ఆంధ్రప్రదేశ్‌

యూనిట్ రూ.3కే సౌర విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 12: రాష్ట్రంలో కీలకమైన వ్యవసాయం, పరిశ్రమల వంటి రంగాలకు అందుబాటు ధరల్లోనే విద్యుత్ సరఫరా చేసేందుకు ఉపయోగపడే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ సంస్థ ది ఎనర్జీ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టెరి) ప్రకటించింది. అంతేకాక రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు తక్కువ ధరలో డిస్కంలకు (విద్యుత్ పంపిణీ సంస్థలు)కు సోలార్ విద్యుత్ అందేలా సహకరించేందుకు ముందుకొచ్చింది. దీనివల్ల కొంత మేర విద్యుత్ ఉత్పాదన వ్యయం తగ్గటంతో పాటు రాష్ట్ర ఖజానాపై భారం తగ్గనుంది. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) సంస్థ ముంబైలో నిర్వహించిన ‘ఇన్‌స్పైర్-2019’ (ఇంటర్నేషనల్ సింపోసియం టు ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ ఎనర్జీ ఎఫిషియన్సీ) అంతర్జాతీయ సదస్సులో భాగంగా టెరి డైరెక్టర్ జనరల్ అజయ్ మాధుర్, వివిధ దేశాల నుంచి వచ్చిన నిపుణులు మాట్లాడుతూ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు తక్కువ ధరలో విద్యుత్ లభించేలా చూడాల్సిన అవసరాన్ని వివరించారు. ఏ రాష్ట్రం, దేశ అభివృద్ధిలో అయినా ఈ రెండు రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) అధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని శక్తివంతం చేసేందుకు ప్రత్యేకించి ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతగా నిర్ణయించిందని తెలిపారు. దీనిపై టెరి డీజీ అజ్ మాధుర్ స్పందిస్తూ ఏపీకి సహకారాన్ని అందించేందుకు టెరి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశానికి వెనె్నముక లాంటి వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేసేందుకు ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను ప్రశంసించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ రంగానికి పూర్తి స్థాయిలో చేయూత నివ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం
వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నప్పటికీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటం ద్వారా విద్యుత్ ఉత్పత్తి భారాన్ని కొంత మేర తగ్గించుకోవచ్చని, ఇది అంతిమంగా రాష్ట్ర ఖజానాకు మేలు చేస్తుందని టెరి డీజీ వివరించారు. ఏపీ డిస్కంలకు సుమారు రూ. 3కే సోలార్ ద్వారా విద్యుత్ అందేలా టెరి తన వంతు సహకారాన్ని అందిస్తుందని వెల్లడించారు. ఈ విద్యుత్ కేవలం వ్యవసాయ పంపుసెట్లకు మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. అయితే ఇది ప్రభుత్వ అంగీకారం, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ అనుమతులపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇది దీర్ఘకాలంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకానికి మరింత ఊతమిస్తుందని ఇప్పటికే ఈ లోకాస్ట్ సోలార్ విద్యుత్‌ను కొన్ని రాష్ట్రాల వ్యవసాయ అవసరాలకు సరఫరా చేసేందుకు టెరి సన్నాహాలు చేస్తోందని తెలిపారు. ఈ ప్రక్రియ భవిష్యత్‌లో ఎంతో దోహదపడుతుందని విద్యుత్ వ్యవస్థ బలోపేతం కాగలదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం విద్యుత్ డిమాండ్ 65,579 మిలియన్ యూనిట్లు కాగా అందులో 11,593 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను భారీ సబ్సిడీతో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వ్యవసాయ, పారిశ్రామిక రంగాల విద్యుత్ సరఫరాపై ఓ ప్రత్యేక ఆధ్యయనం నిర్వహించి సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా వ్యయాన్ని తగ్గించుకునేలా తగిన సూచనలు చేసేందుకు టెరి సిద్ధంగా ఉందని మాధుర్ స్పష్టం చేశారు. ఈ సాకేతికతలో వ్యయం తగ్గినప్పటికీ విద్యుత్ సరఫరా పరిమాణంలో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. నాణ్యతతో పాటు అందుబాటు ధరల్లో విద్యుత్‌ను అందించే దిశగా డిస్కంలు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే టెరి డైరెక్టర్ అశ్విని కుమార్‌ను ఏపీలో ఆధ్యయనం చేయాల్సిందిగా సూచిస్తామని తెలిపారు.
టెరి అందించే సాంకేతిక పరిజ్ఞానం పరిశ్రమలకు కూడా చౌకలో విద్యుత్ లభించేలా ఉపకరిస్తుందన్నారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యం పరిస్థితుల వల్ల ఉత్పత్తి పడిపోయి అనేక దేశాల్లో పరిశ్రమలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని ఈ దృష్ట్యా చౌక ధరల్లో విద్యుత్ సరఫరా పారిశ్రామిక రంగానికి ఉపశమనం కలిగిస్తుందని విపులీకరించారు. అదే సమయంల చౌక ధరల్లో విద్యుత్ ఉత్పత్తిలో ఇంధన సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇంధన సామర్థ్య రంగంలో వస్తున్న అధునాతన సాంకేతికను అందిపుచ్చుకోవటం ద్వారా ఇంధన రంగంలో రాష్ట్రం అగ్ర స్థానానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు హాజరైన ఏపీఎస్‌ఈసీఎం సీఈఓ ఏ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ విద్యుత్ రంగానికి వినియోగదారులే కేంద్ర బిందువుగా మార్చేందుకు అవసరమైన నిర్మాణాత్మక చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. ఆధునిక సాంకేతిక నూతన ఆవిష్కరణలను ఆహ్వానించటంలో ప్రభుత్వం ముందుంటుందని స్పష్టం చేశారు. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడం చివరి వినియోగదారుల వరకు లబ్ది పొందేలా చూడటమే ఈ చర్యల లక్ష్యమన్నారు. విద్యుత్ ఉత్పత్తి, సేకరణ, సరఫరాలో వ్యయాన్ని అదుపు చేసేందుకు అవసరమైన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకుందని వివరించారు. పగటిపూట రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు తొలి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 5110 వ్యవసాయ ఫీడర్లకు ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతోందని మిగిలిన వాటికి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయగలమన్నారు. అన్ని కేటగిరిల వినియోగదారులకు నాణ్యమైన నమ్మకమైన చౌకధరల్లో విద్యుత్‌ను అందించటమే ఏపీ విద్యుత్ సంస్థ అంతిమ లక్ష్యాలని చెప్పారు. ఇదిలా ఉండగా గ్రామీణ నీటి సరఫరా పంపుసెట్ల స్థానంలో ఇంధన సామర్థ్య పంపుసెట్లు అమర్చేందుకు ఈఈఎస్‌ఎల్ ముందుకొచ్చింది. దీని అమలులో ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదని స్పష్టం చేసింది. ఈఈఎస్‌ఎల్ ఎండీ సౌరబ్‌కుమార్ మాట్లాడుతూ ఈ పంపుసెట్ల సామర్థ్యం 0.75 కిలో వాట్ల నుంచి 75 కిలోవాట్ల మధ్య ఉంటుందని ఎస్కో మోడల్‌లో వీటిని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అదే విధంగా 75 నుంచి 100 హెచ్‌పీ ఇంధన సామర్థ్య పంపుసెట్లను కూడా ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా మంచినీటి ప్రాజెక్ట్‌కు సరఫరా చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో విస్తృతంగా అమలవుతున్న ఇంధన సామర్థ్య కార్యక్రమాలను టెరి డీజీ, ఇతర అధికారులకు వివరిస్తూ కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో 39 గ్రామీణ మంచినీటి పంపుసెట్ల స్థానంలో ఇంధన సామర్థ్య పంపుసెట్లను విజయవంతంగా అమర్చారని సీఈఒ వివరించారు. దీనివల్ల 1.38 మిలియన్ యూనిట్లు ఇంధనం ఆదా అవుతుందని, ఏడాదికి 67.7 లక్షల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మిగిలిన పది జిల్లాల్లో మరో 528 ఇంధన సామర్ధ్య పంపుసెట్లు అమర్చేందుకు ఎనర్జీ ఆడిట్ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. తొలివిడత కర్నూలులో ఏర్పాటు చేసిన 8 పంపుసెట్లలో ఎనర్జీ ఆడిట్ నిర్వహించి 24.9 శాతం విద్యుత్ ఆదా అయినట్లుగా నిర్ధారించామన్నారు.