ఆంధ్రప్రదేశ్‌

ఎందుకూ పనికిరాని హెల్త్‌కార్డులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 15: ముఖ్యమంత్రిగా జగన్ పట్ట్భాషిక్తుడు కావాలని ఎంతోకాలంగా కలలు కంటూ వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగుల ఆశలను నేడు అడియాసలు చేస్తున్నారని ఆదివారం నాడిక్కడ రెవెన్యూ భవన్‌లో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం మండిపడింది. ఉద్యోగుల హెల్త్‌కార్డులు ఎందుకూ పనికిరావటం లేదని, మూడు విడతల డీఏ బకాయిల చెల్లింపులో, కొత్త పీఆర్‌సీ అమల్లోనూ అంతులేని జాప్యం జరుగుతోందని సమావేశం నిరసన తెలిపింది. సమావేశానికి అధ్యక్షత వహించిన జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అనంతరం విలేఖరులతో మాట్లాడారు. దశాబ్దాల కాలంగా రీయింబర్స్‌మెంట్ సదుపాయం ఉండేదని, అయితే గడచిన ఐదేళ్లుగా ప్రస్తుత హెల్త్‌కార్డుతో ఏ ఆసుపత్రికి వెళ్లినా చెల్లడం లేదని వాపోయారు. దీంతో అప్పోసప్పో చేసి ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోందని, తీరా లక్షల రూపాయలు ఖర్చయితే వేలు కూడా చేతికి అందడం లేదని, బిల్లుల్లో అడుగడుగునా కోతలు వేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. ముందుగా అనుకున్న ప్రకారం సాలీనా ఉద్యోగులు ప్రీమియం కింద రూ. 200కోట్లు, దాంతో సమానంగా ప్రభుత్వం రూ. 200 కోట్లు జమ చేయాల్సి ఉంటే ఉద్యోగుల ప్రీమియం కింద రూ. 90కోట్లు, ప్రభుత్వ వాటాగా రూ. 90కోట్లు మొత్తం రూ. 180కోట్లు మాత్రమే జమ కావటంతో ఆసుపత్రులకు రూ. 150కోట్లు బకాయిలు ఉన్నాయని, దీంతో ఏ ఆసుపత్రి కూడా హెల్త్‌కార్డులను అనుమతించడం లేదన్నారు. దీన్ని గుర్తించే తాము ఎంతోకాలంగా ఉద్యోగుల ప్రీమియంను రూ. 200 కోట్లకు పెంచాలని, దీనివల్ల ప్రభుత్వ వాటాగా మరో రూ. 200 కోట్లు జమ అవుతాయని కోరుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. విశ్రాంత ఉద్యోగులు, ప్రతి ఉద్యోగి తన కుటుంబ సభ్యులు సహా ఏడాదికోసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునే అవకాశం కల్పించాలని కోరారు. సబ్ కమిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై మూడు నెలలుగా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు. విద్య, ఆరోగ్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న సీఎం జగన్ ఉద్యోగుల హెల్త్‌కార్డులపై ఒక్కసారి సమీక్షించాలని బొప్పరాజు కోరారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది నిత్యం టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌లతో తల్లడిల్లిపోగా, నేడు జగన్ అర్ధరాత్రి వరక పని చేయించుకుంటున్నారని వాపోయారు. వాస్తవానికి గతం కంటే మిన్నగా నవరత్నాలు, నవశకం అమలుకు పని చేస్తున్నప్పటికీ పలు జిల్లాల్లో కొందరు అధికారులు మొదటి ర్యాంకు సాధించాలన్న ప్రయత్నంలో ఉద్యోగులపై తీవ్ర పనిభారం మోపుతున్నారని చెప్పారు. కొందరు అనారోగ్యానికి గురవుతున్నారని, తీరా ఆసుపత్రికి వెళితే హెల్త్‌కార్డులు పని చేయడం లేదన్నారు.
జేఏసీ సెక్రటరీ జననల్ టీవీ ఫణిపేర్రాజు మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ అడగకుండానే ఉద్యోగులకు డీఏ చెల్లిస్తుండేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, రానున్న క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పర్వదినాలను దృష్టిలో ఉంచుకుని డీఏ బకాయిలు విడుదల చేయాలని కోరారు. తొలుత జేఏసీ కోశాధికారి వీయు మురళీకృష్ణమ నాయుడు మాట్లాడుతూ సీఎం జగన్ ఎవరూ అడగకుండానే ఉద్యోగులకు 27శాతం ఐఆర్ ప్రకటించారని, కానీ నేటివరకు చెల్లింపులు జరగలేదన్నారు. నిర్దేశించిన 11వ పీఆర్‌సీ కమిటీ కాల పరిమితిని రెండుసార్లు పెంచడం ఉద్యోగుల్లో నిరాశ నిస్పృహలు నెలకొని సందేహాలకు తావిస్తోందన్నారు. జేఏసీ కో-చైర్మన్ జీవీ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచార హామీలో భాగమైన సీపీఎస్ విధానం రద్దుపై సీఎం జగన్ కాలయాపన చేస్తున్నారన్నారు. జేఏసీ కృష్ణా జిల్లా చైర్మన్ ఈశ్వర్ మాట్లాడుతూ తమ జేఏసీలో మొత్తం 94 ప్రభుత్వ ఉద్యోగ సంఘాలున్నాయని, అయితే ప్రభుత్వం గత పదేళ్లుగా ఏ ఒక్క చిన్న సమస్య కూడా పరిష్కరించని ఒక ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి 103 ద్వారా గుర్తింపు కల్పించడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో కో-చైర్మన్‌లు కే ఆల్ఫ్రెడ్, డీఎస్ కొండయ్య, జే శ్రీనివాసరావు, పీ వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా చైర్మన్ కే సంగీతరావు పాల్గొన్నారు.
*చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు