ఆంధ్రప్రదేశ్‌

ప్రతిష్టాత్మకంగా ఆంగ్ల మాధ్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 12: ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేదవర్గాలే విద్యనభ్యసిస్తారని, వారికి ఆంగ్ల భాషను చేరువ కానివ్వకుండా ఉండేందుకు ప్రతిపక్ష పార్టీలతో సహా కొన్ని మీడియా సంస్థలు ఏకమయ్యాయని ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఆంగ్ల మాధ్యమ బోధనను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6 తరగతుల వరకు ఆంగ్ల విద్యా బోధన అనే అంశంపై గురువారం శాసనసభలో విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ పేద విద్యార్థులు బాహ్య ప్రపంచంలో పోటీని ఎదుర్కొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేశారన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బకాయిలు చెల్లించకుండా వదిలేశారని ఆరోపించారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో అరకొర వసతులతోనే చదువులు సాగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మార్పులు తీసుకువచ్చేందుకే ఆంగ్ల మాధ్యమంతో పాటు పాఠశాలల్లో నాడు- నేడు, అమ్మఒడితో విప్లవాత్మక మార్పులు
తెస్తామన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో 95 శాతం ఆంగ్లంలో బోధన సాగుతోందని అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు అమలు కాకూడదని ప్రశ్నించారు. ప్రపంచ స్థాయిలో పోటీని తట్టుకునేందుకు పేదలకు ఆంగ్లంలో బోధన వల్ల మేలు జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు అగ్రకులాల్లో పేదలే ఉంటారని వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లీష్ మీడియంను అందుబాటులోకి తెచ్చామని పునరుద్ఘాటించారు. తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుందన్నారు. విద్యా హక్కు చట్టం తరహాలో ఆంగ్ల విద్యా హక్కుకు నాంది పలికామన్నారు. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడే స్థాయి లేనప్పుడు ఎంత చులకన భావం ఉంటుందో చూస్తున్నామని, ఆంగ్లంలో చదివితే ఓ గౌరవం ఉంటుందని చెప్పారు. టీడీపీ హయాంలో పాఠశాలల్లో వౌలిక సదుపాయాలకు ఏడాదికి రూ. 50 కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధనను ఇప్పటి వరకు వ్యతిరేకించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజలు తిరగబడటంతో యూటర్న్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జూన్ 1 నుంచి తొలి దశగా 16,500 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కల్పనకు రూ. 3600 కోట్లు కేటాయించామన్నారు. నాడు- నేడుతో పాఠశాలలకు పూర్తి స్థాయిలో ప్రహరీలు, తరగతి గదులు నిర్మిస్తామని వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అక్షరాస్యత 33 శాతం ఉందని దేశం మొత్తంగా 27 శాతం ఉందన్నారు. ఇంగ్లీష్ మీడియంను తప్పని చేసి, వచ్చే ఏడాది జనవరి 9 నుంచి అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల స్థాయి పెరగాలన్నా, పోటీ పరీక్షలను ఎదుర్కోవాలన్నా, భవిష్యత్‌లో వేతనాలు పెరగాలన్నా ఆంగ్ల విద్యా బోధన దోహద పడుతుందన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగితే వారి జీవితాలు మెరుగు పడతాయని చెప్పారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనలో అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పదవ తరగతి పరీక్షలు రాసే సమయానికి ఇంగ్లీష్‌లో నైపుణ్యత సాధిస్తే ఉన్నత చదువుల్లో రాణించే వీలు కలుగుతుందని తెలిపారు. పదవ తరగతి బోర్డు పరీక్షలు రాసే సమయానికి విద్యార్థులకు భాషపై పట్టు వస్తుందన్నారు. ప్రతి మండలంలో ఓ హైస్కూల్‌ను ఎంపిక చేసి జూనియర్ కళాశాల స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. టెన్త్ వరకు ఆంగ్ల విద్యనభ్యసించిన విద్యార్థులు జూనియర్ ఇంటర్, డిగ్రీ, పీజీల్లో తిరుగులేని పట్టు సాధించగలరనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బ్రిడ్జి కోర్సులను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. ఇందు కోసం 30 కీ రిసోర్స్ పర్సన్లను గుర్తించామని, 220 టీచర్లను ఎంపిక చేశామని వారికి కంప్యూటర్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజిపై శిక్షణ ఇచ్చామన్నారు. మండలానికి నలుగురు టీచర్లను గుర్తించి 2704 జిల్లా రిసోర్స్ పర్సన్లకు కూడా శిక్షణ ఇస్తున్నామని వివరించారు. టీచర్స్ ట్రైనింగ్ కరిక్యులంలో కూడా మార్పులు తీసుకువచ్చి ఆంగ్ల మాధ్యమాన్ని బోధించే దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులకు తగిన అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వివరించారు. పోటీ పరీక్షలకు కోచింగ్ లేకుండా విద్యార్థులు వెళ్లగలిగే పరిస్థితి తీసుకురావటమే ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయటంలోని ముఖ్య ఉద్దేశమన్నారు. దేవుడు దీవిస్తాడు.. ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు.
*చిత్రం...ఆంగ్ల మాధ్యమంపై పత్రికల్లో వచ్చిన వార్తలను సభకు చూపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరును ఎండగడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్