ఆంధ్రప్రదేశ్‌

పిల్లల భవితే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 14: పిల్లల భవిష్యత్ కోసమే విప్లవాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పిల్లలు పోటీ పడుపడుతున్నది సమాజంతో కాదని, ప్రపంచ జాబ్ మార్కెట్‌తోనని పేర్కొన్నారు. గురువారం ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ హైస్కూలు ప్రాంగణంలో మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. పిల్లల భవిష్యత్ కోసమే విప్లవాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతున్నామని, అయితే తనను కావాలనే కొంతమంది టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. భారత ఉప రాష్టప్రతి, రాజకీయ నాయకులు, ఏ అధికారి, సినిమానటులు, పత్రికాధిపతులు తమ పిల్లలను తెలుగుమీడియంలో చదివించటం లేదని, అందరూ ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇంగ్లీషు మీడియంలో చదివిస్తున్నారని ఆయన అన్నారు. తన వల్ల తెలుగు జాతి ఇబ్బంది పడుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. తనపై ఆరోపణలు చేసేవారు హిపోక్రసీని వదిలి డెమొక్రసీకి విలువనివ్వాలని ఆయన హితబోధ చేశారు. పేదవాడి పిల్లలు ఇంగ్లీషు చదవుకోవద్దా అంటూ ఆయన ప్రశ్నించారు. నేటి బాలలే రేపటి పౌరులని, ఇంగ్లీషు రాకపోతే రాబోయే రోజుల్లో పోటీ ప్రపంచంలో పిల్లలు ఏ విధంగా రాణిస్తారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని పేద పిల్లలందరికీ ఇంగ్లీషు మీడియంలో విద్యనందించేందుకే చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మారుతున్న కాలానికి అనుగుణంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారుచేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మాకమైన మార్పులు తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టామన్నారు. విద్యారంగానికి బడ్జెట్‌లో 33వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 45వేల ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూడు దశల్లో ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. మొదటి దశలో 15వేల 715 పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించేందుకు మూడువేల ఐదువందల కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. మొదటి దశలో నాడు-నేడు కార్యక్రమం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు తయారుచేశామన్నారు. నాడు-నేడు కార్యక్రమం కింద ఎంపిక చేసిన పాఠశాలల ప్రస్తుత ఫొటోలు, పాఠశాలల్లో పనులు పూర్తయిన తరువాత ఫోటోలు పాఠశాలల్లో ప్రచురించి ప్రజలకు తెలియచేస్తామని తెలిపారు. మొదటి దశలో పనులు జూన్, జూలై నెలలకు పూర్తిచేస్తామన్నారు. రాష్ట్రంలో తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో పేదప్రజలు ఆర్థిక ఇబ్బందుల
వల్ల తమ పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువులు చెప్పించలేక పోతున్నామని తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీషు విద్యను అందించేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి నుండి ఆరవ తరగతి వరకు పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది తరగతి విద్యార్థులకు దశలవారీగా ఇంగ్లీషు మీడియంను అమలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోలేక ఇంటర్మీడియట్‌తోనే ఆగిపోతున్నారన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని అమలుచేస్తామని తెలిపారు. డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థికి హాస్టల్ ఫీజు కింద ప్రతి సంవత్సరం 20వేల రూపాయలు ఇస్తామని వెల్లడించారు. పిల్లలను స్కూలుకు పంపే ప్రతి తల్లికి అమ్మఒడి పథకం కింద సంవత్సరానికి 15వేల రూపాయలను వారి ఖాతాలకు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో అమ్మఒడి కార్యక్రమాన్ని జనవరి 9వ తేదీ నుండి అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ఒక స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా మనబడి నాడు-నేడు పైలాన్‌ను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ముందుగా దివంగత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అంగన్‌వాడీ బాలలకు అక్షరాభ్యాసం
ఇదిలావుండగా మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తొలిసారిగా ఒంగోలుకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంగన్‌వాడీ బాలలకు అక్షరాభ్యాసం చేశారు. ఉదయం 10.55 గంటలకు స్థానిక పీవీఆర్ ఉన్నత పాఠశాల సభా ప్రాంగణనాకి ముఖ్యమంత్రి జగన్ చేరుకున్నారు. విద్యార్థులు కేరింతలు, కరతాళధ్వనులతో జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత సభా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను జగన్ సందర్శించారు. మొదట ఆరోగ్యశ్రీ స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం వైఎస్‌ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ముఖ్యమంత్రి స్వయంగా కళ్లజోళ్లు పెట్టి వారికి అందచేశారు. వైఎస్‌ఆర్ కిశోర్ బాలిక వికాస పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం పురస్కారాలు పొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందచేసి ప్రత్యేకంగా అభినందించారు. వారు ఎంచుకున్న లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమయ్యే ఇంగ్లీషు మీడియం లేబలేటరీ స్టాల్‌ను జగన్ పరిశీలించారు. అనంతరం నాడు-నేడు కార్యక్రమంలో చేపట్టే అభివృద్ధిపై ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి నిశితంగా పరిశీలించారు.
నాణ్యమైన విద్యనందించడానికే మనబడి నాడు-నేడు
* విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో విద్యాసంస్కరణలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. అగ్రకులాల్లోని పేదలతో సహా ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టి నాణ్యమైన విద్య అందించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం జగన్ విప్లవాత్మకమైన నిర్ణయాలతో రానున్న రోజుల్లో లక్షలాది మంది బడుగు, బలహీన వర్గాలు, ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల జీవితాలు మారతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పి విశ్వరూప్, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్, టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్, అన్నా రాంబాబు, బుర్రా మధుసూదన్ యాదవ్, కె నాగార్జునరెడ్డి, టీజెఆర్ సుధాకర్‌బాబు, మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, గరటయ్య, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... ఒంగోలులో గురువారం మనబడి నాడు-నేడు కార్యక్రమం ప్రారంభించిన అనంతరం చిన్నారికి అక్షరాభ్యాసం చేస్తున్న ముఖమంత్రి జగన్మోహన్ రెడ్డి