ఆంధ్రప్రదేశ్‌

కేంద్రంతో సయోధ్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 14: కేంద్రంతో సయోధ్యకు వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. గత మూడు విడతలుగా ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశం రాకపోవటంతో నేరుగా సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. విభజన చట్టంలో అంశాలతో పాటు రెవెన్యూ లోటు భర్తీ, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం, రాజధాని పనులు ఎక్కడికక్కడ పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులతో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నా భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రంతో సన్నిహితంగా మెలగటమే మేలని వైసీపీ అధినేత భావిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల ముందు వెన్నుతట్టి ప్రోత్సహించిన బీజేపీ హైకమాండ్ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎందుకు స్పందించటంలేదనే ప్రశ్న వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు బలమైన కారణాలు లేకపోలేదనే వాదనలు వినవస్తున్నాయి. కొన్ని కీలకమైన విషయాల్లో కనీసం తమతో చర్చించకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవటాన్ని కూడా కేంద్రం తప్పు పడుతోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునస్సమీక్ష, పోలవరానికి రివర్స్ టెండరింగ్, రాజధాని అంశాల్లో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను కేంద్రం ఆక్షేపిస్తోంది. ఇంటెలిజెన్స్ ఐజీగా సిన్హా నియామకాన్ని కూడా పునపరిశీలించాలని కేంద్రం సూచించినట్లు తెలియవచ్చింది. కేంద్ర రక్షణ శాఖ సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్‌పై సిన్హా ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఆయన్ను ఇంటెలిజెన్స్ డీజీగా నియమించటం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రంతో విభేదాలన్నీ పరిష్కరించుకుని ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టాలనే వ్యూహంతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటిపై కేంద్రానికి వివరణ ఇచ్చి, ఓ అవగాహనకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. ఇలాఉంటే మరో ఏడాదిలో కేంద్రం ఉమ్మడి పౌరస్మృతి బిల్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మహారాష్టల్రో శివసేన దూరం కావటంతో తెలుగు రాష్ట్రాలపై బీజేపీ దృష్టి సారించినట్లు సమాచారం. సంఖ్యా పరంగా లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యసభలో ప్రతి ఓటు కీలకంగా బీజేపీ భావిస్తోంది. రాజ్యసభలో వైసీపీకి ఇద్దరు సభ్యులే ఉన్నప్పటికీ లోక్‌సభలో మూడవ ప్రతిపక్ష స్థానంలో ఉన్నందున వివిధ అంశాల్లో నైతిక మద్దతు కూడగట్టేందుకు అవసరమని భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు సహకారాన్ని అందించటంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పట్టుకు భవిష్యత్ వ్యూహాన్ని నిర్దేశించుకున్నట్లు బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఎన్టీఏతో శివసేన తెగదెంపులు
చేసుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వైసీపీ, టీఆర్‌ఎస్‌లతో మైత్రీ సంబంధాలు కొనసాగించాలనేది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. వైసీపీ ప్రధానకార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎన్నికల ముందు వరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను ముందస్తు అపాయింట్‌మెంట్లు లేకుండా కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే గత ఆరు నెలల్లో సీఎం జగన్ మూడు సార్లు ఢిల్లీ పర్యటన జరిపినా వారిద్దరినీ కలిసే అవకాశం రాలేదు. దీంతో విజయసాయిరెడ్డిపై ముఖ్యమంత్రి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది. గత మూడు రోజుల క్రితం ఢిల్లీలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇచ్చిన విందు వెనుక అసలు కథ ఏంటనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కుదిర్చే ప్రయత్నాల్లో ఇది కూడా ఓ భాగమనే ప్రచారం జరుగుతోంది. అయితే రఘురామకృష్ణం రాజు బీజేపీ గూటికి చేరతారనే మరో వాదన తెరపైకి వచ్చింది. ఇదెలా ఉన్నప్పటికీ సీఎం జగన్ ఢిల్లీ పెద్దలతో ఇప్పటికే మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రెండు బెర్త్‌లు ఖాయమయ్యాయనే ప్రచారం కూడా జరుగుతోంది. దీన్ని బట్టి బీజేపీ, వైసీపీ మధ్య సఖ్యత కుదిరిందనే ఊహాగానాలు వినవస్తున్నాయి. రాష్ట్ర వ్యవహారాల్లో తమ ఉనికికి భంగం కలుగకుండా కేంద్రం చేసే సూచనలు పాటించటం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే యోచనతో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు గత కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు తనపై మోపుతున్న హిందుత్వ వ్యతిరేక భావాన్ని బీజేపీతో మైత్రితో తిప్పికొట్టే భావనతో ఉన్నట్లు వినికిడి. ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ముస్లిం, మైనారిటీ వర్గాలను జాగృతం చేసే ప్రక్రియలో భాగంగా ఆ వర్గాల ఓటు బ్యాంక్ ఉన్న వైసీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తే భవిష్యత్‌లో ప్రయోజనాలు ఉంటాయని బీజేపీ ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, వైసీపీ మధ్య సయోధ్య కుదిరే అవకాశాలు లేకపోలేదనేది స్పష్టమవుతోంది.

*చిత్రం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి