ఆంధ్రప్రదేశ్‌

అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 13: రాష్ట్రంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ పరిధిలో అనధికార లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనలు-2019కు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. క్రమబద్ధీకరణ వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఇళ్ల కొనుగోలు, రుణ సదుపాయం సులభతరమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం వివరాలను సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాకు వెల్లడించారు. గత కొనే్నళ్లుగా గ్రామాల నుంచి నగరాలకు వలసలు పెరిగాయి. దీనివల్ల నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల శివార్లలో పెద్దఎత్తున ప్లాట్లు వెలిశాయి. ఇందులో చాలా వాటికి సరైన అనుమతులు లేవు. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో డ్రెయినేజి, విద్యుత్, రోడ్లు, ఇతర వౌలిక సదుపాయాల కల్పనకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. దీంతో పాటు ప్రజల నుంచి విజ్ఞప్తులు రావటంతో క్రమబద్ధీకరణ నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ లా చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఆంగ్ల బోధనకు ఏకగ్రీవ ఆమోదం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధనకు రాష్ట్ర మంత్రి మండలి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనతో పాటు అధికార భాషగా తెలుగు లేదా ఉర్దూను తప్పనిసరి సబ్జెక్టులుగా ప్రభుత్వం గుర్తించింది. ఒక్కో ఏడాది ఒక్కో తరగతిని పెంచుతూ పదవ తరగతి వరకు ఆంగ్ల బోధన అందించాలని నిర్ణయించింది. ప్రైవేట్ పాఠశాలల్లో 98.5 శాతం ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన జరుగుతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 34 శాతం పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లీష్ మీడియం అమల్లో ఉందని తల్లిదండ్రులు, మేధావులు, నిరుద్యోగులు, తదితర వర్గాల నుంచి డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమంలో బోధన తప్పనిసరి చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే డ్రాపవుట్లు కూడా తగ్గే అవకాశం ఉందని
పోటీ పరీక్షల్లో తట్టుకునేందుకు ఉపకరిస్తుందనేది ప్రభుత్వ వాదన.
వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కార్పొరేషన్
పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల నిర్వహణ, కాలుష్యం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పారిశ్రామిక వ్యర్థాలతో పాటు ఇతర వ్యర్థాల సేకరణ, రవాణా, నిల్వ, శుద్ధి నిర్వహణను కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది. రాష్ట్రం మొత్తంగా 9 వేల పరిశ్రమలు ఉండగా అందులో 2వేల వరకు రెడ్ కేటగిరి, 2683 పరిశ్రమల నుంచి ఏడాదికి 5,56,317 టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 2,11,440 టన్నులు డిస్పోజబుల్ వేస్ట్, 3,13,217 టన్నుల రీ సైక్లబుల్ వేస్ట్, 31,659 టన్నుల ఇన్‌క్రెడిబుల్ వేస్ట్, 196.3 ఎంఎల్‌డీల కలుషిత జలాలు విడుదలవుతున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ వ్యవస్థీకృతంగా లేదని గుర్తించిన ప్రభుత్వం వ్యర్థాలు, కలుషిత జలాలను శుద్ధి చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని భావించింది. వ్యర్థాల అక్రమ సరఫరాకు కారకులైన వారిపై నిఘా వహించటంతో పాటు వాటిని రవాణా చేసే వాహనాలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవటం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కార్పొరేషన్ బాధ్యత వహించనుంది. పరిశ్రమల పేరుతో వ్యర్థాలను సేకరించి మరో పరిశ్రమ పేరుతో డిస్పోజ్ చేయటాన్ని నియంత్రించటం, రికార్డులలో చూపిన పరిమాణం కంటే ఎక్కువ మొత్తంలో వ్యర్థాలను డెలివరీ చేయటాన్ని అడ్డుకోవడం, పరిశ్రమల్లో విడుదలవుతున్న వ్యర్థాల నిర్థారణకు సరైన ప్రయోగశాలలు ఏర్పాటు చేయటం వంటి కార్యకలాపాలను కార్పొరేషన్ నిర్వహిస్తుంది.
పవర్ పాలసీలకు సవరణలు
రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ కొనుగోళ్లలో గతంలో జరిగిన అక్రమాలను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధిక ధరలకు కొనుగోళ్లు జరగటం వల్ల పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావటంలేదని, ఇందుకు అవసరమైన నూతన విధాన నిర్ణయాలు అమలు చేసేందుకు నిపుణుల కమిటీ సలహాలు, సూచనలు స్వీకరించిన మేరకు ఆంధ్రప్రదేశ్ సోలార్, విండ్ పాలసీ-2018లతో పాటు విండ్, సోలార్, హైబ్రిడ్ పవర్ పాలసీల సవరణకు కేబినెట్ ఆమోదం లభించింది. విధాన సవరణలతో ట్రాన్స్ మిషన్, డిస్కంలకు నష్టాలు జరక్కుండా నియంత్రించే వీలు కలుగుతుందని మంత్రి పేర్ని నాని వివరించారు.
గ్రామ న్యాయాలయాల ఏర్పాటు
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న వివాదాల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 84 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు మంత్రి మండలి తీర్మానించింది. ఇందుకోసం 2008 చట్ట సవరణకు ఆమోదం లభించింది. గ్రామ స్థాయిలో వివాదాల సత్వర పరిష్కారానికి గ్రామ న్యాయాలయాల వ్యవస్థ దోహదపడుతుందని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. న్యాయాలయాల్లో న్యాయాధికారులు, సిబ్బంది నియామకానికి కూడా ఆమోదం లభించింది. కాగా రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ నిధి చట్ట సవరణకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.
ఆలయ పాలకవర్గ కమిటీలకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో రూ. 21 కోట్ల ఆదాయానికి పైబడిన ప్రధాన ఆలయాలకు ట్రస్ట్‌బోర్డు సభ్యుల నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం, ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయం, కాళహస్తీశ్వర స్వామి ఆలయం, పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంతో పాటు కాణిపాకంలోని స్వయంభూ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ పాలక మండళ్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సేవా దృక్పథం, ధార్మిక దృష్టి, సత్ప్రవర్తన ఉన్న వారికి ట్రస్ట్‌బోర్డు సభ్యులుగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.
మత్స్యకారులకు ఆర్థిక భరోసా
నవరత్నాల్లో భాగంగా ఎన్నికల ప్రణాళికలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మరో హామీ అమలుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం, డీజిల్ సబ్సిడీతో పాటు సముద్రంలో వేటకి వెళ్లి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియోను రూ. 5 నుంచి 10 లక్షల పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 60 సంవత్సరాలలోపు వారికి వైఎస్సార్ బీమా పథకం కింద నమోదు చేసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. నవంబర్ 21న ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,05,357 మందిని అర్హులుగా గుర్తించారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఈ పథకం అమలు కానుంది.
మొక్కజొన్నకు గిట్టుబాటు ధర
రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న ధరలు గత వారం రోజులుగా తగ్గుతున్న విషయంపై మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. గత కొద్దిరోజుల క్రితం క్వింటాల్‌కు రూ. 2200 ధర పలికిందని ప్రస్తుతం రూ. 1500 కు మించి కొనుగోలు జరగటంలేదని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు సమావేశంలో వివరించారు. కనీస మద్దతు ధర రూ. 1750 కూడా రావటంలేదని, రైతులు నష్టపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులు నష్టపోకుండా చూడాలని ఆదేశించారు. బుధవారం నుంచే విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.
హోంశాఖలో అదనపు పోస్టుల భర్తీ
రాష్ట్ర విభజన అనంతరం హోంశాఖ పరిధిలోని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ తెలంగాణకు కేటాయించిన నేపథ్యంలో ఆ విభాగానికి డైరెక్టర్‌తో పాటు డీఎఫ్‌ఓ ర్యాంక్ స్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్ల పోస్టులు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఇసుకాసురులకు
రెండేళ్ల జైలు.. జరిమానా
ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమ రవాణా, నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, పునర్విక్రయాలపై ఉక్కుపాదం మోపనుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 2లక్షల జరిమానా విధించాలని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ గనుల చట్టంలో సవరణలు తీసుకురావాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది. ఇసుక లభ్యతను మరింత పెంచేందుకు 14 నుంచి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.రోజుకు 2 లక్షల టన్నుల సరఫరాతో పాటు వచ్చే పదిరోజుల్లో కొరత తీర్చేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు.
*చిత్రం... మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి