ఆంధ్రప్రదేశ్‌

నగరపాలక సంస్థగా అమరావతి ప్రాంతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 16: రాజధాని అమరావతి ప్రాంతాన్ని నగరపాలక సంస్థగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. రాజధాని ప్రాంత రైతుల ఆందోళనల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలనే అంశాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చింది. రాజధానిని విశాఖకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై ఆ ప్రాంత రైతులు
దాదాపు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. రాజధానిని తరలించవద్దని, ఇక్కడే కొనసాగించాలంటూ రైతులు ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. అయితే రాజధాని విశాఖకు తరలించటం ఖాయమని, ముఖ్యమంత్రి ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి రాజధాని తరలింపు, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధిపై సిఫారసులు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఈ నెల 20న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించనున్నారు. అదేరోజు అసెంబ్లీలో ఈ కమిటీ నివేదికపై చర్చించి రాజధాని, తదితర అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు తీవ్రతరం అవుతుండటంతో వారిని శాంతింపజేసేందుకు వివిధ మార్గాలపై అధికార పక్షం దృష్టి సారించింది. రాజధాని పరిధిలో భూములిచ్చిన రైతులకు ఎకరాకు అదనంగా మరో 200 గజాల స్థలం ఇవ్వడం కొత్త ప్రతిపాదనల్లో ఒకటి. రాజధాని ప్రాంతాన్ని నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయడం మరో ప్రతిపాదన. ఈ నిర్ణయాల ద్వారా రైతులను శాంతింపజేయవచ్చని భావిస్తున్నారు. రాజధానిని తరలించినప్పటికీ ఆ ప్రాంతానికి ఓ గుర్తింపు ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్న అభిప్రాయం రైతుల్లో కలిగించేలా ఈ ప్రతిపాదనను తెర పైకి తెచ్చారు. త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజధాని ప్రాంతాన్ని నగరపాలక సంస్థగా ఏర్పాటు చేసే అంశంపై మరింత స్పష్టనిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతి ప్రాంతాన్ని నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 40 ఎంపీటీసీ స్థానాలు, 31 గ్రామ పంచాయతీలు రద్దు కానున్నాయి. గుంటూరు జిల్లాలో కొత్తగా రెండు నగర పంచాయతీలు, ఒక నగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తుండటంతో 70 పంచాయతీలు, 50 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. రాజధాని అమరావతి ప్రాంతంలోని మూడు మండలాల పరిధిలోని 31 గ్రామాలను వేరుచేసి నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తుళ్లూరు మండలంలో 20 గ్రామాలు, తాడేపల్లి మండలంలో రెండు గ్రామాలు, మంగళగిరి మండలంలో 9 గ్రామాలను కలుపుతూ అమరావతి నగరపాలక సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతం అంతా ఏపీ సీఆర్డీఏ పరిధిలో ఉంది. ఏపీ సీఆర్డీఏను రద్దుచేసి దాని స్థానంలో వీజీటీఎం ఉడాను పునరుద్ధరించేందుకు ప్రతిపాదించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రతిపాదనకు చట్టరూపం కల్పించనున్నారు. దీంతో సీఆర్డీఏ పరిధి నుంచి ఈ గ్రామాలకు మినహాయింపు లభించి, నగరపాలక సంస్థ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. అమరావతి నగరపాలక సంస్థ ఏర్పాటు, దాని పరిధిని నోటిఫై చేయాల్సి ఉంటుంది. ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తరువాత పూర్తిస్థాయిలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.