారంతా ముఖ్యమంత్రి జగన్ తాబేదార్లుగా మారినట్లు స్పష్టమవుతుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ విమర్శించారు. గుంటూరు జిల్లా ప్రజలు 15 స్థానాల్లో వైసీపీ పభ్యుల్ని గెలిపించారని, వారంతా ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డితో సహా అమరావతిని సమర్థించారని గుర్తుచేశారు.
అమరావతిని చంపేందుకే కుట్రలు: లోకేష్
విజయవాడ(సిటీ) సీఎం జగన్, అబద్ధాలు అవిభక్త కవలలు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా జగన్ పంధా మార్చుకొని నిజాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ట్విట్టర్‌లో లోకేష్ ఆరోపించారు. పసి బిడ్డగా ఉన్నప్పుడే అమరావతిని చంపేయడానికి వైసీపీ ఎన్నో కుట్రలు చేసిన సంగతి అందరికీ తెలుసన్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావొద్దంటూ సింగపూర్ ప్రభుత్వానికి దొంగ మెయిల్స్ పెట్టడం ఇలా ఒక్కటేంటి అనేక అడ్డంకులు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నించిందన్నారు.
''చిత్రాలు..మందడంలో ధర్నా చేస్తున్న మహిళలు, రైతులు
*తుళ్లూరులో సెల్ టవర్ ఎక్కిన యువకులు