ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వంపై అవాకులు మానండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం : రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వివిధ ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుంటే, వాటిని నిర్వీర్యం చేయాలన్న దురుద్దేశంతో ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలడం సరైన పద్ధతి కాదని ప్రతిపక్షాలు, ముఖ్యంగా టీడీపీపై మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం అనంతపురం నగరంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా టీడీపీ విమర్శిస్తోందన్నారు. ప్రజా సంక్షేమ పథకాలపై రోజుకో రీతిలో నోరు పారేసుకుంటోందని, రెండు, మూడు రోజులు గోల చేసి ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో మిన్నకుండిపోతోందని ఎద్దేవా చేశారు. ఉపాధి, ఉద్యోగావకాశాల పెంచేందుకే 1 నుంచి 6వ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రజల అభీష్టం మేరకు అమలు చేయాలని నిర్ణయించామన్నారు. తెలుగు కంపల్సరీ సబ్జెక్టుగా పెట్టామని
అన్నారు. ఇది కచ్చితంగా వద్దు అని, అది తమ విధానమని ధైర్యం ఉంటే చెప్పాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యతిరేకిస్తున్న వారికి సవాల్ విసిరారు. ఇంగ్లీష్ మాధ్యమానికి, మత మార్పిడికి లంకె పెడుతున్నారని, ఇదిమి పద్దతి అని మంత్రి ప్రశ్నించారు. ఏలూరులో బీసీ డిక్లరేషన్, అంతకుముందు పాదయాత్రలోనూ, అలాగే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వైకాపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్నింటిలోనూ 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, వాటిలో రిజర్వేషన్ల మేరకు నామినేటెడ్ పోస్టులు లాటరీ పద్ధతిలో కేటాయిస్తున్నామన్నారు. అనంతపురం జిల్లాలో మొత్తం 16 మార్కెట్ కమిటీలో ఈ విధానంలో ఎంపికలు చేశామన్నారు. ఇకపై ఏ ప్రభుత్వం వచ్చినా ఈ విధానం మారదని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే చట్టాలు చేయడంతో పాటు వాటిని సమర్థవంతంగా అమలు చేయడాన్ని తాము హర్షిస్తున్నామని, ఇది చరిత్రలో నిలిచి పోతుందని మంత్రి అన్నారు. వేరుశెనగ రైతులకు క్వింటాలుకు రూ.3090 మద్దతు ధరను కేంద్రం ప్రకటించినా, రైతులు రూ.3,700కే అమ్ముకుంటున్నారని అన్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, దళారీలకు పంట అమ్ముకోవద్దన్నారు. రూ.3000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్ ఇంటర్‌వెన్షన్ ఫండ్‌తో కనీస మద్దతు ధర కల్పించి మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
రోజురోజుకూ ఇసుక విధానాన్ని మెరుగుపర్చుకుంటున్నామని, ఇసుక ధరను కూడా ఖరారు చేశామని, ఇకపై కావాల్సినంత అందుబాటులోకి ఉంచుతామని మంత్రి అన్నారు. రాజధాని విషయంలో వాస్తవాలు వదిలేసి టీడీపీ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్‌ను స్విస్ చాలెంజ్ ద్వారా గత ప్రభుత్వం అప్పగిందని, అయితే సింగపూర్ కంపెనీ వైదొలగిందని, గత ప్రభుత్వం, తమ కంపెనీ పరస్పర ఒప్పందంతోనే వైదొలుగుతున్నట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారని గుర్తుచేశారు. అయితే స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్‌ను స్విస్ చాలెంజ్ ద్వారా కట్టబెట్టడం లోపభూయిష్టమని, కేంద్ర ప్రభుత్వంతో పాటు సుప్రీం కోర్టు కూడా చెప్పిందని మంత్రి అన్నారు. పాత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల గురించి తాము చెప్పలేమని, మీతో కొనసాగడానికి తాము సిద్ధంగా ఉన్నామని సింగపూర్ ప్రభుత్వం చెప్పిందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని టీడీపీ చెబుతోందని, పెట్టుబడుల పేరుతో అవినితి చేస్తే సహించేది లేదన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో రూ.5వేల కోట్లు అప్పు ఉంటే, 2019లో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చేనాటికి రూ.2లక్షల 60వేల కోట్లకు చేరిందని, రూ.45 వేల కోట్ల వివిధ రకాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, మున్సిపల్ పరిపాలనా విభాగంలో రూ.18వేల కోట్లు అప్పులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇదంతా గత ప్రభుత్వం నిర్వాకమేనన్నారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ తాము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు త్వరలో పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సమావేశంలో మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
*చిత్రం... అనంతపురంలో విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ